
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీకి బ్రేక్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిస్తే కానీ, సన్న బియ్యం పంపిణీ జరిగే అవకాశాలు కానరావడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. విత్‌డ్రాల అనంతరం ఎన్నిక ఏకగ్రీవమైతే 10వ తేదీ తర్వాత కోడ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఎన్నికల బరిలో అభ్యర్థులు మిగిలి ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నెల 29 వరకు కోడ్ అమలులో ఉంటుంది.
ఆ తర్వాతనే సన్నబియ్యం జరిగే అవకాశాలున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ కోటా నుంచి బియ్యం కేటగిరి మారుతుండటంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖ ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరినా..ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. దీంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది.
దొడ్డు బియ్యంపై అనాసక్తి
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆహార భద్రత(రేషన్) లబ్ధి కుటుంబాలు దొడ్డు బియ్యంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అర్బన్ పరిధిలో సుమారు 12.56 లక్షల రేషన్ కార్డులుండగా, అందులో బుధవారం నాటికి కేవలం 20 వేల కుటుంబాలు మాత్రమే ఈ నెల కోటా డ్రా చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నెల 17న హైదరాబాద్, 23న రంగారెడ్డి జిల్లాలో, 20న మేడ్చల్‌మల్కాజిగిరి అర్బన్ పరిధిలో నెల వారి కోటా గడువు ముగియనుంది. అయితే కోటా గడువులోగా ఎన్నికల కోడ్ ముగిస్తే మాత్రం సన్నబియ్యం కోటా డ్రా చేయవచ్చని లబి్ధకుటుంబాలు భావిస్తున్నాయి.