మత్స్యకారులకు మంచి రోజులు  | Good days for fishermen | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు మంచి రోజులు 

Published Wed, Mar 30 2022 3:56 AM | Last Updated on Wed, Mar 30 2022 3:56 AM

Good days for fishermen - Sakshi

నాగాయలంక సంతలో ఎండు చేపల మార్కెట్‌ను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయి. మత్స్య సంపదను మార్కెట్‌కు తరలించే సందర్భంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా దళారులకు చెక్‌ పెట్టేందుకు ఐస్‌ ప్లాంట్లు, హేచరీలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో ఇటీవలే సాత్వా, ఢిల్లీ నుంచి అవస్థాపన బృంద సభ్యులు దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లోని పలు తీర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో నాబార్డు నిధులతో కొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు.  

మత్స్య సంపదే కీలకం 
కృష్ణా జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో మత్స్య సంపదపైనా ఆధారపడి 1,12,977 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో 111 కిలోమీటర్ల మేర సముద్రంలో చేపల వేట సాగుతోంది. 2020–21 నివేదిక ప్రకారం కృష్ణా జిల్లా నుంచి 13.83 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తీరప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు నాబార్డుకు అనుబంధంగా పనిచేస్తున్న సాత్వా, ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) బృందాల సభ్యులు దివిసీమలోని తీర గ్రామాలైన నాగాయలంక, కోడూరు మండలాల్లో ఇటీవల పర్యటించారు. నాబార్డు, సాత్వా బృంద సభ్యులు నీల్, అభిషేక్, పీఎంఎఫ్‌ఎంఈకి సంబంధించి కార్తికేయరెడ్డితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం కోడూరు మండలం బసవానిపాలెం, పాలకాయతిప్ప, నాగాయలంక మండలం జింకపాలెం, నాచుగుంట్ల గ్రామాల్లో పర్యటించింది.  

తొలగనున్న సమస్యలు 
35 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించేందుకు నాబార్డు ముందుకొచ్చినట్టు బృంద సభ్యులు చెప్పారు. ఐస్‌ ప్లాంట్లు, కోల్డ్‌ స్టోరేజీలు, హేచరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అవనిగడ్డతోపాటు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోనూ వీటి అమలుకు చర్యలు తీసుకుంటామని బృందాల ప్రతినిధులు చెప్పారు. ఇవి కార్యరూపం దాలిస్తే జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామాలకు మంచి రోజులు వస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement