ఓరుగల్లుపై చంద్రబింబం !
ఔటర్ రింగ్ రోడ్డులో కదలిక... ప్రధాన రహదారుల విస్తరణ
నగరంలోని రద్దీ ప్రాంతాల్లో మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు
ప్రతిపాదనల రూపకల్పనకు కేసీఆర్ ఆదేశాలు
29న ఏరియల్ సర్వే నేపథ్యంలో
జిల్లా అధికారులతో సమీక్ష
వరంగల్ అర్బన్ : తెలంగాణలో రెండో అతి పెద్ద నగరమైన చారిత్రక ఓరుగల్లు అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. మెట్రోపాలిటన్ నగరాల తరహాలో వరంగల్‌ను తీర్చిదిద్దాలని ఆయా శాఖల అధికారులను పురమాయించారు. ఈ నెల 29వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా అభివృద్ధి ప్రతిపాదనల తయారీపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర్‌రావు, ఆర్ అండ్ బీ జిల్లా అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అర్‌అండ్‌బీ అధికారులకు ప లు సూచనలు చేశారు. వరంగల్ నగరానికి వలసలు పెరుగుతుండడంతో రోజురోజుకూ విస్తరిస్తోంది. గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందనుంది. ఇందులో భాగంగా విజన్-2031 పేరుతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ ము సాయిదా(డ్రాఫ్ట్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రహదారుల వినియోగ సామర్థ్యం పెంచడం, నిర్వహణ వ్యయాన్ని నియంత్రించడం, రవాణా ప్రయాణ సమయం, ఖర్చు గణనీయంగా తగ్గించడం, గమ్య స్థానాలు చేరుకోవడంలో కచ్చితత్వం పెంపొందించడం, రక్షణ చర్యలు, పార్కింగ్, కూడళ్ల విస్తరణతో రవాణా వ్యవస్థను సమగ్రంగా వినియోగించడం ద్వారా ఆర్థికాభివృద్ది సాధించడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయని అధికారులకు సీఎం వివరించారు. ఈ దిశగా నూతన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఖమ్మం, నర్సంపేట, ములుగురోడ్, కరీంనగర్, హైదరాబాద్ రోడ్లతోపాటు వరంగల్ నగరంలో విలీనమైన 42 గ్రామాల రోడ్లను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఉండాలని ఆదేశించారు.
అంతేకాకుండా మడికొండ, హన్మకొండ చౌరస్తా, నర్సంపేట రహదారుల విస్తరణకు కసరత్తు చేయాలన్నారు. ప్రస్తుతం హన్మకొండ నుంచి నర్సంపేట వరకు ఉన్న 100 అడుగుల రహదారిని 150 అడుగుల రోడ్డుగా విస్తరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాజీపేట దర్గాలోని రైల్వే ట్రాక్ సమీపం నుంచి హంటర్ రోడ్డు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. ఎన్‌ఐటీ నుంచి కేయూసీ రోడ్డును మరింత విస్తరించాలని సూచించారు. అదేవిధంగా వరంగల్ నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మల్టిలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అవసరమైన చోట మల్టీలెవల్ ఫ్లై ఓవర్లను నిర్మిచేందుకు శాస్త్రీయతతో కూడిన భవిష్యత్ ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. నగర పరిధిలో రెండు లేదా మూడు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి.. నిధులు మంజూరైతే వరంగల్ నగరం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కనుంది.
రవాణా వ్యవస్థను సమగ్రంగా వినియోగించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యం. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్ నగరంలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం శాస్త్రీయతతో చేపట్టేలా ప్రతిపాదనలు సమర్పించాలి.
సీఎం కేసీఆర్