Traffic problems
-
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కారు కంటే నడుస్తూ వెళ్లడమే బెటర్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ సమస్యలు గుర్తుకువస్తాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరులో ఐటీ ఉద్యోగులు భారీగా నివసిస్తుండటంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు భరించలేనంత ఉంటుంది.కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే వాహనాల మధ్య గంటల తరబడి ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. రోడ్లపైకి వస్తే తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితులు బెంగళూరు నగరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక వానకాలం కావడంతో బెంగళూరులో రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి.తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిగా మారింది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. వి విషయాన్ని ఆయుష్ సింగ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో షేర్ చేశాడు.ఇందులో బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఇది కేవలం బెంగుళూరులోనే సాద్యమంటూ షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.This happens only in Bangalore pic.twitter.com/MQlCP7DsU7— Ayush Singh (@imabhinashS) July 25, 2024 ఒక్కరోజులోనే మూడు లక్షలకు పైగా లైకులు సంపాదించింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరు భారత్‌కు ట్రాఫిక్ రాజధాని అని, ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుందని చెబుతున్నారు. -
ATTENTION PLEASE: కూడళ్లూ.. 'కష్టాలు'..
సాక్షి, హైదరాబాద్: బండి తీసి రోడ్డెక్కాం.. ఆ రోడ్డు ఎంత బాగున్నా.. ఫ్లైఓవర్ ఎక్కి ఎంచక్కా దూసుకెళ్లినా.. ఏదైనా జంక్షన్ రాగానే ఉత్సాహం కాస్తా తుస్సుమంటుంది. అడుగులో అడుగేస్తున్నట్టుగా కదులుతున్న వాహనాలతో చిరాకు మొదలవుతుంది. ఎడమ వైపు ‘ఫ్రీలెఫ్ట్’ ఉంటుందేమో అనుకుంటే.. ఇరుకైన జంక్షన్‌తో అదీ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎలాగోలా జంక్షన్ దాటేసి, కాస్త దూరంలోని మరో ఫ్లైఓవర్ ఎక్కుదామనుకుంటే.. దానికి ముందే మళ్లీ వాహనాల నత్తనడక మొదలవుతుంది. చిరాకు మరింత పెరిగిపోతుంది. ఎవరైనా వీఐపీ కోసం ట్రాఫిక్ గానీ ఆపి ఉంటే.. ఈ ‘మంట’ నషాళానికి అంటుతుంది.హైదరాబాద్ మహా నగరంలో కూడళ్ల నిర్వహణ సరిగా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సిగ్నల్ ఫ్రీ సిటీ కోసం చర్యలు చేపట్టినా..హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు గత పదేళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వాహనాలు జంక్షన్ల వద్ద చాలాసేపు ఆగిపోవాల్సి వస్తోంది. దాంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతోపాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్‌పాత్‌లు సరిగా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికి తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.భారీగా విస్తరణకు నిర్ణయించినా.. త్రీవేలు, చౌరస్తాలు, పెద్ద జంక్షన్లున్న చోట ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనితో జంక్షన్లను విస్తరించి, అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జోన్‌కు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 12 జంక్షన్లను అభివృద్ధి చేయాలనుకున్నారు. తర్వాత వీటిని 60కి పెంచారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి.. మొత్తం 127 జంక్షన్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 13 చోట్ల మాత్రమే పనులు చేపట్టారు. మిగతావీ మొదలై, పనులన్నీ పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటివి ఈ పనులకు ఆటంకంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన వాటిల్లో పూర్తికానివే కాక ఇంకా పనులే ప్రారంభం కానివీ ఉన్నాయి. జీహెచ్ఎంసీలో పనులకు కొంతకాలంగా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. సగానికిపైగా జంక్షన్లకు ఇంకా డీపీఆర్‌లే పూర్తి కాలేదు.ఫ్లైఓవర్ దాటితే అంతే.. కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణం వేగంగా సాగుతున్నప్పటికీ.. ఫ్లైఓవర్ దాటగానే ట్రాఫిక్ చిక్కులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు ఐటీ కారిడార్‌లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. అక్కడి ఇరుకైన జంక్షన్ దీనికి కారణం. ఫ్లై ఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో చూపకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.⇒ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్‌కు ముందు, పంజగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. నగరంలో చాలా ఫ్లైఓవర్లకుముందు, చివరల్లోఇదే పరిస్థితి ఉంది.జంక్షన్లను అభివృద్ధి చేస్తారిలా.. ముఖ్యమైన జంక్షన్ల వద్ద వాహనాలు సులువుగా మలుపుతిరగడంతోపాటు పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. అందులో భాగంగా చేపట్టే పనులేంటో వెల్లడించారు.⇒ వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్లను విశాలం చేస్తారు. ⇒ జంక్షన్లో అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ బస్టాపులున్న జంక్షన్ల వద్ద ఎటువైపు వెళ్లే బస్సు ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్ వేస్తారు. ⇒ రాత్రివేళ జంక్షన్ అందంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఉంటుంది. కూర్చునేందుకు బెంచీలు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద రోడ్డు డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్ అందేలా మొక్కలు పెంచుతారు. ⇒ పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు,వరద నీరు నిలవకుండా కాలువలు నిర్మిస్తారు.విశాలంగా ఉన్నా తప్పని తిప్పలు..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ పాదచారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అండర్‌పాస్ ఉన్నా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ జంక్షన్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాక నేటికీ పనులు మొదలు కాలేదు.శాస్త్రీయంగా పరిశీలించి పనులు చేయాలి కేవలం ఫ్లైఓవర్లు, యూటర్న్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరవు. యూటర్న్లు ఏర్పాటు చేసేందుకు శాస్త్రీయంగా సిమ్యులేషన్ స్టడీ చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యేలా వాటి ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇది సరిగా జరుగుతున్నట్టు లేదు. ఏ పనులైనా సైంటిఫిక్ స్టడీతో చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
-
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోకి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ♦ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. ♦లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. ♦ డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యా హ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. ♦ ప్రైవేట్ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్యనే నగరంలో ప్రయాణించాలి. ♦ అత్యంత నెమ్మదిగా నడిచే కేటగిరీకి చెందిన చేతితో తోసే బళ్లు, వివిధ రకాలైన జంతువులు లాగే బళ్లు, సైకిల్ రిక్షాలు, ట్రాక్టర్లు తదితరాల సంచారాన్ని నగరంలోని కీలకమైన 61 టూర్లలో నిషేధించారు. ♦ భవన నిర్మాణ, కూలి్చవేత వ్యర్థాలను తరలించే వాహనాల్లో 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు కలిగినవి ఉ. 11.30 నుంచి సాయంత్రం 5, రా త్రి 10 నుంచి ఉదయం 9 మధ్య సంచరించాలి. ♦ వీటిలో 10 టన్నులు అంతకంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. -
HYD: ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్లాన్.. కార్ పూలింగ్ విధానం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఐటీ ఉద్యోగులు వరుసుగా ఆఫీసులకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. కాగా, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసిఐసిఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్ విధానంపై వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు మరో ప్రతిపాదన చేశారు. ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పనివేళల్లో మార్పులపై సూచనలు తెలియజేశారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు. కార్ పూలింగ్ విధానం.. ఒకరి కంటే ఎక్కువ మంది కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా ఆదుపులో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు. కేవలం ఒకరి కోసం కూడా కారును బయటకు తీస్తున్నారు. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీంతో కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చన్నది ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది. హైటెక్‌సిటీలో కారు పూలింగ్ చేపడితే సగానికి సగం సమస్య తీరినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
