2023 కన్నా 2024లో పెరిగిన భూగర్భ జలాల వినియోగం
అత్యధికంగా తోడేస్తున్న పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ ∙కేంద్ర భూగర్భజల మండలి నివేదికలో వెల్లడి
12,656.20 టీఎంసీలు: దేశవ్యాప్తంగా 2024లో భూగర్భజలాలుగా మారిన వర్షపునీరు
11,503.30 టీఎంసీలు: వినియోగించుకోదగిన భూగర్భజలాలు
6,956.52 టీఎంసీలు: ఉపయోగించుకున్న భూగర్భజలాలు
60 శాతం వినియోగించుకోదగ్గ జలాల్లో వాడుకున్నవి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ 2024లో భూగర్భజలాలు అపారంగా పెరిగాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవడంతో వర్షపు నీరు భారీగా భూమిలోకి ఇంకి భూగర్భజలంగా మారింది. దేశంలో 2024లో 12,656.20 టీఎంసీలు(446.9 బిలియన్ క్యూబిక్ మీటర్లు) మేర భూగర్భజలాలు పెరిగాయని కేంద్ర భూగర్భజల మండలి(సీజీడబ్ల్యూబీ) అంచనా వేసింది. ఇందులో 11,503.30 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అందులో 60 శాతం జలాలను వినియోగించుకున్నారని లెక్కగట్టింది. రాష్ట్రంలో 2024లో 787.30 టీఎంసీల మేర భూగర్భజలాలు పెరిగితే.. అందులో 223.17 టీఎంసీలను ఉపయోగించుకున్నారని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 2024లో భూగర్భజలాల పరిస్థితి అధ్యయనం చేసిన సీజీడబ్ల్యూబీ ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది.
సీజీడబ్ల్యూబీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ...
⇒ దేశంలో తొలి సారిగా 1980లో భూగర్భజలాల పరిస్థితిపై అధ్యయనం జరిగింది. ఆ తర్వాత 1995, 2004, 2009, 2011, 2013, 2017, 2020లలో భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. 2022 నుంచి ఏటా భూగర్భజలాల పరిస్థితిపై అంచనా వేస్తోంది.
⇒ దేశంలో కురిసే వర్షం వల్ల వచ్చే నీటిలో 61 శాతం భూమిలోకి ఇంకి, భూగర్భజలాలుగా మారుతున్నాయి.
⇒ 2023తో పోల్చితే 2024లో భూగర్భజలాల పరిమాణం కాస్త తగ్గింది. 2023లో భూగర్భజలాల పరిమాణం 12,717.95 టీఎంసీలు ఉంటే... అది 2024లో 12,656.20 టీఎంసీలకు తగ్గింది. ఇక భూగర్భజలాల వినియోగం 2023తో పోల్చితే 2024లో పెరిగింది. భూగర్భం నుంచి 2023లో 6,834.75 టీఎంసీలను... 2024లో 6,956.52 టీఎంసీలను వినియోగించుకున్నారు.
⇒ దేశంలో భూగర్భజలాలను పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, డయ్యూ డామన్, గుజరాత్‌లలో భారీ ఎత్తున తోడేసి ఉపయోగించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment