Ground water Department
-
170 మండలాల్లో కరువు ఛాయలు 'భూగర్భ శోకం'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు (24.08 అడుగులు) ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్ల (28.54 అడుగులు)కు పడిపోవడమే అందుకు కారణం. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 1.36 మీటర్ల (4.46 అడుగుల) మేర భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల వ్యవధిలోనే ఒక మీటర్ మేర క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గత నెలలో ఉన్న భూగర్భ జలాల స్థితిగతులపై భూగర్భజల శాఖ రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,718 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ఆ శాఖ ప్రతి నెలా సమీక్షించి మరుసటి నెలలో నివేదికలను విడుదల చేస్తోంది. 11 జిల్లాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ... జిల్లా స్థాయిల్లో భూగర్భ జలమట్టాలను 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లకుపైన అనే కేటగిరీలుగా భూగర్భజలశాఖ వర్గీకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల (42.8 అడుగులు)కు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. మొత్తం 33 జిల్లాలకుగాను కేవలం జగిత్యాల జిల్లా 4.93 మీటర్ల (16.17 అడుగులు) భూగర్భ జలమట్టంతో 0–5 మీటర్ల కేటగిరీలో నిలిచింది. అంటే ఈ ఒక్క జిల్లాలోనే భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్యన, మరో 11 జిల్లాల్లో 10 మీటర్లకన్నా ఎక్కువగానే భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జలమట్టం 10 మీటర్లకు (32.8 అడుగులు)పైనే పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు. 30 జిల్లాల్లో క్షీణత నమోదు.. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 జిల్లాల్లోని భూగర్భ జలమట్టాల్లో క్షీణత నమోదైంది. నాటితో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టాల్లో 0.15 మీటర్ల నుంచి 3.91 మీటర్ల వరకు వ్యత్యాసం కనిపించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.91 మీటర్ల వ్యత్యాసం కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లాలో భూగర్భ జలమట్టం 6.15 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.06 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నల్లగొండ జిల్లాపై తీవ్ర దుష్ప్రభావం పడినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాల్లో అత్యంత ప్రమాదకరం.. సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణమధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మోస్తారు లోతు (మోడరేట్లీ డీప్), 20 మీటర్లకుపైన తీవ్ర లోతు (వెరీ డీప్)ల్లో ఉన్నట్టు నిర్ధారించారు. రాష్ట్ర భూభాగంలో 8 శాతం ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 24 శాతం ప్రాంతం పరిధిలో 10–15 మీటర్లు, 53 శాతం ప్రాంతం పరిధిలో 5–10 మీటర్లు, 15 శాతం ప్రాంతం పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలమట్టాలు నమోదయ్యాయి. 170 మండలాల్లో దశాబ్ద కాల కరువు... రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలను గత దశాబ్ద కాల (2014–2023) సగటు భూగర్భ జలమట్టాలతో పోల్చినప్పుడు ఫిబ్రవరిలో 170 (28%) మండలాల్లో భూగర్భ జలమట్టాలు 0.01 మీటర్ల నుంచి 17.08 మీటర్ల వరకు క్షీణించాయి. గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు 442 (72%) మండలాల్లో మాత్రం నామమాత్ర స్థాయి నుంచి 15.52 మీటర్ల వరకు వృద్ధి చెందాయి. అంటే రాష్ట్రంలోని 170 మండలాల్లో గత దశాబ్దకాలంలో లేని కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
సమృద్ధిగా భూగర్భ జలాలు
