poduturu
-
కార్మికుల ఆందోళనతో అట్టుడికిన ప్రొద్దుటూరు
మున్సిపల్ కార్మికుల ఆందోళనతో శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణం అట్టుడికింది. అధికారులు సులభ్ సిబ్బందితో పనులు చేయిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను బలవంతంగా ఈడ్చిపడేశారు. సీఐటీయూ జిల్లా నేత అన్వేష్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా కార్మికురాలి జాకెట్ చిరిగిపోయింది. పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి పరకలను రోడ్డుపై వేసి తగులబెట్టారు. ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపల్ కార్మికుల ఆందోళన, పోలీసుల రంగ ప్రవేశంతో ప్రొద్దుటూరు పట్టణం శుక్రవారం అట్టుడికింది. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. పాలక వర్గం సులభ్ సిబ్బందితో పనులు చేయిస్తుంటే కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి పరకలను తీసుకొని నిప్పు పెట్టారు. పోలీసుల రంగ ప్రవేశంతో గాంధీరోడ్డులో అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వన్‌టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసిన కార్మికులను అడ్డుకున్నారు. పోలీస్ వాహనాల్లో ఎక్కించే క్రమంలో కార్మికులు తిరగబడ్డారు. సీఐటీయూ జిల్లా నాయకుడు అన్వేష్‌తోపాటు కార్మిక సంఘం, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్న చేయగా, మహిళా కార్మికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేరు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పడేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు మహేష్, వెంకటేశ్వర్లు, సిబ్బంది.. కార్మిక సంఘాల నాయకులను జీపులో ఎక్కించారు. మహిళా కార్మికులు వాహనానికి అడ్డుపడ్డారు. మగ పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఈ సమయంలో ఓ కార్మికురాలి రవిక చినిగి పోయింది. పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు.. దీంతో కార్మికులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. మా నాయకులను విడిచి పెట్టాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళా కార్మికులు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. అక్కడ మహిళా కానిస్టేబుల్స్ కార్మికులను లోనికి తోసేశారు. ఎమ్మెల్యే చర్చించడంతో పరిస్థితి అదుపులోకి.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం అణచి వేసే ధోరణి వ్యవహరిస్తుంటే.. స్థానిక పాలకవర్గం కూడా అదే విధానాన్ని పాటిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ పూజితా నీలం, సీఐలతో చర్చించారు. అరెస్టు అయిన కార్మిక సంఘం నాయకులు అన్వేష్, అక్కడికి వచ్చిన ఏఐటీయూసీ నాయకులు రామయ్యతో చర్చించారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా మసీదు, ఈద్గాల వద్ద శుభ్రం చేసి కార్మికులు ఆదర్శంగా నిలవాలని పోలీస్ అధికారులు కోరారు. అందుకు రాష్ట్ర కమిటీ ఒప్పుకోదని, ప్రైవేటు వారితో చేయించుకుంటే అభ్యంతరం లేదని కార్మిక సంఘం నేతలు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన వారిని విడిచి పెట్టడంతో ఎమ్మెల్యే, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముక్తియార్‌తోపాటు వైఎసార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వరకు వచ్చారు. -
పచ్చ నేతలా.. మజాకా!
ప్రొద్దుటూరు: ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మండలంలోని శంకరాపురం గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నదిలో కొద్ది రోజులుగా యథేచ్చగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సుమారు రూ.2 కోట్ల 70 లక్షలతో ప్రొద్దుటూరు-చౌడూరు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెన్నానదిలో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏకంగా పొక్లైయినర్ను నదిలోకి దింపి తవ్వకాలు సాగించి ట్రాక్టర్లతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు వందల ట్రాక్టర్ల గ్రావెల్‌ను రోడ్డు నిర్మాణానికి తరలించారు. రాత్రిళ్లే ఈ రవాణా సాగుతోంది. ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని అక్రమ రవాణా చేస్తుండటంతో పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు నిద్రలేని రాత్రిళ్లు గుడుపుతున్నారు. ఈ కారణంగా పెన్నానదిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ సమస్యపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట్లలోని మైన్స్ అండ్ జియాలజీ అధికారులు గురువారం దాడులు చేశారు. గ్రావెల్ రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లతోపాటు నదిలో తవ్వకాలు సాగిస్తున్న పొక్లెయినర్ యంత్రాన్ని మైన్స్ అధికారులు సీజ్ చేశారు. అసిస్టెంట్ జియాలజిస్టు సుధాకర్, ఆర్ఐలు నాగరాజు, రామసుబ్రమణ్యం, వీఆర్ఓలు నరసింహులు, బాదుల్లా తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. తహశీల్దార్ రాంభూపాల్రెడ్డికి మైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయన వీఆర్ఓలను పంపి ట్రాక్టర్లను ఎక్కడికక్కడే పట్టుకున్నారు. అయితే సాయంత్రానికే నామమాత్రపు జరిమానా చెల్లించి నేతలు వాహనాలను విడిపించుకు పోవడం కొసమెరుపు. -
సివిల్స్‌కు ఎంపికైన ముగ్గురు
ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్‌రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్‌రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో చదివాడు. 2001లో పదవ తరగతి పరీక్షలో 468 మార్కులు సాధించాడు. తర్వాత విజయవాడలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో (ఎంపీసీ) ఇంటర్ చదివి 921 మార్కులు పొందాడు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 77 శాతం మార్కులతో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన అనంతరం చెన్నైలోని సీటీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివాడు. దిల్లీలోని వాజీరామ్ అండ్ రవి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. మూడేళ్లుగా వరుసగా సివిల్స్పరీక్షలు రాస్తున్నాడు. సోషియాలజి సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలువడిన ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్ష ఫలితాలలో ఆలిండియాలో 85వ ర్యాంక్ సాధించాడు. శనివారం వెలువడిన సివిల్స్ పరీక్ష ఫలితాల్లో 462వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా ఈయనకు ఐపీఎస్, ఐఆర్ఎస్, కస్టమ్స్ ఆఫీసర్లలో ఏదో ఒక పోస్టు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయభాస్కర్‌రెడ్డి తల్లిదండ్రులు పెద్ద సుబ్బారెడ్డి, వెంకటమ్మలు మైలవరం మండలంలోని బాక్రాపేట గ్రామానికి చెందిన వారు. వీరిది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. అయితే మైలవరం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గ్రామం ముంపునకు గురికావడంతో ప్రొద్దుటూరుకు వచ్చి స్థిరపడ్డారు. తర్వాత కాలంలో పెద్ద సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు. సివిల్ ర్యాంకర్ విజయభాస్కర్‌రెడ్డికి విజయలక్ష్మిదేవి, ప్రమీల దేవి, శశిరేఖ అనే అక్కచెల్లెల్లు ఉన్నారు, వారికి వివాహం అయింది. వైద్య వృత్తి నుంచి సివిల్స్‌లోకి.. వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం రూకావాండ్లపల్లెకు చెందిన డాక్టర్ ఏ.సురేష్‌రెడ్డి సివిల్ సర్వీసెస్‌లో 525వ ర్యాంకు సాధించారు. రైతు కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, ధర్మాదేవిల కుమారుడు. ప్రస్తుతం వీరు రాయచోటిలోని ఎన్జీఓ కాలనీలో ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు శ్రీనికేతన్(రాయచోటి), ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకు (ఆంగ్లో ఇండియన్, రాయచోటి), తొమ్మిదవ తరగతి(రాజు స్కూల్), పది నుంచి ఇంటర్ వరకు(రత్నం కళాశాల, నెల్లూరు), ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. రెండు సంవత్సరాలుగా రోయచోటిలో బీడీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇతను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం పట్ల తన సొంత గ్రామమైన నూకావాండ్లపల్లెలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యువత ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. ఆ లక్ష్యం సాధనకు సమయం కేటాయించుకుని పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా చదివితే లక్ష్యం చేరడం కష్టం కాదని చెప్పారు. ఐఏఎస్ కోసం మరోసారి ప్రయత్నిస్తా : డా.ధీరజ్ నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ బి.ధీరజ్‌కుమార్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 1177వ ర్యాంకు సాధించారు. ధీరజ్‌కుమార్ తండ్రి బి.జయభాస్కర్రావ్ వృత్తి రీత్యా రైల్వేలో వైద్యుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించారు. ప్రస్తుతం ఈయన గుంటకల్ రైల్వే డివిజన్లో అసిస్టెంట్ చీప్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ధీరజ్ తల్లి ఎం.విజయభారతి రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ డి.ఎమ్.డబ్లు.ఒ.గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పట్టుదలతో ప్రయత్నించి సివిల్స్‌లో విజయం సాధించారు. ఇతని సోదరుడు దీపక్‌కుమార్, సోదరి దీప్తిలు సైతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నందలూరులోని శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్లో పదవ తరగతి, నెల్లూరులోని రత్నం కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. సివిల్స్ కోసం హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ ఫలితం పట్ల తాను పెద్దగా సంతృప్తి పడటం లేదన్నారు. ఈ ర్యాంక్‌తో ఐఆర్ఎస్ రావచ్చని, తన లక్ష్యం ఐఏఎస్ అని చెప్పారు. ఆ లక్ష్యం కోసం మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహకం అధికంగా ఉందని అన్నారు. -
మా గోడు ఆలకించండి
ప్రొద్దుటూరు : ‘మేము ఏ సమస్య చెప్పినా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదా అని చిన్నచూపు చూడొద్దు.. సామాన్యుల తరఫున మాట్లాడుతున్నాం.. కొన్ని సమస్యలను పదే పదే విన్నవించినా న్యాయం జరక్కపోవడంతో పదే పదే ప్రశ్నిస్తున్నాం.. అంతే కానీ మాకు అధికారులెవరిపై వ్యక్తిగత కక్షలేదు.. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించి ప్రజలకు న్యాయం చేయాల’ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బం దిని పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణ ఏజెన్సీ తరఫున అధికార పార్టీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ 18 మంది సెక్యూరిటీ సిబ్బందితో పనిచేయిస్తూ వారికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించలేదన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం సరిగా లేదని, అతని తీరు సరిగా లేదని గతంలో జరిగిన అడ్వైజరి కమిటీ సమావేశంలో తనతోపాటు కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డిలతో కలిసి ఫిర్యాదు చేశామన్నారు. కాం ట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పినా ఫలితం లేదన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పినాపని కాలేదంటే తమ విలువ ఏమేడ్చిందన్నారు. వేతనాల కోసం ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది గత వారం ఆత్మహత్యకు ప్రయత్నిస్తే వారికి వేతనాలు చెల్లించలేదు కదా కనీసం వారిని పరామర్శించేందుకు కూడా కాంట్రాక్టర్ బాలనారాయణరెడ్డి ఆస్పత్రికి రాకపోవడం విచారకరమన్నారు. గతంలోనే జిల్లా కలెక్టర్ స్పందించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదన్నారు. కష్టాల్లో ఉన్న వారికి జిల్లా కలెక్టర్ దేవుడని, కనిపించని దేవుడు వారి సమస్యను పరిష్కరించకపోగా కళ్లేదుటే కనిపిస్తున్న కలెక్టర్ దేవుడు కూడా వీరిని పట్టించుకోకపోవడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు గైనకాలజిస్టులను నియమించాలని, మం దుల కొరత తీర్చాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తాము పదే పదే కలెక్టర్‌ను వేడుకుంటున్నా పరిస్థితి మారలేదన్నారు. ఇప్పటికే ఆస్పత్రి సమస్యలపై తనతోపాటు సీపీఐ, సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి పలుమార్లు ఆందోళన చేశామన్నారు. అయినా ఆయన మనసు కరగలేదన్నారు. కాలేకడుపుతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మానసిక ఆవేదనకు గురవుతున్న సెక్యూరిటీ సిబ్బంది చివరికి ఆత్మహత్యే శర ణ్యమని భావించారన్నారు. పొరపాటున కార్మికులకు ఏమైనా జరిగితే కలెక్టర్ ఇంటి వద్ద తిష్ట వేస్తామన్నారు. కేసులకు, అరెస్టులకు భయపడబోమన్నారు. స్వయంగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పినా కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు వేతనాలు చెల్లించకపోవడం ఒక తప్పు అయితే బాధ్యతగా ఆ కాంట్రాక్టర్ ప్రతినెల వీరికి వేతనాలు ఇవ్వకపోవడం మరో తప్పిదమన్నారు. -
ఊరంతా పందిళ్లు.. ఇంటింటా సందడి
కొత్తపేట(ప్రొద్దుటూరు) : ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్న కొత్తపేట గ్రామంలో ఆదివారం భారీ ఎత్తున పెద్దమ్మతల్లి దేవర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1000 ఓట్లు గల ఈ గ్రామంలో ఈ ఉత్సవాల నిర్వహణకు గ్రామస్తులు రూ.కోటికిపైగా వెచ్చిస్తున్నారు. వివరాలిలావున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి కూతవేటు దూరంలో జమ్మలమడుగు రోడ్డులో కొత్తపేట గ్రామం ఉంది. పూర్వం గ్రామంలో ప్రతి ఏటా పెద్దమ్మతల్లి దేవరను నిర్వహించేవారు. అయితే గ్రామ పరిస్థితుృ దష్ట్యా దేవరను నిలిపివేశారు. 1958లో చివరగా ఈ ఉత్సవం నిర్వహించారు. కాగా గ్రామస్తులంతా చర్చించుకుని మళ్లీ గ్రామంలో ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రయత్నించారు. మూడేళ్లుగా ఈ విషయం నానుతోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో రెండేళ్లుగా ఉత్సవాన్ని పోలీసుల సూచన మేరకు నిలిపివేశారు. ఏది ఏమైనా ఈ మారు నిర్వహించాలని పూనుకున్నారు. ఈ మేరకు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయానికి సున్నాలు వేశారు. ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి హాజరు కావాలని గ్రామంలోని పలువురు ఆహ్వాన పత్రాలను కూడా పంచిపెట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఊరంతా పందిళ్లు వేసి ఏర్పాట్లు చేశారు. ఇంటింటా అమ్మవారికి సమర్పించేందుకు పొట్టేళ్లు సిద్ధం చేసుకున్నారు. 10 పొట్టేళ్లను కూడా ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి 500కుపైగా పొట్టేళ్లను గ్రామానికి తీసుకురాగా మొత్తం ఖర్చు కోటి రూపాయలకుపైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ప్రముఖుల రాక దేవర ఉత్సవానికి హాజరు కావాలని గ్రామస్తులు ప్రముఖులను ఆహ్వానించారు. ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్బాష, రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, టీడీపీకి సంబంధించి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఉత్సవం నిర్వహించారు తాను ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో గ్రామంలో చివరగా దేవర ఉత్సవాన్ని నిర్వహించారు. 1958 నుంచి దేవర నిర్వహించలేదు. చాలా కాలం తర్వాత నిర్వహిస్తుండటంతో అంతా సందడిగా ఉంది. - గుద్దేటి వెంకటసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చారు గ్రామానికి సంబంధించి పలువురు విదేశాల్లో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు. ఎందరో హైదరాబాద్‌లాంటి నగర ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటివారు తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను ఆహ్వానించారు. విదేశాల్లో ఉన్న వారు సైతం వచ్చారు. - వెల్లాల కుమార్‌రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ అందరినీ ఆహ్వానించాం దేవర మహోత్సవానికి హాజరు కావాలని ఇరు పార్టీల వారిని ఆహ్వానించాం. గ్రామస్తులంతా బంధు మిత్రులను పిలుచుకున్నారు. గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరూ ఆహ్వానితులే. - రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గ్రామ కమిటీ సభ్యుడు గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది దేవర మహోత్సవంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. చాలా రోజులుగా ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వాహనాల పార్కింగ్‌కు కూడా ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేశాం. -కృష్ణారెడ్డి -
ఎంత కష్టం.. ఎంత నష్టం...
ఈ మహిళా రైతు పేరు సానె చంద్రమ్మ. ప్రొద్దుటూరు మండలం సీతంపల్లె గ్రామానికి చెందిన ఈమె 10 ఎకరాల్లో వరి పంట సాగు చేసింది. ఎకరాకు రూ.25 వేలు చొప్పున పంట సాగుకు రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టింది. పంట పొట్ట దశకు చేరుకుంది. రేపోమాపో కోత కోయాల్సి ఉండగా అకస్మాత్తుగా వచ్చిన గాలి వానతో పంట మొత్తం నేలవాలింది. నాలుగు రోజులుగా అలాగే ఉండటంతో నేలవాలిన పంట నుంచి మోసులు వచ్చాయి. ‘పంట చేతికి వచ్చి ఉంటే రూ.4 లక్షల దాకా వచ్చేది. మోసులొచ్చి అంతా కుళ్లిపోయింది. పశుగ్రాసానికి కూడా పనికొచ్చేలా లేద’ంటూ ఆమె వాపోయింది. ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలం సీతంపల్లెలో ఆదివారం గాలి వానకు 300 ఎకరాల్లో వరి పంట పాడైంది. వరికి ధర బాగా పలుకుతుండటంతో అందరూ 555 రకానికి చెందిన వరి ధాన్యాన్ని సాగు చేశారు. అకాల వర్షంతో పాటు భారీ స్థాయిలో వీచిన గాలులకు పంట నేల వాలింది. ఈ గ్రామం ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉండగా, పొలాలు చాపాడు మండల పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామంలో రైతులంతా చాలా ఏళ్లుగా కర్బుజా పంటను సాగు చేస్తున్నారు. జనవరిలో రెండో పంటగా వరి సాగు చేశారు. గ్రామానికి చెందిన రైతులు కుందూ పరివాహక ప్రాంతాలైన కుచ్చుపాప, వెదురూరు, సన్నపల్లె తదితర గ్రామాలకు వెళ్లి.. పొలం కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తు కారణంగా అటు వరి, ఇటు కర్బుజా పంటలు నాశనం అయ్యాయి. భారీ నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు అధికారులెవ్వరూ ఇటు వైపు తొంగి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమె పేరు జగతి వెంకటమ్మ. సీతంపల్లె గ్రామానికి చెందిన ఈమె కుటుంబం తొమ్మిది ఎకరాల్లో వరి పంట, ఐదు ఎకరాల్లో కర్బుజా పంటను సాగు చేశారు. గాలి వాన కారణంగా అటు వరి, ఇటు కర్బుజా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఈమె లబోదిబో మంటోంది. చేతికొచ్చిన పంటలు ఇలా ఎన్నడూ దెబ్బతినలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు ఎకరాల్లో నష్టపోయా ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేసి నష్టపోయాను. గతంలో ఎప్పుడు మా గ్రామంలో ఇలా జరగలేదు. మిగతా గ్రామాలకంటే ముందుగా పంటను సాగు చేయడంతో ఎక్కువ నష్టం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. - పేట చెండ్రాయుడు, సీతంపల్లె కోలుకోలేని దెబ్బ ఇటీవల వర్షం, గాలితో మా గ్రామం కోలుకోలేని విధంగా దెబ్బ తినింది. రైతులంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నేను ఆరు ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో కర్బుజా పంట సాగు చేశాను. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోయాను. అధికారులు పరిశీలనకు కూడా రాలేదు. - జగతిపుల్లయ్య, సీతంపల్లె రెండు మండలాల్లో ఉన్నాం ప్రొద్దుటూరు మండలంలో నివాసం ఉన్న రైతుల పొలాలు చాపాడు మండల పరిధిలోకి వస్తాయి. గ్రామంలో కూడా రెండు మండలాల వారు కలిసి ఉంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పంటకు ఇలా మోసులు రావడం ఈ ప్రాంతంలో ఎన్నడూ చూడలేదు. - వరికూటి నాగన్న, సీతంపల్లె -
లక్ష్య సాధన కోసం శ్రమించాలి
- ఐఐటీ ప్రొఫెసర్ మూర్తి ప్రొద్దుటూరు: లక్ష్యసాధన కోసం విద్యార్థులు శ్రమించాలని ఐఐటీ చెన్నై ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలను మంగళవారం సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా ఎదగాలంటే కృషి, పట్టుదల ఉండాలన్నారు. యువత పరిశోధన రంగంవైపు అడుగులు వేయాలని, పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు దేశంలోని ఎన్నో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ద్వారాలు తెరచి ఉంచాయన్నారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ బీ.జయరామిరెడ్డి, ఎంఎంటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ డాక్టర్ ఏ.అశోక్ పాల్గొన్నారు. నేడు జాతీయ సదస్సు వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెటలర్జి అండ్ మెటీరియల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి యూజీసీ ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెటలర్జి అండ్ మెటీరియల్ సైన్స్ రామ్ -2కే15 జాతీయ సదస్సు బుధవారం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఏ.అశోక్‌కుమార్ తెలిపారు. -
ఆడ ‘బిడ్డ’ను గెంటేశారు
ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో అధర్మం రాజ్యమేలుతోంది. మానవత్వం మంటగలిసిపోతోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య సిబ్బంది పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పురిటినొప్పులతో ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన నిండుచూలాలిని నిర్దయగా గెంటేశారు. రాత్రి వేళ.. దిక్కుతోచని స్థితిలో అమ్మా.. నిరుపేదలం.. మాకు పెద్దాసుపత్రే దిక్కు.. పెద్ద మనసు చేసుకుని దయచూపండమ్మా అంటూ కాళ్లావేళ్లాపడినా వారి హృదయాలు కరగలేదు. యావత్ ప్రపంచం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓ అబల పురుడుపోసుకునేందుకు పడిన వేదన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ప్రొద్దుటూరు: పురిటి నొప్పులతో ప్రసవం కోసం వెళ్లిన నిండు చూలాలిని జిల్లా ఆస్పత్రి సిబ్బంది గెంటివేసిన హృదయ విదారక సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వీరపునాయునిపల్లి మండలం పాయసంపల్లె గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మకు పురిటి నొప్పులు రావడంతో అక్కడి ఆస్పత్రి సిబ్బంది సలహా మేరకు ప్రసవం కోసం 108 వాహనంలో శుక్రవారం రాత్రి జిల్లా ఆస్పత్రికి వచ్చారు. వీరిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. అవి పురిటి నొప్పులు కాదుపొమ్మన్నారు. పైగా ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేరని, ఉదయాన్నే రండి అచి చెప్పి వెనక్కు పంపారు. రాత్రి వేళలో సుమారు 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వెంకటలక్షుమ్మతోపాటు ఆమె భర్త, బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. కడుపేదలమైన తాము ఎంతో నమ్మకంతో పెద్దాసుపత్రికి వచ్చామని.. తీరా ఇక్కడికి వచ్చాక తమను ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి పంపితే ఎలా అని ప్రశ్నించారు. ఈ రాత్రివేళ తాము ఎక్కడికి వెళ్లాలి.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేవని ప్రాధేయపడ్డారు. వీరి మాటలను ఏమాత్రం పట్టించుకోని సిబ్బంది వారిని వార్డులో కూడా ఎక్కువ సేపు ఉంచకుండా బయటికి పంపారు. తొలి కాన్పు కావడంతో కుటంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఏమవుతుదోనని భయపడ్డారు. కనీసం కడప రిమ్స్‌కు వె ళ్లాలని సిద్ధపడినా ఆస్పత్రి వైద్యుల సంతకం లేనిదే వెళ్లలేమని 108 సిబ్బంది తెలిపారు. ఇలా చాలాసేపు తర్జనభర్జన పడ్డాక చివరకు ఆసుపత్రి ఉన్నతాధికారుల అనుమతితో రాత్రి 11 గంటల ప్రాంతంలో గ ర్భిణిని 108 వాహనంలో వల్లూరు దాటేంత వరకు తీసుకెళ్లి అక్కడినుంచి చింతకొమ్మదిన్నెకు చెందిన 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. శనివారం రాత్రి ఆమెకు సిజేరియన్ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారని ఆమె వెంట వచ్చిన బంధువులు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయంపై మెడికల్ సూపరింటెండెంట్ బుసిరెడ్డిని వివరణ కోరగా ఆస్పత్రిలో మొత్తం నలుగురు గైనకాలజిస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారన్నారు. ఇందులో డాక్టర్ భాగ్యమ్మ తమ పిల్లల పరీక్షల కోసం సెలవు పెట్టారన్నారు. ఉన్న ఒక్క డాక్టర్ పగలు ఆపరేషన్లు చేయడంతోపాటు ఓపీని చూస్తున్నారన్నారు. చాలా దారుణం ఎంతో నమ్మకంతో ప్రసవం కోసం మా గ్రామం నుంచి వచ్చాం. 108 సిబ్బంది ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడి సిబ్బంది మమ్మల్ని వెళ్లిపోవాలని బయటికి పంపారు. రాత్రి వేళ ఇలా చేస్తే మాలాంటి పేదల పరిస్థితి ఏమిటి. వెంకటేశు, బాధితురాలి భర్త -
నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక మైదుకూరు రోడ్డులోని బాలాజీ నగర్-1లో మంచి నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కారు. రెండు నెలల నుంచి వీధిలో నీరు రావడం లేదంటూ గురువారం మహిళలంతా సీపీఐ ఆధ్వర్యంలో ఖాలీ బిందెలతో మైదుకూరు రోడ్డుపై బైఠాయించారు. రెండు నెలల నుంచి కుళాయిల ద్వారా నీరు రావడం లేదని దీంతో మోడంపల్లె, నడింపల్లె ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు తెలిపారు. వీధిలో ఉన్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు మాత్రం నీరు సరఫరా అవుతోందన్నారు. అయితే వీధి కుళాయిలకు మాత్రం 4-5 బిందెలు మాత్రమే వచ్చి తర్వాత ఆగిపోతున్నాయని వాపోయారు. గతంలో నాలుగైదు సార్లు మున్సిపల్ అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవి కాలంలో తమ పరిస్థితి ఏమిటని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, పాలకులు మా వార్డును గాలికి వదిలేశారన్నారు. నినాదాలతో హోరె త్తించిన మహిళలు.. రహదారిపై బైఠాయించిన మహిళలు కమిషనర్ డౌన్ డౌన్..చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డి, కమిషనర్ ప్రమోద్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీటి ఎద్దడి ఉండటం వల్లనే ప్రతి రోజూ బాలాజీనగర్‌కు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నామని తెలిపారు. 10 రోజుల్లో ప్రతి రోజూ నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా సేపు మహిళలు వినిపించుకోలేదు. ఇక నుంచి వార్డులో మంచి నీటి ఎద్దడి రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, మునిరెడ్డి, రామకృష్ణ, మున్ని, మురళి, జయరామిరెడ్డి, సులోచన, స్వర్ణ, ఎస్ఎం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
భూమాయ
రూ.కోట్ల విలువైన కళాశాల స్థలం ఇది. మూడేళ్ల క్రితమే బెంగుళూరుకు చెందిన ఇద్దరికి విక్రయించారు. స్థలం కొన్న వారు చదును కూడా చేయించారు. అంత వరకు బాగానే ఉంది. ఆ సొమ్ము ఇంత వరకు కళాశాల అకౌంట్లకు చేరలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కళాశాల అభివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రొద్దుటూరు టౌన్: అది కోట్లు విలువ చేసే స్థలం. ఈ స్థలాన్ని అతి తక్కువ ధరకు చేజిక్కించుకున్నారే కానీ ఒక్క రూపాయి కూడా స్థలానికి సంబంధించిన కళాశాల అకౌంట్లలో జమ కాకపోవడం చూస్తుంటే ఈ రిజిస్ట్రేషన్లు బోగస్ అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులో ఉన్న డీఏడబ్ల్యూ కళాశాలకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ మోహన్‌రావు 2011లో ఇద్దరికి విక్రయించారు. ఈ స్థలాలను కొనుగోలు చేసిన బెంగళూరు సిటీకి చెందిన ఎం.ఆంజనేయరెడ్డి రూ.4కోట్ల 41 లక్షల 90వేలకు బెంగళూరు విజయనగరం బ్రాంచి కరూర్ వైశ్యాబ్యాంక్ పేరున చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందుకుగాను ఇతనికి 8.30 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్లు 636, 666, 667 ఏలో రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే హైదరాబాద్ సిటీకి చెందిన శివగణేష్ సర్వే నెంబర్ 667 ఏ లో ఉన్న 20 సెంట్ల స్థలానికి సంబంధించి రూ.67 లక్షల 76వేలు సికింద్రాబాద్ బ్రాంచి చార్టెడ్ బ్యాంక్ పేరున చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే సర్వే నెంబర్లు 636, 666, 667 ఏలో 1.30 ఎకరాల స్థలానికి రూ. కోటి 22 లక్షల 46వేలకు అదే బ్యాంక్ పేరున చెక్కులను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం 11 ఎకరాలకు గాను రూ.6కోట్ల 99 లక్షల 88 వేలకు కొనుగోలు చేసినట్లయింది. ఆంజనేయరెడ్డి స్థలం మరికొందరికి విక్రయం బెంగళూరు సిటీకి చెందిన ఆంజనేయరెడ్డి తాను కొనుగోలు చేసిన స్థ లాన్ని ద్వారకచర్ల రాఘవరెడ్డి, ద్వారకచర్ల ఈశ్వరరెడ్డిలకు చెరో 25సెంట్లు రూ. 26లక్షల 62వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మార్కెట్ విలువ రూ.50కోట్ల పైమాటే అయితే ప్రస్తుతం కొర్రపాడు రోడ్డులో రిజిస్ట్రేషన్ విలువే సెంటు రూ.5లక్షలుపైగా పలుకుతోంది. హౌసింగ్ బోర్డు ఏరియాలోకి వచ్చే స్థలం కూడా సెంటు రూ.3-4లక్షలకు పైగా ఉంది. ఇక మార్కెట్ విలువ చూసుకుంటే రిజిస్ట్రేషన్ విలువకు రెండింతలు ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విధంగా చూస్తే 11 ఎకరాల స్థలం రూ.50 నుంచి రూ. 60 కోట్లకుపైగా ధర పలుకుతోంది. విక్రయించి మూడేళ్లవుతున్నా కళాశాల అభివృద్ధి ఏదీ... స్థలాన్ని విక్రయించి డీఏడబ్ల్యూ కళాశాలను అభివృద్ధి చేస్తామని యాజమాన్యం ఇప్పటి వరకు ఒక్క భవన నిర్మాణం చేపట్టలేదు. స్థలం విక్రయించగా వచ్చిన కోట్ల రూపాయల డబ్బు ఏమైందన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడేకానీ రిజిస్ట్రేషన్‌లో డబ్బు చెల్లించినట్లు లేదు. అన్ని బ్యాంక్ చెక్కులపైనే కోట్ల రూపాయల విలువ చేసే స్థలం రిజిస్ట్రేషన్ ఎలా చేయిస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో స్థలాన్ని కొనుగోలు చేసిన వారి నుంచి ఒక్క రూపాయి కూడా జమ కానట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా కళాశాల అభివృద్ధికి ఒక్కరూపాయి అయినా ఖర్చు పెట్టారా డీఏడబ్ల్యూ కళాశాలకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని విక్రయించామని చెబుతున్న కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కళాశాలకు ఖర్చు చేయలేదు.విక్రయాలన్నీ చెక్కులపైనే జరిగాయి. రూ.60 కోట్లకుపైగా విలువ చేసే స్థలం రూ.6కోట్ల 99 లక్షలకు విక్రయించడం చూస్తుంటే ఇదంతా బోగస్ అనిపిస్తోంది. భూమి అమ్మి కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన యాజమాన్యం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టారా? అంటే అదీలేదు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
రోగం కుదిరేదెలా..!
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు ధర్మాసుపత్రికి అవినీతి జ్వరం పట్టుకుంది. ఇక్కడి సిబ్బంది ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. డెలివరీతో పాటు ఇతర కేసులను డాక్టర్ లేరంటూ కడప రిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి 2012 ఆగస్టులో జిల్లా స్థాయి ఆస్పత్రిగా స్థాయి పెరిగింది. ఇక్కడికి ప్రొద్దుటూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఆస్పత్రిలో సివిల్ సర్జన్ పోస్టులు 9 ఉండగా కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 21 ఉండగా 12 మంది రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ బేసిక్ డాక్టర్లు ఉన్నారు. ఇద్దరు దంత వైద్యులు ఉన్నారు. అయితే రేడియాలజితో పాటు పలు విభాగాలకు సర్జన్లు లేరు. కాసులు ఇవ్వందే కాన్పు కాలేరు జిల్లా ఆస్పత్రిలోని కాన్పుల వార్డులో గతంలో నెలకు 120-130 దాకా కాన్పులు జరిగేవి. అయితే గత ఆరు నెలల నుంచి కాన్పుల సంఖ్య నెలకు 30-40 మాత్రమే నమోదవుతోంది. గతంలో నలుగురు గైనకాలజిస్టులు ఉండేవారు. ఇద్దరు దీర్ఘకాలంగా సెలవులో ఉండటం వల్ల కాన్పుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉన్న డాక్టర్లు ఇద్దరూ ఓపీ చూడటమే గాక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో కాన్పులు జరగరాదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరగాలని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే ఇక్కడికి ఎంతో ఆశతో వస్తున్న పేదలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. కాఫీ, టీ ఖర్చులకు డబ్బులు తెచ్చుకున్న బాధితులను డబ్బు ఇవ్వాల్సిందేనని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే ముందు ఒక సారి, కాన్పు అయ్యాక మరో సారి వేలల్లో డబ్బు ఇవ్వాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లో కూడా సిబ్బంది డబ్బు ఇవ్వనిదే పసికందును చేతిలో పెట్టడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసులు తగ్గడంతో సీ గ్రేడుకు ఆస్పత్రిలోని పలు విభాగాలలో పరికరాలున్నప్పటికీ డాక్టర్లులేరు. కొన్ని విభాగాల్లో వైద్యులు ఉన్నారే కానీ ఆపరేషన్ చేయడానికి పరికరాలు లేవు. ఆర్థో విభాగంలో డాక్టర్లు ఉన్నారు. అయితే తగినన్ని పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు సరిగా జరగడం లేదు. ఆస్పత్రిలో గత కొన్నేళ్ల నుంచి అల్ట్రాసౌండ్ మిషన్ ఉంది. అయితే రేడియాలజిస్టు లేకపోవడంతో లక్షలు విలువ చేసే స్కానింగ్ మిషన్ మూలన పడిఉంది. దీంతో ప్రజలు రూ. వందలు చెల్లించి బయట స్కానింగ్ చేయించుకుంటున్నారు. అలాగే ఈసీజీ విభాగంలో కూడా కొన్ని నెలల నుంచి టెక్నీషియన్ లేడు. దీంతో ఈసీజీ విభాగం మూతపడి ఉంది. గుండెకు సంబంధమైన ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలన్నా రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విధంగా ఆస్పత్రిలో అనేక సమస్యలు రోగులను పట్టి పీడిస్తున్నాయి. నేడు ఆస్పత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా స్థానిక జిల్లా ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిరక్షణకమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించనున్నారు. -
భగవంతుడా.. నన్ను తీసుకెళ్లు..!
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామానికి చెందిన ఇల్లూరి నాగమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులుండేవారు. భర్త చాలా ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమార్తెకు కూడా వివాహం చేసింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత కుమార్తె మృతి చెందింది. నాగమ్మ కుమారులు బాలచెరువు, వెంకటస్వామిలు గనులలో ట్రాక్టర్‌కు కూలీలుగా వెళ్లేవారు. ఈ క్రమంలో సుమారు 15 ఏళ్ల క్రితం ట్రాక్టర్లో రాళ్లు తీసుకొని వెళ్లే సమయంలో తిప్పలూరు వద్ద లారీ ఢీ కొన్న సంఘటనలో మృతి చెందారు. కుమారుల మరణంతో కుంగిపోయి.. భర్త, కుమార్తె చనిపోయినా కుమారులున్నారనే ధైర్యంతో జీవిస్తున్న నాగమ్మ చెట్టంత కొడుకులు కూడా మృత్యువాత పడటంతో మానసికంగా కుంగిపోయింది. తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా రాలిపోతుండటంతో ఆమె ఎంతగానో కలత చెందింది.‘ నా అనే వాళ్లందరూ చనిపోయారు.. ఇక నేనుఎవరి కోసం బతకాలనుకొని చావాలని ప్రయత్నం చేశాను.. కానీ దేవుడు నా చావును ఒప్పుకోలేదు’ అని నాగమ్మ కనీళ్లపర్యంతమైంది. నాకు ఎన్నేళ్లు ఉన్నాయో తెలియదు.. చావు రావాలని రోజూ కోరుకుంటున్నా.. భగవంతుడు మరచిపోయినట్టుండాడు.. అని ఆమె అంటుంటే ఆమె దీన స్థితిని చూసిన వారు అయ్యోపాపం అంటున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఆమె జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు కాలు విరిగింది. దీంతో నడవలేని స్థితిలో ఉండిపోయింది. బుధవారం మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ నాగమ్మను పరామర్శించారు. ఆపరేషన్ చేయించేందుకు ఆమె వైద్యులతో మాట్లాడారు. అనాథ శరణాలయంలో చేర్పిస్తాం ఉంటావా అని ప్రశ్నించగా.. ఎందుకమ్మా.. నా కష్టం ఇంకొకరి మీద వెయ్యాలా.. వద్దులేమ్మా..అని సున్నితంగా తిరస్కరించింది. ఆస్పత్రికి వచ్చే సందర్శకులు ఆమెకు సమయానికి ఇంత అన్నం పెడుతూ, తమకు తోచింది చేతిలో పెట్టి వెళ్తున్నారు. అందరినీ కోల్పోయి వృద్ధాప్యంలో కష్టమైన జీవితాన్ని నెట్టుకొస్తున్న నాగమ్మను మానవతావాదులు చేరదీయడం అవసరం. -
గొంతెండుతున్న పల్లెలు
అంగట్లో అన్నీఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది జిల్లాలోని గ్రామపంచాయతీల పరిస్థితి.రాష్ట్రప్రభుత్వ నిర్వాకం కారణంగా పంచాయతీలు సొంత నిధులను సైతం వాడుకోలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా గ్రామాల్లో జనం తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. వీధి దీపాలు వెలగక చీకటిలో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న మరమ్మతు పనులు కూడా చేసుకునే పరిస్థితిలేక సర్పంచులు చేతులెత్తేశారు. ప్రొద్దుటూరు: నగదు చెల్లింపులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఏర్పడిన ఇబ్బంది పంచాయతీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవి కంటే ముందుగానే గ్రామాల్లో తలెత్తిన తాగునీటి సమస్య భయపెడుతోంది. నిధుల లేమి ఫలితంగా సర్పంచ్‌లు చర్యలు తీసుకోలేకపోవడంతో సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాలో మొత్తం 761 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన వనరుగా ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. వాటితో అభివద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్‌లు భావించేలోపే విద్యుత్ బిల్లులకు సంబంధించి ట్రెజరీలో ఆంక్షలు విధించారు. విద్యుత్ బకాయిలు చెల్లించే వరకు నిధులు విడుదల చేయవద్దని డీపీఓ అపూర్వ సుందరి ఏకంగా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుమారు రెండు నెలలపాటు ఈ సమస్య వెంటాడగా చివరికి సర్పంచులు అంగీకరించడంతో పరిష్కారమైంది. ఇక ఏ ఇబ్బందులు ఉండవు త్వరత్వరగా పనులు చేయాలనుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం గత నెల 27 నుంచి ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని జారీ చేసిన ఉత్తర్వులు గ్రామ పంచాయతీలకు గుదిబండగా మారాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో నదీపరివాహక గ్రామాల్లో సైతం అప్పుడే తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నా సర్పంచుల చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రొద్దుటూరు మండలం గోపవరం, కొత్తపల్లె, సోములవారిపల్లె గ్రామ పంచాయతీలు మేజర్ పంచాయతీల జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉన్న 8 బోర్లల్లో రెండు బోర్లు పూర్తిగా ఎండిపోగా మరో రెండింటిలో అంతంత మాత్రమే నీరు వస్తోంది. దీంతో 2 రోజులకోమారు నీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు సైతం లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి మరింత పెద్ద మొత్తంలో నిధులు విడుదల రావాల్సి ఉంది. ఇటీవల తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొత్తగా ఉపసర్పంచ్ గురుస్వామి బోర్లతోపాటు పైపులైన్ వేశారు. పనులు చేసి ప్రస్తుతం రోజూ నిధుల కోసం రోజు ట్రెజరీ చుట్టు తిరుగుతున్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వీరికి ప్రభుత్వ నిధులే ఆధారం. కేంద్ర ప్రభుత్వ నిధులపై పెత్తనం తగదు గ్రామ పంచాయతీలకు విడుదలైన టీఎఫ్సీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం విచారకరం. ఇలా అయితే ఆర్థిక వనరులు లేని గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమిటి. కుళాయి బిగించాలన్నా డబ్బు లేకపోవడం సర్పంచ్‌లను ఆందోళనకు గురిచేసే అంశం. - మోపూరి ప్రశాంతి, సర్పంచ్, సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడం లేదు గత నెల నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిలిపేసింది. కనీసం ఎప్పుడు నిషేధం ఎత్తివేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో ఆర్థికంగా సర్పంచ్‌లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. - కే.దేవీ ప్రసాదరెడ్డి, సర్పంచ్, గోపవరం గ్రామ పంచాయతీ -
గుడ్డూ లేదు.. ఫుడ్డూ లేదు
ఈమె పేరు ఎ.ప్రసన్నకుమారి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంలో ఉన్న 33వ ఎస్సీ అంగన్వాడీ కేంద్రంలో బాలింతగా పేరు నమోదు చేసుకుంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఆమెకు గుడ్డుతో కూడిన భోజనాన్ని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయాలి. అయితే గత నెల 21వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రంలో భోజనం పెట్టకుండా నిలిపేశారు. ఇదిలావుండగా 30వ తేదీ నుంచి గుడ్డు కూడా ఇవ్వడం లేదు. - ఎ.ప్రసన్న కుమారి ప్రొద్దుటూరు: అమృత హస్తం పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి బియ్యంతోపాటు గుడ్ల సరఫరా నిలిచిపోవడమే దీనికి కారణం. సరైన పోషణ అందనట్లయితే గర్భస్థ దశ నుండే శిశువులో పోషకాహార లోపం మొదలై బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రభావం ఎదుగుదలపై ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అమృత హస్తం పథకాన్ని ఏర్పాటు చేసింది. మొదటి విడతగా 2012 డిసెంబర్ 1, రెండో విడత 2013 డిసెంబర్ నెల నుంచి జిల్లాలో అమృత హస్తం పథకం అమలు చేశారు. నిబంధనల ప్రకారం గర్భవతి అయిన మూడో నెల నుంచి 6వ నెల బాలింత వరకు అంగన్వాడీ కేంద్రంలో భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రొద్దుటూరు రూరల్, పులివెందుల, ముద్దనూరు, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, పోరుమామిళ్ల, బద్వేలు ఐసీడీఎస్ ప్రాజెక్టులలో పథకం అమలవుతోంది. ఆగిన బియ్యం సరఫరా... గత నెల రోజులుగా జిల్లా అంతటా బియ్యం సరఫరా నిలిచిపోయింది. అలాగే గుడ్ల సరఫరాలో కూడా జాప్యం జరుగుతోంది. కేవలం పాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రంలోని లబ్ధిదారులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావంతో అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్నానికే మూతపడుతున్నాయి. అమృత హస్తం మినహా జిల్లాలో మరో 7 ప్రాజెక్టులు ఉండగా అన్నింటిలో 3-6 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే బియ్యం కొరత కారణంగా ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా భోజనం పెట్టడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నవంబర్ నుంచి బాలామృతం సరఫరా ఆగిపోయింది. ప్రత్యామ్నాయంగా బియ్యం, గుడ్లు, ఇతర వస్తువులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇంత వరకు జిల్లాకు బియ్యం కేటాయించలేదు. సరఫరా లేకపోవడంతోనే... అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పై నుంచి సరఫరా కాలేదు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. దీంతో అమృత హస్తం అమలుకు సమస్యలు ఏర్పడుతున్నాయి. వచ్చిన వెంటనే సరఫరా చేస్తాం. గుడ్లు సరఫరా అవుతున్నాయి. - శ్రీదేవి, సీడీపీఓ, ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు భోజనం పెట్టలేకపోతున్నాం .. బియ్యం సరఫరా లేకపోవడం వల్ల భోజనం పెట్టలేకపోతున్నాం. మా అంగన్వాడీ కేంద్రంలో 14 మంది గర్భవతులు, బాలింతలు ఉన్నారు. జనవరి 21 నుంచి వీరికి భోజనం లేదు. ప్రస్తుతం గుడ్లు కూడా లేవు. శోభారాణి, అంగన్వాడీ కార్యకర్త ఈమె పేరు గురులక్ష్మి. ప్రొద్దుటూరు మండలంలోని ఈశ్వరరెడ్డినగర్ 3వ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతిగా పేరు నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం పెట్టకుండా ఆపేశారు. కారణం బియ్యం లేకపోవడమేనని అంగన్వాడీ కార్యకర్త చెప్పార ని వాపోతోంది. గురులక్ష్మి -
బిడ్డా.. వెళ్లిపోయావా
ప్రొద్దుటూరులో ఆదివారం బాలకృష్ణ పర్యటన ఓ కుటుంబానికి కడుపుకోతను మిగిల్చింది. ‘లెజెండ్’ విజయోత్సవ సభకు బాలకృష్ణ వస్తుండటంతో ఆయనను చూడటానికి గంగాధర్, నాగశేషుడు, రమేష్ అనే వారు బైక్‌లో బయల్దేరారు. ఇంతలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో గంగాధర్ మృతి చెందాడు రమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రొద్దుటూరు క్రైం: లెజండ్ విజయోత్సవ సభ విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంగా వస్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ఢీ కొన్న సంఘటనలో పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టకు చెందిన దిద్దిగారి గంగాధర్ (11) మృతి చెందగా ఎర్రబల్లి నాగశేషుడు, మిద్దె రమేష్ గాయపడ్డారు. వారిలో మిద్దె రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. లెజండ్ చిత్రం విజయోత్సవ సభను ఆదివారం పట్టణ శివారులో ఉన్న రాయల్ కౌంటీ రిసార్ట్స్‌లో నిర్వహించాలని భావించారు. బాలకృష్ణకు రక్షణ కల్పించేందుకు కడప నుంచి ఎస్కార్ట్ వాహనం రాయల్ కౌంటీ మార్గంలో వెళుతోంది. పట్టణంలోని కాల్వకట్టకు చెందిన గంగాధర్, నాగశేషుడు, మిద్దె రమేష్ అదే సమయంలో రాయల్ కౌంటీకి బయల్దేరారు. రాయల్ కౌంటీ సమీపంలోని మైలవరం కెనాల్ వద్దకు వెళ్లగానే వెనుకవైపు నుంచి వస్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం వారి మోటార్‌బైక్‌ను ఢీకొంది. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే దిద్దిగారి గంగాధర్ మృతి చెందాడు. ఎర్రబల్లి నాగశేషుడుకు కాలు విరిగింది, మిద్దె రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్నాడు. రమేష్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించగా నాగశేషుడిని కడప రిమ్స్‌కు తరలించారు. మధ్యతరగతి కుటుంబాల్లో విషాదం గంగన్న పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టలో నివాసం ఉంటున్నాడు. అతనికి గంగాధర్, గణేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగాధర్ ఒలివియా స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గంగన్న రాయల్ కౌంటీలో పనిచేస్తున్నాడు. బాలకృష్ణ అక్కడికి రానుండటంతో గంగాధర్, నాగశేషుడు కలిసి రాయల్ కౌంటీకి బయల్దేరారు. విషయం తెలియడంతో రమేష్ కూడా వారితోపాటు వెళ్లాడు. అతను గంగాధర్‌ను ఉన్నత చదువులు చదివించాలని తపించాడు. అయితే విధి మరోలా తలిచింది. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో తల్లిదండ్రులు నాగలక్షుమ్మ, గంగన్నలు ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుని పరిస్థితిని చూసి వారు సొమ్మసిల్లిపోయారు. ఐదు నెలల క్రితమే వివాహం అయింది మిద్దె రమేష్ పట్టణంలోని గాంధీరోడ్డులో టైలర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఐదు నెలల క్రితం అమృతానగర్‌కు చెందిన లక్ష్మిదేవితో వివాహం అయింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఈ వార్తను భార్యకు తెలియనివ్వలేదు. వెంటనే అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఎర్రబల్లి నాగశేషుడు గంగాధర్‌కు సమీప బంధువు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. అతని తండ్రి నాగమయ్య బేల్దారి పనికి వెళ్లేవాడు. నాగమయ్యకు నాగశేషుడితోపాటు నాగమల్లేశ్వరి, నాగమ్మ అనే కుమార్తెలు ఉన్నారు. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలికి చేరుకున్నారు. ఎర్రగుంట్లలో.. ఎర్ర గుంట్ల: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన అభిమానులలో, టీడీపీ కార్యకర్తలతో నిరాశ మిగిల్చింది. అంతేకాక అపశృతి దొర్లింది. బాలయ్యను చూడడానికి వచ్చిన ఓ కార్యకర్తపై లెజండ్ బస్సు ఎక్కింది. దీంతో ఆ కార్యకర్త కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ముద్దనూరు మండలం కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్ బాలయ్య చూడడానికి ఎర్రగుంట్లకు వచ్చాడు. పోలీస్‌స్టేషన్ వద్దకు రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ రద్దీలో ప్రవీణ్‌ను బస్సు ఢీకొంది. 108 వాహనంకు సమాచారం అందించి గాయాలపాలైన ప్రవీణ్‌ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలయ్య వస్తున్నారని తెలిసి చూడడానికి వచ్చిన అబిమానులలో ప్రత్యేకించి మహిళలలో టీడీపీ కార్యకర్తలలో నిరాశ మిగిలింది. -
యూ అల్లా..!
ఆ యువజంటపై ఏ దుష్టశక్తి కళ్లు పడ్డాయో ఏమో.. అత్యంత పవిత్ర స్థలమైన మక్కాకు బయలు దేరిన వారు శాశ్వతంగా అల్లా వద్దకే చేరుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన హసద్(25), షేక్ రిహానా (21)లకు ఏడు నెలల క్రితమే వివాహమైంది. సౌదీలో వ్యాపారం చేస్తున్న హసద్ భార్య, తల్లి, సోదరుడు నూర్‌తోపాటు మదీనా వెళ్లి అక్కడి నుంచి మక్కా యూత్రకు బయలుదేరారు. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. చీకట్లో మృత్యురూపంలో ఆగి ఉన్న ఓ ట్యాంకర్ ఆ యువజంటను కాటేసింది. ఈ ప్రమాదంలో హసద్ తల్లి జిలాన్ బేగం కూడా మృత్యువాతపడగా.. సోదరుడు నూర్ తీవ్ర గాయూలతో చికిత్స పొందుతున్నాడు. ప్రొద్దుటూరు క్రైం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని కబళించింది. నిలిచి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీ కొన్న సంఘటనలో ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో మక్కాకు 150 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెం దిన దంపతులు షేక్ రిహానా (21), హసద్ (25)తోపాటు హసద్ తల్లి జిలాన్‌బేగం (51)లు మృతి చెందగా నూర్ అనే యువకుడు గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆర్ట్స్‌కాలేజి రోడ్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ అమీర్ కుమార్తె రిహానాకు ఏడు నెలల క్రితం శ్రీనివాసనగర్‌లో ఉన్న హసద్‌తో వివాహం జరిగింది. రెండు నెలల తర్వాత దంపతులిద్దరూ సౌదీకి వెళ్లిపోయారు. 10 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలోనే.. హసద్ సౌదీ అరేబియాలోని రియాద్‌లో సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాడు. అతనితోపాటు తల్లిదండ్రులు జిలాన్‌బేగం, ఖాసిం, సోదరులు ఇబ్రహిం, నూర్లు కూడా అక్కడే ఉన్నారు. ఇటీవలే తల్లి జిలాన్‌బేగం నూర్‌తో కలిసి ఇండియాకు వచ్చింది. కొన్ని రోజులపాటు ఇక్కడ ఉన్న జిలాన్‌బేగం చిన్న కుమారుడు నూర్‌తో కలసి 12 రోజుల క్రితం సౌదీకి వెళ్లింది. రెండు రోజుల క్రితం హసద్ దంపతులతోపాటు జిలాన్‌బేగం, నూర్లు కలిసి కారులో మదీనాకు బయలుదేరారు. తర్వాత అక్కడి నుంచి గురువారం రాత్రి మక్కాకు బయలుదేరారు. అయితే వారి వాహనం మదీనాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉండగా శుక్రవారం ఉదయం 4.15 (భారత కాలమానం ప్రకారం) సమయంలో నిలిచి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొంది. ఈ సంఘటనలో రిహానా, హసద్, జిలాన్బేగంలు మృతి చెందగా నూర్‌కు గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోయిన నూర్ సుమారు రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతను సౌదీలో ఉంటున్న బంధువులతోపాటు ప్రొద్దుటూరులో ఉన్న వారికి సమాచారం అందించాడు. కాగా రిహానా 7 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. మక్కా యాత్ర అనంతరం కొద్ది రోజుల్లోనే కూతురు, అల్లుడు ఇండియాకు వచ్చేవారని చెప్పుకుంటూ అమీర్ రోదించసాగాడు. పరామర్శించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విషయం తెలియడంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు ఆర్ట్స్ కాలేజి రోడ్డులోని అమీర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రోడ్డు ప్రమా దం ఎలా జరిగిందో వారు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే రాచమల్లు అమీర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, కౌన్సిలర్లు చక్రకోళ్ల రాందాసు, జయశంకర్, కోనేటి సునంద, వైఎస్సార్సీపీ నాయకులు పోసా భాస్కర్, కుతుబుద్దీన్, రాయల్గౌస్ తదితరులు అమీర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
నకిలీ బాబా కోర్టుకు హాజరు
ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తితోపాటు అతనికి సహకరించిన లోమడ సుబ్బారెడ్డిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా సుబ్బారెడ్డికి వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదన్న కారణంతో వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తిరిగి ఎర్రగుంట్లకు తీసుకెళ్లారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి వద్ద సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరు అక్కడే ఉండి స్వామీజీని నమ్ముకుంటే ఎలాంటి సమస్యలున్నా తీరుతాయని, పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందని, స్వామి వద్దకు వస్తే దెయ్యాలు పోతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇటీవల అయ్యప్పస్వామి దేవాలయంలో జరిగిన లక్షార్చన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది స్వామీజీ వేషంలో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తిని చూసి ప్రలోభాలకు గురయ్యారు. స్వామీజీ వేషంలో ఉన్న వ్యక్తిని కోర్టు తిరిగి పోలీసులకు అప్పగించడంతో పోలీసులకు ముప్పుతిప్పలు తప్పలేదు. అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం కష్టంగా మారింది. ఏ క్షణంలో అతను ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులు కాపలాగా సిబ్బందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో కడప రిమ్స్‌కు తరలించినా అక్కడ వైద్యులు అందుబాటులో ఉండకపోవచ్చని పోలీసులు శుక్రవారం వరకు స్టేషన్లోనే ఉంచుకునే అవకాశం ఉంది. -
దొంగ బాబా అరెస్ట్
ప్రొద్దుటూరు టౌన్: అతను మతిస్థిమితం లేని వ్యక్తి. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద, సార్వకట్టవీధిలోని ఉన్న చెత్త కుండీల వద్ద కూర్చుని ఉండేవాడు. అలాంటి వ్యక్తికి కొందరు స్వామీజీ వేషం వేశారు. పిల్లలు లేని వారు స్వామీజీ వద్దకు వస్తే పిల్లలు పుడతారని, ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే ఇక దోచుకోవడం వారి వంతైంది. ఎర్రగుంట్ల రోడ్డులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక ఉన్న ఓ చెట్టును ఆసరాగా చేసుకున్నారు. అక్కడ స్వామీజీ వేషం వేసి ఓ కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన వారికి ఆ వ్యక్తితో(స్వామీజీ) మట్టి ఇప్పిస్తున్నారు. ఈ స్వామీజీ మోసాన్ని పసిగట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున పూజలు.. ఇంకేముంది మహిళలు పెద్ద ఎత్తున స్వామీజీ వద్దకు రావడం, హారతులు ఇవ్వడం, పూలమాలలు వేయడం మొదలుపెట్టారు. ఈ తతంగం రెండు నెలలుగా జరుగుతోంది. అయితే స్వామి వేషంలో ఉన్న వ్యక్తి వచ్చిన వారిని చూస్తూ కూర్చుంటాడు. అక్కడ స్వామీజీ శిష్యులుగా చెప్పుకుంటున్న వారు మహిళల పట్ల స్వామీజీ స్పర్శ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు చెబుతున్నారు. హుండీ ఏర్పాటు... అక్కడే ఓ హుండీ ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఆశ్రమం నిర్మించాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్కడే ఆ మతిస్థిమితం లేని వ్యక్తికి పరుపు, మంచం ఏర్పాటు చేశారు. వంట సామాన్లు, అన్నదానాల పేరుతో పెద్ద ఎత్తున నిత్యావసరాలు వసూలు చేస్తున్నారు. స్వామీజీ పేరుతో జరుగుతున్న అసాంఘిక చర్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు అరెస్టు ఎర్రగుంట్ల: పెన్నానది సమీపంలోని య్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో దెయ్యాలు వదిలిస్తానంటూ మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. అలాగే ఇతిన్న ప్రోత్సహించిన లోమడ సుబ్బారెడ్డిని కూడా అరెస్టు చేశామన్నారు. అయ్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో స్వామి అనే వ్యక్తి మహిళలకు దెయ్యాలు ఉన్నాయంటూ వారిని లోబరుచుకొని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని భూమిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కేసు నమోదు చేసి దొంగ స్వామిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అమ్మాలంటే.. పాతాళంలో
ప్రొద్దుటూరు: దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బును కూడా రైతులకు 48 గంటల్లో చెల్లించడం జరుగుతుందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ప్రస్తుతం పంట నూర్పిళ్ల సీజన్ ప్రారంభమైనా జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో గత్యంతరం లేక రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోతున్నారు. వారు చెప్పిన ధరలకు ధాన్యాన్ని అమ్మక తప్పడంలేదు. కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రామాల్లో రైతులకు ఇంతవరకు వెల్లడించలేదు. తమకు దళారులే దిక్కు అని రైతులు భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఈ ఏడాది సరికొత్త నిబంధనలను అమలు చేసింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ గత నెల 25న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రేడ్ ఏ ధర క్వింటాలు రూ.1400, కామన్ వెరైటీ ధర రూ.1360లుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో డ్వాక్రా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 48 గంటల్లో ఆ రైతులకు డబ్బు ఇవ్వాలని నిబంధనలు విధించారు. ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అసలు నిబంధనలు ఎలా ఉంటాయో తెలియకపోయినా ఇప్పటి వరకు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మీరు అధైర్య పడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చేవారు లేరు. వాస్తవానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతుకు గిట్టుబాటు కాకపోయినా ఈ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ ధర కన్నా మార్కెట్ ధరే అధికంగా ఉండేది. అయితే వ్యాపారులు క్రమేపి ధరలు తగ్గిస్తూ వస్తున్నారు. వారం రోజుల క్రితం గ్రేడ్ ఏ ధాన్యం (జిలకర మసూర) 8 బస్తాల ధర రూ. 9,500 ఉండగా శుక్రవారం రూ.8,800లకు తగ్గించారు. ప్రస్తుతం వర్షం ప్రభావం కనిపిస్తుండటంతో రైతులు త్వరితగతిన పంట నూర్పిళ్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు ధాన్యం ధరలు తగ్గించారు. పైగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో దళారులు చెప్పిందే గ్రామాల్లో సాగుతోంది. గతంలో రైతులు చాలా మంది నేరుగా అమ్మకుండా నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో ధరలు పెరుగుతాయని రైతులు విశ్వసించడం లేదు. ఉన్న వరకు పండిన వెంటనే అమ్ముకోవడమే మేలని భావిస్తున్నారు. జనవరి నెలాఖరులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం జిల్లాకు సంబంధించి 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తమ టెక్నికల్ సిబ్బంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లకు వెళ్లారు. ఈనెలాఖరులో వారు తిరిగి వస్తారు. జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. వచ్చే నెలాఖరులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. - బుల్లారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దళారులను ఆశ్రయించాల్సిందే అధికారులెవ్వరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పలేదు. గ్రామంలోకి దళారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని బస్తా రూ.1100లతో అమ్ముకున్నా. ధర గిట్టుబాటు కాక నష్టపోతున్నాం. - గంజికుంట వెంకట సుబ్బారెడ్డి, రైతు అడిగేవారు లేరని ... ప్రస్తుతం పండించిన ధాన్యానికి డిమాండ్ లేదు. వ్యాపారులు పెద్దగా రావడం లేదు. దీంతో ఉన్న ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్కో రోజు ఒక్కో ధరను మార్కెట్లో నిర్ణయిస్తున్నారు. - సహదేవరెడ్డి, రైతు -
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు.. రూ. లక్షలు విలువ చేసే జనరేటర్‌తో పాటు ఏసీని మాయం చేశారు. దీనిపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపల్ చైర్మన్‌ను కోరుతున్నారు. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో చైర్మన్ తటపటాయిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని గురువయ్యతోటలో నివాసం ఉంటున్న శివనాగప్రసాదరెడ్డి ఇంటిపై (26/284-25) రిలయన్స్ సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2008లో ఇందుకు సంబంధించి రిజిష్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అప్పట్లో చుట్టుపక్కల వారు ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనుమతి లేకుండా ఎలా టవర్ నిర్మిస్తారని మున్సిపల్ అధికారులు టవర్ దగ్గర ఏర్పాటు చేసిన జనరేటర్తోపాటు ఎయిర్ కండీషన్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని అంచనా. అప్పటి నుంచి ఇవి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోనే ఉండేవి. అప్పటి కౌన్సిలర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి, ప్రస్తుత కౌన్సిలర్ మార్కాపురం గణేష్‌బాబు వీటిని క్రేన్ సహాయంతో మున్సిపల్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. కొత్తగా పాలకవర్గం ఏర్పాటు కావడంతో తన సమస్యను శివనాగప్రసాదరెడ్డి సతీమణి రాజేశ్వరి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల ద్వారా విన్నవించారు. శివనాగప్రసాదరెడ్డి తనకు సహచరుడు కావడంతో 32వ వార్డు కౌన్సిలర్ కోనేటి సునంద భర్త భాస్కర్‌రెడ్డి కొద్ది రోజుల కిందట మున్సిపల్ అధికారులను కలిసి జనరేటర్, ఏసీ మిషన్లను అప్పగించాలని కోరారు. అందుకు సంబంధించిన పత్రాలు వెతికి అప్పజెప్పుతామని టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లోని నాగేంద్ర తెలిపారు. ఈ విషయంపై ఈనెల 2వ తేదీన రాజేశ్వరి మున్సిపల్ చైర్మన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను నాన్చుతుండటంతో భాస్కర్‌రెడ్డి స్వయంగా చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కార్యాలయ ఆవరణంలో ఉన్న జనరేటర్, ఏసీ మిషన్లు కన్పించడంలేదని సిబ్బంది చైర్మన్‌కు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ కౌన్సిలర్లు ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా చైర్మన్‌కు విన్నవించారు. నేడో రేపో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిని వివరణ కోరగా జనరేటర్, ఏసీ మిషన్లు కనిపించని మాట వాస్తవమేనన్నారు. -
కొందామా.. వద్దా..!
ప్రొద్దుటూరు కల్చరల్ : మార్కెట్లో పుత్తడి ధరలు ఊగిసలాడుతున్నాయి. కొన్ని రోజులు గా బంగారు ధరలు పెరగడం అంతలోనే తగ్గుతూ రావడంతో కొందామా.. వద్దా అని వినియోగదారులు ఊగిసలాడుతున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో బంగారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారాన్ని ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా బంగారం ధర చుక్కలను అంటుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి కనిపించడంలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, తగ్గడం, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు ఉండటంతో బంగారు ధరలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.2680, 22 క్యారెట్ల బంగారం ధర రూ.2467 ఉండగా వెండి కిలో రూ.36800గా ఉంది. డిసెంబర్ 1వ తేదీన 24క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.2,620, 22 క్యారెట్లు రూ.2,410, వెండి కిలో ధర రూ.34,400గా ఉంది. 2వ తేదీనాటికి 10 గ్రాముల మీద దాదాపు రూ.850 వరకు పెరిగి 24 క్యారెట్ల గ్రాము ధర రూ.2705, 22 క్యారెట్ల ధర రూ.2488కు చేరింది. వెండి కిలో మీద రూ.2500 పెరిగి రూ.36,900కు చేరింది. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ... పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికి బంగారం కొనుగోలు అంతంత మాత్రంగా జరుగుతుండటంతో షరాబు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు కాస్త దిగి రావడంతో పసిడి విక్రయాలు పుంజుకుంటాయని వధూవరులకు అవసరమైన బ్రాస్లెట్, చైను, గాజులు, హారాలు, ఉంగరాలు వంటి నూతన డిజైన్లను తయారు చేయించి అమ్మకానికి సిద్ధం చేశారు. అయితే రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. పుత్తడి ధరలు భారీగా దిగిరావచ్చనే భావన ఉండటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రజలలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, పెట్టుబడులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, ఇళ్లు, వాహన కొనుగోళ్లకు ఇచ్చినట్లు బంగారానికి రుణాలు ఇవ్వక పోవడం వంటి కారణాలను వ్యాపారులు చెబుతున్నారు. సీజన్ అయినా... పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారాలు లేవు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా కొనుగోళ్లు చాలా వరకు పడిపోయాయి. వివాహాలు ఉన్నా అవసరమైన మేరకే ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. - బుశెట్టి రామ్మోహన్రావు, బులియన్ మార్కెట్ మెంబర్ ధరలు తగ్గుతాయని చూస్తున్నారు బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుసుకుంటుండటంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు వేచిచూస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయినా అంతంతమాత్రంగానే కొనుగోళ్లు ఉన్నాయి. - రామమనోహర్, షరాబు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు ఆర్డర్లు తగ్గాయి... బంగారం ధరల హెచ్చుతగ్గుల వల్ల ప్రజలు కొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దీంతో ఆర్డర్లు తగ్గాయి. కొందరు వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి ఆభరణాలు దిగుమతి చేసుకుంటున్నారు. - రమణాచారి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు -
బయోమెట్రిక్ విధానం..అదో ఆర్భాటం
ప్రొద్దుటూరు: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ అటెండెన్స్ నివారణకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బయో మెట్రిక్ విధానం అమలు ప్రశ్నార్థకంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్ సామగ్రి నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి చాలా రోజుల క్రితమే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్తగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే విద్యార్థుల హాజరునుబట్టి వసతి గృహ సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు సెప్టంబర్లో సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 998 వసతి గృహాలకు ఈ సామగ్రి చేరింది. జిల్లాకు సంబంధించి 140 వసతి గృహాలకుగాను 99 వాటికి సరఫరా చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌తో వీటిని రూపొందించడంతో ఒక్కో వసతి గృహానికి సంబంధించిన ల్యాప్‌టాప్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలుకు ప్రభుత్వం సుమారు రూ.లక్ష వరకు వెచ్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో విద్యార్థుల అటెండెన్స్‌ను బయోమెట్రిక్ ద్వారా సేకరించాల్సి ఉంది. ప్రధానంగా బోగస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే సంబంధిత ల్యాప్‌టాప్ కంపెనీ ప్రతినిధులు ఆయా డివిజన్లకు వచ్చి ల్యాప్‌టాప్‌లు అందించారే కానీ వినియోగంపై సరైన అవగాహన కల్పించలేదు. పూర్వం నుంచి రిజిష్టర్లపైన ఆధారపడిన హెచ్‌డబ్ల్యూఓలకు ఈ విధానంపై అవగాహన లేక ఆ సామగ్రిని తీసుకెళ్లి ఇళ్లల్లో దాచుకున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే మీరే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో హెచ్‌డబ్ల్యూఓలు వీటిని భద్రంగా దాచి ఉంచారు. ఇదిలావుండగానే సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని వసతి గృహాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అవగాహన లేని కారణంగా జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలుకు నోచుకోలేదు. -
ఐపీ.. బాంబులు
పసిడిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో బంగారు వ్యాపారులు ఐపీ పెడుతుండడంతో రుణదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పెట్టాబేడా సర్దుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు ఐపీ పెడతారోననే ఖాతాదారులు భయపడుతున్నారు. కొందరు బంగారు దుకాణాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. పసిడి పురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం ఐపీ బాంబులతో వణికిపోతోంది. మార్కెట్లో బాగా పేరున్న వ్యాపారులే ఐపీ బాట పట్టడంతో రుణదాతలు ఆందోళన చెందుతున్నారు.వ్యాపారులు వరుసగా దివాళా తీస్తుండటం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. ఈ ప్రభావం బంగారు వ్యాపారంపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రొద్దుటూరు క్రైం: నాలుగు రోజుల కిందట పట్టణంలోని మెయిన్‌బజార్‌లో కరిష్మా జ్యూవెలర్స్ దుకాణ యజమానులు రూ. 7.50 కోట్లకు ఐపీ పెట్టారు. మరికొందరు అదే బాటలో పయనిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రొద్దుటూరు బంగారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. ఇక్కడ ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతోంది. రాయలసీమతో పాటు ఇతర జిల్లాల వాసులు కూడా ఇక్కడి బంగారు కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు మెయిన్‌బజార్‌లో మాత్రమే ఉన్న దుకాణాలు ఇప్పుడు నాలుగైదు వీధులకు విస్తరించాయి. ప్రస్తుతం మోక్షగుండం వీధి, పాత మార్కెట్, రాజబాటవీధి, కోటవీధి, దర్గాబజార్ తదితర వీధుల్లో దుకాణాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బంగారు వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్నారు. నమ్మకం పోతోంది... బజార్లో చాలా మంది నమ్మకమే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసేవారు. కొన్ని నెలల వరకూ చెన్నై, సేలం, కోయంబత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవారు. తమ వద్ద నున్న బంగారు వస్తువులు పట్టణంలోని దుకాణాలకు వేసి కొన్ని రోజుల తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బయటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానికంగా ఉన్న బంగారు దుకాణాలకు ఒక్క నగ కూడా ఇవ్వడం లేదు. డబ్బు ఇస్తే గానీ వారు నగలు ఇవ్వడం లేదు. దీనికి ఇటీవల కాలంలో చాలా మంది వ్యాపారులు ఐపీ పెట్టడమే కారణమని తెలుస్తోంది. బంగారు దుకాణం వద్ద ఆందోళన మోక్షగుండం వీధిలోని శ్రీనివాసా జ్యువెలరీ షాపు, కటింగ్ మిషన్ వద్ద గురువారం పలువురు వ్యక్తులు గుమికూడారు. షాపు యజమానులు మన్నేపల్లి వేణు, శివకుమార్‌లు తమకు డబ్బు ఇవ్వాలంటూ పలువురు రుణదాతలు దుకాణం వద్ద గుమికూడారు. చీటీల వ్యాపారులు, కార్పొరేషన్, బంగారు నగల తయారీ దారులతో పాటు 22 మందికి దుకాణ దారులు సుమారు రూ. 1.50 కోట్లు దాకా ఇవ్వాలని ఆందోళన కారులు తెలిపారు. మిట్టమడి వీధిలో ఉన్న ఇంటిని ఇది వరకే విక్రయించారని వారన్నారు. పెద్ద మనుషులు పంచాయితీ చేసి రూ 60 లక్షలు రుణ దాతలకు ఇచ్చేలా పంచాయతీ చేశారన్నారు. వేణు, శివకుమార్‌లు మాత్రం డబ్బు ఇవ్వకుండా ఐపీ దాఖలు చేసే యోచనలో ఉన్నారని వారు పేర్కొన్నారు. విషయం తెలియడంతో వేణు, శివకుమార్‌లు వన్‌టౌన్ పోలీస్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న బాకీదారులు స్టేషన్ వద్దకు వెళ్లి డబ్బు ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరారు. మరో నలుగురు ఐపీ ! పట్టణంలో మరో నలుగురు బంగారు వ్యాపారులు ఐపీ పెట్టే యోచనలో ఉన్నట్లు మెయిన్‌బజార్‌లో చర్చించుకుంటున్నారు. ఓ బంగారు వ్యాపారి ఇప్పటికే రూ.25 కోట్లకు ఐపీ సిద్ధం చేసుకోగా మరో ము గ్గురు తొందరలోనే ఐపీ బాంబు పేల్చనున్నట్లు సమాచారం. మెయిన్‌బజార్‌లో ఒకరు, పాత మార్కెట్ ప్రాంతంలో మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఎవరి రూల్ వారిది
ఇది ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న భారతీయ స్టేట్‌బ్యాంక్ టౌన్ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. రుణమాఫీకి సంబంధించి రైతులు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు 1-బి ఒరిజనల్, రేషన్, ఆధార్‌కార్డు, లోన్ తీసుకున్న రశీదు జిరాక్స్‌లు ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా దరఖాస్తును కూడా బ్యాంక్ అధికారులు ముద్రించారు. చివరితేదీ ఈనెల 3వ తేదీ అని బ్యాంక్ నోటీసు బోర్డులో పెట్టారు. రుణమాఫీ కోసం గత నెల 25వ తేదీ చివరి రోజుగా ప్రొద్దుటూరు పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులు ప్రకటించడంతో రైతులు గ్రామాల నుంచి తరలి వచ్చి క్యూలో నిల్చొని ఒరిజనల్ పుస్తకాలను చూపించి జిరాక్స్ పత్రాలను ఇవ్వాల్సి వచ్చింది. ఈ బ్యాంక్‌లో 1-బి పత్రాలు మాత్రం అడగలేదు. అది ప్రొద్దుటూరు పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ అభివృద్ధి శాఖ బ్రాంచి. ఇక్కడ 1-బి ఒరిజనల్తోపాటు పట్టాదారుపాస్పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ పత్రాలను ఇవ్వాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడు 1-బి తయారు చేసి ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు చెప్పడంతో దానిని తొలగించారు. ఎర్రగుంట్లలోని ఎస్బీఐలో ఏకంగా రైతుల నుంచి టైటీల్ డీడ్ ఒరిజనల్ పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ పుస్తకం తీసుకున్నట్లు రైతులకు రశీదులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఎదురు ప్రశ్నిస్తే బ్యాంక్ అధికారులు ఏమంటారోనని బ్యాంక్ అధికారులు అడిగిన వాటిని రైతులు సమర్పిస్తున్నారు. -
జిల్లాలో దొంగలు పడ్డారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె పరిధిలోని రాజేశ్వరి నగర్లో నివాసం ఉంటున్న వ్యాపారి కర్నాటి వీరశేఖర్‌రెడ్డి ఇంటిలో భారీ చోరీ జరిగింది. దొంగలు బంగారు, వెండి నగలతోపాటు నగదును అపహరించారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు ... వీరశేఖర్‌రెడ్డి తన సతీమణి శ్రీదేవి, పిల్లలు విశ్వనాథరెడ్డి, శివకుమార్‌రెడ్డి, జ్యోతిలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలంకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దొంగలు అదే రోజు రాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని నెక్లస్‌లు, చైన్లు, బ్రాస్లైట్లు తదితర 25 తులాల బంగారు నగలు, వెండి ప్లేట్లు, చెంబు తదితర మూడున్నర కిలోల వెండి నగలను చోరీ చేశారు. వీటితోపాటు బీరువాలోనే ఉంచిన రూ.2.15లక్షల నగదును తీసుకెళ్లారు. సుమారు లక్ష రూపాయల విలువ గల మూడు పట్టు చీరెలను కూడా అపహరించారు. సోమవారం మధ్యాహ్న సమయంలో పక్కింటిలో నివశిస్తున్న మహిళ వీరశేఖరరెడ్డి ఇంటి తలుపులు తెరచిన విషయాన్ని గమనించింది. వెంటనే వీరశేఖర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపింది. ఆయన తమ బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు ఇంటి వద్దకు వెళ్లి చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం సాయంత్రానికి ఇంటికి వచ్చిన వీరశేఖర్‌రెడ్డి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం క్లూస్ టీం అధికారులతోపాటు టూటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి విచారించారు. సినీ హబ్ అధినేత బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డితోపాటు పలువురు వీరశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారంలో రెండో సంఘటన ప్రొద్దుటూరులో వారంలో రెండో భారీ చోరీ సంఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈనెల 23న వైఎంఆర్ కాలనీలోని డీఏడబ్ల్యూ కళాశాల కరస్పాండెంట్ దేవరశెట్టి నాగరాజు కుటుంబ సభ్యులతో బెంగుళూరుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఇంటి తాళాలు పగులగొట్టి రూ.12.50 లక్షల విలువైన బంగారు, నగదును అపహరించుకెళ్లారు. 26వ తేదీన చోరీ సంఘటనను గుర్తించారు. ఇదే తరహాలో ప్రస్తుతం వీరశేఖర్‌రెడ్డి ఇంటికి తాళం వేసి శ్రీశైలంకు వెళ్లగా చోరీ జరగింది. దీనిని బట్టి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈసంఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.