మియాపూర్ టు సంగారెడ్డి ట్రాఫిక్ రద్దీకి చెక్.. ఆరు వరుసలుగా రోడ్డు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా.. ఈ మార్గంలోనే ఉన్న కూకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. -
‘మినీ’తో విశాఖ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. 67 కి.మీ.పరిధిలో 12 ఫ్లై ఓవర్లు
సాక్షి, అమరావతి: విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. విశాఖ నగరాన్ని దశాబ్దాలుగా వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్యలకు త్వరలో ముగింపు పలకనుంది. అనకాపల్లి నుంచి విశాఖ నగరం గుండా ఆనందపురం వరకు జాతీయ రహదారిపై 12 మినీ ఫ్లై ఓవర్లు నిర్మించడానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సంసిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ‘వన్‌టైం ఇన్వెస్ట్మెంట్స్కీం’ కింద ఈ మినీ ఫ్లై ఓవర్లను మంజూరు చేసింది. కేవలం 67 కి.మీ.పరిధిలోనే 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలపడం విశేషం. విశాఖ, గంగవరం పోర్టులు, విశాఖ విమానాశ్రయంతోపాటు త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే రహదారుల జంక్షన్లలో ఈ మినీ ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు. అందుకోసం రూ.350 కోట్ల అంచనాతో ఎన్హెచ్ఏఐ ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసింది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను రూపొందించేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కన్సల్టెన్సీలను ఖరారు చేసింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆ 12 జంక్షన్ల భౌగోళిక స్వరూపాన్ని అనుసరించి 3 డిజైన్లలో ఫ్లై ఓవర్లు నిర్మించనుంది. నాలుగు రోడ్ల జంక్షన్ అయితే ప్లస్ (+), మూడు రోడ్ల కూడలి అయితే వై (Y), రెండు రోడ్ల కూడలి అయితే టీ (T) ఆకృతిలో వాటిని ని ర్మించాలని నిర్ణయించారు. అవసరమైన ప్రదేశాల్లో అండర్ పాస్‌లు నిర్మిస్తారు. భవిష్యత్‌లో విశాఖ మెట్రో రైల్ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐను కోరింది. 12 మినీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి డీపీఆర్‌లను 2023 జనవరి చివరినాటికి ఖరారు చేసి ఆమోదించాలని భావిస్తున్నట్లుగా ఎన్హెచ్ఏఐ పేర్కొంది. మార్చి–ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో పూర్తి చేయాలని భావిస్తోంది. మినీ ఫ్లై ఓవర్లు నిర్మించే జంక్షన్లు ఇవే.. లంకెలపాలెం, దువ్వాడ, స్టీల్‌ప్లాంట్ మెయిన్ గేట్, గాజువాక, డెయిరీ ఫాం,తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వార, సీతమ్మధార, మద్దిలపాలెం, ఎండాడ, మధురవాడ. -
Hyderabad: కోర్ సిటీలోకార్ రేసా?.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నగరవాసులకు చుక్కలు చూపింది. తొలిసారిగా ఐఆర్‌ఎల్‌కు హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమే కానీ రేసింగ్ నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతమే “సిటీ’జనులను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేసింది. నగరం నడిబొడ్డున నిర్వహించిన రేసింగ్.. రెండు రోజులుగా వాహనదారులకు చమటలు పట్టిస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో ఫార్ములా రేసులు జరిగిన నగరాలను, అక్కడి ఏర్పాట్లను అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్ల నిండా వాహనాలే.. ఐఆర్ఎల్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్, సెక్రటేరియట్ చుట్టూ రహదారులను పూర్తిగా మూసివేశారు. సమాంతర రోడ్లు లేకపోవటంతో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ రహదారులైన ఖైరతాబాద్, బుద్ధభవన్, రసూల్‌పురా, మినిస్టర్ రోడ్, బీఆర్కే భవన్ వైపు మళ్లించారు. దీంతో ఆయా మార్గాలలోని నివాస, వాణిజ్య సముదాయాలవాసులు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్, ట్యాంక్‌బండ్‌లలో ట్రాఫిక్ స్తంభించింది. అఫ్జల్‌గంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్ మార్గం కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్, కవాడిగూడ మీదుగా ప్రయాణించడంతో రోడ్లన్నీ బ్లాకయ్యాయి. దీంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కి.మీ. ప్రయాణానికే గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చేయాలంటే.. రేసింగ్ అనేవి కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనవి. పైగా ఐఆర్ఎల్ పోటీలకు ఉచిత ప్రవేశం కాదు అలాంటప్పుడు ప్రధాన నగరంలో కాకుండా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లేదా లింకు రోడ్లలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయ పడ్డారు. కొన్ని దేశాలలో విమానాశ్రయాలలోనూ రేసింగ్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట విమానాశ్రయంలలో నిర్వహిస్తే బాగుండేదనే పలువురు తెలిపారు. పైగా రేసింగ్ కోసం కొత్తగా రోడ్లను నిర్మించే అవసరం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి, ఉప్పల్ స్టేడియంలలో ట్రాక్స్‌ను నిర్మించి రేసింగ్‌లను నిర్వహిస్తే వీక్షకులకు సైతం ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. చైనా, చెన్నైలలో ఎలాగంటే.. చైనా, మన దేశంలోని చెన్నైలో ఫార్ములా రేసింగ్‌లను సాధారణ ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా శివారులలో నిర్వహిస్తుంటారు. మన దగ్గర మాత్రం సిటీ సెంటర్లో నిర్వహించడంపై నగరవాసులు విమర్శిస్తున్నారు. పోటీ లేకుండానే రేసింగ్ ముగిసింది ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం మరోసారి నిరాశపర్చింది. ఎలాంటి పోటీలు లేకుండా ట్రయల్స్‌కే పరిమితమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ట్రయల్స్ గంట ఆలస్యంగా మొదలయ్యాయి. రేసర్లు రెండు, మూడు రౌండ్లు తిరిగిన తర్వాత ఆఖరికి పోటీ ఉంటుందని మొదట ప్రచారం చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేదనే కారణంగా లీగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో నవంబర్ నెలలో జరిగినట్లుగా ఉదయం 11 గంటల నుంచే పోటీ ఉండవచ్చని భావించి వీక్షించేందుకు వచ్చిన మోటారుస్పోర్ట్స్ ప్రియులు సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాశారు. గంట పాటు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలోనూ కొన్ని వాహనాలు బ్రేక్‌డౌన్‌కు గురయ్యాయి. ట్రాక్ పై నిలిచిపోయిన వాటిని అక్కడి నుంచి తరలించారు. ఎంతో ఉత్కంఠ రేపుతుందనుకొన్న లీగ్ ఎలాంటి హడావుడి లేకుండానే మొదటి రోజు ముగిసింది. ఈసారి పోటీలపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీ సీట్లతో కనిపించాయి. నరకప్రాయంగా మారుతోంది.. సిటీలో వాహనాల రద్దీ ఎక్కువ. దీనికి తోడు ఇలా ట్రాఫిక్ మళ్లింపు, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మూనేసి వేరు దారుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం ఇళ్లకు వెళ్లడానికి నరకప్రాయంగా మారుతోంది. – రామ్, ప్రైవేటు ఉద్యోగి వైఫల్యానికి నిదర్శనం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురయ్యే ఇబ్బందులను భరించగలం. కానీ ఇలాంటి పరిణామాలు తరచుగా జరగడమే సంబంధిత శాఖల వైఫల్యానికి నిదర్శనం. నగరం కేంద్రంగా జరిగే కొన్ని కార్యక్రమాలు సిటీ ప్రతిష్టను పెంచేవే అయినప్పటికి వాటిని నిర్వహించే ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. – ప్రవీణ్ రెడ్డి, సాఫ్ట్వేర్ రెట్టింపు సమయం.. సాధారణ రోజుల్లో బంజారాహిల్స్ నుంచి రామ్‌నగర్ రావడానికి గంట సమయం పడితే గత రెండు రోజులుగా రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. నగరం మధ్యలో రోడ్లు మూసేసి, ట్రాఫిక్ మళ్లింపులతో ఈవెంట్లు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మణికంఠ, నగరవాసి జనాల్ని బాధపెట్టే పోటీలు.. ఇండియన్ రేసింగ్ లీగ్‌తో రోడ్లపై నరకాన్ని చూడాల్సి వస్తోంది. చివరకు అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనాల్ని బాధపెట్టి కార్లను పరుగులు పెట్టించడమేంటి? – వంగీపురం రాఘవ, నాగారం -
లైసెన్స్ లేకపోయినా.. నో ఫైన్ !
సాక్షి, భీమవరం: మన రోడ్లపై నిత్యం అనేకమంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా బైక్‌లు నడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ సమస్యకు భీమవరం పోలీసులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్ఎల్ఆర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అమలుచేసేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తనిఖీ చేస్తే ప్రతి 10 మందిలో 8 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఎప్పీ రవిప్రకాష్ వినూత్నంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో లైసెన్స్‌లేని వారు అక్కడికక్కడే ఎల్ఎల్ఆర్ పొందేలా రూపకల్పన చేశారు. లైసెన్స్ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్ఎల్ఆర్ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్నట్లు రవిప్రకాష్ చెప్పారు. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి లైసెన్స్‌లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7 వేల మందికి తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేసినట్లు చెప్పారు. హెల్మెట్ తప్పనిసరి వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వాహనాదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీనిలో భాగంగా తనిఖీలు చేసే ప్రాంతాల్లో హెల్మెట్ల అమ్మకాలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నాణ్యమైన హెల్మెట్లు విక్రయించేలా చేయడం వల్ల జరిమానా కట్టే కంటే హెల్మెట్ కొనుగోలు చేయడం, ధరించడం మేలనే భావన వాహనదారుల్లో కలిగేలా చైతన్యం కలిగించడానికి ప్రణాళిక రూపొందించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు భీమవరం జిల్లాకేంద్రంగా అవతరించిన తరువాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు రూపొందించవచ్చనే అంశంపై పట్టణంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం.సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక.. జిల్లాలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్న తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కూడా ఇదే తరహా సర్వే చేయించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేíÙస్తాం. – రవిప్రకాష్ ఎస్పీ, భీమవరం జిల్లా -
‘ఉప్పల్ కష్టాల్’ ఇలా తీరున్.. ప్రత్యామ్నాయ మార్గాలెన్నో..
ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ చక్రబంధనం తప్పేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక్కడ వాహనాల రద్దీని నిలువరించి సమస్యను పరిష్కరించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కోవడం తప్పనిసరి. ఇక్కడ చేపట్టిన స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లయితే ట్రాఫిక్ పద్మవ్యూహం సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. చదవండి: ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి.. ఆ స్థలాన్ని సేకరిస్తే.. ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ స్టేడియం పక్కనే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఉన్నతాధికారులు, పాలకులు మాట్లాడి శాశ్వత లేక తాత్కా లిక పద్ధతిలోనైనా స్థలాన్ని సేకరిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. జిల్లా బస్టాప్‌ను మారిస్తే.. ఉప్పల్ వరంగల్ బస్ స్టాప్ నుంచి మొదలు నలువైపులా కిలోమీటరు మేర బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చౌరస్తా వరకు బస్సుల వరుస నిత్యకృత్యం. దీంతో పాటు ఉప్పల్ చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు రోడ్డుకు అడ్డుగా బస్సులను నిలిపివేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా బస్ స్టాప్‌ను మెట్రో స్టేషన్ వద్దకు మార్చవచ్చు. సమాంతర రహదారుల్ని అభివృద్ధి చేస్తే.. వరంగల్ జాతీయ రహదారికి సమాంతరంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ సమాంతర రోడ్ల మీదుగా ట్రాఫిక్‌ను డ్రైవర్షన్ చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలను నిలువరిస్తే.. ఉప్పల్ వరంగల్ రహదారి.. ఇటువైపు ఎల్బీనగర్ వెళ్లే మార్గం దాదాపు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తున్నాయి. వాటికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆ స్థానంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఫుట్‌పాత్ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో ఆర్టీఏ కార్యాలయం వరకు ప్రైవేట్ వాహనాల షోరూంల యజమానులు దాదాపుగా సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు వీరిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. సర్వీస్ రోడ్డును క్లియర్ చేస్తే ఎల్బీనగర్ రోడ్డు దాదాపుగా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. పనుల నత్తనడకకు స్వస్తి పలికితే.. ఉప్పల్ చౌరస్తా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇవి నత్త నడకన జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020లోనే పూర్తవ్వాలి. అధికారుల అలసత్వంతో ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యకు ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. బస్టాప్‌తో బోలెడు కష్టాలు.. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఆర్టీసీ, మున్సిపల్, అర్అండ్బీ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరం. యాదాద్రి టెంపుల్ తెరిచినప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఉప్పల్ వరంగల్ బస్‌స్టాప్‌ను నుంచే యాదాద్రి వెళ్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపైకి మినీ బస్సులను సైతం ఉప్పల్ నుంచే ప్రారంభించారు. ఈ కారణంగానూ రద్దీ మరింత పెరిగింది. అదనంగా ఇమ్లీబన్, జూబ్లీ బస్‌స్టేషన్ వరంగల్, హన్మకొండ, పరకాల, చెంగిచర్ల, ఉప్పల్ డిపోల బస్సులు సైతం ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒకే బస్‌స్టాప్ ఉంది. అది వరంగల్ బస్‌స్టాప్ మాత్రమే. సరైన బస్ బే లేక పోవడంతో రోడ్లపైనే బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. వీటిని పక్కపక్కనే పెట్టడంతో ట్రాఫిక్‌జాం సమస్య తలెత్తుతోంది. -
సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: అల్వాల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న స్థలంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలగిరి చౌరస్తా–బొల్లారం చెక్‌పోస్టు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనచోదకులు ఈ మార్గాన్ని అనుసరించవద్దని సూచిస్తున్నారు. కరీంనగర్ హైవేకు రాకపోకలు సాగించే వారు ఔటర్ రింగ్ రోడ్‌ను ఆశ్రయించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సోమవారం సూచించారు. నిర్ణీత సమయంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో జరుగుతుందన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ హైవే మధ్య ఉన్న టివోలీ ఎక్స్‌రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తెలంగాణ తల్లి విగ్రహాల కేంద్రంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కరీంనగర్ హైవే నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే మార్గంలో షామీర్పేట ఓఆర్ఆర్, బిట్స్ జంక్షన్, తూముకుంట ఎన్డీఆర్ విగ్రహం, బొల్లారం చెక్‌పోస్టు కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. (చదవండి: కూకట్‌పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేస్తున్న చినజీయర్ స్వామి ) -
ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు!
సాక్షి ముంబై: నిత్యం వాహనాల రద్దీతో సతమతమయ్యే పాదచారులకు కొంత ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇకపై ప్రతి ఆదివారం ముంబైలోని 13 రోడ్లపై వాహనాల రాకపోకలను మూసివేసి ఆ రోడ్లకు సెల వు ప్రకటించనున్నారు. మార్చి27 ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో నేడు ముంబైలోని 13 రోడ్లను వాహనాలు తిరగకుండా మూసివేయనున్నారు. ప్రతి రోజూ వాహనాల రద్దీ తో సతమతమయ్యే పాదచారులకు కాస్త వెసులుబాటు కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 13 రోడ్లపై ఉదయం 8 గంటల నుంచి 11 గం టల వరకు వాహనాలను అనుమతించరు. ఈ విషయంపై ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా మాట్లాడుతూ, రోడ్లను వాహనాల రాకపోకలకు మూసివేసి, కేవలం పాదచారుల కోసం మాత్ర మే తెరిచి ఉంచుతామన్నారు. అదేవిధంగా వాహనాల కోసం ప్రత్యామ్నాయ దారుల్ని కేటాయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోడ్లపై ఆదివారం పిల్లలు ఆటలాడుకోవచ్చని, సీనియర్ సిటిజన్లు వ్యాహ్యాళికి వెళ్ళ వచ్చనీ, సైక్లింగ్, యోగా, వ్యాయామం లాంటివి రోడ్ల మీదనే చేసుకోవచ్చన్నారు. ఇక ఈ నిర్ణయంపై ముంబైకర్ల స్పందనను బట్టి మరిన్ని రోడ్లను ఆదివారం మూసివేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చదవండి: కనువిందు చేసే ట్రెక్కింగ్.. వణుకుపుట్టించే చరిత్ర కొత్త ప్రతిపాదనేం కాదు... నిర్ధారిత సమయాల్లో ప్రధాన రహదారులని మూసివేసే ప్రక్రియ బొగోటా, కొలంబియా లాంటి దేశాల్లో 1974 నుంచే అమలులో ఉంది. ఇందుకోసం ఆ దేశాల్లో ఉద్యమమే జరిగింది. ప్రజల సౌకర్యంకోసం కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్లను వాహనాల కోసం మూసి ఉంచుతారు. ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా పలు ప్రాంతాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. నగర ప్రాముఖ్యత కలిగిన రోడ్లను వాహన కాలుష్యం లేకుండా, ప్రజల కోసం తెరిచి ఉంచడం వల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాహనాల కోసం మూసివేసిన ఈ రోడ్లపై నడవడం, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుందో.. నిజంగానే రాబోతుందండోయ్
మనం కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు భారీగా ట్రాఫిక్‌జామ్ అయితే... కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే ఏమనిపిస్తుంది? గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీని తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. కొత్తగా ఆవిష్కరించిన ఎగిరే కారును ఎవరు, ఎక్కడ రూపొందించారు, అది ఎలా ఉంటుందనే విశేషాలు చూద్దాం..! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 2027 నాటికల్లా వినియోగంలోకి.. యూరప్ దేశమైన స్లొవేకియాలో ఏరోమొబిల్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి ఫోర్‌సీటర్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఆవిష్కరించింది. దీని పేరు ఏఎం నెక్ట్స్. మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది. 2027నాటికల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్ కారు ఇది. సూపర్‌కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్’ను (అంటే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగరడం.. గాల్లో నుంచి రోడ్డు మీదికి దిగడం) మార్చుకోగలదు. హాయిగా వెళ్లొచ్చు... ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల విలువైన సమయం చాలా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యమైన నగరాల మధ్య 100 నుంచి 500 మైళ్ల దూరం వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటోంది. ఇందులో వెళ్తే ప్రయాణ బడలిక అస్సలుండదని, ఆడుతూపాడుతూ వెళ్లొచ్చని, అదీగాక భూమ్మీద ఉండే అందాలను వీక్షిస్తూ వెళ్లొచ్చని చెబుతోంది. అయితే ఫ్లయింగ్ ట్యాక్సీ ధర ఎంత అనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అలాగే ప్రయాణికులకు టికెట్ ఎంత ఉంటుందన్నది కూడా వెల్లడించలేదు. తొలుత ఏఎం 4.0 ఈ కంపెనీ మొదట రూపొందించిన టూసీటర్ ఫ్లయింగ్ కారు ఏఎం 4.0 మోడల్‌ను 2017 జూన్‌లో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. గాలిలో గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డుపై దీని గరిష్టవేగం గంటకు 160 కి.మీ. దీని ఖరీదు రూ.9.8 కోట్లు – 12 కోట్ల వరకు ఉంది. ఈ ఫ్లయింగ్ కారును గాలిలో నడపాలంటే మాత్రం పైలట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కారును వచ్చే ఏడాదికి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు 2024కు గానీ అందుబాటులోకి రాదని చెబుతోంది. అసలు సిసలు ఫ్లయింగ్ కారు ‘ఇది ఏరోమొబిల్ అసలు సిసలు ఫ్లయింగ్ కారు. ఇది రెండో విప్లవాత్మకమైన మోడల్’ అని కంపెనీ సీఈఓ పాట్రిక్ హెస్సెల్ చెప్పారు. ఒక్క ఉత్తర అమెరికా మార్కెట్లోనే ఏడాదికి 4 లక్షల కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగిరే కార్ల వల్ల వ్యక్తిగత రవాణాను మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. రోడ్డుపైగానీ, గాలిలో గానీ చాలా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి దోహదం చేస్తుందని అంటోంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్‌లకు దీంతో చెక్ పెట్టవచ్చంటోంది. ఈ ఎగిరే కారు కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న 10 వేల ల్యాండింగ్ స్ట్రిప్‌లను వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. -
ఇక వారికి ట్రాఫిక్ చిక్కులు లేనట్లే.. ఫిబ్రవరిలోనే అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన మరో అండర్‌పాస్ వచ్చే ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద కుడివైపు అండర్‌పాస్ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులుదిద్ది, ఫిబ్రవరిలో వినియోగంలోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్‌పాస్ వినియోగంలో ఉండటం తెలిసిందే. ఈ అండర్‌పాస్ కూడా అందుబాటులోకి వస్తే ఇటు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వారికి, విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిథానీల మీదుగా ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్ ప్రాంతాల వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. అండర్‌పాస్ వివరాలు.. ► పొడవు: 490 మీటర్లు ► వెడల్పు: 12. 87 మీటర్లు ► మూడు లేన్లు.. ఒకవైపు ప్రయాణం ► అంచనా వ్యయం : రూ.14.87 కోట్లు ఫిబ్రవరిలో అందుబాటులోకి.. తుకారాంగేట్ ఆర్యూబీ సైతం.. ఎల్బీనగర్ అండర్‌పాస్‌తో పాటు తుకారాం గేట్ రైల్వే అండర్‌పాస్ పనులు కూడా పూర్తి కావచ్చాయని, అది కూడా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య -
ముంబైలో ‘రెంట్ ఏ ట్యాక్సీ’ పథకం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజురోజుకూ జఠిలమవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు ‘రెంట్ ఏ బైక్’ అనే నూతన విధానాన్ని ఓ ప్రైవేటు కంపెనీ తెరమీదకు తెచ్చింది. అందుకు సంబంధించిన ప్రతిపాదన రవాణ శాఖకు పంపించింది. దీనిపై త్వరలో స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఎస్టీఏ) సమావేశం ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్ అవినాశ్ ఢాకణే తెలిపారు. ముంబైలో జరుగుతున్న మెట్రో పనులు వల్ల గత కొన్ని నెలలుగా రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. ఫలితంగా వాహనాల వేగం మందగించి తరచూ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీని ప్రభావం ముంబైకర్ల విలువైన సమయం, వ్యయంపై పడుతోంది. రోడ్లపై ప్రైవేటు కార్లు, ట్యాక్సీలు, ఆటోల సంఖ్య తగ్గించాలంటే రెంట్ ఏ బైక్ పథకం ఎంతో దోహదపడుతుందని ప్రైవేటు కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ కంపెనీ అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం రెంట్ ఏ బైక్ పథకం యాప్ బేస్డ్ సేవా తరహాలో ఉంటుంది. ఈ బైక్‌ల సేవలు రైల్వే స్టేషన్ నుంచి కార్యాలయాలకు చేరుకునే విధంగా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరు రోజుల కోసం ఈ బైక్‌లు హెల్మెట్‌తోపాటు అందజేస్తాయి. బైక్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చు. చదవండి: (ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే..) లోకల్ రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ బయట అందుబాటులో ఉన్న రెంట్ ఏ బైక్ సేవలను వినియోగించుకోవచ్చు. సాధారణంగా లోకల్ రైలు దిగిన ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు షేర్ ట్యాక్సీలు, ఆటోలలో తమ కార్యాలయాలకు చేరుకుంటారు. ఆలస్యమైతే లేదా అత్యవసరమైతే సొంతంగా ట్యాక్సీలో లేదా ఆటోలో వెళతారు. దీంతో రోడ్డుపైకి ఎక్కువ వాహనాలు రావడంవల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంవల్ల చార్జీలు కూడా ఎక్కువే అవుతాయి. ఇది మధ్యతరగతి వారికి ఆర్థికంగా భారం కూడా. అదే బైక్‌ను రెంట్‌కు తీసుకుంటే విలువైన సమయం ఆదా కావడంతోపాటు తక్కువ చార్జీలకే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రైవేటు కంపెనీ అంటోంది. అంతేగాకుండా ట్యాక్సీ, యాప్ ఆధారిత ప్రైవేటు ఓలా, ఉబెర్టాంటి ఫోర్ వీలర్స్‌తో పోలిస్తే టూ వీలర్ ప్రయాణం వేగంగా, చార్జీలు గిట్టుబాటు అయ్యే విధంగా ఉంటుందని పేర్కొంది. ‘ర్యాపిడో’ వ్యవహారం ఇంకా తేలలేదు... ఇదిలాఉండగా 2020 ఆగస్టులోనే ర్యాపిడో అనే కంపెనీ ముంబైలో ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఆ సేవలకు సంబం ధించిన బ్యాడ్జీ, లైసెన్స్ లేకపోవడంతో ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) స్పందించలేదు. అనుమతులు లేకుండా ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తే ర్యాపిడో కంపెనీపై, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆర్టీఓ హెచ్చరించింది. దీంతో ఈ పథ కం అటకెక్కింది. అయితే బైక్ టాక్సీ సేవలు కొనసాగుతుండగా, రెంటెడ్ బైక్ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. అప్పటికే కరోనా కారణంగా ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోయారు. తరుచూ పెరుగుతున్న సీఎన్జీ ధరలతో చార్జీలు పెంచివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రెంట్ ఏ బైక్ సేవలు ప్రారంభిస్తే ట్యాక్సీ, ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఎస్టీఏ దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి సంబంధిత ఆర్టీఓ అధికారులతో సమగ్ర విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆదరాబాదరగా నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత వచ్చే విమర్శలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వచ్చే వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. -
ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ట్రాఫిక్ తిప్పలు త్వరలోనే తీరనున్నాయి. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, మెట్రో–2, 3, 4 దశలు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టులు 2023 వరకు వినియోగంలోకి వస్తాయని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలో జీవనాడి అయిన లోకల్ రైళ్లు సహా బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం నగరంలో ప్రతీరోజు కొన్ని వందల కొద్దీ కొత్త వాహనాలు రోడ్డుపైకి రావడమే. వీటివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటంతో పాటు వాహనాలలో నుంచి వెలువడుతున్న పొగ, ఇతర విష వాయువులు, ధ్వని కాలుష్యం వల్ల వాతావరణం కలుషితం అవుతోంది. దీంతో ముంబైకర్లకు స్వచ్చమైన గాలి, ప్రశాంత వాతావరణం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ముంబైకర్లకు ట్రాఫిక్ జామ్ సమస్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు స్వచ్చమైన గాలితో కూడిన ప్రశాంత వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రణాళికలు రచించింది. చదవండి: ('పోల్‌వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం) ఈ క్రమంలోనే బీఎంసీ పరిపాలనా విభాగం కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) మెట్రో–2, 3, 4 దశల ప్రాజెక్టులు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ముంబైలో ట్రాఫిక్ జామ్ సమస్య చాలా శాతం వరకు తీరనుంది. ప్రయాణం వేగవంతం అవుతుంది. ప్రస్తుతం రెండు గంటల్లో పూర్తి అవుతున్న ప్రయాణం అప్పుడు అర గంటలోనే ముగుస్తుంది. అలాగే, బీఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోస్టల్ రోడ్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు దాదాపు 45 శాతం పూర్తి కావచ్చాయని మంత్రి ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ఇక, ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి వర్లీ సీ–లింకు వరకు 10.58 కిలోమీటర్ల పొడవైన మార్గం ఉంది. ఇందులో నాలుగు లేన్లు (2+2) ఉంటాయి. ఈ మార్గం కొన్ని చోట్ల నేలపై నుంచి, మరికొన్ని చోట్ల భూగర్భం లోపలి నుంచి ఉంటుంది. దీనికి సంబంధించిన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు 2,300 టన్నుల భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మలబార్ హిల్ వద్ద భూగర్భం లోపల తవ్వకం పనులు ఈ ఏడాది జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి కూడా 2023 వరకు పూర్తికానున్నాయి. ఈ పనుల కోసం బీఎంసీ ఏకంగా రూ. 12,700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదే తరహాలో మెట్రో వివిధ ప్రాజెక్టు పనులు, శివ్డీ–నవశేవా సీ–లింకు పనులు కూడా పూర్తవుతాయని ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివ్డీ–నవశేవా సీ–లింకును వర్లీ–బాంద్రా సీ–లింకుతో అనుసంధానం చేయనున్నారు. దీంతో వర్లీలో సీ–లింకు వంతెన పైకెక్కిన వాహనాలు శివ్డీ–నవశేవా మీదుగా నేరుగా నవీ ముంబైలో బయటకు వస్తాయి. ప్రస్తుతం ట్రాఫిక్ ఉన్న సమయంలో వర్లీ నుంచి నవీ ముంబై చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. కానీ, సీ–లింకు మీదుగా వెళితే సుమారు 30–45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీంతో వాహనదారుల విలువైన సమయంతో పాటు వాహనాల ఇంధనం కూడా దాదాపు 50–70 శాతం వరకు ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం కూడా సగానికి పైగా తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో ముంబైకి ఎంతగానో దోహదపడుతాయని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. -
హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న భారీ రియాక్టర్
మల్కాపురం (విశాఖ పశ్చిమ): విశాఖ షిప్‌యార్డ్ నుంచి భారీ రియాక్టర్‌ను మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హెచ్‌పీసీఎల్‌కు తరలించారు. గత రెండేళ్ల నుంచి హెచ్‌పీసీఎల్ సంస్థ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన భారీ రియాక్టర్లను గుజరాత్‌లోని ఎల్అండ్టీ సంస్థ తయారుచేస్తోంది. గుజరాత్ నుంచి రియాక్టర్లు సముద్రమార్గం ద్వారా షిప్‌యార్డ్‌కు వస్తున్నాయి. అక్కడ నుంచి భారీ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు తరలిస్తున్నారు. ఇదేవిధంగా మంగళవారం షిప్‌యార్డ్‌కు వచ్చిన భారీ రియాక్టర్‌ను అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన భారీ హైడ్రాలిక్ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు చేరవేశారు. ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెల్లవారుజామునే అధికారులు రియాక్టర్‌ను తరలించారు. -
అమరావతి సభను ప్రశాంతంగా జరపండి
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సభ నిర్వహణకు అనుమతులు ఇచ్చామని గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమ వర్మ చెప్పారు. సభను అల్లర్లకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన పూర్తి బాధ్యతను నిర్వాహకులే వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. శాంతియుతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యంగం భారత పౌరులకు ఇచ్చిందని.. ఇతరులకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభకు పోలీస్ శాఖ నుంచి అన్ని సహకారాలు ఉంటాయన్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా కొందరు అల్లర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తమకు ముందస్తు సమాచారం అందిందన్నారు. ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విధిగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సభ, ర్యాలీ కార్యక్రమాలను అనుమతిస్తామన్నారు. ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. కరకట్టపై ముఖ్య అధికారులు, జడ్జిలు, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలకు అనుమతి ఉంటుదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మందిని సమీకరించకుండా జాగ్రత్తలు పాటించేలా నిర్వహకులకు అనుమతులు ఇచ్చామన్నారు. -
ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి లింక్‌రోడ్లు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి, కాలుష్యనియంత్రణకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా 137 లింక్, స్లిప్‌రోడ్లు నిర్మిస్తున్నామని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మొదటిదశలో చేపట్టిన 37 లింక్‌రోడ్ల(126 కి.మీ.)లో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. లింక్‌రోడ్లకు ఇప్పటికే రూ.313.65 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ఆకర్షణీయ నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు. తగిన జీవన ప్రమాణాలతో నివాసయోగ్యమైన నగరంగా జేఎల్ఎల్, మెర్సర్ వంటి సంస్థల సర్వేల్లో వెల్లడైందని చెప్పారు. ఓల్డ్ బాంబే హైవే నుండి రోడ్ నంబర్ 45 మార్గంలో రూ. 23.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్‌పాస్ పనులకు శంకుస్థాపనతోపాటు ఓల్డ్ బాంబే హైవే నుండి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు రూ.19.51 కోట్ల వ్యయంతో 2.30 కిలోమీటర్ల మేర లింక్‌రోడ్డు, ఓల్డ్ బాంబే హైవే లెదర్ పార్కు నుండి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు రూ.15.54 కోట్ల వ్యయంతో 1.20 కిలోమీటర్ల లింక్ రోడ్డు, మియాపూర్ రహదారి నుండి హెచ్‌టీ లైన్ వరకు రూ. 9.61 కోట్ల వ్యయంతో కిలోమీటరు దూరంతో నిర్మించిన మరో లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాజాగూడలో విలేకరులతో మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని, నగరంలో గత ఆరేళ్లలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ప్రజల సూచనలు, సలహాలు స్వీకరిస్తాం.. నగర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లింకురోడ్ల గురించి సోషల్ మీడియా, పబ్లిక్‌డొమైన్‌లో పెడతామని, వీటిపై ప్రజల సూచనలు, సలహాలు, స్వీకరించి అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని లింక్‌రోడ్లు నిర్మిస్తామన్నారు. ఖాజాగూడ కొత్తరోడ్డు పక్కనే ద్వీపంలా పెద్ద చెరువు ఉన్నందున దీన్ని నెక్లెస్‌రోడ్డు తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సంజీవయ్యపార్కు, దుర్గంచెరువు, ఇతర చెరవులను అభివృద్ధి చేసినట్లుగానే ఈ చెరువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రజలంతా వీకెండ్స్‌లో సేదతీరేలా మార్చాలన్నారు. కార్యక్రమాల్లో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తల సాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే గాంధీ, మేయ ర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. -
ముంబైలో సరికొత్త ప్రయోగం.. కేటీఆర్ ఆసక్తి
-
రోడ్ల విస్తరణ చేపట్టట్లేదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను విస్తరించట్లేదని, రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను పిల్ కమిటీ సిఫారసుల మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ట్రాఫిక్ డీసీపీలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వల్ల సగం రోజు రోడ్లపైనే గడిచిపోతోందని భాస్కర్ తన లేఖలో పేర్కొన్నారు. తగిన స్థాయిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించలేదని, దీంతో పాదచారులు రోడ్డు దాటడం కష్టమవుతోందన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటం వల్ల వాహనాలను కూడా రోడ్లపై నిలుపుతున్నారని, ఇది కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారిందని వివరించారు. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకుని వాహనదారులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లకు, మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు నిర్వహించే విషయంలో ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండట్లేదన్నారు. ఆర్టీసీ బస్సులను కూడా రోడ్ల మధ్యలో అకస్మాత్తుగా ఆపుతున్నారని, వీటి వల్ల వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పారు. పార్కింగ్ ప్రదేశంలో షాపులు.. పిల్ కమిటీలోని న్యాయమూర్తులందరూ కూడా ఈ లేఖను పిల్‌గా పరిగణించాలని ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సమయంలో స్టిల్ట్ ఏరియాను పార్కింగ్ కోసం చూపుతున్నా, ఆ తర్వాత దాన్ని వాణిజ్య అవసరాల కోసం దుకాణాలుగా మారుస్తున్నారని కమిటీ లోని న్యాయమూర్తి జస్టిస్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. దీంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను నిలపాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఈ అభిప్రాయంతో న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ ఏకీభవించారు. -
స్పీడ్ ప్రాజెక్ట్
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన మొదటి ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే మొదటిసారి కేవలం ఫౌండేషన్స్ తప్ప.. మిగతా పనులన్నీ రెడీమేడ్ (ప్రీ ఫ్యాబ్రికేటేడ్)గా కామినేని వద్ద (ఎడమవైపు) ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టి కేవలం 16 నెలల్లోనే పూర్తి చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రెండు నుంచి రెండున్నరేళ్లు పడుతోంది. టెండరు మేరకు.. ఈ వంతెనను సంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాల్సి ఉండగా, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పనులను దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు సంస్థ బీఎస్సీపీఎల్ ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’ వైపు మొగ్గు చూపింది. ఖర్చు 20 శాతం అధికమైనా తామే భరిస్తామనడంతో ప్రభుత్వం అంగీకరించింది. వివిధ ప్రాజెక్టుల్లో స్తంభాలపైన ఉండే పియర్ క్యాపింగ్ సెగ్మెంట్లు, గర్డర్లకు మాత్రం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ను వినియోగిస్తున్నారు. స్తంభాలకు కూడా ప్రీకాస్టింగ్ వాడడం ఇదే ప్రథమం. ‘ప్రీకాస్ట్ అండ్ పోస్ట్ టెన్షన్డ్ టెక్నాలజీ’గా వ్యవహరించే ఈవిధానంతో ఫ్లై ఓవర్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. కాగా దీనిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఇదే పద్ధతిలో మరో 14 నిర్మాణం చైనా, జర్మనీ వంటి దేశాల్లో ఎంతోకాలంగా అనుసరిస్తున్న ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానాన్ని నగరంలో అమలు చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఎండీ బొల్లినేని శీనయ్య ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వం ప్రోత్సహించడంతో తాము చేపట్టనున్న మరో 14 ఫ్లై ఓవర్లను సైతం ఇదే పద్ధతిలో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కామినేని జంక్షన్ పరిసరాల్లోని మిగతా ఎస్సార్డీపీ పనులు కూడా పూర్తయ్యాక ట్రాఫిక్ సమస్యలు 89 శాతం తగ్గుతాయని జీహెచ్ంసీ చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టŠస్) ఆర్.శ్రీధర్ తెలిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్.. పర్యావరణ పరంగానూ మేలైనదన్నారు. ట్రాఫిక్ సమస్యలతో పాటు ధ్వని కాలుష్యం, జంక్షన్ వద్ద విరామ సమయం తగ్గుతుందన్నారు. ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయని ప్రాజెక్ట్ మేనేజర్ బి.మల్లికార్జునయ్య వివరించారు. కొత్త టెక్నాలజీతో ప్రయోగం సాహసమే అయినా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రూ.448 కోట్లతో ప్యాకేజీ–2 పనులు ఎస్సార్డీపీ మొదటి దశ ప్యాకేజీ–2లో భాగంగా ఎల్బీనగర్ చుట్టుపక్కల నాలుగు జంక్షన్ల (ఎల్బీనగర్, కామినేని, చింతల్‌కుంట, బైరామల్‌గూడ) వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. వీటికి మొత్తం వ్యయం రూ. 448 కోట్లుగా అంచనా వేశారు. తగ్గనున్న ట్రాఫిక్ చిక్కులు ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్‌తో పాటు ప్యాకేజీ–2 పనులు పూర్తయితే కామినేని జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు దాదాపు తొలగిపోతాయి. శ్రీశైలం, శంషాబాద్, ఒవైసీ ఆస్పత్రి, విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుంది. కుడివైపు ఫ్లై ఓవర్ పనులు జరగాల్సి ఉన్నందున అది పూర్తయ్యేంత వరకు ఈ ఫ్లైఓవర్‌ను ప్రస్తుతానికి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు నుంచి ఒవైసీ, శంషాబాద్ వైపు వెళ్లే వారి కోసం వినియోగించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణారావు తెలిపారు. -
టైమింగ్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఈ సమయాల్లో రహదారులపై దూసుకుపోయే వాహనాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఆటోలు, వ్యానులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా... కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల తొందరపాటుతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని తప్పించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు విద్యాసంస్థల పని వేళల్లో మార్పు (స్టాగరింగ్) చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన ఏడేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. 2010 లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, ఆ తర్వాతి ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆశించినప్పటికీ అది అటకెక్కింది. నగర ట్రాఫిక్ చీఫ్‌గా పనిచేసిన సీవీ ఆనంద్ బదిలీతో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ నేతృత్వంలో బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తొలి దశలో పాఠశాలలు, రెండో దశలో కళాశాలల సమయాల్లో మార్పులు చేయాలని తాజాగా ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. విద్యాశాఖ ముందుకొస్తేనే... విద్యాసంస్థల సమయాల్లో మార్పునకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తిస్థాయి అధికారం ట్రాఫిక్ విభాగానికి లేదు. దీని కోసం తొలుత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా కొత్తగా ఏర్పడిన, ఏళ్లుగా ఉన్న స్కూల్ జోన్లను గుర్తించాలి. వీటి ఆధారంగా డీఈఓ సహకారంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ట్రాఫిక్ ఏసీపీ, స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీరంతా ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, తలెత్తుతున్న సమస్యలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆపై ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూసేందుకు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి స్టాగరింగ్కు సంబంధించిన ప్రతిపాదిత విధానాన్ని రూపొందిస్తారు. వీటిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ వింగ్ ప్రయత్నాలు 2012లోనే చేసినా విద్యాశాఖ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు వేళల్లో మార్పులు రాలేదు. దాదాపు అన్నీ ఒకే సమయానికి ప్రారంభమవడం, ముగియడం జరుగుతోంది. దీంతో విద్యార్థులను తరలించే, వ్యక్తిగత వాహనాల కారణంగా తీవ్రమైన రద్దీ ఉంటోంది. మరోవైపు సమయం మించిపోకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో విద్యాకుసుమాలు ప్రమాదాలబారిన పడుతున్నాయి. కేటగిరీల విభజన కీలకం... స్టాగరింగ్ అమలు చేయడానికి ముందుగా స్కూల్ జోన్స్‌ను గుర్తించడంతో పాటు వాటిని కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. 2010లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు, ఆ తర్వాత ఏడాది నగరవ్యాప్తంగా అధ్యయనం చేశారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసిన ట్రాఫిక్ వింగ్ ఉన్నతాధికారులు విద్యాసంస్థలున్న ప్రాంతాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. ఏదేని ప్రాంతంలో 500–750 మీటర్ల విస్తీర్ణంలో 8కంటే ఎక్కువ స్కూల్స్ ఉంటే ‘ఎ’ కేటగిరీగా, ఇంతే విస్తీర్ణంలో 5–7 వరకు స్కూళ్లుంటే ‘బి’, 3–4 ఉంటే ‘సి’ అని గ్రేడింగ్ ఇస్తూ కేటగిరీలుగా విభజించారు. ఈ సంఖ్య ఆధారంగా ఆయా సంస్థల పనివేళల్లో కనీసం 15 నిమిషాల వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని విద్యాసంస్థలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తున్నాయి. స్టాగరింగ్ అమలు చేస్తే ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల మధ్యలో వివిధ సమయాల్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నది ట్రాఫిక్ పోలీసుల అభిప్రాయం. ఇవీ పరిగణించాలి... విద్యాసంస్థలకు సంబంధించి ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల పని వేళలు మార్పు చేసే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో అనేక చిన్న కుటుంబాలున్నాయి. అందులోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారే అధికం. ప్రస్తుతమున్న వేళలకు అనుగుణంగా వీరు తమ విధులకు సంబంధించి సర్దుబాట్లు చేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో స్టాగరింగ్తో చిన్నారుల తల్లిదండ్రుల విధులపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాల్సిందే. స్టాగరింగ్ విధానాన్ని సినిమా హాళ్లు, ప్రైవేట్ కార్యాలయాలకు సైతం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పీక్ అవర్స్ వేళల్లో మార్పులొచ్చి ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 3,522.. శివార్లలో 2,623 సూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 15లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరి రవాణా కోసం సిటీలోనే 9వేల బస్సులు, మరో 30వేల ఆటోలు తిరుగతున్నాయి. వ్యక్తిగత వాహనాలపై పిల్లల్ని తరలించే వారు దీనికి అదనం. -
తొమ్మిదింటికే ‘ప్రైవేట్ హారన్’!
సిటీని ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటకముందే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిత్యం ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ వాహనాల వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనదారులు నరకం చవిచూడాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులపై ప్రైవేట్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిబంధనలకు పాతరేసి సిటీ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. రాత్రి 9 దాటకుండానే రోడ్ల మీదకు వస్తున్న బస్సులు, లారీలు రవాణా చట్టాలను, రహదారి భద్రతను యధేచ్ఛగా తుంగలో తొక్కేస్తూ స్వైరవిహారం చేస్తున్నాయి. రాత్రి 8గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాలు కబంధహస్తాల్లో చిక్కుకొంటుంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే అతి పెద్ద కారిడార్‌లో ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ రద్దీకి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాత్రి వేళల్లో ఈ వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితమం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్, పెద్ద అంబర్‌పేట్‌ల వద్ద బస్సులు, ట్రక్కులు, లారీలు, తదితర రవాణా వాహనాల కోసం టర్మినల్స్ ఏర్పాటు చేసి అక్క డి నుంచే నడాపాలని ఇటీవల రవాణాశాఖ సమీ క్షా సమావేశంలనూ ఆ శాఖ మంత్రి స్పష్టం చేశా రు. ఇందుకోసం ట్రాక్ ఆపరేటర్స్ అసోసియేషన్ కు గతంలో కేటాయించిన భూములను వినియోగించాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. దీంతో రాత్రి వేళ ల్లో, తెల్లవారు జామున రహదారులన్నీ ప్రైవేట్ బస్సులు, లారీలకు అడ్డాగా మారుతున్నాయి. చీమ కూడా కదలడం కష్టమే.... కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ రోడ్లు సాయంత్రం 5 గంటల నుంచే రద్దీగా ఉంటాయి. ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం రాకపోకలు సాగించే వాళ్లతో æరోడ్లు జనసముద్రాన్ని తలపిస్తాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులతో ప్రధాన రహదారులు నిండిపోతాయి. అలాంటి రోడ్లపై ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. కాలనీల నుంచి ఒకటెనుక ఒకటిగా ప్రైవేట్ బస్సులు బయలుదేరుతాయి. క్రమంగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ బస్సులే కనిపిస్తాయి. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగిపోయిన వాహనాలకు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతాయి. దీంతో లక్షలాది మంది రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఒక్క కూకట్పల్లి ప్రజలే కాదు. అటు మియాపూర్ నుంచి కూకట్పల్లి, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, లకిడాకాఫూల్, హిమాయత్‌నగర్, కాచిగూడ, ఆబిడ్స్, కోఠీ, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ వరకు అడుగడుగునా ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రధానమైన బస్టాపులు, బస్‌బేలలో ప్రయివేట్ బస్సులను నిలిపివేస్తున్నారు.లకిడికాఫూల్లోని టెలిఫోన్ భవన్, కాచిగూడ, అమీర్‌పేట్ బస్టాపులు రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సుల అడ్డాలుగా మారుతున్నాయి. ఈ బస్సులను నియంత్రించడంలో పోలీసులు,ఆర్టీఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిబంధనలు బేఖాతర్... మోటారు వాహన నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ వాహనాలు సిటీలోకి ప్రవేశించాలి. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోదు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను దాటి మరీ దూసుకొస్తాయి. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఖైరతాబాద్ వంటి అతి పెద్ద కూడళ్లలో రెడ్‌సిగ్నల్ వెలుగుతున్నప్పటికీ దూసుకొనిపోయే ప్రైవేట్ బస్సులు ప్రతి రోజు కనిపిస్తాయి. ఒకవైపు లకిడికాఫూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజ్‌భవన్ వైపు వెళ్తూనే ఉంటాయి. కానీ అదేమీ పంజగుట్ట నుంచి లకిడికాఫూల్ వైపు వెళ్లే బస్సులు మాత్రం రెడ్ సిగ్నల్‌ను లెక్కచేయకుండా పరుగులు తీస్తూనే ఉంటాయి. రాత్రయిందంటే చాలు అపరిమితమైన వేగంతో ఏ వైపు నుంచి దూసుకొస్తాయో తెలియదు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు రాత్రి సుమారు 550 బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. అలాగే మరో 500 బస్సులు ఉదయం పూట నగరానికి చేరుకుంటాయి. శని,ఆది వారాలు వంటి వీకెండ్స్‌లో వీటి రాకపోకలు మరింత అధికంగా ఉంటాయి. నగరంలోకి వచ్చే వాహనాలు కానీ తిరిగి వెళ్లేవి కానీ ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. ప్రైవేట్ బస్సులకు తోడు హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు మరో 50 వేల లారీలు కూడా ఇదే తరహా ఉల్లంఘనలతో ట్రాఫిక్ టెర్రర్ను సృష్టిస్తున్నాయి. పర్మిట్ల ఉల్లంఘన ... ప్రయాణికులను ఎక్కించుకోవలసిన అనేక బస్సులు సరుకు రవాణా అవతారమెత్తాయి. కేవలం ప్రయాణికుల రవాణా కోసమే ఇచ్చిన పర్మిట్లను ఉల్లంఘించి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వాణిజ్య,వ్యాపార వస్తువులను రవాణా చేస్తున్నాయి. అక్రమంగా తిరుగుతున్న ఇలాంటి బస్సులు వల్ల రహదారి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఒక్కొక్క బస్సుపైన 4 నుంచి 5 టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, బహదూర్‌పురా, లకిడికాఫూల్, తదితర ప్రాంతాల్లో రవాణా అధికారులు నిర్వహించే తనిఖీల్లో ఇలాంటి ఓవర్‌లోడ్‌పై కేసులు నమోదువుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు,నెల్లూరు,కడప,అనంతపురం,తదితర ప్రాంతాలకు ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను వ్యాపారులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. లారీల్లో మాత్రమే తీసుకెళ్లాల్సిన అనేక వస్తువులు టూరిస్టు బస్సుల్లో రవాణా అవుతున్నాయి.ఒక్క ప్రైవేట్ బస్సులకే కాకుండా అన్ని రకాల రవాణా వాహనాలకు నగర శివార్లలోనే హాల్టింగ్ కల్పించి అక్కడికి ప్రయాణికులను తరలించేందుకు సిటీ బస్సులను నడిపితే తప్ప పరిష్కారం లభించదు. -
ట్రాఫిక్ కమాండ్ & కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ సాంకేతికమయం అవుతోంది. టెక్నాలజీ సహాయంతో నేరాలను నిరోధించడానికి, కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప పోలీసింగ్ అమలు చేయాలని నిర్ణయించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాలు, పోలీసు కమిషనరేట్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లను ఆయన బుధవారం ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ ‘బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్లను అనుసంధానించి సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని చెప్పారు. ‘హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఏర్పాటు చేశాం. తొలుత ఇక్కడ అమలులోకి తీసుకువచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తాం. లోపాలు బయటపడితే వాటిని సరిచేసి ఐసీసీసీ అందుబాటులోకి వచ్చేనాటికి పక్కాగా రూపొందిస్తాం’అని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేయడానికి టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లోని పోలీసులకు శిక్షణ ఇచ్చే బాధ్యతల్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు అప్పగిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని శాంతిభద్రతలకు నిలయంగా మార్చి పెట్టుబడులకు కేంద్రాన్ని చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఈ అంశంలో 1.66 లక్షల కెమెరాలను ఏర్పాటు చేయించిన హైదరాబాద్ కమిషనరేటే మిగిలిన వాటికి ఆదర్శం’అని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్చార్జి పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావుతోపాటు మూడు కమిషనరేట్ల అధికారులు పాల్గొన్నారు.