డిమాండ్ వారిదే.. వారించేదీ వారే
దావోస్‌లో చంద్రబాబు ఎదుటే మంత్రి భరత్ వ్యాఖ్య
టీడీపీ పెద్దల డ్రామాపై జనసేన శ్రేణుల మండిపాటు
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు చేసిన హడావుడితో కూటమిలో కాక రేగడంతో సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడొద్దంటూ దావోస్ నుంచి పార్టీ నేతలను హెచ్చరించారు. తన సమక్షంలోనే పార్టీ నేతలు ఈ డిమాండ్ చేసినప్పుడు స్పందించని చంద్రబాబు... రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితి ఉండడంతో దావోస్ నుంచి స్పందించడం గమనార్హం. మరోవైపు ఇదే వేదికగా మంత్రి టీజీ భరత్ మరో అడుగు ముందుకేసి కాబోయే సీఎం లోకేశేనని తాజాగా వ్యాఖ్యానించడం టీడీపీ పెద్దల రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది.
డిప్యూటీ కాదు.. కాబోయే సీఎం
టీడీపీ పెద్దల రాజకీయాలు కూటమి పార్టీల్లో రక్తి కట్టిస్తున్నాయి. డిమాండ్ చేసేదీ.. వార్నింగ్‌లు ఇచ్చేదీ పచ్చ నేతలేనని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. లోకేశ్‌ని డిప్యూటీ సీఎంగా చేయాలని నాలుగు రోజులుగా టీడీపీ నేతలు పోటీలు పడి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో మొదలైన ఈ డిమాండ్ల పర్వం.. తాజాగా దావోస్‌కి చేరింది. కాబోయే సీఎం లోకేశేనని మంత్రి టీజీ భరత్ ప్రకటించేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి ఇదంతా టీడీపీ పెద్దలు ఆడుతున్న డ్రామాగా స్పష్టమవుతోంది.
స్పందన తెలుసుకునేందుకే..
లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి.. సీఎం చంద్రబాబు ఎదుటే డిమాండ్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు వారించలేదు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఇదే పల్లవి వినిపించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ఈ అంశం హోరెత్తుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. దీన్నిబట్టి ఆయన ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు ఈ డిమాండ్లు చేస్తున్నట్లు వెల్లడైంది. తనయుడికి ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధమై కూటమిలో నేతల స్పందన తెలుసుకునేందుకే తన పార్టీ నేతలతో డిమాండ్లు చేయించినట్లు తెలుస్తోంది. జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కూటమిలో చిచ్చు రగిలే పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా రూటు మార్చారు. ఇదంతా చంద్రబాబు, ఆయన తనయుడు ఆడిస్తున్న నాటకాలేనని జనసేన నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
జన సైనికులు ‘రివర్స్’..
టీడీపీ నేతల డిమాండ్లపై జనసేనకు నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన విశ్వం రాయల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు తమ నేత పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలనే వాదన వినిపించారు. పవన్ సీఎం కావాలని తమకు కోరిక ఉన్నట్లు తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చెప్పారు. సోషల్ మీడియాలో ఇది రెండు పార్టీల మధ్య పెద్ద వార్‌గా మారిపోయింది. లోకేశ్ డిప్యూటీ సీఎం ఏంటని జనసేన శ్రేణులు సెటైర్లు వేస్తుంటే.. పవన్‌కు సీఎం పదవా? ఆయనకు అంత సీనుందా? అంటూ టీడీపీ నేతలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment