జువ్వలదిన్నె సిద్ధం
మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభానికి ముస్తాబవుతోంది.
సాక్షి, అమరావతి: మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వలస వెళ్లాల్సి వస్తోంది. పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారికి స్థానికంగానే ఉపాధి కల్పించేలా ఫిషింగ్ హార్బర్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.
ఈమేరకు రూ.3,520.56 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జువ్వలదిన్నె హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించనున్నారు. మరో మూడు హార్బర్ల పనులు 60 నుంచి 70 శాతం పూర్తి కాగా సెప్టెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ఇక రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అదనంగా మత్స్యకారులు బోట్లను నిలుపుకొని చేపలు దింపుకునే విధంగా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద సమకూరుతుందని, వీటి ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9 వేల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
జువ్వలదిన్నె హార్బర్‌లో ఏర్పాటు చేసిన షెడ్లు
హార్బర్ ఆధారిత పరిశ్రమలు..
హార్బర్ల ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులను ఏపీ మారిటైమ్ బోర్డు నెలకొల్పుతోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద సమకూరనుంది. వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా హార్బర్ వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, 5 ఎకరాల విస్తీర్ణంలో బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది.
కొత్త బోట్లకు డిమాండ్
రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లల్లో 10,521 బోట్లను నిలుపుకునే సామర్థ్యం ఉండటంతో కొత్త బోట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడనుంది. 9ఎం ఎఫ్‌ఆర్‌పీ రకం, 12 ఎం గిల్ నెట్టర్, 15ఎం ట్రావలెర్, 24ఎం టూనా లాంగ్ లైనర్ లాంటి అత్యాధునిక బోట్లు అవసరం కానున్నాయి. అన్ని హార్బర్ల వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
కూలీల నుంచి యజమానులుగా..
రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ పని కోసం చెన్నై, మంగళూరు వలస కూలీలుగా వెళ్లాం.ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఫిషింగ్ హార్బర్, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15 వేల మందికిపైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు.
– కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్‌కాఫ్)
సురక్షితంగా ఒడ్డుకు బోట్లు
ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో ఆటు పోట్లు వల్ల ఈ ఇబ్బంది అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలుపుకోవచ్చు.
– పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నం.
పర్యాటక ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం
మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ముఖ్యమంత్రి జగన్ ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించేలా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున నెలకొల్పుతున్నాం.
ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. హార్బర్ల వద్ద పర్యాటక ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నాం.
– ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీ మారిటైమ్‌బోర్డు, వీసీఎండీ ఏపీఐసీసీ.
మినీ పోర్టు స్థాయిలో
ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక అవస్థలు ఎదుర్కొన్నాం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తేవడంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.
దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం.
– ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ
Comments
Please login to add a commentAdd a comment