గూడు ఉంటుందా? | Notice to Housing Board Quarters Retired Employees | Sakshi
Sakshi News home page

గూడు ఉంటుందా?

Published Thu, Aug 8 2019 11:32 AM | Last Updated on Thu, Aug 8 2019 11:32 AM

Notice to Housing Board Quarters Retired Employees - Sakshi

మాదన్నపేట కాలనీ హౌసింగ్‌ బోర్డు క్వార్టర్స్‌

చంచల్‌గూడ: మాదన్నపేట హౌసింగ్‌బోర్డు క్వార్టర్స్‌లో అద్దెకుంటున్నవారికి పెద్ద కష్టం వచ్చిపడింది. వాటిలో ఏళ్ల తరబడి ఉంటున్న విశ్రాంత ఉద్యోగులను ఖాళీ చేయాలని అధికారులు తరచూ నోటీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్‌ను కేటాయించాలని హౌసింగ్‌ బోర్డుకు పలుమార్లు నివాసితులు విజ్ఞప్తి చేసినా వారి అభ్యర్థనకు స్పందించలేదు. రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు 1964లో 36 బ్లాక్‌లతో 144 ఫ్లాట్స్‌తో మాదన్నపేటలో క్వార్టర్స్‌ నిర్మాణం చేపట్టింది. అవి పూర్తికాగానే 1969లో అమ్మకానికి పెట్టింది. అప్పట్లో ఒక్కో ఫ్లాట్‌ను రూ.20 వేల చొప్పున విక్రయించగా 71 ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. మిగతా వాటిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు ఉండేలా వీలు కల్పించారు. అప్పటి నుంచి ఈ క్వార్టర్స్‌లో నివసిస్తున్నవారు తమ జీతభత్యాలకు అనుగుణంగా రూ.3 నుంచి 10 వేల వరకు అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 73 మంది అద్దెదారుల్లో సగానికిపైగా విశ్రాంత ఉద్యోగులే. కాగా 1994లో తమకు క్వార్టర్స్‌పై యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో క్వార్టర్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా రెండు సార్లు వీరికి హౌసింగ్‌ బోర్డు నోటీసులు జారీ చేసింది.

హౌసింగ్‌ బోర్డు అలసత్వం
దాదాపు 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్‌ను కేటాయించాలని ఇక్కడివారు హౌసింగ్‌ బోర్డుకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అటునుంచి స్పందన రాకపోవడంతో సమస్యను 2008లో ఆ నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. అద్దెదారులకు మార్కెట్‌ ధర ప్రకారం క్వార్టర్స్‌ను కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు వచ్చి సర్వే కూడా చేశారు. అయితే, దురదృష్టవశాత్తు అదే ఏడాది సీఎం రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో నివాసితుల విజ్ఞప్తులు బుట్టకాఖలైపోయాయి. ఆ నాటి నుంచి వారి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఫ్లాట్స్‌ కేటాయింపులను తిరిగి మొదలు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

వారిది న్యాయమైన డిమాండ్‌  
నివాసితులది న్యాయమైన డిమాండ్‌. మార్కెట్‌ ధరకు అనుగుణంగా క్వార్టర్స్‌ను కేటాయించి యాజమాన్య హక్కులు కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం వీరిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ఈ సమస్యపై దృష్టి సారించాలి.    – సహదేవ్‌యాదవ్, బీజేపీ నేత

ప్రభుత్వం న్యాయం చేయాలి
నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ నివాసముంటున్న మమ్మల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరిగాయి. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని క్వార్టర్స్‌ను మాకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అందుకు హౌసింగ్‌ బోర్డు అధికారులకు అదేశాలు జారీ చేయాలి.– పి. శ్రీశైలం, రిటైర్డ్‌ ఉద్యోగి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement