పవన్‌కల్యాణ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీపై అభాండాలు వేసినందుకు నిరసనగా సినీనటుడు పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మను శుక్రవారం మధ్యాహ్నం బెంజిసర్కిల్‌లో ఆయన అభిమానులు దహనం చేశారు. పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు కంభాల వెంకట మణుదీప్‌రెడ్డి మాట్లాడుతూ పవన్ తెలంగాణలో ఉన్నప్పుడు జై తెలంగాణ అని, ఇక్కడకు వచ్చిన తరువాత జై సమైక్యాంధ్ర అంటూ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడంతో ఆయన అభిమానులుగా తమకూ తిక్క ఉందని ప్రజలు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిరంజీవి, పవన్‌లను ఎంతో అభిమానించామని, వారిని ఎవరైనా ఏదైనా అంటే ఎదిరించేవారమని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి, పవన్‌లు కాంగ్రెస్, టీడీపీలను తీవ్రస్థాయిలో విమర్శించారని చెప్పారు. ఆ తరువాత కనీసం అభిమానులతో సంప్రదించకుండా చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని, ఇప్పుడు పవన్ టీడీపీ పంచన చేరారని మండిపడ్డారు.
అతి పెద్ద అవినీతిపరుడని చంద్రబాబును విమర్శించిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఆయన్ను గొప్ప నాయకుడంటూ పొగడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రాష్ట్రాన్ని విడదీయడంలో టీడీపీ, బీజేపీలు సమాన పాత్ర పోషించాయని, ఇప్పుడు వాటివెంట పవన్‌కల్యాణ్ వెళ్లడం సరికాదని అభిమానులు పేర్కొన్నారు.
పవన్‌ను నటుడుగా మాత్రమే ఆదరిస్తామని, రాజకీయ నాయకుడిగా చూడలేమన్నారు. ఆయన ఎవరికి ఓటేయాలో చెప్పడం అనవసరమని, తమకు నచ్చినవారికి ఓటేస్తామని చెప్పారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో పవన్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.