మళ్ళీ నామినేషన్ దందా షురూ! | Punganur Branch Canal Lining Work Handed Over to NCC | Sakshi
Sakshi News home page

మళ్ళీ నామినేషన్ దందా షురూ!

Published Mon, Feb 3 2025 4:16 AM | Last Updated on Mon, Feb 3 2025 4:16 AM

Punganur Branch Canal Lining Work Handed Over to NCC

రూ.480.22 కోట్ల పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు ఎన్‌సీసీకి అప్పగింత

రూ.1,929 కోట్లతో ఈ కెనాల్‌ వెడల్పు చేసే పనులు చేపట్టిన గత ప్రభుత్వం 

అవి పూర్తికాక ముందే అందులో రూ.711.51 కోట్లు మిగిలాయంటూ వింత లెక్కలు 

నిబంధనలకు విరుద్ధంగా ఆ పనులను నామినేషన్‌పై కట్టబెట్టిన కూటమి ప్రభుత్వ పెద్దలు 

భారీఎత్తున కమీషన్లు చేతులు మారాయంటున్నఅధికార వర్గాలు 

ఈ అక్రమాలను కప్పెట్టుకోవడానికి కేబినెట్‌తో ఆమోదముద్ర  

2014–19 మధ్య పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.2,917 కోట్ల విలువైన పనులు నవయుగకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు 

సాక్షి, అమరావతి: రూ.లక్ష లోపు అంచనా ఉన్న పనులను ఈఈ.. రూ.2 లక్షల్లోపు పనులను ఎస్‌ఈ.. రూ.3 లక్షల్లోపు పనులను సీఈ నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభు­త్వ నిబంధన. అదీ వరదలు, కరువు వంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్‌ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్య­లు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్‌ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. 

కానీ, ఈ నిబంధనను నిక్కచ్చిగా అమలుచేయాల్సిన ప్రభుత్వమే దాన్ని నిలువునా పాతరేసింది. రూ.లక్ష కాదు, రూ.2 లక్షలు కాదు.. ఏకంగా రూ.480.22 కోట్ల విలువైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులను ఎన్‌సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇవి యు­ద్ధ­ప్రాతిపదికన పూర్తిచేయా­ల్సినవి కావు. 

అయినా, నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఎన్‌సీసీ సంస్థకు అప్పగించడం వెనుక భారీఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలను కప్పెట్టుకోవడానికి కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించడం గమనార్హం. 

అక్రమాల దందా పునరావృతం
అస్మదీయులకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకోవడం 2014–19 మధ్య ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్‌ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్‌ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడాలేవు. 

కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది. ఇప్పుడూ అదే రీతిలో నామినేషన్‌ దందాకు తెరతీసింది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని కూడా నామినేషన్‌పై కట్టబెట్టకపోవడం గమనార్హం.  

పూర్తికాక ముందే నిధులు మిగులా?.. 
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2014–19 తరహాలోనే మళ్లీ నామినేషన్‌ దందాకు తెరతీసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ పనులను ఇందుకు వేదికగా చేసుకుంది. నిజానికి.. ఈ కెనాల్‌ను 79.6 కిమీ నుంచి 220.35 కిమీ వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021, సెపె్టంబరు 4న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతిచ్చింది. 

ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023, ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్‌సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో మిగిలాయాన్నది తేల్చవచ్చు.

కానీ.. ఇక్కడ పూర్తికాక ముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందంటూ తేల్చడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌కు 75.075 కిమీ నుంచి 207.80 కిమీ వరకూ లైనింగ్‌ చేసే పనులను నామినేషన్‌ పద్ధతిలో ఎన్‌సీసీ సంస్థకు కట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశించారు. దాంతో ఆ పనులను ఎన్‌సీసీకి అప్పగిస్తూ జలవనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement