
అంగన్‌వాడీలకు కోడిగుడ్ల సరఫరా టెండర్ల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడి కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో నెలపాటు పొడిగించింది. టెండరు విధానంలో నిర్దేశించిన నిబంధనలు కొంతమందికే అనుకూలంగా ఉన్నాయనే అంశంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రత్యేక కథనం రావడంతో స్పందించిన ప్రభుత్వం మొదట ఒకసారి గడువును పొడిగించింది. అలాగే, పౌల్ట్రీ రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అధికారుల వైఖరిపై ఫిర్యాదులు చేయడంతో తాజాగా మరోసారి గడువును పొడిగించారు.
37,500 అంగన్‌వాడి కేంద్రాలకు ఏడాదిలో 36.96 కోట్ల గుడ్లు సరఫరా చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఆ మేరకు రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలో ఏడుగురు కాంట్రాక్టర్ల ఎంపికకు టెండర్లను పిలిచి, ఈ నెల 11న టెండర్లు తెరవాలని నిర్ణయించుకుంది. అయితే టెండరు నిబంధనలు పాత కాంట్రాక్టర్లకు అనుకూలంగా, కొత్తవారికి ప్రతిబంధకంగా ఉన్నాయనే అంశాలను ప్రస్తావిస్తూ ఈ నెల 6న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. టెండరు నిబంధనల్లో సవరణలు చేస్తూ గడువు తేదీని ఐదు రోజులు పొడిగించింది.
అయినప్పటికీ ప్రధాన నిబంధనల్లో సవరణలు చేయలేదంటూ పౌల్ట్రీ రైతులు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన టెండర్ల గడువును పొడిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో శిశుసంక్షేమ శాఖ.. మే 15 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని, 16న కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తామని ప్రకటిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీచేసింది. కాగా, టెండర్ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు పౌల్ట్రీ రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేసినట్లు తెలిసింది.