
సాక్షి, అమరావతి: బీడువారిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఉచిత బోర్లు వేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా.. పథకం ద్వారా అధిక ప్రయోజనం కలిగేలా నిబంధనలను మార్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నాబార్డు మార్గదర్శకాలను అనుసరించి తొలుత వైఎస్సార్ జలకళ పథకానికి నిబంధనలు రూపొందించారు. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల వల్ల ఈ నిబంధనలు ప్రతికూలంగా మారాయి. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భూగర్భ జల శాఖ గణాంకాలను విశ్లేషించిన అనంతరం నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు మార్పులు చేసేందుకు నిర్ణయించింది.
సమస్యలు ఏమిటంటే..
వాస్తవానికి 200 మీటర్ల పరిధిలో వ్యవసాయ బోరు ఉంటే మరో బోరు మంజూరు చేయకూడదు. రాతి నేలల్లో 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయరాదనే నిబంధన ఉంది. ఇసుక నేలల్లో బోరు లోతుపై పరిమితి లేదు. కానీ.. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,200 అడుగల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. దీంతో ఇక్కడ 120 మీటర్ల నిబంధన వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అలాగే
ఒక రైతు భూమిలో బోరు ఉంటే పక్క రైతు భూమి వంద మీటర్ల పరిధిలోనే బోరు వేయాల్సి ఉంటుంది. అందువల్ల కనీసం 200 మీటర్ల దూరం దాటిన తర్వాతే మరో బోరు వేయాలనే నిబంధన రైతులకు అశనిపాతంగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పథకం నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. తగిన సిఫార్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర భూగర్భ జల శాఖ , గ్రామీణ నీటి సరఫరా, జల వనరులు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి రాష్ట్ర భూగర్భ జలశాఖ సంచాలకులు సభ్య కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సులతోపాటు రాష్ట్ర భూగర్భ జలశాఖ ఇచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని ప్రభుత్వం సవరించనుంది.
నిబంధనల్ని సవరిద్దాం
‘ప్రతి రైతుకూ ఉపయోగపడేలా వైఎస్సార్ జలకళ నిబంధనలను సవరిద్దాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు సమర్పించండి. రాయలసీమలో ఒక్కో రైతు 1,200–1,400 అడుగుల లోతు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితిని కళ్లారా చూశాం. వీటిని పరిగణనలోకి తీసుకోండి’ అని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు.