అమ్మను చంపేశాడు.. | husband attempt murder | Sakshi
Sakshi News home page

అమ్మను చంపేశాడు..

Published Sun, Feb 23 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

అమ్మను చంపేశాడు..

అమ్మను చంపేశాడు..

ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ఆ ఇల్లాలికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి.. కట్టుకున్న భర్తే క్రూరుడిగా మారాడు.. ఇల్లాలిపై అతను అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రోకలిబడెతో కొట్టి గర్భిణి అయిన భార్యను హత్య చేశాడు. మట్టి మసీదు వీధిలోని వక్కల యాస్మిన్ (25) శనివారం సాయంత్రం భర్త సాదిక్ హుసేన్ చేతిలో దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చక్రాయపేటకు చెందిన అల్లాబకాష్‌కు ముగ్గురు కుమార్తెలతోపాటు కుమారులు ఉన్నారు.
 
 రెండవ కుమార్తె యాస్మిన్‌ను ఐదేళ్లక్రితం ప్రొద్దుటూరులోని మట్టిమసీదు వీధికి చెందిన సాదిక్ హుసేన్‌కు ఇచ్చి వివాహం చేశారు. దూరపు బంధువు కావడంతో అతనికి ఇచ్చి వివాహం చేశారు. సాదిక్ హుసేన్ బంగారు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి మూడేళ్ల రెహనుమా అనే పాప ఉంది. కాగా యాస్మిన్ ప్రస్తుతం 7 నెలల గర్భణి కూడా. అతను కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అంతేగాక అదనపు కట్నం కావాలంటూ తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. భర్త దుకాణం నుంచి ఇంటికి వస్తున్నాడంటే ఆమె భయంతో వణికిపోయేది. ఏ వంక పెట్టి తనను బేధిస్తాడోనని యాస్మిన్ ఆందోళన చెందేది.

 కుమార్తెను దుకాణానికి పంపి...
 ఈ క్రమంలో శనివారం సాయంత్రం సాదిక్ హుసేన్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. కుమార్తె రెహనుమాను దుకాణానికి పంపించాడు. అతను రోకలిబడె తీసుకుని భార్యను కొడుతున్న సమయంలో ఇంటికొచ్చిన కుమార్తె తల్లిని కొట్టడాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి తన అవ్వ, తాతతో చెప్పింది. వారు వచ్చేలోపే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. తన కోడలు చనిపోయిందంటూ అత్త జబువున్నీసా గట్టిగా కేకలు వేసింది. దీంతో మట్టిమసీదు వీధిలోని బంధువులందరూ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సాదిక్ హుసేన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
 
 గురువారం వస్తానంటివే...
 సాదిక్ హుసేన్ మధ్యాహ్నం చక్రాయపేటలోని యాస్మిన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు ఆరోగ్యం సరిగా లేదని అన్నాడు. అయితే  ఇక్కడికి వచ్చి రెండు రోజుల పాటు ఉండి వెళ్లాలని వారు అల్లుడితో అన్నారు. తర్వాత యాస్మిన్ కూడా తల్లిదండ్రులతో మాట్లాడింది. వచ్చే గురువారం అక్కడికి వస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిపింది.
 
 అయితే 4 గంటల సమయంలోనే కుమార్తె హత్యకు గురైనట్లు బంధువులు ఫోన్ చేయడంతో అల్లాబకాష్ దంపతులు రోదించసాగారు. రెండు గంటల ముందు ఫోన్ చేసిన కుమార్తె హత్యకు గురైందన్న వార్తను వారు నమ్మలేకపోతున్నారు. హుటాహుటిన తల్లిదండ్రులతోపాటు బంధువులందరూ చక్రాయపేట నుంచి జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా సాదిక్ హుసేన్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement