మార్క్‌‘ఫ్రాడ్‌’ | Loans taken from a national bank are deposited in a private bank | Sakshi
Sakshi News home page

మార్క్‌‘ఫ్రాడ్‌’

Published Wed, Aug 30 2023 3:01 AM | Last Updated on Wed, Aug 30 2023 3:01 AM

Loans taken from a national bank are deposited in a private bank - Sakshi

ఆయన ఓ మార్క్‌ఫెడ్‌ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్‌ బ్యాంకు భరించింది.  

మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం.  

సాక్షి, హైదరాబాద్‌: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్‌ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్‌ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్‌ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్‌ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్‌లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్‌ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్‌ బ్యాంకుల్లోనే పెడుతోంది.  

ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు  
2022–23లో ఫెర్టిలైజర్స్‌ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్‌ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు.

కమీషన్లు... బహుమతులు.. టూర్‌ ప్యాకేజీలు
వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్‌ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్‌ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్‌ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్‌ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది.

వాస్తవంగా ప్రైవేట్‌ బ్యాంకులు షెడ్యూల్డ్‌ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్‌ ఎవరికోసం మార్క్‌ఫెడ్‌ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్‌ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు.

ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్‌ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్‌ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్‌ బ్యాంకుల్లో పెట్టి  కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది.

ఇక్కడ రుణాలు...అక్కడ జమ

  •  మార్క్‌ఫెడ్‌ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్ప­త్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది.  
  • అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న.  
  • పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్‌ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు.  
  •  కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్‌ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు.  
  • ఇలా ఒక ప్రైవేట్‌ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి.  
  • ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్‌ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్‌ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement