
గుంటూరు కేంద్రంగా ఎయిర్ ట్యాక్సీల తయారీ
క్యాబ్ ఖర్చుతోనే గగన ప్రయాణం.. తొలి అడుగు వేసిన మాగ్నమ్ వింగ్స్
అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగం..
అనుమతులు వస్తే ఎయిర్ ట్యాక్సీల సందడి
రోడ్డుపై ఆటో లేదా ట్యాక్సీ ఎక్కినట్టుగానే.. ఎయిర్ ట్యాక్సీ ఎక్కి గాలిలో ప్రయాణించే సదుపాయం మనకూ ఆందుబాటులోకి రాబోతోంది. చైనా, దుబాయ్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎయిర్ ట్యాక్సీలు భవిష్యత్‌లో ఏపీలోనూ సందడి చేయనున్నాయి. గుంటూరుకు చెందిన ఓ యువకుడు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. మోటార్లు మినహా పరికరాలన్నీ మేడిన్ ఆంధ్రా కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని గుంటూరుకు చెందిన ఓ యువకుడు మన దేశంలోనూ సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారు. ‘మాగ్నమ్ వింగ్స్’ కంపెనీ పేరిట కంపెనీ నెలకొల్పి ఎయిర్ ట్యాక్సీల తయారీ ప్రారంభించారు.
తొలి ఎయిర్ ట్యాక్సీ సంస్థగా..
ఏపీలో ప్రప్రథమంగా మాగ్నమ్ వింగ్స్ తొలి ఎయిర్ ట్యాక్సీ సంస్థగా ఆవిర్భవించింది. గుంటూరులోని ఏటుకూరు రోడ్డు కేంద్రంగా 2018లో చావా అభిరామ్ దీనిని ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్‌లోని రోబోటిక్స్ యూనివర్సిటీ ఆఫ్ యూటాలో ఉన్నత విద్యను అభ్యసించిన అభిరామ్.. అక్కడే మంచి ఉద్యోగాలు వచ్చినా స్థిరపడకుండా సొంత గడ్డపై పరిశ్రమ స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మాగ్నమ్ వింగ్స్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలి ఎయిర్ ట్యాక్సీ ఏపీలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయాలు, నగరాలకు వేగవంతమైన కనెక్షన్, అత్యవసర వైద్య సేవల కోసం వినియోగించేందుకు అధునాతన పరికరాలు సిద్ధం చేస్తున్నారు.
రెండు, మూడు సీట్లతో..
పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా ఎయిర్ ట్యాక్సీని రూపొందించి∙మాగ్నమ్ వింగ్స్ విజయవంతంగా ప్రయోగించింది. అయితే, పైలట్ లేని వాటిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించదు కాబట్టి.. పైలట్ కూడా ఉండేలా రెండు లేదా మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నారు. రెండు సీట్లతో ఒక ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీ–2 అని పేరు పెట్టారు. దీని ప్రయోగం విజయవంతం కావడంతో రెండో వెర్షన్ తయారీలో నిమగ్నమయ్యారు. మూడు సీట్లతో కూడిన ఎక్స్–4 అనే మోడల్‌ను మరో నెల రోజుల్లో పరిశీలించనున్నారు.
తక్కువ ఖర్చుతోనే ప్రయాణం
వీ–2 రకం వెయ్యి అడుగుల ఎత్తులో గరిష్టంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఎక్స్–4 ఎయిర్ ట్యాక్సీ 300 కిలోమీటర్ల దూరాన్ని 20 వేల అడుగుల ఎత్తులో 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దూర ప్రయాణాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మార్కెట్‌లోకి వచ్చేసరికి వీ–2 మోడల్ ధర రూ.2 కోట్లు, ఎక్స్–4 రకం రూ.8 కోట్లు ఉండొచ్చని అభిరామ్ చెప్పారు. క్యాబ్ ఖర్చుతోనే ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం అందుబాటులోకి తీసుకు రావాలనేది తన లక్ష్యమని ఆయన తెలిపారు. తమ వాహనాలు బ్యాటరీ సహాయంతోనే నడుస్తాయని, ఆకాశ మార్గంలో దూరం తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చు సైతం పెద్దగా ఉండదని వివరించారు.
అనుమతులే తరువాయి
మనదేశంలో బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సైతం ఎయిర్ ట్యాక్సీలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎయిర్ ట్యాక్సీ పాలసీ ఇంకా ముసాయిదా (డ్రాఫ్టింగ్) దశలోనే ఉంది. విధి విధానాలు అందుబాటులోకి వస్తే అనుమతుల ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చు.
మాగ్నమ్ వింగ్స్ సంస్థ ద్వారా ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కావాలనుకున్న వారికి వాటిని విక్రయిస్తామని మాగ్నమ్ వింగ్స్ సీఈవో చావా అభిరామ్ చెప్పారు. అనుమతులు లభించిన వెంటనే విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో విమానాశ్రయ కనెక్షన్, అత్యవసర వైద్య సేవలు ప్రారంభిస్తామన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఈ సేవలను విస్తరించేందుకు యోచిస్తున్నట్టు పేర్కొన్నారు.
సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా..
పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మా ఎయిర్ ట్యాక్సీలు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు. అత్యవసర వైద్య సేవలు, వైద్యులు, రోగుల రవాణా, మెడికల్ సపోర్ట్ డెలివరీ వంటి సేవల ద్వారా వేలాది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. భద్రత మా తొలి ప్రాధాన్యత. సింగిల్, డబుల్, త్రిబుల్, ఫైవ్ సీటర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. వైమానిక విప్లవానికి నాంది పలికేందుకు పాటుపడుతున్నాం. – చావా అభిరామ్, సీఈవో, మాగ్నమ్ వింగ్స్
ప్రయోజనాలివీ..
» కారుతో పోలిస్తే 70% తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేయగలదు.
» రోడ్డు ప్రయాణం సుమారు 100 కిలోమీటర్లు ఉంటే.. ఎయిర్ ట్యాక్సీ 50 కిలోమీటర్లలోపే గమ్యాన్ని చేరుకుంటుంది.
» నగరాల మధ్య తక్కువ దూరంలోనే ప్రయాణించగలదు. 40 కి.మీ. పరిధిలోని ప్రయాణాలను కేవలం 10–15 నిమిషాల్లో పూర్తి చేయగలదు.
» ప్రయాణ చార్జీలు ఓలా, ఉబర్ క్యాబ్ ధరలకు సమానంగా ఉండేలా రూపొందించబడింది.
» కిలోమీటరుకు సుమారు రూ.50 చార్జీ అయ్యే అవకాశం.
» పర్యావరణహితంగా పూర్తిగా ఎలక్ట్రిక్ టెక్నాలజీతో నడిచే ఇవి కార్బన్ ఎమిషన్ లేకుండా శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
» అత్యున్నత భద్రతా ప్రమాణాలు, బహుళ రిడండెన్సీ వ్యవస్థలు, అత్యాధునిక ఆటోనమస్ ఫ్లైట్ మోడ్, మల్టీ–రోటర్ టెక్నాలజీతో భద్రతను మరింత మాగ్నమ్ వింగ్స్ మెరుగుపరిచింది.
» ఎమర్జెన్సీ సేఫ్టీ ఫీచర్లు, సేఫ్ బ్యాటరీ బ్యాకప్, ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సిస్టం, ప్రయాణికుల రక్షణ కోసం అధునాతన సెన్సార్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది.
» అత్యంత అత్యవసర వైద్యసేవల కోసం ఎయిర్ అంబులెన్స్‌లుగా కూడా ఎయిర్ ట్యాక్సీలు ఉపయోగపడతాయి.
» యాక్సిడెంట్, గుండెపోటు, ఇతర అత్యవసర చికిత్సల కోసం వైద్యులను తక్కువ సమయంలో ఆస్పత్రులకు చేర్చేందుకు ఉపయోగపడతాయి.
» మెడికల్ సపోర్ట్, అత్యవసర ఔషధాల డెలివరీ, బ్లడ్ బ్యాగ్స్, ఎంతో కీలకమైన అవయవ మార్పిడి కోసం అవసరమైన సపోర్టింగ్ సామగ్రిని ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఇతర దూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వేగంగా పంపించేందుకు సాయం చేస్తాయి.