జోనల్ స్థాయి అధికారులతో సమావేశాలు ప్రారంభం
‘జీవో 117 రద్దు’ మార్గదర్శకాలపై అవగాహన పేరుతో 11 ప్రాంతాల్లో నిర్వహణ
ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి లేదు
510 హైస్కూల్ ప్లస్‌లు రద్దు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ ప్రకటన
1,830 మంది పీజీటీల భవితవ్యం తేల్చని విద్యాశాఖ
ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు.. తీవ్ర ఆందోళన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దికరణ(రేషనలైజేషన్)కు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జీవో నంబర్ 117 రద్దు చేసిన అనంతరం చేపట్టే చర్యల కోసం రూపొందించిన మార్గదర్శకాలపై జోనల్ స్థాయిలో అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో జరిగే ఈ సమావేశాల్లో జిల్లా, మండల, క్లస్టర్ స్థాయి అధికారులు పాల్గొంటారు.
ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా తేదీలు, వేదికలను నిర్ణయిస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి ఇవ్వలేదు. కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలపై తమకున్న అనేక అనుమానాలను నివృత్తి చేయకుండానే ప్రభుత్వం పాఠశాలల హేతుబద్దికరణ దిశగా ముందుకెళుతుండటంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా ప్రభుత్వ చర్యలు
⇒ గత ప్రభుత్వం జీవో నంబర్ 117 ప్రకారం నాణ్యమైన బోధన కోసం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలో మీటరు లోపు దూరంలో ఉన్న 3,348 ప్రాథమికోన్నత, హైస్కూళ్లల్లో విలీనం చేసింది. ఇలా 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతుల విద్యార్థులను కిలో మీటరు దూరంలోని ఆయా స్కూళ్లకు పంపింది. అలాగే దాదాపు 8 వేల మంది అర్హత గల ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి ఉన్నత పాఠశాలల్లో నియమించింది.
⇒ అయితే, 2025–26 విద్యా సంవత్సరం నుంచి 3,348 ప్రాథమికోన్నత, హైస్కూళ్లల్లో ఉన్న 3–5 విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చి మోడల్, ప్రైమరీ స్కూళ్లల్లో చేరుస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆయా హైస్కూళ్లల్లో పనిచేస్తున్న 8 వేల మంది స్కూల్ అసిస్టెంట్లను ఏం చేస్తారో తేల్చలేదు.
⇒ గత ప్రభుత్వం మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా హైస్కూల్ ప్లస్‌లను ఏర్పాటు చేసింది. దీనికోసం మండల స్థాయిలో ఎన్‌రోల్‌మెంట్ ఎక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్చి ఇంటర్ విద్యను ప్రారంభించింది. మొదటి విడతలో 292, రెండో విడతలో 218... మొత్తం 510 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ పాఠశాలల్లో ఇంటర్ సిలబస్ బోధన కోసం 1,850 సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను పీజీటీలుగా నియమించింది.
⇒ ప్రస్తుత చందబ్రాబు ప్రభుత్వం హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, అక్కడ చదువుతున్న విద్యార్థులను ఎక్కడ చేరుస్తారో చెప్పలేదు. అలాగే, 1,850 మంది హైస్కూల్ ప్లస్‌లలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను ఏం చేస్తారో కూడా వివరణ ఇవ్వలేదు.
⇒ జీవో నంబర్ 117 ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ప్రస్తుతం 88 మంది విద్యార్థులు దాటితే మూడో సెక్షన్‌గా పరిగణిస్తున్నారు. కానీ, కొత్త మార్గదర్శకాల ప్రకారం 94 మంది విద్యార్థులు దాటితేనే మూడో సెక్షన్‌గా గుర్తిస్తారు. అంటే కేవలం ఆరుగురు విద్యార్థుల తేడాతో రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మూడో సెక్షన్ తగ్గిపోయి వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు సర్‌ప్లస్‌గా మిగులుతారు.
⇒ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను కూడా మండల విద్యాశాఖ అధికారులుగా నియమించాలని ఎన్నో దశాబ్దాలుగా ఆ విభాగం టీచర్లు ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నారు. వారి అభ్యర్థనను గౌరవించి గత ప్రభుత్వం కొత్తగా 680 ఎంఈవో–2 పోస్టులను మంజూరు చేసి జెడ్పీ ప్రధానోపాధ్యాయులను ఆ పోస్టుల్లో నియమించింది. ప్రస్తుత ప్రభుత్వం ఎంఈవో–2 పోస్టులను సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో 680 మందిని తిరిగి హెచ్‌ఎంలుగా నియమిస్తే... మరో 680 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయ పదోన్నతులు ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment