నాబార్డు చైర్మన్ షాజీ కేవీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నాబార్డ్ సాయంతో విద్యారంగంలో చేపడుతున్న మనబడి నాడు–నేడు కార్యక్రమం, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ప్రశంసించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో నాబార్డ్ చైర్మన్‌తో పాటు.. ప్రతినిధుల బృందం భేటీ అయింది.
ఈ సందర్భంగా నాబార్డ్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాబార్డ్ సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ, మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నాయని సీఎం వివరించారు.
ఏపీలో 3 ఏళ్లలో మూడురెట్లు పెరిగిన వ్యాపారం
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలో మూడు రెట్లు వ్యాపారం పెరగడం నిజంగా గొప్ప విషయమన్నారు. మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమ్మేళనం(బ్యాంకర్స్ కాంక్లేవ్)కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే రూ.10 వేల కోట్ల టర్నోవర్ దాటిన తొలి బ్యాంక్‌గా కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నిలవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ బ్యాంక్‌ను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన బ్యాంకులు కూడా మారుమూల ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే రుణాల్లో కనీసం 40 శాతం సహకార బ్యాంకుల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పాడి, పశుపోషణ, మత్స్య అనుబంధ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండు గ్రామాలకొకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఎసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు.
నాబార్డ్ నిబంధనలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎలాంటి పెనాల్టీలు పడవని, బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా అంతరాయం ఏర్పడదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీలో సహకార బ్యాంకులు సీడీ రేషియో 140 శాతం సాధించడం పట్ల ఎంపీ బాలశౌరి బ్యాంకర్స్‌కు అభినందనలు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి చిరంజీవిచౌదరి, ఆప్కాబ్ చైర్‌పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ నవనీత్‌కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment