అప్పుల నుంచి బయటపడేందుకే..!
వస్త్ర షోరూమ్ ప్రమాదంపై పోలీసుల నిర్ధారణ
కృష్ణలంక : ఆర్థికంగా స్థితిమంతుడు. ఐనా తలకు మించిన అప్పులు. వ్యాపారం సక్రమంగా సాగడం లేదు. ఉన్న ఆస్తులు అమ్మేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించరు. బయటపడే మార్గం కోసం బీమా సొమ్ము రాబట్టేందుకు పథక రచన. అదికాస్తా వికటించడంలో పరువు కాపాడుకునేందుకు ఆత్మహత్యకు పాల్పడినట్టు బెంజిసర్కిల్ సమీపంలోని కోరా శారీస్ ఔట్‌లెట్ అగ్నిప్రమాదంపై పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. వ్యాపారంలో నష్టాలు, అమ్మేందుకు కుటుంబ సభ్యుల ఆంక్షల కారణంగానే షోరూమ్ నిర్వాహకుడు మురళీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. బీమా సొమ్ము రాబట్టేందుకు అగ్నిప్రమాదం జరిగినట్లు సృష్టించే ప్రయత్నాలు చేశాడు. పెట్రోల్ తరహా ద్రావకాన్ని దుస్తులపై పోసి నిప్పంటించినట్టు చెపుతున్నారు. తనకు నమ్మకగుమాస్తా మహేష్‌ను తీసుకొని అర్థరాత్రి సమయంలో షాపులోకి వెళ్లాడు.
గుమాస్తాను బయట ఉంచి లోనికి వెళ్లి మంటలు వెలిగించాడు. అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి తాను కూడా గాయపడ్డాడు. ఇదే సమయంలో ఇరుగుపొరుగు అప్రమత్తమై పోలీసులను రప్పించడంలో పరువు పోతుందని భయపడి సమీపంలోని కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. బెంజిసర్కిల్ సమీపంలోని కోరా శారీస్ ఔట్‌లెట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. ప్రమాదస్థలిని శుక్రవారం ఉదయం డీసీపీ కాళిదాస్, ఇన్‌చార్జి ఏసీపీ రమేష్‌బాబు పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై దృష్టిసారించిన పోలీసులు కుటుంబ సభ్యులు, షాపులోని వర్కర్లు, బంధువులను విచారించడంతో ఇటీవల అప్పుల పాలైన విషయం వెలుగులోకి వచ్చింది.
కాల్వలో శవమై
ప్రమాదం జరిగిన తర్వాత గోడౌన్ నుంచి పరుగులు తీసిన మురళీకృష్ణ పటమటలంక మసీద్ వీధి సమీపంలోని బందరు కాల్వలో శవమై తేలాడు. స్థానికులు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జరిగిన ప్రమాదంలో మురళీకృష్ణ అక్కడ నుంచి పరుగుపెట్టి స్క్రూబ్రిడ్జి నుంచి కాల్వలోకి దూకి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రూ.7లక్షల ఆస్తినష్టం
జరిగిన ప్రమాదంలో సరుకు సుమారు రూ.7లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిఉంటుంది. విద్యుత్ షార్టు సర్యూట్ ద్వారానే ప్రమాదం జరిగినట్లుగా ఉంది. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో విద్యుత్ కారణంగా భావిస్తున్నాం.
- బి.శ్రీనివాసరెడ్డి, ఫైర్ ఆఫీసర్
షార్ట్ సర్క్యూట్ కాదు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఒక ట్రాన్స్‌ఫారం నుంచి, ఒకే కనెక్షన్ నుంచి విద్యుత్ సప్లై అవుతుంది. భవనంలో రెండు మీటర్లు ఉండగా పక్కన బిల్డింగ్‌లో మూడు మీటర్లను ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే ధ్వంసం జరిగి అవి బాగా ఉన్నాయి. షార్టు సర్క్యుట్ జరిగితే ఆ విధంగా జరగదు.
బి ఆర్ ప్రసాద్, విద్యుత్ ఏఈ