ఆకివీడు: గోదావరి నది, కృష్ణా నదులకు శివారు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత మూడేళ్లుగా భూగర్భ జలాలు సమృద్ధిగానే ఉన్నాయి. భూమికి రెండు మూడు అడుగుల నుంచి 100 అడుగుల వరకూ నీటి మట్టం ఉంది. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో లక్షలాది క్యూసెక్కుల నీరు పొంగి ప్రవహించింది. భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి వర్షాలు, వాయుగుడం ప్రభావం, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిస్తే మే నెలలో కూడా నీటి మట్టం యథావిధిగా ఉండే అవకాశం ఉందని భూగర్భజలవనరుల శాఖ చెబుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 17.12 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో 16.73 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. అధిక వర్షాలతో నీటి మట్టం నిలకడగా ఉంది. ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో ఆగస్టు నెలలో సరాసరి నీటి మట్టం 20.53 మీటర్లు, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లు నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి మట్టాలు గత ఏడాది కన్నా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో భూగర్భ జలాల లోతును పరీక్షిస్తే కాళ్ల మండలంలో నీటి మట్టం భాగా అడుగుకు ఉంది. సముద్ర తీర ప్రాంతం, ఉప్పుటేరుకు చేర్చి మండలం ఉన్నప్పటికీ భూమి పొరలలో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. గత మూడు నెలల పరీక్షా ఫలితాల్లో నీటి మట్టం సరాసరిన ఆగస్టులో 26.5, సెప్టెంబర్ నెలలో 26.19, అక్టోబర్ నెలలో 27.72 మీటర్లుంది. ఇవే నెలలో నీటి మట్టం బాగాపైకి ఉన్న మండలాల్లో ఆగస్టులో ఆకివీడు మండలం 0.25, సెప్టెంబర్‌లో ఆకివీడు మండలంలో 1.5 మీటర్లు, అక్టోబర్‌లో ఉండి మండలంలో 0.45 మీటర్ల నీటి మట్టం ఉంది. మార్చి నెల వరకు నీటి మట్టాలు సరాసరి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. నిండు కుండలా కొల్లేరు సరస్సు ప్రపంచ ప్రసిద్ది గాంచిన కొల్లేరు సరస్సు ఉనికిని కోల్పోయే విధంగా గత రెండు దశాబ్ధాలుగా బీడు పడి, నెరలు దీసి ఉంది. సుమారు 75 వేల ఎకరాల్లో ఉన్న కొల్లేరు సరస్సులో నీటి మట్టం తగ్గిపోవడంతో వేలాది పక్షులు వలసలు పోయాయి. కొన్ని చనిపోయాయి. గత మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలోనూ, ఎగువ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు కొల్లేరు నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మూడు, నాలుగు కాంటూర్ల పరిధిలో నీటి మట్టం 1.6 మీటర్ల నిలబడి ఉంది. సహజంగా సరస్సు నీటి మట్ట 1.2 మీటర్లు మాత్రమే ఉండేది. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలకు నీటి మట్టం భారీగా పెరిగింది. పెరిగిన నీటి మట్టం పశ్చిమగోదావరి జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో రెండు మూడు అడుగుల లోతులో, మరి కొన్ని మండలాల్లో 70 నుంచి 90 అడుగుల లోతులో నీటి మట్టం ఉంది. భారీ వర్షాలకు ఈ ఏడాది భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. – కె.గంగాధరరావు, జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం సరాసరి నీటి మట్టం 16.73 ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో నీటి మట్టం సరాసరి 16.73 ఉంది. వాటర్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఆగస్టులో 20.53, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లతో భూమి లెవిల్‌కు నీటిమట్టం పెరిగింది. – పీఎస్ విజయ్‌కుమార్, డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, ఏలూరు జిల్లా -
భూగర్భ జలం పుష్కలం.. నీటి సంరక్షణలో దేశంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్
ఎండిన బోరు బావికి జీవకళ ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భీమేష్. అనంతపురం జిల్లా పుట్లూరుకు చెందిన రైతు. ఆరు ఎకరాలు పొలం ఉంది. గతంలో 1,250 అడుగులు తవ్విన బోరు బావి ఎండిపోవడంతో పొలం బీడుగా మారింది. 2020 నాటికి పుట్లూరు మండలంలో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం, వాన నీటిని ఒడిసిపట్టి చెరువులను నింపుతుండటంతో ఎండిన భీమేష్ బోరుబావికి జలకళ వచ్చింది. నాలుగు ఎకరాల్లో బత్తాయి, రెండు ఎకరాల్లో వేరుశెనగ సాగు చేసిన భీమేష్ రెండో పంటగా మొక్కజొన్న సాగుకు సిద్ధమయ్యాడు. సాక్షి, అమరావతి: పాతాళగంగ పైపైకి వస్తోంది. ఎండిన బోరు బావుల నుంచి జలధారలు ఉబికి వస్తున్నాయి. రాష్ట్రంలో సగటున 5.83 మీటర్లు అంటే కేవలం 19.13 అడుగుల్లోనే నీళ్లు లభ్యమవుతుండటంతో భూగర్భ జల వనరులలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాల సంరక్షణలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం భారీగా తోడేస్తుండటంతో భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలపై రాష్ట్రాల భూగర్భ జలవనరుల శాఖలు, కేంద్ర భూగర్భ జలమండలి విభాగం ఈ ఏడాది నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 667 మండలాల పరిధిలో 1,669 ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధ్యయనం చేశారు. జలసంరక్షణలో ఏపీ టాప్... ► నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు పడటంతో దేశంలో భూగర్భ జలాలు సగటున 15,453.69 టీఎంసీలు పెరిగాయి. ఇందులో సగటున 14,058.06 టీఎంసీలను సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే 8,445.85 టీఎంసీలు (60.80 శాతం) మాత్రమే వినియోగిస్తున్నారు. ► రాష్ట్రంలో సగటున 741 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ నైరుతి రుతుపవనాల కాలం ముగిసే నాటికి, అంటే అక్టోబర్ ఆఖరుకు 799.03 మి.మీ. వర్షపాతం కురిసింది. సాధారణ కంటే 7.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. రుతుపవనాల కాలం ప్రారంభమయ్యే నాటికి అంటే 2022 మే 30 నాటికి రాష్ట్రంలో సగటున 8.33 మీటర్లలో భూగర్భ జలమట్టాలు ఉండగా రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ 31 నాటికి సగటున 5.83 మీటర్ల లోతులోనే నీళ్లు లభ్యమవుతున్నాయి. సగటున 2.5 మీటర్ల (8.21 అడుగులు) మేర రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది. ► రాష్ట్రంలో ఈ ఏడాది భూగర్భ జలమట్టం అత్యధికంగా 5.56 మీటర్ల మేర శ్రీసత్యసాయి జిల్లాలో పెరిగింది. శ్రీకాకుళం జిల్లా రెండో స్థానం (4.82 మీటర్లు), ఏలూరు జిల్లా మూడో స్థానం (4.43 మీటర్లు)లో నిలవగా 0.62 మీటర్లు తగ్గడం ద్వారా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ► భూగర్భ జలాలు 637 మండలాలలో పుష్కలంగా లభ్యమవుతున్నాయి. మరో 19 మండలాల్లో జలమట్టం సమస్యాత్మకంగానూ, ఐదు మండలాల్లో అత్యంత సమస్యాత్మకంగానూ, ఆరు మండలాల్లో ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ ఆరు మండలాల పరిధిలోని 387 గ్రామాల్లో ఎడాపెడా భూగర్భ జలాలను తోడివేయడమే దీనికి కారణం. ► రాష్ట్రంలో భూగర్భ జలాలు 961.61 టీఎంసీల మేర పెరిగాయి. ఇందులో 913.23 టీఎంసీలను వివిధ అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే ఏటా సగటున 15 లక్షల బోరు బావుల ద్వారా సాగు, తాగు నీటి అవసరాల కోసం 263.09 టీఎంసీలు (28.8 శాతం) మాత్రమే వాడుకుంటున్నారు. దేశంలో సగటున 60.8 శాతం మేర భూగర్భ జలాలను వాడుకుంటుండగా, రాష్ట్రంలో 28.8 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలో భద్రపరచడం, పొదుపుగా వాడకం ద్వారా నీటి సంరక్షణలో ఏపీ అగ్రగామిగా నిలిచింది. లభ్యతలో విజయనగరం ప్రథమ స్థానం రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యతలో విజయనగరం జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఏలూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. కేవలం 1.99 మీటర్ల (6.5 అడుగులు)లో విజయనగరం జిల్లాలో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. బాపట్ల జిల్లా రెండో స్థానంలో (2.21 మీటర్లు), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మూడో స్థానంలో(2.33 మీటర్లు) నిలిచాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏలూరు జిల్లాలో భూగర్భ జలమట్టం 17.94 మీటర్లకు (58.85 అడుగులు) దిగజారడం గమనార్హం. తీవ్ర వర్షాభావ ప్రాంతంలోని రాయలసీమ కంటే ఏలూరు జిల్లాలో భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉంది. -
ఫ్లోరైడ్ భూతం వీడట్లే!
ఫ్లోరైడ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉమ్మడి నల్లగొండ జిల్లా. కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోయిన అభాగ్యులు కళ్ల ముందు మెదులుతారు. వారికది తరతరాల పీడ. ఈ ఫ్లోరైడ్ భూతం ఇతర జిల్లాల్లోనూ విస్తరిస్తున్నట్లు భూగర్భ జల విభాగం 2019లో జరిపిన అధ్యయనంలో తేలింది. సంగారెడ్డి, రంగారెడ్డి, జగిత్యాల, ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల భూగర్భ జలాల్లో అనుమతించదగ్గ పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. అయితే 2018లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో... 2019 వేసవిలో జనం తాగునీటి కోసం చేతిబోర్ల వైపు మళ్లడంతో... తాము పరిశీలించిన శాంపిల్స్‌లో ఫ్లోరైడ్ శాతం అధికంగా కనబడినట్లు తేల్చారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ భూతం ఇంకా వీడట్లేదు. భూ ఉపరితల నీటి వినియోగం పెరిగి, భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించినా... ఫ్లోరైడ్ మాత్రం ఎప్పట్లాగే తిష్టవేసుకొని కూర్చుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మనకు తెలిసిన ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఫ్లోరైడ్ విస్తరించి ఉందనుకుంటే అది ఇతర జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వేగంగా విస్తరిస్తున్నట్లు భూగర్భ జల విభాగం జరిపిన అధ్యయనంలో తేలింది. తగ్గింది చాలా తక్కువే భూగర్భ జల విభాగం ప్రతి ఏటా వర్షాలకు ముందు ఒకమారు, వర్షాల అనంతరం మరో మారు రాష్ట్రంలోని భూగర్భ జల పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. అందులో భాగంగా 2019లో వర్షాలకు ముందున్న పరిస్థితి, తర్వాతి పరిస్థి తులపై అధ్యయనం చేసింది. ఈ నివేదిక పరిశీ లనలను తాజాగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,318 నీటి నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపింది. ఈ మొత్తం శాంపిల్స్‌లో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న శాంపిల్స్ 1,118 వరకు ఉన్నట్లు తేల్చింది. వాస్తవానికి నీటిలో 1 నుంచి 1.5 మిల్లీగ్రామ్/లీటర్ వరకు ఫ్లోరైడ్ ఉంటే దాన్ని అనుమతించదగ్గ పరిమితిగా పరిగణిస్తారు. అంతుకు మించితే మాత్రం ప్రమాదమే. ప్రస్తుతం పరిశీలించిన శాంపిల్స్‌లో నల్లగొండే కాకుండా సంగారెడ్డి, రంగారెడ్డి, జగి త్యాల, యాదాద్రి, ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఫ్లోరైడ్ ఉన్నట్లుగా తేలింది. 2018లో వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో 2019 వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, జలాశయా ల్లోనూ తగినంత నీరు లేక సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం, నీరు అందుబాటులో లేక ప్రజలు చేతిబోర్ల వైపు మళ్లడంతో ఫ్లోరైడ్ శాతం అధికంగా కనిపించినట్లు అధ్యయనం వెల్లడిం చింది. రాష్ట్రవ్యాప్తంగా భూవిస్తీర్ణంలో వర్షాలకు ముందు 15% విస్తీర్ణంలో 1.5 మిల్లీగ్రామ్/లీటర్ కన్నా అధికంగా ఫ్లోరైడ్ కనిపించగా, వర్షాల అనంతరం అది 11 శాతం విస్తీర్ణానికి తగ్గినట్లు నివేదిక పేర్కొంది. 2014–2019 వరకు గమనిస్తే ఫ్లోరైడ్ శాతం కేవలం 0.046 మిల్లీగ్రామ్/లీటర్ తగ్గినట్లు వెల్లడించింది. ఈ ఆరేళ్లలో భూగర్భ జలాలు సగటున 0.42 మీటర్/ ఇయర్, వర్షపాతం 58 మిల్లీమీటర్/ ఇయర్ పెరగడంతో కొద్దిమేరైనా ఫ్లోరైడ్ శాతం తగ్గినట్లు తెలిపింది. ముప్పు ఎక్కడెలా ఉందంటే... నల్లగొండ జిల్లా అనుములలో వర్షాలకు ముందు 5.39 మి.గ్రా/లీ, వర్షాల తర్వాత 3.40 మి.గ్రా/లీ నమోదవగా, పెద్దవూర మండలం వెలమగూడ, డిండి మండలం వావిల్‌కోల్,, నల్లగొండ మండలం నార్సింగ్ భట్ల, ఎం.దోమపల్లి, పి.దోమలపల్లి, మును గోడు, చండూరు మండలం నర్మెట్ల, అంగడి పేట, కట్టంగూర్ మండలం పామన గుండ్ల, మర్రి గూడ మండలం శివన్నగూడెం, కుదాభక్షు పల్లి, అంతంపేట, నామాపూర్, నిడమనూర్ మండలం వెంకన్నగూడెం, దామరచర్ల మండలం అడవిదేవులపల్లి, మునుగోడు మండలం కాల్వలపల్లి, నార్కట్‌పల్లి మండలం ఔరవాణిలలో ఎక్కువగా ఫ్లోరైడ్ ఉంది. వరంగల్ అర్బన్ జిల్లాలో వర్షాలకు ముందు పరిశీలించిన 150 శాంపిల్స్‌లో ఫ్లోరైడ్ సగటు 2.10మిల్లీగ్రామ్/లీటర్ ఉండగా, అది వర్షాల అనంతరం సగటున 1.3 వరకు ఉంది. అత్యధి కంగా ఎల్కతుర్తి మండల పరిధిలో వర్షాలకు ముందు 8.51, వర్షాల అనంతరం 8.02 మి.గ్రా/లీ ఫ్లోరైడ్ నమోదు కావడం గమనార్హం. ఖిల్లా వరంగల్ మండలం తిమ్మాపూర్‌లో వర్షాల అనంతరం సైతం 6.83 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ కనబడింది. ఐనవోలు మండలం పాటిని, సింగారం, కమలాపూర్ మండలం శనిగరం, హసన్‌పర్తి మండలం దేవన్నపేట, కోమటిపల్లి, ధర్మసాగర్ మండలం ఉనికి చర్లలలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్నట్లు తేల్చారు. రంగారెడ్డి జిల్లాలో వర్షాలకు ముందు సగటు 1.53 మి.గ్రా/లీ ఉండగా, వర్షాల అనంతరం 1.10మి.గ్రా/లీ ఉంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో వర్షాలకు ముందు ఏకంగా 5.09మి.గ్రా/లీ ఫ్లోరైడ్ ఉండగా, మహేశ్వరం మండలం పొందియాల, మంచాల మండలం బోడకొండ, కందుకూరు మండలం గుమ్మడివెల్లిలో అధికంగా ఫ్లోరైడ్ ఉంది. సంగారెడ్డి జిల్లాలో రాయ్‌కోడ్ మండల పరిధిలోని చిన్నాపూర్‌లో అధికంగా 4.41 మి.గ్రా/లీ వర్షాలకు ముందు ఉండగా, వర్షాల అనంతరం సైతం 3 మి.గ్రా/లీ ఫ్లోరైడ్ కనబడింది. ఇదే జిల్లాలో పుల్కల్ మండలం సింగూరు, బండ్లగూడ, కోహీర్‌లలో ఫ్లోరైడ్ అధికంగానే నమోదైంది. జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండలంలోని చెప్యాలలో 3.54 మి.గ్రా/లీ వరకు ఉండగా, మేడిపల్లి మండలం రంగాపూర్, మల్లాపూర్ మండలంలోని సాతారం, ఓబ్లాపూర్, ఇంద్రా నగర్, గుండంపల్లె, ధర్మపురి మండలంలోని బుద్ధేశ్‌పల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలో అధికంగా ఫోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. -
జలకళ పెంపు.. నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: బీడువారిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఉచిత బోర్లు వేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా.. పథకం ద్వారా అధిక ప్రయోజనం కలిగేలా నిబంధనలను మార్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నాబార్డు మార్గదర్శకాలను అనుసరించి తొలుత వైఎస్సార్ జలకళ పథకానికి నిబంధనలు రూపొందించారు. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల వల్ల ఈ నిబంధనలు ప్రతికూలంగా మారాయి. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భూగర్భ జల శాఖ గణాంకాలను విశ్లేషించిన అనంతరం నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు మార్పులు చేసేందుకు నిర్ణయించింది. సమస్యలు ఏమిటంటే.. వాస్తవానికి 200 మీటర్ల పరిధిలో వ్యవసాయ బోరు ఉంటే మరో బోరు మంజూరు చేయకూడదు. రాతి నేలల్లో 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయరాదనే నిబంధన ఉంది. ఇసుక నేలల్లో బోరు లోతుపై పరిమితి లేదు. కానీ.. