కట్టాల్సిందే!
పొద్దుటూరు: స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణాల మాఫీ జాప్యం కావడంతో ఓ వైపు బ్యాంకర్లు, మరో వైపు సంబంధిత అధికారులు పొదుపు సంఘాల వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం రుణాలు చెల్లిస్తుందో లేదో తమకు సంబంధం లేదని బకాయిలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరికొందరు అధికారులు ఇంకా ముందుకెళ్లి రాజధాని నిర్మాణానికే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అలాంటప్పుడు మీ బకాయిలు చెల్లిస్తారన్న గ్యారంటీ ఏముందని పొదుపు సంఘాల వారిని నయానా భయానా హెచ్చరిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే మీ సంఘాలు మనుగడలో లేనట్లేనని చెబుతున్నారు. దీంతో పొదుపు సంఘాలకు చెందిన మహిళలు అధికారుల ఒత్తిడి భరించలేక బకాయిలు చెల్లిస్తున్నారు.
కొన్ని సంఘాల వారు బకాయిలు చెల్లించలేదని బ్యాంకర్లు ఏకంగా ఆ సంఘాలకు సంబంధించిన సేవింగ్స్ ఖాతాలోని డబ్బును జమ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పేదల నిర్మూలన పథకం (మెప్మా) పరిధిలో 2300 పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.22 కోట్లు, 2014-15 సంవత్సరంలో రూ.20 కోట్లు బ్యాంక్ లింకేజి కింద మహిళలు రుణాలు తీసుకున్నారు. పట్టణ పరిధిలోని 16 బ్యాంక్‌ల నుంచి వీరు రుణాలు పొందారు.
కాగా ఎన్నికల హామీల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెల నుంచి మహిళలు రుణాలు చెల్లించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసం మహిళలంతా ఎదురు చూశారు. ప్రమాణ స్వీకారం రోజున రుణ మాఫీ సంతకం పెడతారని భావించారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పొదుపు సంఘాల రుణాల మాఫీపై సంతకం చేసినా స్పష్టత లేదు. ఎప్పటి నుంచి రుణ మాఫీ అమలవుతుంది, ఎంత రుణం మాఫీ అవుతుంది తదితర విషయాలు తేలాల్సి ఉంది. ఈ విషయంపై కమిటీ వేయడంతో ఇప్పుడే రుణాల మాఫీ అమలు కాదని స్పష్టమైంది. ఇదిలావుండగా తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం 3 నెలలలోగా తీసుకున్న రుణం చెల్లించకపోతే మీ సంఘం నాన్ పర్‌ఫార్మెన్స్ అకౌంట్ (ఎన్‌పీఏ) కిందికి వెళుతుందని, అలా వెళితే మీ సంఘం నష్టపోతుందని’ చెబుతున్నారు. అలాగే రుణాల మాఫీ తేలకపోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలు మంజూరు చేయడం లేదు.
కాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని సంబంధిత అధికారులు కూడా పొదుపు సంఘాలపై బకాయిలు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రికవరి 98 శాతం ఉండటంతో గత మూడేళ్లుగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు రుణాలు చెల్లించాలని మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే పలు సంఘాలకు సంబంధించి సేవింగ్స్ ఖాతాలోని సొమ్మును బకాయిల కింద జమ చేసుకున్నారు.
సంఘాలు ఎన్‌పీఏ పరిధిలోకి వెళతాయి
తీసుకున్న రుణాన్ని మూడు నెలలలోపు చెల్లించకపోతే సంఘాలు నాన్ ఫర్‌ఫార్మెన్స్ అకౌంట్ పరిధిలోకి వెళతాయి. దీని వలన ఆ సంఘానికి ఇచ్చే రుణం కూడా తగ్గుతుంది. బకాయిలు చెల్లించాలని సంఘాలకు చెప్పిన మాట వాస్తవమే.
- కెజియా జాస్లిన్, పావర్టి రీసోర్స్ పర్సన్
రుణం చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు
తీసుకున్న రుణం చెల్లించమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాఫీ అవుతుందో లేదో అన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తపరుస్తున్నారు. దీంతో రుణం చెల్లించేందుకు సిద్ధమవుతున్నాం.
- నాగసుబ్బమ్మ,
వీరభద్ర స్వయం సహాయక సంఘం లీడర్
అందరికీ చెప్పారు
ఇటీవల స్వయం సహాయక సంఘాల సమావేశంలో అధికారులు బకాయిలు చెల్లించాలని అందరికీ చెప్పారు. అలా చెల్లిస్తేనే రుణాలు ఇస్తారని చెబుతున్నారు. దీంతో రుణం చెల్లించాల్సి వస్తోంది.
- జే.వెంకటలక్షుమ్మ,
నరసింహ స్వయం సహాయక సంఘం