యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: పోలీస్‌స్టేషన్‌లో ఉన్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లిన యువకుడిని ఎస్‌ఐ, సిబ్బంది చితకబాదిన సంఘటన చాపాడు స్టేషన్‌లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 2న మట్కా రాస్తున్నారనే కారణంతో చాపాడు ఐడీ పార్టీ పోలీసులు ప్రొద్దుటూరులోని దస్తగిరిపేటకు చెందిన మహబూబ్‌బాషా, దస్తగిరి, కుమార్‌తో పాటు మరో యువకుడిని తీసుకొని వెళ్లారు.
కుమార్‌తో మాట్లాడటానికి ప్రొద్దుటూరులోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన నరసింహప్రకాశ్ 3వ తేదీన స్టేషన్‌కు వెళ్లాడు. అతన్ని బయటికి వదలాలంటే రు.1 లక్ష తీసుకొని రమ్మని ఐడీ పార్టీ పోలీసులతో పాటు ఎస్‌ఐ గిరిబాబు చెప్పాడు. అంత డబ్బు నా వద్ద లేదు.. నేను అతన్ని చూడటానికి మాత్రమే వచ్చానని చెప్పాడు. రు.20 వేలు మాత్రమే అతని వద్ద ఉందంట.. కావాలంటే తీసుకొని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
ఫోన్ చేసి పిలిచి మరీ చితకబాదారు
బుధవారం ఉదయాన్నే చాపాడు ఐడీ పార్టీ పోలీసులు నరసింహప్రకాష్‌కు ఫోన్ చేశారు. మీ ఫ్రెండ్ కుమార్‌ను కోర్టుకు పెడుతున్నామని చెప్పడంతో రూ.20 వేలు తీసుకొని అతను చాపాడుకు వెళ్లాడు. డబ్బు తీసుకున్న ఎస్‌ఐ మిగతా రూ.30 వేలు ఏదీ అని అడిగాడు. లేదు సార్ ! నిన్ననే చాప్పాను కదా ..ఉండేది రు.20 వేలేనని.. ఎస్‌ఐతో అన్నాడు. నిన్ను లోపల వేసి కుమ్మితే డబ్బులు అవే పరుగెత్తుకుంటూ వస్తాయ్ అంటూ ఎస్‌ఐ అతన్ని లాఠీతో చితకబాదాడు. ఎస్‌ఐతో పాటు ఐడీపార్టీ సిబ్బంది కాళ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. అతని చెయ్యి విరగడంతో పాటు ఒళ్లంతా రక్తగాయాలయ్యాయి. బంధువులు అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎస్‌ఐపై ప్రైవేట్ కేసు
తనను విచక్షణా రహితంగా కొట్టిన ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లు సుధాకర్, చెన్నయ్యపై గురువారం సాయంత్రం నరసింహప్రకాష్ స్థానిక కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.