
రూ.1.05 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యార్థి
జడ్చర్ల: బెట్టింగ్ యాప్‌లో పందాలు కాసిన ఓ విద్యార్థి చివరకు రూ. 1.05 కోట్ల అప్పులపాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District) జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు (ఇంజినీరింగ్ విద్యార్థి) ఓ యాప్‌లో క్రికెట్‌కు సంబంధించి బెట్టింగ్ కాశాడు.
అయితే బెట్టింగ్ యాప్ (Betting App)లో వచ్చిన లోన్ అప్లికేషన్‌ను పూర్తిచేసి.. ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా (Bank Account) తదితర వివరాలను పొందుపరిచి, వారిచ్చిన నిబంధనలకు అంగీకారం తెలిపారు. దీంతో విద్యార్థి అనుకున్నంత లోన్ మంజూరు కావడం.. మంజూరైన డబ్బులతో బెట్టింగ్ కాయడం జరిగింది. తీరా బెట్టింగ్ పూర్తయ్యే సరికి సదరు విద్యార్థికి రూ. 1.05 కోట్ల అప్పులు మిగిలాయి. ఈ అప్పునకు రూ.30 నుంచి రూ.40 వరకు వడ్డీగా ఉంది. తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో ఇటీవల వారు విద్యార్థి ఇంటికి వచ్చి నానాయాగి చేశారు. అయితే పరువు కలిగిన ఆ కుటుంబ సభ్యులు తమ కుల సంఘం నాయకుడి ద్వారా మధ్యవర్తిత్వం (Mediation) నెరిపి చివరకు సెటిల్‌మెంట్ చేసుకున్నారు.
అప్పులవాళ్లు ఇచ్చిన రూ. 1.05 కోట్లను వడ్డీ లేకుండా చెల్లించే విధంగా ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిసింది. ఇలా.. పట్టణంలో బెట్టింగ్ యాప్‌ల వలలో పడి పలువురు యువకులు రూ. కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికైనా పోలీసులు స్పందించి సైబర్ నేరాలతో పాటు బెట్టింగ్ యాప్‌లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!