సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈల) అభివృద్ధికి, యువతలో నైపుణ్యాభివృద్ధికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కరోనా కష్ట సమయంలో రీచార్జ్ ప్యాకేజితో పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నాబార్డు కూడా దన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రంలో స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. రాష్ట్రంలో 2022 –23 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.52,468.55 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇందులో మూల ధనం కింద రూ.18,400.93 కోట్లు, పెట్టుబడి రుణం కింద రూ.34,067.62 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపింది. పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు సహాయం అందించాలని చెప్పింది.
మూత పడిన యూనిట్ల పునరుద్ధరణకు బ్యాంకులు ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని ఎంఎస్‌ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వైఎస్సార్ నవోదయం పేరిట వన్‌టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆ పత్రంలో నాబార్డు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపింది. వ్యవసాయ రంగంలో రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
చిన్న పరిశ్రమలకు సాయం చేద్దాం
Published Sun, Mar 6 2022 5:46 AM | Last Updated on Sun, Mar 6 2022 8:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment