
హైదరాబాద్ నగరంలోని భూములమ్మి నిర్మించేందుకు హౌసింగ్ బోర్డు కసరత్తు
అందుబాటు ధరల ఇళ్ల కోసం పాలసీ
దీనిపై కన్సల్టెన్సీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచిన బోర్డు
విస్తృత స్థాయిలో అపార్ట్‌మెంట్లు నిర్మించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం అందుబాటు ధరల్లో ఉండే గృహాలను నిర్మించేందుకు గృహనిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) సిద్ధమైంది. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా కేపీహెచ్‌బీ వంటి భారీ హౌసింగ్ కాలనీలను రూపొందించిన బోర్డు.. ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ కాలనీలు నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది.
ఉమ్మడి ఏపీ సమయంలో 2013లో హైదరాబాద్ శివార్లలోని రావిర్యాలలో విల్లాల నిర్మాణమే హౌసింగ్ బోర్డు చివరి ప్రాజెక్టు కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. సుమారు పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడుతోంది. హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించేందుకు పాలసీని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ పాలసీ ఎలా ఉండాలి, తక్కువ ధరలో ఇళ్లు అందుబాటులో ఉంచేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇళ్ల నమూనాలు, ఖర్చును తగ్గిస్తూ మన్నికను పెంచేందుకు వినియోగించే ఆధునిక పరిజ్ఞానం తదితర అంశాలపై సూచనల కోసం కన్సల్టెన్సీని నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ బోర్డు బుధవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28న టెక్నికల్ బిడ్లు, మార్చి 3న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనుంది.
సిటీలో భూములు అమ్మి..
హైదరాబాద్ నగరంలోపల కాలనీలను నిర్మించాలంటే భారీ వ్యయం అవుతుంది. ఇళ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనితో అందుబాటులో ఇళ్ల ధరలు ఉండేలా.. ఔటర్ రింగురోడ్డు చుట్టూ కాలనీలు నిర్మించాలని, అవి శాటిలైట్ టౌన్‌షిప్‌ల తరహాలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో వందల ఎకరాల స్థలాలు ఉన్నాయి. కానీ వాటిలో దాదాపు 1,200 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు కూడా బోర్డు ఆ«దీనంలో ఉన్నాయి. ఇందులో ఖరీదైన ప్రాంతాల్లోని భూములను వేలం వేసి, ఆ నిధులతో శివార్లలో భూములు సేకరించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలిసింది.
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి..
ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు అమలు చేసిన విధానాలు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. పలు రాష్ట్రాలు వీటిని అనుసరించాయి కూడా. అయితే అనంతర కాలంలో రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు నామమాత్రంగా మారగా.. ఇతర రాష్ట్రాల్లో పురోగతి సాధించాయి.
ఈ క్రమంలో కన్సల్టెన్సీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి, అనుసరించదగిన అంశాలను సూచించనుంది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు వద్ద నిధులు లేవు. అయితే వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నందున.. వాటిని తనఖా పెట్టి హడ్కో వంటి సంస్థల నుంచి రుణం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ నిధులతో కాలనీల నిర్మాణం చేపట్టనుంది.
అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి చాన్స్..
గతంలో హౌసింగ్ బోర్డు రూపొందించిన కాలనీల్లో 80శాతం వ్యక్తిగత ఇళ్లే. అప్పట్లో వాటికే డిమాండ్ ఉండటంతో అవే నిర్మించింది. ఎల్‌ఐజీ కేటగిరీలో మాత్రం అల్పాదాయ వర్గాల కోసం క్వార్టర్ల రూపంలో ఇళ్లను నిర్మించింది. ఇప్పుడు భూముల ధరలు అధికంగా ఉన్నందున వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం కాకుండా.. విస్తృత స్థాయిలో అపార్ట్‌మెంట్లనే నిర్మించే అవకాశం ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే..
ఔటర్ రింగు రోడ్డును నిర్మించిన తర్వాత దాని చుట్టూ శాటిలైట్ టౌన్íÙప్స్ నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ నగరంపై జనాభా ఒత్తిడి తగ్గుతుందని భావించి, టౌన్íÙప్‌లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఆయన అకాల మరణంతో అమల్లోకి రాలేదు, తర్వాతి ప్రభుత్వాలేవీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఆలోచనతో కసరత్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment