దేశంలో భూగర్భ జలాల్లో విషతుల్యమైన రసాయనాలు, ధాతువులు
రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా నైట్రేట్
17 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, 12 జిల్లాల్లో ఇనుము
7 జిల్లాల్లో పరిమితికి మించి ఆర్శనిక్
ప్రతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పరిమితికి మించి సోడియం కార్బొనేట్
ఈ నీరు సాగుకూ పనికిరాదు
భూగర్భ జల నాణ్యత నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర భూగర్భజల మండలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూగర్భ జలం గరళంగా మారిందా? బావులు, బోరు బావుల్లో ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగితే రోగాలు కొనితెచ్చుకున్నట్లేనా? 26 జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తాగడానికే కాదు.. సాగుకు కూడా భూగర్భ జలాలు పనికి రానంత విషతుల్యంగా మారాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది భూగర్భ జలాల నాణ్యత నివేదిక–2024. దేశవ్యాప్తంగా 2023లో వర్షాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం ముగిసిన తర్వాత కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) భూగర్భ జలాల నమూనాలను పరీక్షించి, వాటి నాణ్యతను తేల్చింది.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన రసాయనాలు పరిమితికి మించి చేరడం వల్ల విషతుల్యంగా మారాయని సీజీడబ్ల్యూబీ నివేదిక తేల్చింది. ఆర్శనిక్, యురేనియం, క్లోరైడ్, ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలతోపాటు ఇనుము వంటి లోహ ధాతువులు భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడించింది.
పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడం, వ్యవసాయంలో క్రిమి సంహారక మందులు, ఎరువులను అధిక మోతాదులో వినియోగించడం, పట్టణీకరణ పెరిగిపోవడంతో మురుగు నీటిని శుద్ధి చేయకుండా వదిలేయడం, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చింది.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైట్రేట్, 17 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, 12 జిల్లాల్లో ఇనుము, 7 జిల్లాల్లో ఆర్శనిక్ పరిమితికి మించి ఉన్నట్లు తెలిపింది. ప్రతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో పరిమితికి మించి సోడియం కార్బొనేట్ ఉండటం వల్ల ఆ నీళ్లు సాగుకు కూడా వాడకూడదని సీజీడబ్ల్యూబీ తేల్చింది.
నైట్రేట్
భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నైట్రేట్ ఎక్కువ ఉంది. 2023 వర్షాకాలం ముగిసిన తర్వాత 1149 ప్రాంతాల్లో పరీక్షించగా.. 270 ప్రాంతాల్లో పరిమితికి మించి నైట్రేట్ ఉన్నట్లు తేలింది. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తరువాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పల్నాడు జిల్లాలో 70 చోట్ల పరీక్షించగా 36 చోట్ల నైట్రేట్ చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది.
క్లోరైడ్
లీటర్ నీటిలో 250 మిల్లీ గ్రాముల లోపు క్లోరైడ్ ఉంటే అవి తాగడానికి సురక్షితం. రాష్ట్రంలో 887 చోట్ల పరిమితికి లోపే క్లోరైడ్ ఉన్నట్లు తేలింది. 222 చోట్ల 250 నుంచి 1,000 మిల్లీగ్రాముల మధ్య ఉన్నట్లు తేలింది. వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువ క్లోరైడ్ ఉంటే ఆ నీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాగకూడదు. రాష్ట్రంలో 40 ప్రాంతాల్లో వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువగా క్లోరైడ్ ఉన్నట్లు తేలింది.
ఇనుము
లీటర్ నీటిలో ఒక మిల్లీ గ్రాముకంటే ఎక్కువ పరిమాణంలో ఇనుప (ఐరన్) ధాతువులు ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో (అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశి్చమ గోదావరి) కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాల్లో పరిమితికి మించి ఇనుప ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
ఫ్లోరైడ్
భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 130 ప్రాంతాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. శ్రీసత్యసాయి జిల్లాలో 27 చోట్ల, పల్నాడు జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 25 చోట్ల ఫ్లోరైడ్ పరిమితికి మించి చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది.
అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఎనీ్టఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలోనూ ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్న జిల్లాలు 2015 నుంచి క్రమేణా పెరుగుతున్నాయి.
ఆర్శనిక్
ఆర్శనిక్ విషతుల్యమైనది. లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాములకు మించి ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఆర్శనిక్ ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
సాగుకూ పనికి రావు..
లీటరు నీటిలో 1.25 మిల్లీ గ్రాములకంటే ఎక్కువగా సోడియం కార్బొనేట్ ఉంటే ఆ నీటిని సాగుకు వినియోగించకూడదు. రాష్ట్రంలో 27.68 శాతం నమూనాల్లో సాగుకు పనికిరాని విధంగా ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment