సాక్షి, ముంబై : నవీముంబైలో ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయి. నగరంలో వాహనాలు నడిపేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కేసులు కూడా అదేవిధంగా నమోదవుతున్నాయి. వాటిని అరికట్టడంతో ట్రాఫిక్ పోలీసులు చాలా ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం ద్విచక్రవాహనాలు నడపడం నగరంలో మామూలైపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈ పిల్లలు వాహనాలను తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడంతో అతివేగంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్‌పోలీస్ విభాగం ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 50 మంది పాఠశాల విద్యార్థులు ద్విచక్రవాహనాలను నడుపుతూ పట్టుబడ్డారు. ఖోపర్‌ఖైర్నే, వాషి, బేలాపూర్, రబాలే, సీవుడ్, తుర్బేలలో ఎక్కువగా విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని తేలింది. వీరిలో ఎక్కువ మంది 15 నుంచి 17 ఏళ్ల వయస్సు లోపు వారే.
ఈ సందర్భంగా డీసీపీ (ట్రాఫిక్) అరవింద్ సాల్వే మాట్లాడుతూ.. నగర రోడ్లపై ట్రాఫిక్ స్థితిగతులు, ట్రాఫిక్ నిబంధనల విషయమై విద్యార్థులకు అంతగా అవగాహన లేకపోయినా వాహనాలను నడపడం సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా లెసైన్సులు లేకుండా వాహనాన్ని నడపడం ఇతరుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే అన్నారు. కాగా, ఆయా ట్రాఫిక్ యూనిట్ల వద్దకు తమ తల్లిదండ్రులను తీసుకు రావాల్సిందిగా పట్టుబడిన విద్యార్థులను హెచ్చరించామన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటేనే తిరిగి వాహనాలను ఇస్తామని వారి తల్లిదండ్రులకు సూచించామన్నారు.
తమ డ్రైవ్‌లను పాఠశాలల వద్ద కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉండగా, నవీ ముంబైలో రోజురోజుకు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనలకు సంబంధించి 2,06,299 కేసులు నమోదయినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో 2,00,333 కేసులు నమోదయ్యాయని చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఆధారంగానే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
నవీముంబైలో ‘ట్రాఫికర్’..!
Published Fri, Nov 28 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement