మహబూబ్‌నగర్ న్యూస్‌లైన్: పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగం సాధించాలన్న ఆ యువకుడి కల నెరవేరలేదు. తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉండి చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయాలన్న మరో యువకుడి సంకల్పం ఫ లించలేదు. పెళ్లి పనులకు కూలీలుగా వెళ్లిన ఆ ఇద్దరు యువకు లు విద్యుదాఘాతానికి బలయ్యారు. ఈ విషాదకర సంఘటన గురువారం జిల్లాకేంద్రంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో జరిగింది.
స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తాడూర్ మండలం చె ర్లతిర్మలాపురం గ్రామానికి చెందిన బానాసి వంశీకుమార్(22) జిల్లాకేంద్రంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మరో యువకుడు మహబూబ్‌నగర్ మండలం క్రిష్టియన్‌పల్లికి చెందిన కాశపు యేసు(23) తాపీమేస్త్రీగా పనిచేస్తుండేవాడు. ఇదిలాఉండగా వంశీకుమార్ తన చదువుల కోసం అప్పుడప్పుడు స్థానిక హౌజింగ్‌బోర్డు కాలనీలో ఉన్న యూబీ గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో కూలీపనికి వెళ్తుండేవాడు. యేసు కూడా తాపీ పని దొరకని సమయంలో అతను కూ డా అదే ఫంక్షన్‌హాల్‌లో పనిచేసేవాడు. ఈ క్ర మంలో గురువారం ఆ గార్డెన్‌లో పెళ్లి ఏర్పాట్లలో భాగంగా బ్యానర్ కట్టేందుకు రోడ్డుపైకి వచ్చాడు. ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. విద్యుదాఘాతంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించిన గార్డెన్ యజమాని మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గాంధీనాయక్ తెలిపారు.
సీపీఎం నాయకుల ఆందోళన
ఫంక్షన్‌హాల్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు యువకులు మృతిచెందారని సీపీఎం నాయకులు సంఘటనస్థలంలో ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతపరిచారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఫంక్షన్‌హాల్ యజమాని అందుకు ఒప్పుకోలేదు. ఆందోళనను మరింత తీవ్రతరం చేయడంతో ఎట్టకేలకు దిగిర్చి ఒక్కో కుటుంబానికి రూ.ఐదులక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు అంగీకరించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్
విషయం తెలుసుకున్న కలెక్టర్ గిరిజాశంకర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం ద్వారా ఆదుకుంటామని, కుటుంబంలో ఒక్కరికి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగావకాశం కల్పిస్తామని కలెక్టర్ హామీఇచ్చారు. తక్షణసహాయం కింద ఎన్‌ఎఫ్‌బీఎస్ స్కీం ద్వారా రూ.20వేలు అందజేశారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ సదాశివారెడ్డి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తామని హామీఇచ్చారు.
రెక్కాడితే డొక్కడని కుటుంబాలు
మృతులిద్దరిది రెక్కాడితే గాని డొక్కడని పేద కుటుంబం. వంశీకుమార్ కుటుంబంలో మొదటివాడు. తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకుంటూ స్వగ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. తాను పనిచేయగా వచ్చిన డబ్బులో కొంత తల్లిదండ్రులకు పంపిస్తూ వారి బాగోగులను చూసుకునేవాడు. తన చదువును కూడా కొనసాగిస్తున్నాడు. అతని మరణంతో కన్నవారు తల్లడిల్లిపోతున్నారు. యేసుకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. తల్లిలేని అతడు పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతని మరణంలో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బతుకు వేటలో..
Published Fri, Nov 8 2013 3:58 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement