school timings
-
తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.కాగా, తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9-30 నుంచి తొమ్మిది గంటలకు మార్పు చేశారు. అలాగే, సాయంత్రం 4-45కి బదులుగా 4-15 గంటలకు పని వేళలు ముగుస్తాయని విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది.అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. -
TS: ‘చంద్రయాన్’పై విద్యాశాఖ ఆదేశాలు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో బుధవారం పాఠశాలల టైమింగ్ విషయంలో జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. రేపు చంద్రయాన్ టెలికాస్ట్ కోసమని పాఠశాల ని 6.30 గం. ల వరకు నడపవలసిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే.. రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులకు ప్రొజెక్టర్/కె యాన్/టీవీ ల ద్వారా చూపెట్టాలని.. మిగతా పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద టీవీ లో గాని మొబైల్ లో గాని చూడమని అవగాహన కల్పించాలని తెలిపింది. ఒకవేళ రేపు సాయంత్రం చూడని పక్షంలో తర్వాతి రోజు పాఠశాల సమయంలో విద్యార్థుల కు పాఠశాల లో చూపించాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం కోసమని విద్యార్థులను బడి బయటకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేసిన విద్యాశాఖ.. చంద్రయాన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చంద్రయాన్ 3 లాండింగ్ నేపథ్యంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు టీ సాట్, టీ సాట్ నిపుణ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించేందుకు ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. -
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. బడి వేళలు మార్చుతూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల వేళ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాలను మార్చుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (రేపటి) నుండి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.15 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్ర 4.45 వరకు పని చేస్తాయి. అయితే, విద్యాశాఖ తాజా నిర్ణయానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మరోవైపు తెలంగాణలో వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి రెడ్ అలెర్ట్, హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సోమవారం కూడా భారీగా వర్షాపాతం నమోదైంది. (ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన సర్కార్) సమస్యల బడి భవనాలు.. భారీవర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గత గురు, శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం వెలువడిన వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్ర స్థాయిలో తాజా పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. అయితే, చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయి. తరగతి పైకప్పులు కురుస్తున్నాయి. వర్షపునీరుతో గదుల్లో బోధన జరిపే అవకాశం తక్కువ. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈక్రమంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు కొందరు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు. (హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్ అలెర్ట్ జారీ) -
టైమింగ్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఈ సమయాల్లో రహదారులపై దూసుకుపోయే వాహనాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఆటోలు, వ్యానులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా... కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల తొందరపాటుతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని తప్పించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు విద్యాసంస్థల పని వేళల్లో మార్పు (స్టాగరింగ్) చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన ఏడేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. 2010 లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, ఆ తర్వాతి ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆశించినప్పటికీ అది అటకెక్కింది. నగర ట్రాఫిక్ చీఫ్‌గా పనిచేసిన సీవీ ఆనంద్ బదిలీతో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ నేతృత్వంలో బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తొలి దశలో పాఠశాలలు, రెండో దశలో కళాశాలల సమయాల్లో మార్పులు చేయాలని తాజాగా ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. విద్యాశాఖ ముందుకొస్తేనే... విద్యాసంస్థల సమయాల్లో మార్పునకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తిస్థాయి అధికారం ట్రాఫిక్ విభాగానికి లేదు. దీని కోసం తొలుత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా కొత్తగా ఏర్పడిన, ఏళ్లుగా ఉన్న స్కూల్ జోన్లను గుర్తించాలి. వీటి ఆధారంగా డీఈఓ సహకారంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ట్రాఫిక్ ఏసీపీ, స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీరంతా ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, తలెత్తుతున్న సమస్యలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆపై ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూసేందుకు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి స్టాగరింగ్కు సంబంధించిన ప్రతిపాదిత విధానాన్ని రూపొందిస్తారు. వీటిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ వింగ్ ప్రయత్నాలు 2012లోనే చేసినా విద్యాశాఖ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు వేళల్లో మార్పులు రాలేదు. దాదాపు అన్నీ ఒకే సమయానికి ప్రారంభమవడం, ముగియడం జరుగుతోంది. దీంతో విద్యార్థులను తరలించే, వ్యక్తిగత వాహనాల కారణంగా తీవ్రమైన రద్దీ ఉంటోంది. మరోవైపు సమయం మించిపోకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో విద్యాకుసుమాలు ప్రమాదాలబారిన పడుతున్నాయి. కేటగిరీల విభజన కీలకం... స్టాగరింగ్ అమలు చేయడానికి ముందుగా స్కూల్ జోన్స్‌ను గుర్తించడంతో పాటు వాటిని కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. 2010లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు, ఆ తర్వాత ఏడాది నగరవ్యాప్తంగా అధ్యయనం చేశారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసిన ట్రాఫిక్ వింగ్ ఉన్నతాధికారులు విద్యాసంస్థలున్న ప్రాంతాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. ఏదేని ప్రాంతంలో 500–750 మీటర్ల విస్తీర్ణంలో 8కంటే ఎక్కువ స్కూల్స్ ఉంటే ‘ఎ’ కేటగిరీగా, ఇంతే విస్తీర్ణంలో 5–7 వరకు స్కూళ్లుంటే ‘బి’, 3–4 ఉంటే ‘సి’ అని గ్రేడింగ్ ఇస్తూ కేటగిరీలుగా విభజించారు. ఈ సంఖ్య ఆధారంగా ఆయా సంస్థల పనివేళల్లో కనీసం 15 నిమిషాల వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని విద్యాసంస్థలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తున్నాయి. స్టాగరింగ్ అమలు చేస్తే ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల మధ్యలో వివిధ సమయాల్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నది ట్రాఫిక్ పోలీసుల అభిప్రాయం. ఇవీ పరిగణించాలి... విద్యాసంస్థలకు సంబంధించి ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల పని వేళలు మార్పు చేసే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో అనేక చిన్న కుటుంబాలున్నాయి. అందులోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారే అధికం. ప్రస్తుతమున్న వేళలకు అనుగుణంగా వీరు తమ విధులకు సంబంధించి సర్దుబాట్లు చేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో స్టాగరింగ్తో చిన్నారుల తల్లిదండ్రుల విధులపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాల్సిందే. స్టాగరింగ్ విధానాన్ని సినిమా హాళ్లు, ప్రైవేట్ కార్యాలయాలకు సైతం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పీక్ అవర్స్ వేళల్లో మార్పులొచ్చి ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 3,522.. శివార్లలో 2,623 సూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 15లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరి రవాణా కోసం సిటీలోనే 9వేల బస్సులు, మరో 30వేల ఆటోలు తిరుగతున్నాయి. వ్యక్తిగత వాహనాలపై పిల్లల్ని తరలించే వారు దీనికి అదనం. -
అగ్గి భగ్గు
= సండే, మండే ఎండే = నేడు, రేపు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు = ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దు = వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన = అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం = పాఠశాలల వేళలు సైతం కుదింపు ఒంగోలు టౌన్/కారంచేడు: ప్రచండ భానుడు భగభగమంటున్నాడు. ఏప్రిల్ మాసంలోనే తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పుడే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్న ప్రజలకు వాతావరణ నిపుణుల హెచ్చరికలు మరింత హడలెత్తిస్తున్నాయి. రానున్న రెండురోజులు ఆది, సోమవారాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ప్రజల్ని అప్రమత్తం చేయాలి :డీఆర్వో : రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యలో ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలు జిల్లాకు వచ్చాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరూ బయట తిరగరాదన్నారు. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో మైకులు, దండోరాలతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో పశువులను కూడా బయటకు వదలరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలలను ఉదయం 10 గంటలకే మూసివేయాలన్నారు. ఉపాధి కూలీలు ఉదయం 10గంటలకే పనులు ముగించుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ ఉదయం 9గంటలకే పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లు అవసరమైన మేరకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో సీపీఓ భరత్‌కుమార్, డీఎంహెచ్ఓ యాస్మిన్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, డీపీఓ ప్రసాద్, పశుసంవర్థకశాఖ జేడీ రజనీకుమారి పాల్గొన్నారు. పాఠశాలల వేళలు కుదింపు..: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలని అధికారులు సూచించారు. జిల్లాలో శనివారం 25 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దారవీడు – 42.78 మార్కాపురం – 42.53 మర్రిపూడి – 42.36, పొదిలి – 42.10, వెలిగండ్ల – 41.79, రాచర్ల – 41.55, ముండ్లమూరు – 41.51, బల్లికురవ – 41.24, సీఎస్‌పురం – 41.15, అద్దంకి – 40.48, అర్ధవీడు – 40.30, దొనకొండ – 40.39, దోర్నాల – 40.87, గుడ్లూరు – 40.58, హనుమంతునిపాడు–40.66, కనిగిరి – 40.92, కొమరోలు – 40.89, కొనకనమిట్ల –40.54, కొండపి – 40.58, పామూరు – 40.83, పొన్నలూరు – 40.06, సంతనూతలపాడు– 41.0, తర్లుపాడు – 40.62, తాళ్లూరు – 40.87, త్రిపురాంతకం – 40.26 -
మారిన పాఠశాలల వేళలు
జీహెచ్ఎంసీ పరిధిలో మారిన సమయపాలన కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన డీఈఓ పరిగి: రంగారెడ్డి జిల్లాలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల యాజమాన్యాలు మారిన సమయపాలనను కచ్చితంగా పాటించాలని డీఈఓ రమేష్ ఓ ప్రకటనలో ఆదేశించారు. ఈ మేరకు సమయపాలనతో కూడిన ప్రకటనను ఆయన శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. ప్రస్తుతం పాటిస్తున్న సమయపాలనకు బదులుగా ఈ కింద తెలిపిన సమయాన్ని పాటించాల్సిందేనని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9-00 గంటల నుంచి సాయంత్రం 4-00 గంటల వరకు నిర్వహిస్తుండగా ఇకమీద ఉదయం 8-45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.20 నిమిషాల వరకు కొనసాగించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉదయం 9-00 గంటల నుంచి 4-30 వరకు కొనసాగుతుండగా ఇకమీద ఉదయం 8-45 నుంచి సాయంత్రం 3-55 వరకు కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9-00 గంటల నుంచి సాయంత్రం 4-30 వరకు కొనసాగుతుండగా ఇకమీదట ఉదయం 8-45 గంటల నుంచి సాయంత్రం 3-55 గంటల వరకు కొనసాగించాలన్నారు. మారిన సమయ పాలన కచ్చితంగా అమలయ్యేట్లుగా ప్రధానోపాధ్యాయులు బాధ్యతవహించాలని చెప్పారు. ఈ సమయ పాలన కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.