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,200 అడుగల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. దీంతో ఇక్కడ 120 మీటర్ల నిబంధన వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అలాగే ఒక రైతు భూమిలో బోరు ఉంటే పక్క రైతు భూమి వంద మీటర్ల పరిధిలోనే బోరు వేయాల్సి ఉంటుంది. అందువల్ల కనీసం 200 మీటర్ల దూరం దాటిన తర్వాతే మరో బోరు వేయాలనే నిబంధన రైతులకు అశనిపాతంగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పథకం నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. తగిన సిఫార్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర భూగర్భ జల శాఖ , గ్రామీణ నీటి సరఫరా, జల వనరులు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి రాష్ట్ర భూగర్భ జలశాఖ సంచాలకులు సభ్య కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సులతోపాటు రాష్ట్ర భూగర్భ జలశాఖ ఇచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని ప్రభుత్వం సవరించనుంది. నిబంధనల్ని సవరిద్దాం ‘ప్రతి రైతుకూ ఉపయోగపడేలా వైఎస్సార్ జలకళ నిబంధనలను సవరిద్దాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు సమర్పించండి. రాయలసీమలో ఒక్కో రైతు 1,200–1,400 అడుగుల లోతు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితిని కళ్లారా చూశాం. వీటిని పరిగణనలోకి తీసుకోండి’ అని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. -
భూగర్భ జలమట్టం.. అందినంత దూరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకు సగటున 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలను తోడేస్తున్నారు. రోజుకు సగటున 0.015 మీటర్ల చొప్పున భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సమృద్ధిగా వర్షాలు కురవడం, నదులు ఉప్పొంగడంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం 5.58 మీటర్ల మేర పెరిగింది. పుష్కలంగా భూగర్భ జలాలు లభ్యమవుతుండటంతో రైతులు బోర్లు.. బావుల కింద ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 23.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంది. 11.79 మీటర్లకు.. ప్రస్తుత సీజన్లో వర్షాకాలం ప్రారంభం కాకముందు అంటే 2019 మేలో రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటు 16.19 మీటర్లుగా ఉండేది. వర్షాకాలం దాదాపు ముగిశాక.. అంటే 2019 డిసెంబర్ 15 నాటికి భూగర్భ జలమట్టం సగటు 10.61 మీటర్లకు పెరిగింది. సగటున 5.58 మీటర్ల మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. వర్షాకాలం ముగియడం, తాగు, సాగునీటి అవసరాలకు తోడేస్తుండటంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 11.79 మీటర్లకు చేరుకుంది. 20 శాతం ప్రాంతాల్లో 3 మీటర్ల లోపే.. భూగర్భ జల వనరుల విభాగం రాష్ట్రంలో 661 గ్రామీణ మండలాలు, 9 అర్బన్ మండలాల్లోని 1,261 ప్రాంతాల్లో ఫిజియో మీటర్లను ఏర్పాటు చేసింది. భూగర్భ జలమట్టాలను ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. - భూగర్భ జల వనరుల శాఖ అధ్యయనం ప్రకారం కోస్తాలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. 9 తీర ప్రాంత జిల్లాల్లో సగటున 9.72 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 16.44 మీటర్లలో భూగర్భ జలాలు దొరుకుతున్నాయి. - కనిష్టంగా శ్రీకాకుళం జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 4.91 మీటర్లు ఉండగా.. గరిష్టంగా చిత్తూరు జిల్లాలో 20.64 మీటర్లుగా నమోదైంది. - రాష్ట్రంలో 20.20 శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాలు సగటున 3 మీటర్లలోపే లభ్యమవుతున్నాయి. 33.80 శాతం ప్రాంతాల్లో 3 నుంచి 8 మీటర్లలోపు లోతులో లభిస్తున్నాయి. 46 శాతం ప్రాంతాల్లో 8 మీటర్ల కంటే ఎక్కువ లోతులో దొరుకుతున్నాయి. 17.59 లక్షల బోరు బావుల కింద పంటల సాగు భూగర్భ జలమట్టం పెరగడంతో ఎండిపోయిన బోరు బావులు రీఛార్జి అయ్యాయి. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 17,59,584 బోరు బావుల కింద ఖరీఫ్‌లో రైతులు 23,68,439 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రాష్ట్రంలో అక్టోబర్‌లో భూగర్భ జలమట్టం సగటున 10.98 మీటర్లు ఉండేది. బోరు బావుల కింద భారీగా పంటలు సాగు చేసి భూగర్భ జలాలను తోడేస్తున్నా.. నవంబర్, డిసెంబర్లలో కురిసిన వర్షాలకు భూగర్భ జలమట్టం 10.61 మీటర్లకు పెరిగింది. రబీలో ఇప్పటిదాకా 53,57,854.47 ఎకరాల్లో పంటలు సాగుచేయగా.. ఇందులో 19 లక్షల ఎకరాలు బోర్లు, బావుల కింద సాగుచేసిన పంటలే. బోరు బావుల కింద సాగవుతున్న పండ్ల తోటల విస్తీర్ణం అదనం. పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు తోడేస్తుండటంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం 11.79 మీటర్లకు చేరుకుంది. జనవరి 18 నాటికి భూగర్భ జలమట్టం 11.34 మీటర్లు ఉండేది. అంటే నెల రోజుల్లో 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలను వినియోగించుకున్నట్లు తేటతెల్లమవుతోంది. -
పాతాళానికి భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావం, విచ్చలవిడిగా తోడేయడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. జనవరితో పోలిస్తే మార్చి నాటికి అంటే రెండు నెలల్లోనే ఏకంగా 1.13 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లిపోయాయి. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 13.75 మీటర్ల లోతులో జలం లభించగా.. మార్చిలో అది 14.88 మీటర్లకు పడిపోయింది. అలాగే గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో 2.61 మీటర్ల అదనపు లోతులోకి భూగర్భ జలాలు అడుగంటాయని భూగర్భ జల శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది మార్చిలో 12.27 మీటర్ల లోతులో నీరు లభ్యం కాగా... ఈ మార్చిలో 14.88 మీటర్ల లోతులోకి అడుగంటాయి. గత ఏడాది మేతో పోల్చినా ఈ ఏడాది మార్చి నెలలోనే అధికంగా జలాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. వేసవికాలం ఇంకా నెలన్నరకు పైగా ఉండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అధ్వానం రాష్ట్రంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భూగర్భ జలాలు మరింతగా అడుగంటా యి. మెదక్ జిల్లాలో గతేడాది 18.39 మీటర్ల లోతులో జలాలు లభ్యం కాగా... ఈ ఏడాది మార్చిలో 24.34 మీటర్ల లోతు కు పడిపోయాయి. అంటే ఏకంగా 5.95 మీటర్లు లోపలికి వెళ్లిపోయాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో గతేడాది మార్చిలో 14.29మీటర్ల లోతులో నీరుండగా... ఈ మార్చిలో 5.31 మీటర్లు అదనంగా 19.60 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. దీంతో తాగునీటికి కూడా కటకట ఏర్పడింది.