అభివృద్ధి పనులపై జీహెచ్‌ఎంసీ నిర్ణయం
సీఎం పరిశీలన తర్వాతే పనులు
తాత్కాలికంగా వాయిదా
సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి రహదారుల విస్తరణ చేపట్టాలని భావించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్లు తదితర పనులు చేయాలని తలపెట్టారు. తొలుత మూడు మార్గాల్లోని 60 కి.మీ.ల పరిధిలో చేపట్టాలనుకున్న ఈ పనులు ప్రస్తుతానికి ఆగిపోయాయి. నాగార్జున సర్కిల్ నుంచి వివిధ మార్గాల్లో మియాపూర్ వరకు వీటిని ఏర్పాటు చేసేందుకు కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ టెండర్లు పిలవాలనుకున్నారు. ఆమేరకు నోటిఫికేషన్ కూడా సిద్ధం చేసినప్పటికీ చివరి క్షణంలో విరమించుకున్నారు. హడావుడిగా కాకుండా అన్నీ కూలంకషంగా పరిశీలించాకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వివిధ మార్గాల్లో ఆయా పనులకు సంబంధించిన సర్వే వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నివేదిక అందాక సీఎం సూచన మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని జంక్షన్లు, మార్గాల్లో అభివృద్ధి పనుల అవసరాన్ని సీఎం ఇప్పటికే ప్రస్తావించినప్పటికీ, సర్వే వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాకే పనులు చేయాలని భావిస్తున్నారు.
పరిశీలనలోని మార్గాలు ఇవే..
ప్రస్తుతం అధికారుల పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల్లో మేజర్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం (బషీర్‌బాగ్) నుంచి అఫ్జల్‌గంజ్, ఆబిడ్స్ జీపీఓ నుంచి బ్యాంక్ స్ట్రీట్ మీదుగా చాదర్‌ఘాట్, ఉప్పల్ నుంచి సంగీత్ , హయత్‌నగర్ నుంచి ఎల్‌బీనగర్ మీదుగా ఒవైసీ ఆస్పత్రి, చాదర్‌ఘాట్-పుత్లిబౌలి-ఎంజే మార్కెట్, ఏక్ మినార్ మసీదు, ముస్లింజంగ్ బ్రిడ్జి నుంచి బహదూర్‌పురా మీదుగా ఆరాంఘర్, హబ్సిగూడ నుంచి నాచారం, మల్లాపూర్ మీదుగా ఈసీఐఎల్ చౌరస్తా, బయో డైవర్సిటీ జంక్షన్ నుంచి హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ మార్గం గుండా కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, ఆరాంఘర్ నుంచి ఒవైసీ హాస్పిటల్ మార్గాలున్నాయి.
రెండు దశల్లో జంక్షన్ల అభివృద్ధి..
జంక్షన్ల అభివృద్ధి పనులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నారు. తొలిదశకు పరిశీలిస్తున్న జంక్షన్లలో ఉప్పల్, ఎల్‌బీనగర్, పుత్లిబౌలి, చాదర్‌ఘాట్, బహదూర్‌పురా, కోఠి, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, నారాయణగూడ, కాచిగూడ, వైఎంసీ జంక్షన్లు ఉన్నాయి. రెండో దశ కు పరిశీలిస్తున్న వాటిల్లో కర్బలా మైదాన్, కాటేదాన్ రోడ్డు, బేగంపేట పబ్లిక్‌స్కూల్, ఉషా ముళ్లపూడి ఆస్పత్రి, సంతోష్‌నగర్, ద్వారకా హోటల్ (లక్డీకాపూల్), నేరేడ్‌మెట్, బాచుపల్లి చౌరస్తాలు ఉన్నాయి.
విస్తరణపై ఆచితూచి అడుగు
Published Thu, Jan 15 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM
Advertisement
Advertisement