Benji Circle
-
అప్పుల నుంచి బయటపడేందుకే..!
వస్త్ర షోరూమ్ ప్రమాదంపై పోలీసుల నిర్ధారణ కృష్ణలంక : ఆర్థికంగా స్థితిమంతుడు. ఐనా తలకు మించిన అప్పులు. వ్యాపారం సక్రమంగా సాగడం లేదు. ఉన్న ఆస్తులు అమ్మేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించరు. బయటపడే మార్గం కోసం బీమా సొమ్ము రాబట్టేందుకు పథక రచన. అదికాస్తా వికటించడంలో పరువు కాపాడుకునేందుకు ఆత్మహత్యకు పాల్పడినట్టు బెంజిసర్కిల్ సమీపంలోని కోరా శారీస్ ఔట్లెట్ అగ్నిప్రమాదంపై పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. వ్యాపారంలో నష్టాలు, అమ్మేందుకు కుటుంబ సభ్యుల ఆంక్షల కారణంగానే షోరూమ్ నిర్వాహకుడు మురళీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. బీమా సొమ్ము రాబట్టేందుకు అగ్నిప్రమాదం జరిగినట్లు సృష్టించే ప్రయత్నాలు చేశాడు. పెట్రోల్ తరహా ద్రావకాన్ని దుస్తులపై పోసి నిప్పంటించినట్టు చెపుతున్నారు. తనకు నమ్మకగుమాస్తా మహేష్‌ను తీసుకొని అర్థరాత్రి సమయంలో షాపులోకి వెళ్లాడు. గుమాస్తాను బయట ఉంచి లోనికి వెళ్లి మంటలు వెలిగించాడు. అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి తాను కూడా గాయపడ్డాడు. ఇదే సమయంలో ఇరుగుపొరుగు అప్రమత్తమై పోలీసులను రప్పించడంలో పరువు పోతుందని భయపడి సమీపంలోని కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. బెంజిసర్కిల్ సమీపంలోని కోరా శారీస్ ఔట్లెట్లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. ప్రమాదస్థలిని శుక్రవారం ఉదయం డీసీపీ కాళిదాస్, ఇన్చార్జి ఏసీపీ రమేష్‌బాబు పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై దృష్టిసారించిన పోలీసులు కుటుంబ సభ్యులు, షాపులోని వర్కర్లు, బంధువులను విచారించడంతో ఇటీవల అప్పుల పాలైన విషయం వెలుగులోకి వచ్చింది. కాల్వలో శవమై ప్రమాదం జరిగిన తర్వాత గోడౌన్ నుంచి పరుగులు తీసిన మురళీకృష్ణ పటమటలంక మసీద్ వీధి సమీపంలోని బందరు కాల్వలో శవమై తేలాడు. స్థానికులు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జరిగిన ప్రమాదంలో మురళీకృష్ణ అక్కడ నుంచి పరుగుపెట్టి స్క్రూబ్రిడ్జి నుంచి కాల్వలోకి దూకి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.7లక్షల ఆస్తినష్టం జరిగిన ప్రమాదంలో సరుకు సుమారు రూ.7లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిఉంటుంది. విద్యుత్ షార్టు సర్యూట్ ద్వారానే ప్రమాదం జరిగినట్లుగా ఉంది. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో విద్యుత్ కారణంగా భావిస్తున్నాం. - బి.శ్రీనివాసరెడ్డి, ఫైర్ ఆఫీసర్ షార్ట్ సర్క్యూట్ కాదు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఒక ట్రాన్స్ఫారం నుంచి, ఒకే కనెక్షన్ నుంచి విద్యుత్ సప్లై అవుతుంది. భవనంలో రెండు మీటర్లు ఉండగా పక్కన బిల్డింగ్‌లో మూడు మీటర్లను ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే ధ్వంసం జరిగి అవి బాగా ఉన్నాయి. షార్టు సర్క్యుట్ జరిగితే ఆ విధంగా జరగదు. బి ఆర్ ప్రసాద్, విద్యుత్ ఏఈ -
మధ్యేమార్గం!
బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు కసరత్తు! ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పోలీసులు ఎన్‌హెచ్ అధికారులు ఆమోదిస్తే సమస్య తీరినట్టే.. విజయవాడ సిటీ : రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాలు.. ఏళ్ల తరబడి విస్తరణకు నోచుకోని రోడ్లు... ఫలితంగా రాజధాని నగరంలో ప్రజలను ట్రాఫిక్ కష్టాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కష్టాలకు దశలవారీగా చెక్ పెట్టేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడతగా బెంజిసర్కిల్ సమీపంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో.. ప్రజల సమస్యలను కొంతమేరకైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో బెంజిసర్కిల్ సమీపంలో జాతీయ రహదారిని విస్తరించాల్సి ఉందని సూచిస్తున్నారు. రోడ్డు విస్తరణ పూర్తిచేస్తే నగరంలో ప్రయాణించే వాహనాలు, నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను వేర్వేరు రోడ్లపైకి పంపవచ్చని చెబుతున్నారు. తద్వారా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలూ తలెత్తకుండా వాహనాలు సజావుగా వెళ్లేందుకు వీలుంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను నగర పోలీసులు తయారుచేస్తున్నారు. ఇది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(నేషన్ హైవే ఆఫ్ ఇండియా) ఆమోదిస్తే బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతాయని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయాలని... బెంజిసర్కిల్ సమీపంలో వాహనాల రాకపోకలను ‘ఫ్రీ లెఫ్’విధానంలో మళ్లిస్తారు. నగరంలోకి రాకపోకలు సాగించే వాహనాల వలన ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిని తగిన విధంగా మళ్లిస్తే జాతీయ రహదారిపైకి వెళ్లే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. ట్రాఫిక్ నిలవకుండా ఉంటుంది. హైదరాబాదులో ఈ తరహాలోనే వాహనాలను మళ్లించడం వల్లే ట్రాఫిక్ జామ్ సమస్య పెద్దగా ఉండదని పోలీసులు చెబుతున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా వచ్చే వాహనాలను నేరుగా బందరు రోడ్డులోకి అనుమతించరు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకొని జ్యోతిమహాల్ జంక్షన్లో కుడి వైపునకు తిరిగి బెంజిసర్కిల్ చేరుకుని బందరు రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది. బందరు రోడ్డు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలు ఎడమ వైపునకు తిరిగి నిర్మలా కాన్వెంట్ జంక్షన్లో జాతీయ రహదారి దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నిర్మలా కాన్వెంట్ జంక్షన్‌కు ఏ విధమైన వాహనాలను అనుమతించరు. వ్యతిరేకత సహజమే.. కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు మొదట్లో ప్రజల నుంచి వ్యతిరేకత సహజమేనని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు దుర్గగుడి వద్ద ట్రాఫిక్ మళ్లింపే ఉదాహరణ అని చెబుతున్నారు. గుడి పైకి నేరుగా అనుమతించకుండా కుమ్మరిపాలెం జంక్షన్ వరకు వెళ్లి తిరిగి రావడాన్ని వాహనదారులు వ్యతిరేకించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరూ అక్కడి నుంచి వెళ్లడంతో జాతీయ రహదారిపై తరుచూ ఏర్పడే ట్రాపిక్ ఇబ్బందులు తొలగిపోయాయని గుర్తుచేస్తున్నారు. -
పవన్‌కల్యాణ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీపై అభాండాలు వేసినందుకు నిరసనగా సినీనటుడు పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మను శుక్రవారం మధ్యాహ్నం బెంజిసర్కిల్‌లో ఆయన అభిమానులు దహనం చేశారు. పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు కంభాల వెంకట మణుదీప్రెడ్డి మాట్లాడుతూ పవన్ తెలంగాణలో ఉన్నప్పుడు జై తెలంగాణ అని, ఇక్కడకు వచ్చిన తరువాత జై సమైక్యాంధ్ర అంటూ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడంతో ఆయన అభిమానులుగా తమకూ తిక్క ఉందని ప్రజలు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి, పవన్‌లను ఎంతో అభిమానించామని, వారిని ఎవరైనా ఏదైనా అంటే ఎదిరించేవారమని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి, పవన్‌లు కాంగ్రెస్, టీడీపీలను తీవ్రస్థాయిలో విమర్శించారని చెప్పారు. ఆ తరువాత కనీసం అభిమానులతో సంప్రదించకుండా చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని, ఇప్పుడు పవన్ టీడీపీ పంచన చేరారని మండిపడ్డారు. అతి పెద్ద అవినీతిపరుడని చంద్రబాబును విమర్శించిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఆయన్ను గొప్ప నాయకుడంటూ పొగడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రాష్ట్రాన్ని విడదీయడంలో టీడీపీ, బీజేపీలు సమాన పాత్ర పోషించాయని, ఇప్పుడు వాటివెంట పవన్‌కల్యాణ్ వెళ్లడం సరికాదని అభిమానులు పేర్కొన్నారు. పవన్‌ను నటుడుగా మాత్రమే ఆదరిస్తామని, రాజకీయ నాయకుడిగా చూడలేమన్నారు. ఆయన ఎవరికి ఓటేయాలో చెప్పడం అనవసరమని, తమకు నచ్చినవారికి ఓటేస్తామని చెప్పారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో పవన్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
సమైక్య హోరు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో 62వ రోజు సోమవారం జోరుగా సాగింది. పామర్రు మండల సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లతో పామర్రు నుంచి బెజవాడ బెంజిసర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మొవ్వలో జనగళ గర్జన, వీరంకిలాకులో రైతుగర్జన సభలు జరిగాయి. ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించారు. సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యాన రైతులు, ట్రాక్టర్ యజమానులు పామర్రు నాలుగు రోడ్ల కూడలి నుంచి 150 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉయ్యూరు, కంకిపాడుల మీదుగా ఈ ప్రదర్శన బెజవాడ బెంజిసర్కిల్‌కు చేరుకుంది. మండల కేంద్రం మొవ్వలో జరిగిన జనగళగర్జన కార్యక్రమంలో పలువురు నేతలు తమ ఉపన్యాసాల ద్వారా జనంలో ఉత్సాహం నింపారు. తూర్పు కృష్ణా ఎన్జీవోల సంఘం నాయకుడు ఉల్లి కృష్ణ అధ్యక్షత వహించారు. కైకలూరు 16వ వార్డులో మహిళలు భారీగా ర్యాలీ చేసి రోడ్డుపై ఆటలు ఆడారు. మండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేశారు. కేసీఆర్ మాస్క్‌కు ఫినాయిల్‌తో పళ్ళు తోమి నిరసన తెలిపారు. కలిదిండిలో క్రైస్తవ సోదరులు రిలే దీక్షలు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పొయ్యిలు పెట్టి దోసెలు పోశారు. చల్లపల్లిలో సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధ్యాపకులు, సిబ్బంది దీక్ష చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. అవనిగడ్డలో సుగాలీ సామాజికవర్గానికి చెందిన పురుషులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ఘంటసాల జేఏసీ నాయకులు రహదారులు ఊడ్చి నిరసన తెలియజేశారు. నాగాయలంకలో తలగడదీవికి చెందిన మహిళలు దీక్ష చేశారు. జగ్గయ్యపేటలో జేఏసీ నాయకులు ఆటోలను శుభ్రం చేసి, కొబ్బరి బొండాలను కొట్టి నిరసన తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసనగా మున్సిపల్ సెంటర్లో సమైక్యవాదులు ఆందోళన చేశారు. పెనుగంచిప్రోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను దంపతులు నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ వద్ద సోమవారం కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కంకిపాడులో దీక్షల సందర్భంగా కేసీఆర్ చిత్రపటాన్ని ముఖానికి తగిలించుకున్న వేషధారికి మహిళలు చీపుర్లు, వేపమండలతో బడితపూజ చేసి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం భారీ జాతీయ పతాకంతో జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టి, మానవహారం నిర్వహించారు. నూజివీడు. చిన్నగాంధీబొమ్మ సెంటర్లో రిలేదీక్ష శిబిరంలో సోమవారం పాత్రికేయులు రిలేదీక్షలో పాల్గొన్నారు. బెజవాడలో.. పామర్రు నుంచి వచ్చిన ట్రాక్టర్లను బెంజిసర్కిల్ చుట్టూ ఉంచి ధర్నా చేశారు. ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కన్వీనర్ విద్యాసాగర్ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ముట్టడించారు. భారీ ర్యాలీ నిర్వహించి బెంజిసర్కిల్వద్ద మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, 13 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ నుంచి ఆటోనగర్ పంటకాల్వ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ ఉపాధ్యాయ జేఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు. వన్‌టౌన్‌లో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులు, సిబ్బంది దోసెలు వేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ ఉపాధ్యాయ జెఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు.