తాగునీటి కష్టాలు రానివ్వం
► రూ.19 కోట్లతో వేసవి కార్యాచరణ
► 197 ఆవాసాల్లో ప్రైవేటు బోర్లు అద్దెకు
► రెండు ఊళ్లకు బయటి నుంచి నీరు
► ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాంచంద్
సాక్షిప్రతినిధి, వరంగల్ : వేసవిలో నీటి ఎద్దడి నివారణపై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. వరుసగా రెండో ఏడాది కరువు వచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంత కిందికి వెళ్లాయి. గ్రామాల్లో మంచినీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంముందుగానే ప్రణాళిక రూపొందించిందని ఈ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎల్.రాంచంద్ తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలోని 195 ఆవాసాల్లో తాగునీటి ఇబ్బంది నెలకొందని, ఈ ప్రాంతాలకు స్థానికంగా ఉన్న 247 ప్రైవేటు బోర్లను కిరాయికి తీసుకుని తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి ప్రకారం నర్మెట మండల కేంద్రం, అంకుశాపూర్(బచ్చన్నపేట)లో తీవ్ర నీటి సమస్య ఉందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా మార్గంలో ఈ రెండు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కరువు నేపథ్యంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోసం ప్రత్యేకంగా రూ.17.27 కోట్లు కేటాయిందని ఎస్‌ఈ తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వ పరంగా ఉన్న నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బోరు బావులు, పైపులైన్ మరమ్మతు, పైపులైన్ల విస్తరణ, ఎండిపోయిన నీటి వనరుల పునరుద్ధరణ వంటి పనులను ఈ నిధులతో పూర్తి చేస్తామని తెలిపారు.
కరువు పరిస్థితి ఉన్న 11 మండలాల్లోని ప్రజల తాగునీటి ఇబ్బందులను అధిగించేందుకు విపత్తు సహాయ నిధి(సీఆర్‌ఎఫ్) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు విడుదల చేసిందని ఆయన వివరించారు. సీఆర్‌ఎఫ్‌లోని రూ. 1.54 కోట్లతో తాగునీటి సరఫరా కోసం 730 పనులు చేపట్టినట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ నిధుల కింద గత ఏడాది పనులు చేపట్టిన బిల్లుల కోసం ప్రభుత్వం రూ.3.97 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తున్నామని, రోజువారీగా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఈ రాంచంద్ చెప్పారు.