సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఈ సమయాల్లో రహదారులపై దూసుకుపోయే వాహనాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఆటోలు, వ్యానులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా... కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల తొందరపాటుతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని తప్పించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు విద్యాసంస్థల పని వేళల్లో మార్పు (స్టాగరింగ్) చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన ఏడేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. 2010 లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, ఆ తర్వాతి ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆశించినప్పటికీ అది అటకెక్కింది. నగర ట్రాఫిక్ చీఫ్‌గా పనిచేసిన సీవీ ఆనంద్ బదిలీతో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ నేతృత్వంలో బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తొలి దశలో పాఠశాలలు, రెండో దశలో కళాశాలల సమయాల్లో మార్పులు చేయాలని తాజాగా ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు.
విద్యాశాఖ ముందుకొస్తేనే...
విద్యాసంస్థల సమయాల్లో మార్పునకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తిస్థాయి అధికారం ట్రాఫిక్ విభాగానికి లేదు. దీని కోసం తొలుత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా కొత్తగా ఏర్పడిన, ఏళ్లుగా ఉన్న స్కూల్ జోన్లను గుర్తించాలి. వీటి ఆధారంగా డీఈఓ సహకారంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ట్రాఫిక్ ఏసీపీ, స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీరంతా ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, తలెత్తుతున్న సమస్యలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆపై ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూసేందుకు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి స్టాగరింగ్‌కు సంబంధించిన ప్రతిపాదిత విధానాన్ని రూపొందిస్తారు. వీటిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ వింగ్ ప్రయత్నాలు 2012లోనే చేసినా విద్యాశాఖ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు వేళల్లో మార్పులు రాలేదు. దాదాపు అన్నీ ఒకే సమయానికి ప్రారంభమవడం, ముగియడం జరుగుతోంది. దీంతో విద్యార్థులను తరలించే, వ్యక్తిగత వాహనాల కారణంగా తీవ్రమైన రద్దీ ఉంటోంది. మరోవైపు సమయం మించిపోకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో విద్యాకుసుమాలు ప్రమాదాలబారిన పడుతున్నాయి.
కేటగిరీల విభజన కీలకం...
స్టాగరింగ్ అమలు చేయడానికి ముందుగా స్కూల్ జోన్స్‌ను గుర్తించడంతో పాటు వాటిని కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. 2010లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు, ఆ తర్వాత ఏడాది నగరవ్యాప్తంగా అధ్యయనం చేశారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసిన ట్రాఫిక్ వింగ్ ఉన్నతాధికారులు విద్యాసంస్థలున్న ప్రాంతాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. ఏదేని ప్రాంతంలో 500–750 మీటర్ల విస్తీర్ణంలో 8కంటే ఎక్కువ స్కూల్స్ ఉంటే ‘ఎ’ కేటగిరీగా, ఇంతే విస్తీర్ణంలో 5–7 వరకు స్కూళ్లుంటే ‘బి’, 3–4 ఉంటే ‘సి’ అని గ్రేడింగ్ ఇస్తూ కేటగిరీలుగా విభజించారు. ఈ సంఖ్య ఆధారంగా ఆయా సంస్థల పనివేళల్లో కనీసం 15 నిమిషాల వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని విద్యాసంస్థలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తున్నాయి. స్టాగరింగ్ అమలు చేస్తే ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల మధ్యలో వివిధ సమయాల్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నది ట్రాఫిక్ పోలీసుల అభిప్రాయం.
ఇవీ పరిగణించాలి...
విద్యాసంస్థలకు సంబంధించి ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల పని వేళలు మార్పు చేసే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో అనేక చిన్న కుటుంబాలున్నాయి. అందులోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారే అధికం. ప్రస్తుతమున్న వేళలకు అనుగుణంగా వీరు తమ విధులకు సంబంధించి సర్దుబాట్లు చేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో స్టాగరింగ్‌తో చిన్నారుల తల్లిదండ్రుల విధులపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాల్సిందే. స్టాగరింగ్ విధానాన్ని సినిమా హాళ్లు, ప్రైవేట్ కార్యాలయాలకు సైతం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పీక్ అవర్స్ వేళల్లో మార్పులొచ్చి ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 3,522.. శివార్లలో 2,623 సూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 15లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరి రవాణా కోసం సిటీలోనే 9వేల బస్సులు, మరో 30వేల ఆటోలు తిరుగతున్నాయి. వ్యక్తిగత వాహనాలపై పిల్లల్ని తరలించే వారు దీనికి అదనం.
Comments
Please login to add a commentAdd a comment