The expansion of roads
-
విస్తరణకు దారేదీ?
భూసేకరణే ప్రధాన అడ్డంకి కర్నూలు(అర్బన్): జిల్లాలోని పలు ప్రధాన రహదారులను ఓ వైపు భూసేకరణ, మరో వైపు నిధుల కొరత వేధిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బ్రిడ్జీలకు భూ సేకరణతో పాటు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో రోడ్ల విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. రోడ్లను విస్తరించడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో నిర్మించాల్సిన హైలెవెల్ బ్రిడ్జీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జీలకు అవసరమైన భూములను సేకరించడంలో పలుచోట్ల ఏర్పడిన సమస్యల వల్ల పనులు కాస్తా ఆగిపోవడం... తద్వారా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి భూ సేకరణ సమస్యతో ఏకంగా జాతీయ రహదారుల ఏర్పాటులో అంతులేని జాప్యం జరుగుతోంది. ఇన్ని రోజులుగా జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఆర్ పనులకు విడుదల కాని నిధులు... జిల్లాలోని పలు రోడ్లకు సంబంధించి స్పెషల్ రిపేర్స్ ప్రోగ్రాం (ఎస్ఆర్) కింద రూ.26 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపినా, ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ఎస్ఆర్ పథకం కింద ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వరకు చేపట్టాల్సిన పనులకు రూ.1.10 కోట్లు, చిన్నహుల్తి నుంచి బిల్లేకల్లు వరకు రూ.2 కోట్లు, ఆస్పరి నుంచి ఆలూరు వరకు రూ.1.70 కోట్లు, ప్యాపిలి నుంచి బనగానపల్లె వరకు రూ.2 కోట్లు, బనగానపల్లె నుంచి పాణ్యం వరకు రూ.2 కోట్లు, ఎమ్మిగనూరు నుంచి మాలపల్లి, కోసిగి వరకు రూ.1.70 కోట్లు, నంద్యాల నుంచి బూజనూరు వరకు రూ.1.85 కోట్లు, నంద్యాల నుంచి నందికొట్కూరు వరకు రూ.1.70 కోట్లు, పెంచికలపాడు నుంచి గూడూరు మీదుగా ఎమ్మిగనూరు వరకు రూ.1.80 కోట్లు, వెల్దుర్తి నుంచి ఈదుల దేవరబండ వరకు రూ.2 కోట్లు, వెలుగోడు నుంచి మిడ్తూరు మీదుగా గార్గేయపురం వరకు రూ.2 కోట్లు, అనుగొండ నుంచి లక్ష్మిపురం వరకు రూ.1.85 కోట్లు అవసరమవుతాయని పంపిన ప్రతిపాదనలకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. అటకెక్కిన రూ.290 కోట్ల ప్రతిపాదనలు జిల్లాలోని ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రోడ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపి కూడా నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలనా అనుమతులు రాలేదు. ఈ పనులకు సంబంధించి రూ.290 కోట్లు అవసరమవుతాయని నివేదికలు ప్రభుత్వానికి పంపారు. అయితే, తాజా బడ్జెట్లో కేవలం రూ.30 కోట్లకు మించి కేటాయింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్మాణపు పనులు పూర్తయ్యేందుకు మరో పది సంవత్సరాలు పడుతుందన్నమాట. భూసేకరణ, నిధుల లేమితో జాప్యం జరుగుతున్న పనులు! డోన్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి బస్తిపాడు దగ్గర హంద్రీనదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జీ నందికొట్కూరులో బైపాస్ రోడ్డు నంద్యాల పట్టణంలో నుంచి ఆత్మకూరు రోడ్డుకు బైపాస్ నంద్యాల- ఆత్మకూరు రోడ్డులో ఆర్ఓబీ నిర్మాణం భీమునిపాడు- ఆర్ జంబుదిన్నె రోడ్డులో హై లెవెల్ బ్రిడ్జీ నంద్యాల- కోడూరు రోడ్డు నాగులదిన్నె సమీపంలో తుంగభద్ర నదిపై హై లెవెల్ బ్రిడ్జీ ఆదోనిలో ఆర్ఓబీ నిర్మాణం -
మధ్యేమార్గం!
బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు కసరత్తు! ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పోలీసులు ఎన్‌హెచ్ అధికారులు ఆమోదిస్తే సమస్య తీరినట్టే.. విజయవాడ సిటీ : రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాలు.. ఏళ్ల తరబడి విస్తరణకు నోచుకోని రోడ్లు... ఫలితంగా రాజధాని నగరంలో ప్రజలను ట్రాఫిక్ కష్టాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కష్టాలకు దశలవారీగా చెక్ పెట్టేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడతగా బెంజిసర్కిల్ సమీపంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో.. ప్రజల సమస్యలను కొంతమేరకైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో బెంజిసర్కిల్ సమీపంలో జాతీయ రహదారిని విస్తరించాల్సి ఉందని సూచిస్తున్నారు. రోడ్డు విస్తరణ పూర్తిచేస్తే నగరంలో ప్రయాణించే వాహనాలు, నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను వేర్వేరు రోడ్లపైకి పంపవచ్చని చెబుతున్నారు. తద్వారా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలూ తలెత్తకుండా వాహనాలు సజావుగా వెళ్లేందుకు వీలుంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను నగర పోలీసులు తయారుచేస్తున్నారు. ఇది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(నేషన్ హైవే ఆఫ్ ఇండియా) ఆమోదిస్తే బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతాయని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయాలని... బెంజిసర్కిల్ సమీపంలో వాహనాల రాకపోకలను ‘ఫ్రీ లెఫ్’విధానంలో మళ్లిస్తారు. నగరంలోకి రాకపోకలు సాగించే వాహనాల వలన ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిని తగిన విధంగా మళ్లిస్తే జాతీయ రహదారిపైకి వెళ్లే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. ట్రాఫిక్ నిలవకుండా ఉంటుంది. హైదరాబాదులో ఈ తరహాలోనే వాహనాలను మళ్లించడం వల్లే ట్రాఫిక్ జామ్ సమస్య పెద్దగా ఉండదని పోలీసులు చెబుతున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా వచ్చే వాహనాలను నేరుగా బందరు రోడ్డులోకి అనుమతించరు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకొని జ్యోతిమహాల్ జంక్షన్లో కుడి వైపునకు తిరిగి బెంజిసర్కిల్ చేరుకుని బందరు రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది. బందరు రోడ్డు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలు ఎడమ వైపునకు తిరిగి నిర్మలా కాన్వెంట్ జంక్షన్లో జాతీయ రహదారి దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నిర్మలా కాన్వెంట్ జంక్షన్‌కు ఏ విధమైన వాహనాలను అనుమతించరు. వ్యతిరేకత సహజమే.. కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు మొదట్లో ప్రజల నుంచి వ్యతిరేకత సహజమేనని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు దుర్గగుడి వద్ద ట్రాఫిక్ మళ్లింపే ఉదాహరణ అని చెబుతున్నారు. గుడి పైకి నేరుగా అనుమతించకుండా కుమ్మరిపాలెం జంక్షన్ వరకు వెళ్లి తిరిగి రావడాన్ని వాహనదారులు వ్యతిరేకించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరూ అక్కడి నుంచి వెళ్లడంతో జాతీయ రహదారిపై తరుచూ ఏర్పడే ట్రాపిక్ ఇబ్బందులు తొలగిపోయాయని గుర్తుచేస్తున్నారు. -
విస్తరణపై ఆచితూచి అడుగు
అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ నిర్ణయం సీఎం పరిశీలన తర్వాతే పనులు తాత్కాలికంగా వాయిదా సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి రహదారుల విస్తరణ చేపట్టాలని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్లు తదితర పనులు చేయాలని తలపెట్టారు. తొలుత మూడు మార్గాల్లోని 60 కి.మీ.ల పరిధిలో చేపట్టాలనుకున్న ఈ పనులు ప్రస్తుతానికి ఆగిపోయాయి. నాగార్జున సర్కిల్ నుంచి వివిధ మార్గాల్లో మియాపూర్ వరకు వీటిని ఏర్పాటు చేసేందుకు కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ టెండర్లు పిలవాలనుకున్నారు. ఆమేరకు నోటిఫికేషన్ కూడా సిద్ధం చేసినప్పటికీ చివరి క్షణంలో విరమించుకున్నారు. హడావుడిగా కాకుండా అన్నీ కూలంకషంగా పరిశీలించాకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వివిధ మార్గాల్లో ఆయా పనులకు సంబంధించిన సర్వే వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నివేదిక అందాక సీఎం సూచన మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని జంక్షన్లు, మార్గాల్లో అభివృద్ధి పనుల అవసరాన్ని సీఎం ఇప్పటికే ప్రస్తావించినప్పటికీ, సర్వే వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాకే పనులు చేయాలని భావిస్తున్నారు. పరిశీలనలోని మార్గాలు ఇవే.. ప్రస్తుతం అధికారుల పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల్లో మేజర్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం (బషీర్‌బాగ్) నుంచి అఫ్జల్‌గంజ్, ఆబిడ్స్ జీపీఓ నుంచి బ్యాంక్ స్ట్రీట్ మీదుగా చాదర్‌ఘాట్, ఉప్పల్ నుంచి సంగీత్ , హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఒవైసీ ఆస్పత్రి, చాదర్‌ఘాట్-పుత్లిబౌలి-ఎంజే మార్కెట్, ఏక్ మినార్ మసీదు, ముస్లింజంగ్ బ్రిడ్జి నుంచి బహదూర్‌పురా మీదుగా ఆరాంఘర్, హబ్సిగూడ నుంచి నాచారం, మల్లాపూర్ మీదుగా ఈసీఐఎల్ చౌరస్తా, బయో డైవర్సిటీ జంక్షన్ నుంచి హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ మార్గం గుండా కూకట్పల్లి జేఎన్టీయూ, ఆరాంఘర్ నుంచి ఒవైసీ హాస్పిటల్ మార్గాలున్నాయి. రెండు దశల్లో జంక్షన్ల అభివృద్ధి.. జంక్షన్ల అభివృద్ధి పనులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నారు. తొలిదశకు పరిశీలిస్తున్న జంక్షన్లలో ఉప్పల్, ఎల్బీనగర్, పుత్లిబౌలి, చాదర్‌ఘాట్, బహదూర్‌పురా, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, నారాయణగూడ, కాచిగూడ, వైఎంసీ జంక్షన్లు ఉన్నాయి. రెండో దశ కు పరిశీలిస్తున్న వాటిల్లో కర్బలా మైదాన్, కాటేదాన్ రోడ్డు, బేగంపేట పబ్లిక్‌స్కూల్, ఉషా ముళ్లపూడి ఆస్పత్రి, సంతోష్‌నగర్, ద్వారకా హోటల్ (లక్డీకాపూల్), నేరేడ్మెట్, బాచుపల్లి చౌరస్తాలు ఉన్నాయి. -
ఓరుగల్లుపై చంద్రబింబం !
ఔటర్ రింగ్ రోడ్డులో కదలిక... ప్రధాన రహదారుల విస్తరణ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు ప్రతిపాదనల రూపకల్పనకు కేసీఆర్ ఆదేశాలు 29న ఏరియల్ సర్వే నేపథ్యంలో జిల్లా అధికారులతో సమీక్ష వరంగల్ అర్బన్ : తెలంగాణలో రెండో అతి పెద్ద నగరమైన చారిత్రక ఓరుగల్లు అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. మెట్రోపాలిటన్ నగరాల తరహాలో వరంగల్‌ను తీర్చిదిద్దాలని ఆయా శాఖల అధికారులను పురమాయించారు. ఈ నెల 29వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా అభివృద్ధి ప్రతిపాదనల తయారీపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర్రావు, ఆర్ అండ్ బీ జిల్లా అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అర్అండ్బీ అధికారులకు ప లు సూచనలు చేశారు. వరంగల్ నగరానికి వలసలు పెరుగుతుండడంతో రోజురోజుకూ విస్తరిస్తోంది. గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందనుంది. ఇందులో భాగంగా విజన్-2031 పేరుతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ ము సాయిదా(డ్రాఫ్ట్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రహదారుల వినియోగ సామర్థ్యం పెంచడం, నిర్వహణ వ్యయాన్ని నియంత్రించడం, రవాణా ప్రయాణ సమయం, ఖర్చు గణనీయంగా తగ్గించడం, గమ్య స్థానాలు చేరుకోవడంలో కచ్చితత్వం పెంపొందించడం, రక్షణ చర్యలు, పార్కింగ్, కూడళ్ల విస్తరణతో రవాణా వ్యవస్థను సమగ్రంగా వినియోగించడం ద్వారా ఆర్థికాభివృద్ది సాధించడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయని అధికారులకు సీఎం వివరించారు. ఈ దిశగా నూతన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఖమ్మం, నర్సంపేట, ములుగురోడ్, కరీంనగర్, హైదరాబాద్ రోడ్లతోపాటు వరంగల్ నగరంలో విలీనమైన 42 గ్రామాల రోడ్లను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా మడికొండ, హన్మకొండ చౌరస్తా, నర్సంపేట రహదారుల విస్తరణకు కసరత్తు చేయాలన్నారు. ప్రస్తుతం హన్మకొండ నుంచి నర్సంపేట వరకు ఉన్న 100 అడుగుల రహదారిని 150 అడుగుల రోడ్డుగా విస్తరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాజీపేట దర్గాలోని రైల్వే ట్రాక్ సమీపం నుంచి హంటర్ రోడ్డు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. ఎన్ఐటీ నుంచి కేయూసీ రోడ్డును మరింత విస్తరించాలని సూచించారు. అదేవిధంగా వరంగల్ నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మల్టిలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అవసరమైన చోట మల్టీలెవల్ ఫ్లై ఓవర్లను నిర్మిచేందుకు శాస్త్రీయతతో కూడిన భవిష్యత్ ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. నగర పరిధిలో రెండు లేదా మూడు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి.. నిధులు మంజూరైతే వరంగల్ నగరం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కనుంది. రవాణా వ్యవస్థను సమగ్రంగా వినియోగించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యం. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్ నగరంలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం శాస్త్రీయతతో చేపట్టేలా ప్రతిపాదనలు సమర్పించాలి. సీఎం కేసీఆర్