government money
-
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్‌న్యూస్
ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. కుల రహిత సమాజాన్ని నిర్మించడంతోపాటు అంతరాలను చెరిపేయాలనే లక్ష్యంతో కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రస్తుత సమాజంలో యువతీ యువకుల కులాంతర వివాహ నిర్ణయానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోవడం, ప్రభుత్వం కూడా వీటిని మరింతగా పెంచాలనే ఉద్దేశంతో ప్రోత్సాహక నగదును రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు పెంచింది. దీంతోపాటు ప్రోత్సాహకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షి, ఖమ్మం : జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో కులం ఒకటే అయినా శాఖ భేదాలతో పెద్దలు సంబంధాలు కుదుర్చుకునేవారు కాదు. తమ శాఖకు చెందిన వారినే పెళ్లి చేసుకోవాలనే పట్టింపు ఉండేది. మారుతున్న పరిస్థితుల్లో అలాంటి పట్టింపులన్నీ పట్టు విడుస్తున్నాయి. కులం, శాఖ భేదమే లేకుండా యువతీ యువకులు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. అభిరుచులు, అభిప్రాయాలు కలిసినట్లయితే పెద్దలను ఒప్పించి మరీ మనువాడుతున్నారు. పెద్దలు కాదన్న పక్షంలో పోలీసులను ఆశ్రయించి పెళ్లి చేసుకుంటున్నారు. (మీ అమ్మాయి అలాంటి అమ్మాయి..) రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు.. కులాంతర వివాహం చేసుకున్న జంటలను కొన్ని కుటుంబాలు మొదట్లో ఆదరించకపోయినా ఆ తర్వాత దగ్గరకు తీస్తున్నాయి. మరికొన్ని జంటలను దూరంగా పెడుతుండటంతో కుటుంబ పోషణ కొంత భారంగా మారే అవకాశం ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్నజంటలకు నగదు ప్రోత్సాహం అందిస్తూ వస్తోంది. అయితే ఆ ప్రోత్సాహం కల్యాణలక్ష్మి పథకం కన్నా తక్కువగా ఉండటంతో కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2011 వరకు కులాంతర వివాహం చేసుకున్న జంటకు ప్రోత్సాహకం రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం 2012 నుంచి రూ.50వేల చొప్పున అందజేస్తోంది. (బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!) ప్రోత్సాహకాలు ఇలా.. కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు ప్రభుత్వం అండగా నిలబడి ప్రోత్సాహకాలు అందిస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే వారి వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పూర్తి ఆధారాలనుబట్టి అధికారులు విచారణ చేసి ప్రోత్సాహకాలకు అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. తర్వాత జంటలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. (నాన్నా మళ్లీ వస్తా..) దరఖాస్తుకు అవసరమైనవి ఇవీ.. ► వివాహం చేసుకున్న జంట ఫొటోలు మూడు ►తహసీల్దార్ జారీ చేసిన ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు ►వయసు ధ్రువీకరణ కోసం విద్యా సంస్థల నుంచి ఇచ్చిన టీసీ, పదో తరగతి మార్కుల మెమో ►వివాహం చేయించిన అధికారి ద్వారా పొందిన వివాహ ధ్రువీకరణ పత్రం ►గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన ఫస్ట్ మ్యారేజి సర్టిఫికెట్ ►వివాహం చేసుకున్న జంట కలిపి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ►వివాహానికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు ► ఆదాయ ధ్రువీకరణ పత్రం ► ఆధార్ కార్డు ►రేషన్ కార్డు ప్రోత్సాహకాలను పెంచిన ప్రభుత్వం.. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పెంచింది. గతంలో రూ.50వేల ప్రోత్సాహకం అందిస్తుండగా, రూ.2.50లక్షలకు పెంచుతూ నిర్ణయించింది. కులాంతర వివాహాల ప్రోత్సాహకాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నాం. పెళ్లి చేసుకుని ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటిని పరిశీలిస్తున్నాం. అర్హులైన జంటలను గుర్తించి తక్షణమే ప్రభుత్వానికి నివేదికలు అందించి ప్రోత్సాహకాలు మంజూరయ్యేలా చూస్తున్నాం. జంటలు దరఖాస్తుకు జతపరిచిన బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు ఆన్లైన్ ద్వారా నిధులను జమ చేస్తున్నాం. – కె.సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు -
ఢిల్లీలో చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందంటూనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనేక దుబారా ఖర్చులకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులనే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు. ఈ దీక్షకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు రూ.10 కోట్లు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు, ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లెందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ దీక్ష కోసం రూ.1.12 కోట్లతో శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్లును సిద్ధం చేశారు. అంతేకాక విమానాలు, ఇతర రవాణకు రూ.2 కోట్లు, భోజనాలు వసతులు పబ్లిసిటీకి రూ.8 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. దీక్షకు ఉద్యోగులను భారీగా తరలించేందుకు ఉద్యోగ సంఘాలకు సీఎంవో టార్గెట్ కూడా ఇచ్చింది. ఇవేకాక గడిచిన నాలుగున్నరేళ్లలో ధర్మపోరాటదీక్షల పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీగా ప్రజధనాన్ని వృథా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకోవడానికి చంద్రబాబు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేయడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
సర్కార్ సొమ్ము బాబుగారి దుబారా
-
సర్కారీ సొమ్ము నీళ్లపాలు !
కరీంనగర్ హెల్త్ : ప్రభుత్వ శాఖలను కదిలిస్తే... తమ దగ్గర డబ్బులే లేవు.. ఏం చేయాలో అర్థం కావడం లేదనే సమాధానం సాధారణమే. కానీ, పుష్కలంగా డబ్బులుండీ.... యంత్రాలు సమకూర్చుకున్న తరువాత కూడా వాటిని వాడకుండా పడేయడం ఎక్కడైనా చూశామా? వైద్య ఆరోగ్యశాఖలో ఇది మామూలే. గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు రుతుస్రావం సమయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారని... వారికి న్యాప్కిన్స్ అందిస్తే ఆయా రోగాలు రాకుండా అరికట్టవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు జిల్లాలో వృథా అయ్యాయి. ప్రతినెలా మహిళలు, యుక్తవయసు బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్ పంపిణీ చేయాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం(2013 మే 6న) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఆర్ఎం) నిధుల ద్వారా జిల్లాకు రూ.3,99,920 విడుదల చేసింది. ఈ నిధులతో న్యాప్కిన్ యంత్రాలు, ముడిసరుకు తెప్పించింది. జిల్లాలోని కరీంనగర్, గంగాధర, సిరిసిల్ల, కోరుట్ల ప్రాంతాల్లో ఆయా యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఉన్నతాధికారుల నిర్లక్ష్యం... సిబ్బంది అవగాహన లోపంతో ఆ యంత్రాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యూరుు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజలకు అందని మిషన్ లక్ష్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, భద్రతపై అవగాహన పెంపొందించేందుకు 2005లో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది. శిశు, యుక్త వయసు బాలికలు, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించింది. రుతుస్రావ సమయంలో అవగాహన లేక సరైన జాగ్రత్తలు పాటించక వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన వైద్యశాఖ పరిష్కారానికి చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంత మహిళలకు స్థానిక అంగన్వాడీ, బాలికల వసతిగృహాలు, ఆస్పత్రుల ద్వారా శానిటరీ న్యాప్కిన్ పంపిణీ చేయాలని సంకల్పించింది. వీటి తయారీకి అవసరమైన నిధులు మంజూరు చేసింది. తయారీకి కావాల్సిన యంత్రాలు, ఉపయోగించే ముడిసరుకు వంటివి తెప్పించారు. వాటిని తయారు చేయడానికి స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించి వారికి శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. మిషన్ పనితీరు, తయూరీపై యంత్రాల కంపెనీ ప్రతినిధితో శిక్షణ ఇప్పించారు. ఇదే సమయంలో ఈ యంత్రాలతో తయారు చేసిన న్యాప్కిన్లు నాణ్యత ఉండవని, వీటి తయారీకి కొనుగోలు కంటే ఖర్చు ఎక్కువే అవుతుందని తెలుసుకున్న అధికారులు వాటిని ఏర్పాటు చేయకుండానే మూలన పడేశారు. ప్రస్తుతం ఆ యంత్రాలు గంగాధరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భద్రపర్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆధునిక యంత్రాలపై దృష్టి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన న్యాప్కిన్ తయారీ యంత్రాలు మూలనపడి ఉండటంపై ప్రజాప్రతినిధులు పాలకమండలి సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకపోవడంతో మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని... సమస్య పరిష్కారంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిసారించాలని కోరుతున్నారు. కొత్త యంత్రాల ఏర్పాటుకు కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడటంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కాలపరిమితి దాటిపోయింది న్యాప్కిన్స్ తయారు చేసే మిషన్ పూర్తిగా కాలపరిమితి దాటిపోవడంతో వాడటం లేదు. ఈ మిషన్‌తో ఎక్కువ ఖర్చుతోపాటు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అధునాతన ఆటోమెటిక్ మిషన్‌ను తెప్పించేందుకు ప్రతిపాదనలు తయారుచేశారు. దీనికి రూ.2.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎంపీ వినోద్‌కుమార్ వివరాలు అడిగారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపడతాం - ఎండీ అలీమ్,డీఎంహెచ్‌వో -
బాస్ తమ్ముళ్ల బరితెగింపు!
అధికారంలో ఉన్నాం.. ‘బాస్’ అండగా ఉండగా మనకు అడ్డేముందని భావించారు టీడీపీ నేతలైన అన్నాదమ్ములు. అలా అనుకున్నదే తడవుగా లేని చెట్లను ఉన్నట్లు చూపించి పరిహారం పొందాలనుకున్నారు. టేకు కర్రలను తీసుకొచ్చి గుంతలు తీసి పాతారు. ఎక్కడో ఉన్న కొన్ని టేకు మొక్కలను పీక్కొచ్చి వీటి మధ్య కనిపించేలా ఉంచారు. ఇంకేముంది.. అధికారులు సైతం అవును అక్కడ చెట్లు ఉన్నాయంటూ ధ్రువీకరించారు. త్వరలో నష్టపరిహారం అందుకోనున్నారు. అట్లూరు : మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన ఇద్దరు టీడీపీ నేతలు ప్రభుత్వ సొమ్ము రూ.కోటి కాజేసేందుకు వ్యూహం పన్నారు. వీరికి ముత్తుకూరు రెవెన్యూ పొలంలో సర్వే నెంబరు 43-1, 43-1బి, 43-1ఎఫ్‌లో రెండు ఎకరాలు పొలం ఉంది. ఈ పొలం సోమశిల ప్రాజెక్టు కింద ముంపునకు గురికానుంది. ఆ పొలంలో చీనీ చెట్లతో పాటు సుమారు 800కు పైగా టేకు చెట్లు ఉన్నట్లు రెండేళ్ల క్రితం భూసేకరణ అధికారులతో రాయించుకున్నారు. దానిని ఫారెస్టు అధికారులు ధ్రువీకరిస్తేనే పరిహారం వస్తుందని తెలుసుకుని అప్పటి సిద్దవటం ఫారెస్టు సెక్షన్ అధికారిణిని ఆశ్రయించారు. అదే సమయంలో ఆ పొలంలో టేకు చెట్లు లేవని కొంత మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. టేకు చెట్లు లేవని బట్టబయలు కావడంతో అప్పట్లో పొలంతో పాటు చీనీ చెట్లకు నష్టపరిహారం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే అవకాశంగా భావించి తమ పొలంలో టేకు చెట్లు ఉన్నాయని, వాటికి అప్పట్లో రేట్లు వేయలేదని తిరిగి ఫైల్ కదిలించారు. అధికార బలంతో అధికారులను దారికి తెచ్చుకుని పరిహారం కొట్టేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇతర రైతుల పొలాల్లో కొట్టేసిన టేకు చెట్లు, కొమ్మలను ట్రాక్టర్లలో తెచ్చి పొలంలో గుంతలు తీసి పాతారు. వీటికి ఫారెస్టు అధికారులతో రేట్లు కూడా వేయిస్తున్నారు. ఇక త్వరలో పరిహారం పొందడమే తరువాయి. ఈ తరుణంలో ఇలా నాటిన చెట్లలో కొన్ని కర్రలు కూడా ఉండటంతో బండారం మరోసారి బయటపడింది. విషయం తెలియగానే ‘సాక్షి’ మంగళవారం అక్కడకు వెళ్లింది. ఆ కర్రలను ఫొటో తీస్తుండగా ‘తమ్ముడు’ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ‘గతంలో టేకు చెట్లు ఉండేవి. నీళ్లొచ్చి పోయినాయి. ఇపుడు కొమ్మలు తెచ్చి నాటుకున్నాం. ఇందులో తప్పేం ఉంది అంటూ సమర్థించునే యత్నం చేశారు. అధికారం ఉంది కదా అని ఇంతగా బరితెగించి ప్రభుత్వ సొమ్మును కాజేయడానికి పన్నాగం పన్నడంపై జనం విస్తుపోతున్నారు. -
ఏమిటీ డ్రామా..?
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టు (ఐడబ్ల్యూఎంపీ) అవినీతికి చిరునామాగా మారుతోంది. ఉన్నతాధికారుల పట్టింపులేనితనం... ద్వితీయ శ్రేణి అధికారుల కుమ్మక్కు ఫలితంగా ప్రాజెక్టు అధికారుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అధికారులు కొందరు తమ సొంత వాహనాల్లోనే తిరుగుతూ బినామీ పేర్లపై బిల్లులు ఎత్తుతున్నారు. ఒకవేళ వాహనం ఎవరిదైతేనేమి, ఎలాగూ ఏదో ఒక వాహనాన్ని అద్దెకు తీసుకోవాల్సిందే కదా అని సమాధానపరిచే మాటలు మాట్లాడినా.. తిరుగుతున్న కిలోమీటర్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. చూడడానికి చిన్నవిషయంగా కనిపిస్తున్నా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. డ్వామా పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టులో భాగంగా వాటర్‌షెడ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వీటి పర్యవేక్షణకు జిల్లాలో 9 ప్రాజెక్టులున్నాయి. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో ప్రాజెక్టు అధికారుల (పీఓ)కు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. నెలకు 2500 కిలోమీటర్ల పరిమితితో రూ.24వేలు అద్దె చెల్లించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వీరిలో అత్యధికులు తమ సొంతూళ్ల నుంచి పనిచేసే చోటుకు నిత్యం వస్తూ పోతున్నారు. వాస్తవానికి పనిచేసే చోటే నివాసం ఉండాలి. కానీ, నిత్యం తిరగడం వల్ల వాహనాలు తిరిగే కిలోమీటర్లు పెరిగిపోతున్నాయి. తమ సొంత వాహనాలకు బినామీ పేర్ల మీద కొందరు బిల్లులు ఎత్తేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో పీఓలకు డ్వామాలోని ఓ ద్వితీయశ్రేణి అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. నల్లగొండ పీఓ వినియోగిస్తున్న వాహన యజమాని పేరు జలందర్‌రెడ్డి కాగా, అద్దె మాత్రం పి.కృపాదానం అనే వ్యక్తి పేరున చెల్లించారు. ఆరా తీస్తే సదరు కృపాదానం అనే వ్యక్తి కూతురే నల్లగొండ పీఓ అని తేలింది. ఈ వాహనం తిరిగిన కిలోమీటర్ల రీడింగుల్లోనూ అన్నీ తప్పులే. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదురు సందులో ఉన్న పీఓ కార్యాలయం నుంచి తెలుగు మహిళా ప్రాంగణ సమీపంలోని డ్వామా ఆఫీసులో అడిషనల్ పీడీ సమావేశానికి వెళ్లి రావడానికి 30 కిలోమీటర్లు తిరిగినట్లు ఒక రోజు, మరో రోజు ఏకంగా 45 కిలోమీటర్లు చూపించారు. నల్లగొండ నుంచి కనగల్ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి రావడానికి 72 కిలోమీటర్లు, అదే తహసీల్దార్ కార్యాలయానికి అయితే ఏకంగా 98 కిలోమీటర్ల రీడింగ్ చూపించారు. ఒకే ఊళ్లో ఉన్న రెండు ఆఫీసుల మధ్య దూరం 26 కిలోమీటర్లు ఉంటుందా అన్నది అధికారులకే తెలియాలి. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తికి మన టీవీ కార్యక్రమం కోసం వెళ్లి రావడానికి 68 కిలోమీటర్లు అయ్యిందట. దేవరకొండ పీఓ వాహన రీడింగుల్లోనూ కావాల్సినన్ని తప్పులు ఉన్నాయి. దేవరకొండ నుంచి నల్లగొండ ఆఫీసుకు మీటింగ్‌కు వచ్చిపోతే ఏకంగా 210 కిలోమీటర్లు తిరిగినట్లు రీడింగ్ చూపించారు. కానీ దేవరకొండ నుంచి నల్లగొండకు మహా అయితే 55 కిలోమీటర్లు మాత్రమే. ఇక, దేవరకొండ నుంచి హైదరాబాద్ ఆఫీసుకు సమావేశాల నిమిత్తం వెళ్లి వస్తే 350 కిలోమీటర్ల రీడింగ్ రాశారు. వాస్తవానికి దేవరకొండ నుంచి హైదరాబాద్ కేవలం 107 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్, లోకల్‌గా తిరిగినా 250కిలోమీటర్లు దాటకూడదు. నాంపల్లి పీఓ సైతం ఒకే గ్రామాలకు వేర్వేరు తేదీల్లో ప్రయాణించి కిలోమీటర్లు వేర్వేరుగా చూపించారు. తేదీలు మారితే, నెల మారితే తిరిగిన దూరం కూడా మారిపోయింది. కుర్మేడు, వింజమూరుకు వె ళ్లి నాంపల్లికి తిరిగి రావడానికి ఒకసారి 126 కి.మీ., ఇవే గ్రామాలకు మరో రోజు 195 కి.మీ.గా పేర్కొన్నారు. అదే మాదిరిగా, తక్కల్లపల్లి, కుర్మేడుకు పోయిరావడానికి ఒకసారి 2కి.మీ, ఇదే గ్రామాలకు మరోసారి 194కి.మీగా చూపించారు. ఇదేలా సాధ్యమో వారికే తెలియాలి..ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న వాటర్ షెడ్ కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగం దండిగా జరుగుతోం దన్న ఆరోపణలకు వాహనాల అద్దె చెల్లింపులు, సొంత వాహనాల్లో తిరుగుతూ ఇష్టానుసారం రాస్తు న్న రీడింగులు ఓ ఉదాహరణగా నిలుస్తున్నాయి. పనిచేసేది ఒకచోట... ఉండేది మరోచోట నల్లగొండ ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి నల్లగొండకు రాకపోకలు సాగిస్తున్నారు. తిప్పర్తి ప్రాజెక్టు అధికారి మోత్కూరు నుంచి నిత్యం వచ్చి పోతున్నారు. దేవరకొండ పీఓ సైతం మోత్కూరు నుంచి దేవరకొండ షటిల్ సర్వీసు చేస్తున్నారు. నాంపల్లి ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి అప్‌డౌన్ చేస్తున్నారు. ఇలా నిత్యం తిరగడానికి వారు వాడుతోంది అద్దె (సొంత) వాహనాలే. క్షేత్ర స్థాయి పర్యటనలకు మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను సొంతానికి వాడుతూ వేలాది రూపాయలు బిల్లుల రూపం లో తీసుకుంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఐడబ్ల్యూఎంపీ పీఓల చేతివాటం ఔరా అనిపిస్తోంది. -
కట్టాల్సిందే!
పొద్దుటూరు: స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణాల మాఫీ జాప్యం కావడంతో ఓ వైపు బ్యాంకర్లు, మరో వైపు సంబంధిత అధికారులు పొదుపు సంఘాల వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం రుణాలు చెల్లిస్తుందో లేదో తమకు సంబంధం లేదని బకాయిలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరికొందరు అధికారులు ఇంకా ముందుకెళ్లి రాజధాని నిర్మాణానికే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అలాంటప్పుడు మీ బకాయిలు చెల్లిస్తారన్న గ్యారంటీ ఏముందని పొదుపు సంఘాల వారిని నయానా భయానా హెచ్చరిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే మీ సంఘాలు మనుగడలో లేనట్లేనని చెబుతున్నారు. దీంతో పొదుపు సంఘాలకు చెందిన మహిళలు అధికారుల ఒత్తిడి భరించలేక బకాయిలు చెల్లిస్తున్నారు. కొన్ని సంఘాల వారు బకాయిలు చెల్లించలేదని బ్యాంకర్లు ఏకంగా ఆ సంఘాలకు సంబంధించిన సేవింగ్స్ ఖాతాలోని డబ్బును జమ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పేదల నిర్మూలన పథకం (మెప్మా) పరిధిలో 2300 పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.22 కోట్లు, 2014-15 సంవత్సరంలో రూ.20 కోట్లు బ్యాంక్ లింకేజి కింద మహిళలు రుణాలు తీసుకున్నారు. పట్టణ పరిధిలోని 16 బ్యాంక్‌ల నుంచి వీరు రుణాలు పొందారు. కాగా ఎన్నికల హామీల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెల నుంచి మహిళలు రుణాలు చెల్లించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసం మహిళలంతా ఎదురు చూశారు. ప్రమాణ స్వీకారం రోజున రుణ మాఫీ సంతకం పెడతారని భావించారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పొదుపు సంఘాల రుణాల మాఫీపై సంతకం చేసినా స్పష్టత లేదు. ఎప్పటి నుంచి రుణ మాఫీ అమలవుతుంది, ఎంత రుణం మాఫీ అవుతుంది తదితర విషయాలు తేలాల్సి ఉంది. ఈ విషయంపై కమిటీ వేయడంతో ఇప్పుడే రుణాల మాఫీ అమలు కాదని స్పష్టమైంది. ఇదిలావుండగా తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం 3 నెలలలోగా తీసుకున్న రుణం చెల్లించకపోతే మీ సంఘం నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ (ఎన్పీఏ) కిందికి వెళుతుందని, అలా వెళితే మీ సంఘం నష్టపోతుందని’ చెబుతున్నారు. అలాగే రుణాల మాఫీ తేలకపోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలు మంజూరు చేయడం లేదు. కాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని సంబంధిత అధికారులు కూడా పొదుపు సంఘాలపై బకాయిలు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రికవరి 98 శాతం ఉండటంతో గత మూడేళ్లుగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు రుణాలు చెల్లించాలని మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే పలు సంఘాలకు సంబంధించి సేవింగ్స్ ఖాతాలోని సొమ్మును బకాయిల కింద జమ చేసుకున్నారు. సంఘాలు ఎన్పీఏ పరిధిలోకి వెళతాయి తీసుకున్న రుణాన్ని మూడు నెలలలోపు చెల్లించకపోతే సంఘాలు నాన్ ఫర్ఫార్మెన్స్ అకౌంట్ పరిధిలోకి వెళతాయి. దీని వలన ఆ సంఘానికి ఇచ్చే రుణం కూడా తగ్గుతుంది. బకాయిలు చెల్లించాలని సంఘాలకు చెప్పిన మాట వాస్తవమే. - కెజియా జాస్లిన్, పావర్టి రీసోర్స్ పర్సన్ రుణం చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు తీసుకున్న రుణం చెల్లించమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాఫీ అవుతుందో లేదో అన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తపరుస్తున్నారు. దీంతో రుణం చెల్లించేందుకు సిద్ధమవుతున్నాం. - నాగసుబ్బమ్మ, వీరభద్ర స్వయం సహాయక సంఘం లీడర్ అందరికీ చెప్పారు ఇటీవల స్వయం సహాయక సంఘాల సమావేశంలో అధికారులు బకాయిలు చెల్లించాలని అందరికీ చెప్పారు. అలా చెల్లిస్తేనే రుణాలు ఇస్తారని చెబుతున్నారు. దీంతో రుణం చెల్లించాల్సి వస్తోంది. - జే.వెంకటలక్షుమ్మ, నరసింహ స్వయం సహాయక సంఘం