పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలనే సంప్రదాయానికి చంద్రబాబు తిలోదకాలు
ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా ఉండేందుకు అడుగడుగునా చర్యలు
అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడకుండా చేయడమే కూటమి లక్ష్యం
అధికారంలో ఉన్నవాళ్లే పీఏసీ కూడా తీసుకుంటే ప్రజల గురించి అడిగేవారెవరు?
ప్రతిపక్ష సభ్యుడు ఎన్నికవకుండా అన్ని స్థానాలకు నామినేషన్లు వేసిన కూటమి
శాసనసభ చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి నేడు ఎన్నిక..
వైఎస్సార్‌సీపీ సభ్యుల నామినేషన్‌సమయంలోనూ హైడ్రామా..
పీఏసీ పదవికి నామినేషన్ వేసే సమయంలో అందుబాటులోని లేని అసెంబ్లీ సెక్రటరీ జనరల్
గంటన్నరపాటు ఎదురుచూసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాక నామినేషన్ స్వీకరణ
సాక్షి, అమరావతి: పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి రాకుండా చేసి శాసనసభ వ్యవహారాల్లో అనాదిగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారు. పారదర్శకత ఉండాలంటే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు ఉండటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం.
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి ఇవ్వాల్సిన పదవిని కూడా తమ కూటమికే దక్కేలా అన్ని స్థానాలకు తమ సభ్యులతో నామినేషన్లు వేయించి ఎన్నిక జరిగేలా చేశారు. దీంతో శాసనసభ చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి ఎన్నిక అనివార్యమైంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులకు అవకాశం ఉండగా.. 9 ఎమ్మెల్యేల తరఫున, మూడు ఎమ్మెల్సీల తరఫున ఎన్నికవ్వాల్సి ఉంది.
ఎమ్మెల్సీల తరఫున ఉన్న మూడు స్థానాలకు కేవలం మూడు నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 స్థానాలకు 10 నామినేషన్లు దాఖలవడంతో ఎన్నిక తప్పనిసరైంది. 9 స్థానాలకు కూటమి తరఫున 9 నామినేషన్లు, వైఎస్సార్‌సీపీ తరఫున ఒక నామినేషన్ (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) దాఖలవడంతో శుక్రవారం ఎన్నిక నిర్వహించనున్నారు.
ఆనవాయితీకి చెల్లుచీటీ
పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్ష పార్టీకి వదిలిపెట్టాలనే సంప్రదాయం పార్లమెంటు నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ కొనసాగుతోంది. అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి వస్తుందని ఈ సంప్రదాయాన్ని తెచ్చారు. ప్రతిపక్షానికి పీఏసీ కేటాయించాలనేది ప్రజాస్వామిక స్ఫూర్తి.
కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా, పీఏసీ కూడా వారికి ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రజల గొంతు ఏమాత్రం వినపడకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా తామే చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లే పీఏసీ తీసుకుంటే ఇక ప్రజల తరఫున మాట్లాడేవాళ్లే ఉండరనే దుర్బుద్ధితోనే దాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. పీఏసీ అనే దానిలోనే పబ్లిక్ అనే పదం ఉంది. అంటే ప్రజలకు సంబంధించిన పదవి అని అర్థం. ప్రతి అంశం పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరిగింది.
నామినేషన్ దాఖలులో హైడ్రామా
మరోవైపు పీఏసీ సభ్యత్వాలకు వైఎస్సార్‌సీపీ సభ్యులు నామినేషన్లు వేసే సమయంలోనూ హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సివుండగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ సమయంలో అందుబాటులో లేకుండాపోయారు. పీఏసీ సహా ఇతర రెండు కమిటీల సభ్యత్వాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు సెక్రటరీ జనరల్ చాంబర్‌కి వెళ్లారు. కానీ.. ఆ సమయంలో ఆయన కావాలని అసెంబ్లీలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది.
సాధారణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారి (సెక్రటరీ జనరల్) తన చాంబర్‌లో అందుబాటులో ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించాలి. కానీ.. సమయం దాటిపోయే వరకూ నామినేషన్లు తీసుకోకుండా ఉండేందుకే ఆయన దురుద్దేశంతో అసెంబ్లీలో ఉండిపోయినట్టు సమాచారం. గంటన్నరపాటు ఎదురుచూసినా ఆయన రాకపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు.
సెక్రటరీ జనరల్ దురుద్దేశపూర్వకంగా చాంబర్‌లోకి రావడంలేదనే విషయం తెలుసుకుని ఆయన కూడా చాంబర్ వద్దకెళ్లారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోకుండా ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న మరో చాంబర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటంతో ఆయన్ను కూడా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు.
దీంతో అచ్చెన్నాయుడు వెంటనే అసెంబ్లీలోకి వెళ్లి సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌ను బయటకు పంపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కొద్ది నిమిషాలు ఉందనగా.. సెక్రటరీ జనరల్ హడావుడిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ సభలోనే ఉంటే నామినేషను దాఖలుకు అవకాశం ఇవ్వకుండా చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా చేసి ఉంటే..
2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి ఇచ్చారు.
అప్పట్లో వైఎస్సార్‌సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించారు.
సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సంప్రదాయాలకు గండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment