Housing Board
-
కాపాడలేం.. అమ్మేద్దాం!
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డు, దానికి అనుబంధంగా ఉన్న ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)’ఆధీనంలోని భూములను అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల నిర్వహణ కోసం భారీగా నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ భూముల విక్రయంపై దృష్టిసారించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గృహనిర్మాణ శాఖ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలిసింది. సదరు భూములపై ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. తొమ్మిదో షెడ్యూల్లో ఉండటంతో.. ఉమ్మడి రాష్ట్ర సమయంలో.. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇళ్లను సమకూర్చేలా హౌసింగ్‌బోర్డు ఆధ్వర్యంలో కాలనీలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. బోర్డు ఏర్పడే నాటికే తెలంగాణ ప్రాంతంలో దాని ఆ«దీనంలో భారీగా భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కూడా బోర్డు భూములను సమకూర్చుకుంది. ఇందులో భారీ వెంచర్ల కోసం ప్రత్యేకంగా ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిడెడ్ (దిల్)’పేరిట అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో దిల్ పరిధిలో 1,800 ఎకరాల భూములు, హౌసింగ్ బోర్డు ఆ«దీనంలో మరో 820 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల అంశం రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం పరిధిలో ఉంది. హౌజింగ్‌బోర్డు, దిల్లకు సంబంధించి ఏ ప్రాంతంలోని భూములు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ పట్టుబట్టినా.. షీలా భిడే కమిటీ భిన్న నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ అంశం అలాగే తొమ్మిదో షెడ్యూల్లో తెగని పంచాయితీగా ఉండిపోయింది. హైకోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో సదరు భూములను అమ్మేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారుతోంది. కాపాడలేమంటూ కేంద్రం దృష్టికి.. హౌసింగ్‌బోర్డు, దిల్ భూములు కీలక ప్రాంతాల్లో ఉండటంతో వాటిపై కబ్జారాయుళ్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా భూములపై వివాదాలు మొదలయ్యాయి. ఈ భూముల విక్రయానికి ప్రక్రియ మొదలుపెట్టగానే.. అభ్యంతరాలు వస్తాయని, కోర్టులో కేసు ఉండగా ఎలా అమ్ముతారన్న ప్రశ్న వస్తుందని సర్కారు ముందుగానే అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇటు కోర్టుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భూముల పరిరక్షణ సవాల్‌గా మారిందన్న విషయాన్ని తెలియపర్చాలని భావిస్తోంది. ‘‘ఇప్పటికే చాలా భూములు వివాదంలో ఉన్నాయి. వాటితోపాటు క్లియర్‌గా ఉన్న మిగతా భూములను పరిరక్షించటం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కబ్జాలు ఇంకా పెరిగి వివాదాలు కోర్టుల్లో పెరిగేంత వరకు ఉపేక్షించటం సరికాదు. ఈ భూములకు సంబంధించి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. ముందు వాటిని వేలం ద్వారా విక్రయించి, వచి్చన డబ్బును తదనుగుణంగా వినియోగించుకోవచ్చు. అందుకు వీలు కల్పించాలి’’అని కోర్టును కోరాలని యోచిస్తోంది. కేంద్రానికి కూడా ఇదే వివరించాలని.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ ప్రతినిధిని కూడా నియమించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
ఓపెన్ ప్లాట్లే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: 1991లో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 320 మంది ఉద్యోగులకు ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్లాట్లను ఫ్లాట్లు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 32ను కొట్టివేసింది. ఏపీ హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు హైదరాబాద్ కూకట్పల్లి సర్వే నంబర్ 964, 1009లో 13 ఎకరాలను ప్రభుత్వం 1991లో కేటాయించింది. గజం రూ.45 చొప్పున కేటాయించాలని చెబుతూ ప్లాట్లను సిద్ధం చేసే బాధ్యతను హౌసింగ్ బోర్డుకు అప్పగించింది. అయితే లేఅవుట్ సిద్ధమయ్యాక ఆ మొత్తాన్ని రూ.116కు పెంచింది. దీనిపై చర్చ కొనసాగుతుండగానే కేటాయింపును నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్లకు బదులు ఫ్లాట్లను కేటాయించాలంటూ జీవో 32ను విడుదల చేసింది. దీన్ని ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వం పేర్కొన్న విధంగా రూ.116 చెల్లించిన 107 మందికి ప్లాట్లను అప్పగించాలని తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం, హౌసింగ్‌బోర్డు, మరికొందరు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఉద్యోగుల నుంచి సొమ్ము వసూలు చేసినందున ఆ భూమిపై వారికే హక్కులు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించడం కొత్తకాదని, జీవో 32ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం 320 మందికి ప్లాట్లను 4 నెలల్లో రిజి్రస్టేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
'దొంగ 'అని పొరబడి అనాలోచితంగా చితకబాదేశారు..పాపం ఆ వ్యక్తి..
మద్యం మత్తులో ఓ వ్యక్తి హౌసింగ్ బోర్డులోకి చొరబడ్డాడు. అంతే అతన్ని దొంగగా భావించి సదరు హౌసింగ్ బోర్డు వాచ్మెన్, కొందరూ వ్యక్తులు అతడిని దొంగ అనుకుని చితకబాదేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి చేర్పించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ప్రవీణ్ అనే వ్యక్తి మద్యం సేవించి సమీపంలో కూల్చి వేసి ఉన్న హౌసింగ్ బోర్డులోకి ప్రవేశించాడు. అది గమనించిన వాచ్మెన్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కంగారుపడ్డ ఆ వ్యక్తి గోడ ఎక్కి పారిపోతున్నాడు. ఆగమని చెప్పిన వినకుండా వెళ్లడంతో ..వాచ్మెన్ తోపాటు సదరు వ్యక్తులు ప్రవీణ్‌పై గట్టిగా కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కస్తుర్బా ఆస్పత్రికి తరలించాగా..అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అతను దాడి చేయడం వల్ల మరణించాడా లేక మరేదైనా కారణం వల్ల చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు పోస్ట్‌మార్టం అనంతరం అతడిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తామని వెల్లడించారు. (చదవండి: డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం: వీడియో వైరల్) -
హౌజింగ్బోర్డును ఎత్తేసిన తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హౌజింగ్ బోర్డును ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. గృహ నిర్మాణ శాఖ ఆస్తులు, పథకాలు, ఉద్యోగులను.. ఆర్ అండ్ బీ శాఖలో విలీనం చేసింది. హౌజింగ్ బోర్డుతో పాటు రాజీవ్ స్వగృహ, దిల్(దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్) సంస్థలకూ ఈ కీలక నిర్ణయం వర్తించనుంది. -
‘హౌసింగ్ బోర్డు’ రిజిస్ట్రేషన్లకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) స్థలాల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన జాయింట్ వెంచర్ల కొనుగోలుదారులకు తీపి కబురు అందింది. వారు కొన్న ఇళ్లు, వాణిజ్య స్థలాల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమమైంది. జూలై ఒకటి నుంచి రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనితో దాదాపు 15 ఏళ్ల పాటు కొనసాగిన వివాదానికి తెరపడింది. విలువైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినా.. రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆగిపోవటంతో కొనుగోలుదారుల్లో నెలకొన్న ఆందోళన సమసిపోయింది. ఏమిటీ వివాదం? హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి వంటి విలువైన ప్రాంతాల్లో గృహనిర్మాణ మండలికి ఖాళీ స్థలాలున్నాయి. వాటిలో ప్రైవేటు సంస్థలతో కలిసి పీపీపీ పద్ధతిలో వాణిజ్య సముదాయాలు, నివాస గృహ సముదాయాలను అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. 2007లో అప్పటి ప్రభుత్వం 19 ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయించింది. ఆయా సంస్థలు వివిధ దఫాల్లో కొంతమొత్తం సొమ్ము చెల్లించాయి. అయితే సదరు స్థలాల్లో కొన్ని సంస్థలు పనులు ప్రారంభించినా, మిగతావి జాప్యం చేశారు. సుమారు 12 ప్రాజెక్టుల్లో ఆశించినమేర ప్రాజెక్టులు ముందుకు పడలేదు. ఇలా దశాబ్దానికిపైగా గడిచింది. వాటిని చేపట్టిన సంస్థలు కమర్షియల్ స్పేస్ నిబంధనలు మార్చాలని, వన్‌టైమ్ సెటిల్మెంట్ వంటి ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలోనే ఆయా స్థలాల్లో చేపట్టిన నిర్మాణాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం 2016లో కేబినెట్ సబ్‌కమిటీని నియమించింది. ఆ కమిటీ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు స్థలాలను పరిశీలించి, సంస్థల ప్రతినిధులతో చర్చించి 2018లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా నిర్ణయం వెలువడలేదు. ఈలోగా అన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తయి, నిర్మాణాలు అమ్ముడయ్యాయి. కానీ నిషేధం ఉండ టంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. తాజాగా రిజిస్ట్రేష న్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహనిర్మాణశాఖ ఇచ్చిన భూములకు సదరు సంస్థల నుంచి ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు అందనున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా కూడా సర్కారుకు ఆదాయం రానుంది. -
పేదలకు ఇళ్లస్థలాలు !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు ఇళ్లస్థలాలను ఇచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూంఇళ్లను పూర్తి ఉచితంగా ఇస్తున్నందున, హౌసింగ్ బోర్డు ద్వారా అఫర్డబుల్(తక్కువ ధర) ఇళ్లను నిర్మించి విక్రయించే ప్రతిపాదనలు లేవన్నారు. రాజీవ్ స్వగృహ పథకం విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. డబుల్బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో పట్టణ ప్రాంతాల్లో మైనారిటీలకు 10 శాతం కోటాను తప్పనిసరిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వారి సేవలుS కొనసాగిస్తాం: ఉద్యానవన శాఖలో 550 మంది మండలస్థాయి అధికారులు, 190 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను పూర్తిస్థాయిలో తొలగించలేదని, సంబంధిత ప్రాజెక్టు అమలు కాలపరిమితి ముగియడంతో వారి సేవలను నిలిపివేశామని వ్యవసాయమంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వారి సేవలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉద్యానవన డిప్లొమా, పీజీ కోర్సులకు అవకాశం కల్పించడానికి మంత్రి ప్రతిపాదించిన కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన వర్సిటీ సవరణ బిల్లు–2021ను శాసనసభ ఆమోదించింది. -
4 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నాలుగు బిల్లులను శుక్రవారం ఆమోదించింది. గృహ నిర్మాణ మండలిని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా గుర్తించడంతోపాటు ముగ్గురు సభ్యులను నామినేట్ చేసేలా సవరించిన తెలంగాణ గృహ నిర్మాణమండలి (సవరణ) బిల్లు–2021ను గృహ నిర్మాణమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్ఆర్ఐ), హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల అనుబంధాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు– 2021ని కూడా సభ ఆమోదించింది. జాతీయ న్యాయ శాస్త్ర అధ్యయనాలు, పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయం (నల్సార్)లో తెలంగాణ విద్యార్థుల కోటాను 20 నుంచి 25 శాతానికి పెంచడంతోపాటు ఈ 25 శాతం కోటాలో బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నల్సార్ సవరణ బిల్లు–2021కు సైతం శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని కొత్త గ్రామాల ఏర్పాటు, ఏదైనా గ్రామం విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు, హద్దుల మార్పునకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లులోని పేరుమార్పు నిబంధనలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరుమార్పు నిబంధనను తొలగించాలని పట్టుబట్టడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. పేరుమార్పు నిబంధనపై నిరసన తెలుపుతున్నట్లు అక్బరుద్దీన్ ప్రకటించగా సవరణ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం మరో రెండు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. తెలంగాణ వస్తుసేవల పన్ను సవరణ బిల్లును మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. రాష్ట్ర పర్యాటకులు, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తనను నివారించే బిల్లును హోంమంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. కాగా, వర్షాల మూలంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో శాసనసభ సమావేశాలకు విరామం ప్రకటించడంతో ఈ నెల 7 వరకు సమావేశాలను పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఈ నెల 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
గూడు ఉంటుందా?
చంచల్‌గూడ: మాదన్నపేట హౌసింగ్‌బోర్డు క్వార్టర్స్‌లో అద్దెకుంటున్నవారికి పెద్ద కష్టం వచ్చిపడింది. వాటిలో ఏళ్ల తరబడి ఉంటున్న విశ్రాంత ఉద్యోగులను ఖాళీ చేయాలని అధికారులు తరచూ నోటీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్‌ను కేటాయించాలని హౌసింగ్ బోర్డుకు పలుమార్లు నివాసితులు విజ్ఞప్తి చేసినా వారి అభ్యర్థనకు స్పందించలేదు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు 1964లో 36 బ్లాక్‌లతో 144 ఫ్లాట్స్‌తో మాదన్నపేటలో క్వార్టర్స్ నిర్మాణం చేపట్టింది. అవి పూర్తికాగానే 1969లో అమ్మకానికి పెట్టింది. అప్పట్లో ఒక్కో ఫ్లాట్‌ను రూ.20 వేల చొప్పున విక్రయించగా 71 ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. మిగతా వాటిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు ఉండేలా వీలు కల్పించారు. అప్పటి నుంచి ఈ క్వార్టర్స్‌లో నివసిస్తున్నవారు తమ జీతభత్యాలకు అనుగుణంగా రూ.3 నుంచి 10 వేల వరకు అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 73 మంది అద్దెదారుల్లో సగానికిపైగా విశ్రాంత ఉద్యోగులే. కాగా 1994లో తమకు క్వార్టర్స్‌పై యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో క్వార్టర్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా రెండు సార్లు వీరికి హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు అలసత్వం దాదాపు 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్‌ను కేటాయించాలని ఇక్కడివారు హౌసింగ్ బోర్డుకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అటునుంచి స్పందన రాకపోవడంతో సమస్యను 2008లో ఆ నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. అద్దెదారులకు మార్కెట్ ధర ప్రకారం క్వార్టర్స్‌ను కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు వచ్చి సర్వే కూడా చేశారు. అయితే, దురదృష్టవశాత్తు అదే ఏడాది సీఎం రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో నివాసితుల విజ్ఞప్తులు బుట్టకాఖలైపోయాయి. ఆ నాటి నుంచి వారి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఫ్లాట్స్ కేటాయింపులను తిరిగి మొదలు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వారిది న్యాయమైన డిమాండ్ నివాసితులది న్యాయమైన డిమాండ్. మార్కెట్ ధరకు అనుగుణంగా క్వార్టర్స్‌ను కేటాయించి యాజమాన్య హక్కులు కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం వీరిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈ సమస్యపై దృష్టి సారించాలి. – సహదేవ్‌యాదవ్, బీజేపీ నేత ప్రభుత్వం న్యాయం చేయాలి నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ నివాసముంటున్న మమ్మల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరిగాయి. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని క్వార్టర్స్‌ను మాకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అందుకు హౌసింగ్ బోర్డు అధికారులకు అదేశాలు జారీ చేయాలి.– పి. శ్రీశైలం, రిటైర్డ్ ఉద్యోగి -
భూములు కాపాడుకున్న హౌసింగ్ బోర్డు
సాక్షి, హైదరాబాద్ : దీర్ఘకాలంగా సాగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించుకుని దాదాపు రూ.700 కోట్ల విలువైన భూమి చేజారకుండా రాష్ట్ర గృహనిర్మాణ మండలి కాపాడుకుంది. ఈ వివాదానికి సం బంధించి సుప్రీం కోర్టు తాజాగా మండలికి అనుకూలంగా తీర్పు వెలువరించినట్లు గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది. కూకట్‌పల్లిలోని 1009 సర్వే నంబర్లో 20 ఎకరాల భూమికి సంబంధించి హౌసింగ్ బోర్డుకు, అజమున్నీసా బేగం అనే మహిళకు మధ్య గత 20 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ హౌసింగ్ బోర్డుకు అనుకూలంగా తీర్పునివ్వగా ఆమె హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ అజమున్నీసా బేగంకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు ను సవాల్ చేస్తూ 2010 లో సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ముందు గృహనిర్మాణ మండలి స్పెష ల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 20 ఎకరాల భూమి హౌసింగ్ బోర్డుకే చెందుతుందంటూ హైకోర్టు ఇచ్చి న తీర్పును కొట్టి వేస్తూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు పట్ల గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థంగా వాదనలు వినిపించి న న్యాయ బృందాన్ని వారు అభినందించారు. ఈ తీర్పు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లాంటి శాఖలు రికార్డుల సవరణ చేయకుండా రూలింగ్‌గా ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహ, హౌసింగ్ బోర్డు న్యాయవాది టీవీ రత్నం, హౌసింగ్ బోర్డు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ కె.వెంకటేశ్వర్లు, న్యాయాధికారిణి పి.అరుణ కుమారి ఇతర అధికారులను గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అభినందించారు. -
మళ్లీ హౌజింగ్ బోర్డు వెంచర్లు
♦ రూ.వేయి కోట్లతో 13 చోట్ల ప్రాజెక్టులు ♦ డూప్లెక్స్, ఇండిపెండెంట్, ఫ్లాట్స్ నమూనాలో ఇళ్ల నిర్మాణం ♦ త్వరలో ధరల ఖరారు... పక్షం రోజుల్లో నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణంలో చేయితిరిగిన గృహనిర్మాణ మండలి కొన్నేళ్ల తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్టులతో తెరపైకి వస్తోంది. గత ఐదేళ్లుగా నిస్తేజంగా ఉన్న ఆ మండలి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి డిమాండ్ నోటిఫికేషన్లు జారీ చేయబోతోంది. రూ.వేయి కోట్లతో రాష్ట్రంలోని 13 ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టబోతోంది. డూప్లెక్స్ నమూనా, ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్లు నిర్మించబోతోంది. మరో పక్షం రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లు జారీ చేయకపోవటంతోపాటు, గతంలో డిమాండ్ సర్వే చేసిన ప్రాజెక్టులను కూడా ప్రారంభించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గృహనిర్మాణ సంస్థను ప్రభుత్వం రద్దు చేయటంతో గృహనిర్మాణ మండలిపై కూడా నీలినీడలు ఏర్పడ్డాయి. స్వగృహ కార్పొరేషన్ దాదాపు మూతపడ్డ నేపథ్యంలో గృహనిర్మాణ మండలి కథ కూడా కంచికి చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎట్టకేలకు మళ్లీ కొత్త నోటిఫికేషన్లతో హౌసింగ్ బోర్డు మనుగడ చాటుకునేందుకు రెడీ అయింది. సాధారణంగా బోర్డు నోటిఫికేషన్లకు మంచి స్పందన ఉంటుంది. నిర్మించబోయే ఇళ్ల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. ఇప్పటికీ మంచి డిమాండ్ ఉండటంతో కొత్త నోటిఫికేషన్లకు కూడా దరఖాస్తులు పోటెత్తుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇళ్ల ధరలను మరికొద్ది రోజుల్లో నిర్ధారించి పక్షం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సమాచారం. నగరంలోని కూకట్పల్లి, చందానగర్, శివార్లలోని పోచారం, తట్టిఅన్నారం, బాచుపల్లి, మంగళ్‌పల్లి, గచ్చిబౌలి, బౌరంపేటలాంటి మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాలతోపాటు నల్లగొండ, సదాశివపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ తదితర 13 చోట్ల ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. -
దుమ్ము లేపుతున్న వాహనాలు
► హౌసింగ్‌బోర్డులో కానరాని సీసీ రోడ్లు ► ఎండస్తో దుమ్ము.. వానస్తో బురద ► కాలనీ వాసులకు తప్పని అవస్థలు కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలో హౌసింగ్‌బోర్డు కాలనీ ఏర్పడి 20 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆ కాలనీలో కనీస సౌకర్యాల్లేవు. మారుమూల పల్లెలకంటే అధ్వానంగా ఉంది. సీసీ రోడ్డు చూడాలంటే బూతద్దం పెట్టుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎండ ఉంటే దుమ్ము, వానొస్తే బురదతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా.. హౌజింగ్‌బోర్డు ప్రజల జీవన స్థితిగతులు మాత్రం మారకపోవడం గమనార్హం. ఓట్ల కోసం వచ్చే నాయకులు రెండేళ్లలో సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఓట్లు వేరుుంచుకోవడం, ఆ తర్వాత తొంగిచూడకపోవడం పరిపాటిగా మారింది. హౌజింగ్‌బోర్డు పరిధిలో ఉన్నన్ని రోజుల కష్టాలు అనుభవించిన ప్రజలు, నగరపాలక సంస్థకు అప్పగిస్తే బతుకులు మారుతాయని భావించారు. నగరపాలక సంస్థకు అప్పగించి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇళ్లు దుమ్ముమయం హౌజింగ్‌బోర్డు కాలనీలో సీసీ రోడ్లు లేక దుమ్ముతో తల్లడిల్లుతున్నారు. వాహనాలు వెళ్తే ఇక అంతే సంగతులు. రోడ్లపై కంటే ఇళ్లలోనే ఎక్కువగా దుమ్ము కనబడుతోంది. వంటపాత్రలు, బట్టలు, గృహోపకరణాలు అన్నీ దుమ్ముమయంగా మారుతున్నారుు. ఇక పిల్లలు, వృద్ధులు దుమ్ముతో ఉబ్బసం వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక వానొస్తే ఆ బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నారుు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. రోడ్లన్నీ పొలాలను తలపిస్తారుు. వర్షం పడిన తర్వాత వారం రోజుల వరకు బురద ఉంటోంది. హౌజింగ్‌బోర్డు కాలనీ నిర్మాణం రేగడి నేలలో జరగడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు కరువు కార్పొరేషన్లో ఉన్నా ఇతర డివిజన్లతో పోలిస్తే హౌజింగ్‌బోర్డు కాలనీ ప్రజలు మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోవడం లేదు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగలేదు. మంచినీటి సౌకర్యం పూర్తిస్థారుులో లేదు. వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. యూజీడీ పైపులైన్ కోసం తవ్వకాలు చేపట్టడంతో మట్టిరోడ్లు కూడా ఛిద్రమై గుంతలమయంగా మారారుు. ద్విచక్ర వాహనాలపై వెళ్తే నడుం నొప్పి ఖాయం. కాలినడకన వెళ్లినా అడుగు తీసి అడుగు వేయలేనంత ఇబ్బందిగా ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితులున్నా కాలనీ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికై నా నగరపాలక సంస్థ అధికారులు హౌజింగ్‌బోర్డు కాలనీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
115.75 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం సూళ్లూరుపేట: జిల్లాలో పలు దొంగతనాలతో సంబంధాలు ఉన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.16.97 లక్షలు విలువచేసే 115.75 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వివరించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి షార్ బస్టాండ్ సమీపంలో కొక్కు శంకరయ్య ఇంటి తాళాలు పగులగొట్టి 18 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30 వేలు నగదు చోరీ జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా చెంగాళమ్మ ఆల యం సమీపంలోని పాత చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న చిత్తూరు జిల్లా గుడిపాల మండలం యామ్నూరు కు చెందిన రహంతుల్లా మస్తాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. 2015 జూలైలో నెల్లూరురూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో 8 సవర్లు, 2015 లో ఏప్రిల్‌లో వెంకటగిరిలో 12 సవర్లు, నవంబర్‌లో తడ హైస్కూల్ రోడ్డులోని ఓ ఇంట్లో 3 సవర్లు, 2016 జనవరిలో తడకండ్రిగ రాజీవ్‌నగర్‌లో మరో ఇం ట్లో ఒకటిన్న సవర, అదే నెలలో వెంకటగిరి ఓ ఇంట్లో అర సవర , ఫిబ్రవరిలో గూడూరు మార్కెట్ వీధిలో ఓ ఇంట్లో 30 సవర్ల బంగారు నగలను అపహరించినట్లు విచారణలో తేలింది. అతని నుంచి 72 సవర్ల ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నామని, వీటి విలువ రూ. 10.61 లక్షలు ఉంటుందని తెలిపారు. మరో దొంగ.. ఆనంతపురం జిల్లా తాటిపర్తికి చెందిన ఆకుల రాంబాబు (35) ప్రస్తుతం తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నివాసం ఉంటూ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ నెల 2వ తేదీ రాత్రి మండలంలోని జంగాల పల్లిలో నాగారపమ్మ ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న ఆరున్నర సవర్ల బం గారు ఆభరణాలు, హుండీలో ఉన్న రూ. 10వేలు నగదు అపహరించాడు. నింది తుడు స్థానిక రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా ఉండటంతో అనుమానించి పట్టుకుని విచారించగా సూళ్లూరుపేట, గూడూరు, మనుబోలు, రాపూరు, వెంకటగిరి పట్టణాల్లో సుమారు ఏడు దొంగతనాలు చేనినట్టు ఒప్పుకున్నాడని చెప్పా రు. అతని వద్ద నుంచి 43.5 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ. 6,36 లక్షలు ఉంటుంది. ఈ కేసులను ఛేదిం చిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ విజయకృష్ణ, ఎస్సైలు గంగాధర్‌రావు, సురేష్, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందించారు. -
చెలరేగిన చైన్ స్నాచర్లు
బెంగళూరు(బనశంకరి) : నగరంలో మళ్లీ చైన్‌స్నాచర్లు పెట్రేగిపోయారు. శనివారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌కు తెగబడ్డారు. జేపీ.నగర ఏడవపేజ్లోని చుంచుఘట్ట మెయిన్‌రోడ్డు శివశక్తినగరలో శాలిని అనే మహిళ రాత్రి 8.15 సమయంలో ఆస్పత్రిలో విధులు ముగించుకుని కాలినడకన ఇంటికి బయల్దేరింది. బన్నేరుఘట్టరోడ్డు- అరికెరె సిగ్నిల్ వద్ద బైక్‌లో వచ్చిన దుండగుడు ఆమె మెడలోని 10 గ్రాముల బంగారుచైన్ లాక్కొని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జేపీ.నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా జయనగర హౌసింగ్‌బోర్డులోని వజ్రమునినగరలో చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానికంగా ఉంటున్న సుజాతా అనే మహిళ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి ముందు చిన్నారిని ఆడించుకుంటూ భోజనం తినిపిస్తుండగా ఇద్దరు చైన్స్నాచరు అడ్రస్ అడుగుతూ ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారుచైన్ లాక్కుని బైకులో ఉడాయించారు. ఘటనపై తలఘట్టపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
యువకుడిని చితకబాదిన ఎస్ఐ
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: పోలీస్‌స్టేషన్‌లో ఉన్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లిన యువకుడిని ఎస్ఐ, సిబ్బంది చితకబాదిన సంఘటన చాపాడు స్టేషన్లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 2న మట్కా రాస్తున్నారనే కారణంతో చాపాడు ఐడీ పార్టీ పోలీసులు ప్రొద్దుటూరులోని దస్తగిరిపేటకు చెందిన మహబూబ్‌బాషా, దస్తగిరి, కుమార్‌తో పాటు మరో యువకుడిని తీసుకొని వెళ్లారు. కుమార్‌తో మాట్లాడటానికి ప్రొద్దుటూరులోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన నరసింహప్రకాశ్ 3వ తేదీన స్టేషన్‌కు వెళ్లాడు. అతన్ని బయటికి వదలాలంటే రు.1 లక్ష తీసుకొని రమ్మని ఐడీ పార్టీ పోలీసులతో పాటు ఎస్ఐ గిరిబాబు చెప్పాడు. అంత డబ్బు నా వద్ద లేదు.. నేను అతన్ని చూడటానికి మాత్రమే వచ్చానని చెప్పాడు. రు.20 వేలు మాత్రమే అతని వద్ద ఉందంట.. కావాలంటే తీసుకొని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఫోన్ చేసి పిలిచి మరీ చితకబాదారు బుధవారం ఉదయాన్నే చాపాడు ఐడీ పార్టీ పోలీసులు నరసింహప్రకాష్కు ఫోన్ చేశారు. మీ ఫ్రెండ్ కుమార్‌ను కోర్టుకు పెడుతున్నామని చెప్పడంతో రూ.20 వేలు తీసుకొని అతను చాపాడుకు వెళ్లాడు. డబ్బు తీసుకున్న ఎస్ఐ మిగతా రూ.30 వేలు ఏదీ అని అడిగాడు. లేదు సార్ ! నిన్ననే చాప్పాను కదా ..ఉండేది రు.20 వేలేనని.. ఎస్ఐతో అన్నాడు. నిన్ను లోపల వేసి కుమ్మితే డబ్బులు అవే పరుగెత్తుకుంటూ వస్తాయ్ అంటూ ఎస్ఐ అతన్ని లాఠీతో చితకబాదాడు. ఎస్ఐతో పాటు ఐడీపార్టీ సిబ్బంది కాళ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. అతని చెయ్యి విరగడంతో పాటు ఒళ్లంతా రక్తగాయాలయ్యాయి. బంధువులు అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐపై ప్రైవేట్ కేసు తనను విచక్షణా రహితంగా కొట్టిన ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లు సుధాకర్, చెన్నయ్యపై గురువారం సాయంత్రం నరసింహప్రకాష్ స్థానిక కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. -
బతుకు వేటలో..
మహబూబ్‌నగర్ న్యూస్‌లైన్: పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగం సాధించాలన్న ఆ యువకుడి కల నెరవేరలేదు. తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉండి చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయాలన్న మరో యువకుడి సంకల్పం ఫ లించలేదు. పెళ్లి పనులకు కూలీలుగా వెళ్లిన ఆ ఇద్దరు యువకు లు విద్యుదాఘాతానికి బలయ్యారు. ఈ విషాదకర సంఘటన గురువారం జిల్లాకేంద్రంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తాడూర్ మండలం చె ర్లతిర్మలాపురం గ్రామానికి చెందిన బానాసి వంశీకుమార్(22) జిల్లాకేంద్రంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మరో యువకుడు మహబూబ్‌నగర్ మండలం క్రిష్టియన్పల్లికి చెందిన కాశపు యేసు(23) తాపీమేస్త్రీగా పనిచేస్తుండేవాడు. ఇదిలాఉండగా వంశీకుమార్ తన చదువుల కోసం అప్పుడప్పుడు స్థానిక హౌజింగ్‌బోర్డు కాలనీలో ఉన్న యూబీ గార్డెన్స్ ఫంక్షన్హాల్లో కూలీపనికి వెళ్తుండేవాడు. యేసు కూడా తాపీ పని దొరకని సమయంలో అతను కూ డా అదే ఫంక్షన్హాల్లో పనిచేసేవాడు. ఈ క్ర మంలో గురువారం ఆ గార్డెన్లో పెళ్లి ఏర్పాట్లలో భాగంగా బ్యానర్ కట్టేందుకు రోడ్డుపైకి వచ్చాడు. ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. విద్యుదాఘాతంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించిన గార్డెన్ యజమాని మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గాంధీనాయక్ తెలిపారు. సీపీఎం నాయకుల ఆందోళన ఫంక్షన్‌హాల్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు యువకులు మృతిచెందారని సీపీఎం నాయకులు సంఘటనస్థలంలో ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతపరిచారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఫంక్షన్‌హాల్ యజమాని అందుకు ఒప్పుకోలేదు. ఆందోళనను మరింత తీవ్రతరం చేయడంతో ఎట్టకేలకు దిగిర్చి ఒక్కో కుటుంబానికి రూ.ఐదులక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు అంగీకరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్ విషయం తెలుసుకున్న కలెక్టర్ గిరిజాశంకర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం ద్వారా ఆదుకుంటామని, కుటుంబంలో ఒక్కరికి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగావకాశం కల్పిస్తామని కలెక్టర్ హామీఇచ్చారు. తక్షణసహాయం కింద ఎన్ఎఫ్బీఎస్ స్కీం ద్వారా రూ.20వేలు అందజేశారు. విద్యుత్ శాఖ ఎస్ఈ సదాశివారెడ్డి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తామని హామీఇచ్చారు. రెక్కాడితే డొక్కడని కుటుంబాలు మృతులిద్దరిది రెక్కాడితే గాని డొక్కడని పేద కుటుంబం. వంశీకుమార్ కుటుంబంలో మొదటివాడు. తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకుంటూ స్వగ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. తాను పనిచేయగా వచ్చిన డబ్బులో కొంత తల్లిదండ్రులకు పంపిస్తూ వారి బాగోగులను చూసుకునేవాడు. తన చదువును కూడా కొనసాగిస్తున్నాడు. అతని మరణంతో కన్నవారు తల్లడిల్లిపోతున్నారు. యేసుకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. తల్లిలేని అతడు పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతని మరణంలో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
భక్తి శ్రద్ధలతో బక్రీద్
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం ముస్లింలు భక్తి శ్రద్ధలతోనూ, ఆనందోత్సాహంగా బక్రీద్‌ను జరుపుకున్నారు. సామూహిక ప్రార్థనలతో ఈద్గా మైదానాలు అధ్యాత్మిక భావాన్ని చాటాయి. అధికార, అనధికార ప్రముఖులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని ఈద్గా మైదానంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన సామూహిక ప్రార్థనలో వేలాది మంది పాల్గొన్నారు. జామీయా మసీదు పేష్ ఇమామ్ సయ్యద్ రహంతుల్లా ఖాద్రీ, నగర ఖాజీ ఇమామ్ షరీఫ్ తదితరులు పర్వదిన విశిష్టతను వివరించారు. హజరత్ ఇబ్రహీం చేసిన మహోన్నత త్యాగం.. మానవాళికి సందేశాన్నందించిందని, ఇస్మాయిల్ జ్ఞాపకార్థం వారి త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడం అందరి విధి అని తమ సందేశంలో పేర్కొన్నారు. అన్ని మతాల మధ్య సయోధ్యను, సహకార భావనను బక్రీదు తెస్తుందని, సాధ్యమైనంత మేరకు దానధర్మాలతో అల్లాను మెప్పించాలని సూచించారు. ముతవల్లి కేఎం.షఫివుల్లా, పలువురు మత పెద్దలు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్ చెప్పుకున్నారు. హెచ్చెల్సీకాలనీలోని ఈద్గామైదానంలో బహువీద్దీన్ మసీదులో మత పెద్ద ఇమామ్ బక్రీద్ సందేశాన్ని అందించారు. లలితా కళాపరిషత్ వద్ద ఉన్న ఈద్గా మసీదు, లక్ష్మీనగర్‌లోని పీటీసీ వద్ద ఉన్న చాందినీ మసీదు, పాతూరులోని జామీయా మసీదు, గుల్జార్‌పేట్‌లోని మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముస్లింలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.