సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో 62వ రోజు సోమవారం జోరుగా సాగింది. పామర్రు మండల సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లతో పామర్రు నుంచి బెజవాడ బెంజిసర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మొవ్వలో జనగళ గర్జన, వీరంకిలాకులో రైతుగర్జన సభలు జరిగాయి. ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించారు.
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యాన రైతులు, ట్రాక్టర్ యజమానులు పామర్రు నాలుగు రోడ్ల కూడలి నుంచి 150 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉయ్యూరు, కంకిపాడుల మీదుగా ఈ ప్రదర్శన బెజవాడ బెంజిసర్కిల్‌కు చేరుకుంది. మండల కేంద్రం మొవ్వలో జరిగిన జనగళగర్జన కార్యక్రమంలో పలువురు నేతలు తమ ఉపన్యాసాల ద్వారా జనంలో ఉత్సాహం నింపారు. తూర్పు కృష్ణా ఎన్జీవోల సంఘం నాయకుడు ఉల్లి కృష్ణ అధ్యక్షత వహించారు. కైకలూరు 16వ వార్డులో మహిళలు భారీగా ర్యాలీ చేసి రోడ్డుపై ఆటలు ఆడారు.
మండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలు చేశారు. కేసీఆర్ మాస్క్‌కు ఫినాయిల్‌తో పళ్ళు తోమి నిరసన తెలిపారు. కలిదిండిలో క్రైస్తవ సోదరులు రిలే దీక్షలు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పొయ్యిలు పెట్టి దోసెలు పోశారు. చల్లపల్లిలో సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధ్యాపకులు, సిబ్బంది దీక్ష చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. అవనిగడ్డలో సుగాలీ సామాజికవర్గానికి చెందిన పురుషులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు.
ఘంటసాల జేఏసీ నాయకులు రహదారులు ఊడ్చి నిరసన తెలియజేశారు. నాగాయలంకలో తలగడదీవికి చెందిన మహిళలు దీక్ష చేశారు. జగ్గయ్యపేటలో జేఏసీ నాయకులు ఆటోలను శుభ్రం చేసి, కొబ్బరి బొండాలను కొట్టి నిరసన తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసనగా మున్సిపల్ సెంటర్‌లో సమైక్యవాదులు ఆందోళన చేశారు. పెనుగంచిప్రోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను దంపతులు నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ వద్ద సోమవారం కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కంకిపాడులో దీక్షల సందర్భంగా కేసీఆర్ చిత్రపటాన్ని ముఖానికి తగిలించుకున్న వేషధారికి మహిళలు చీపుర్లు, వేపమండలతో బడితపూజ చేసి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం భారీ జాతీయ పతాకంతో జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టి, మానవహారం నిర్వహించారు. నూజివీడు. చిన్నగాంధీబొమ్మ సెంటర్లో రిలేదీక్ష శిబిరంలో సోమవారం పాత్రికేయులు రిలేదీక్షలో పాల్గొన్నారు.
బెజవాడలో..
పామర్రు నుంచి వచ్చిన ట్రాక్టర్లను బెంజిసర్కిల్ చుట్టూ ఉంచి ధర్నా చేశారు. ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కన్వీనర్ విద్యాసాగర్ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ముట్టడించారు. భారీ ర్యాలీ నిర్వహించి బెంజిసర్కిల్‌వద్ద మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, 13 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ నుంచి ఆటోనగర్ పంటకాల్వ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.
నగరపాలక సంస్థ ఉపాధ్యాయ జేఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు. వన్‌టౌన్‌లో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులు, సిబ్బంది దోసెలు వేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ ఉపాధ్యాయ జెఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు.
సమైక్య హోరు
Published Tue, Oct 1 2013 1:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement