మధ్యేమార్గం!
బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు కసరత్తు!
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పోలీసులు
ఎన్‌హెచ్ అధికారులు ఆమోదిస్తే సమస్య తీరినట్టే..
విజయవాడ సిటీ : రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాలు.. ఏళ్ల తరబడి విస్తరణకు నోచుకోని రోడ్లు... ఫలితంగా రాజధాని నగరంలో ప్రజలను ట్రాఫిక్ కష్టాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కష్టాలకు దశలవారీగా చెక్ పెట్టేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడతగా బెంజిసర్కిల్ సమీపంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో.. ప్రజల సమస్యలను కొంతమేరకైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో బెంజిసర్కిల్ సమీపంలో జాతీయ రహదారిని విస్తరించాల్సి ఉందని సూచిస్తున్నారు. రోడ్డు విస్తరణ పూర్తిచేస్తే నగరంలో ప్రయాణించే వాహనాలు, నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను వేర్వేరు రోడ్లపైకి పంపవచ్చని చెబుతున్నారు. తద్వారా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలూ తలెత్తకుండా వాహనాలు సజావుగా వెళ్లేందుకు వీలుంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను నగర పోలీసులు తయారుచేస్తున్నారు. ఇది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(నేషన్ హైవే ఆఫ్ ఇండియా) ఆమోదిస్తే బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతాయని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా చేయాలని...
బెంజిసర్కిల్ సమీపంలో వాహనాల రాకపోకలను ‘ఫ్రీ లెఫ్’విధానంలో మళ్లిస్తారు. నగరంలోకి రాకపోకలు సాగించే వాహనాల వలన ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిని తగిన విధంగా మళ్లిస్తే జాతీయ రహదారిపైకి వెళ్లే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. ట్రాఫిక్ నిలవకుండా ఉంటుంది. హైదరాబాదులో ఈ తరహాలోనే వాహనాలను మళ్లించడం వల్లే ట్రాఫిక్ జామ్ సమస్య పెద్దగా ఉండదని పోలీసులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ సర్కిల్ వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా వచ్చే వాహనాలను నేరుగా బందరు రోడ్డులోకి అనుమతించరు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకొని జ్యోతిమహాల్ జంక్షన్‌లో కుడి వైపునకు తిరిగి బెంజిసర్కిల్ చేరుకుని బందరు రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది.
బందరు రోడ్డు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలు ఎడమ వైపునకు తిరిగి నిర్మలా కాన్వెంట్ జంక్షన్‌లో జాతీయ రహదారి దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నిర్మలా కాన్వెంట్ జంక్షన్‌కు ఏ విధమైన వాహనాలను అనుమతించరు.
వ్యతిరేకత సహజమే..
కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు మొదట్లో ప్రజల నుంచి వ్యతిరేకత సహజమేనని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు దుర్గగుడి వద్ద ట్రాఫిక్ మళ్లింపే ఉదాహరణ అని చెబుతున్నారు. గుడి పైకి నేరుగా అనుమతించకుండా కుమ్మరిపాలెం జంక్షన్ వరకు వెళ్లి తిరిగి రావడాన్ని వాహనదారులు వ్యతిరేకించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరూ అక్కడి నుంచి వెళ్లడంతో జాతీయ రహదారిపై తరుచూ ఏర్పడే ట్రాపిక్ ఇబ్బందులు తొలగిపోయాయని గుర్తుచేస్తున్నారు.