సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార నిర్వహణలో ఈ సంస్థలు ఎదుర్కొనే ఆర్థిక కష్టాలను తగ్గించి తక్కువ పెట్టుబడితో వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్‌ఎఫ్‌సీ)లను ఏర్పాటుచేయనుంది.
ఇందులో భాగంగా.. కనీసం మూడు నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి అక్కడే ఉమ్మడి సౌకర్యాలతో రెడీ టు వర్క్ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. నిజానికి.. ఒక ఎంఎస్‌ఎంఈ ఏర్పాటులో ఎక్కువ మొత్తం స్థలం కొనుగోలు, వాటి నిర్మాణానికే కేటాయించాల్సి రావడంతో ఆయా సంస్థలు వర్కింగ్ క్యాపిటల్‌కు ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించి వాటిని లీజు విధానంలో ఇస్తే వెంటనే ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందులూ తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఈ విధానంలో రెండు క్లస్టర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
కేంద్రానికి ప్రతిపాదనలు..
ఇక ఆయా జిల్లాల్లో ఉన్న డిమాండ్లను గుర్తించి వాటికి అనుగుణంగా రెండేసి క్లస్టర్లను ఎంపికచేసి వాటి ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎఫ్‌ఎఫ్‌సీల నిర్మాణ వ్యయంలో కేంద్రం 60 శాతం గ్రాంట్‌గా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించిందన్నారు. మొత్తం 26 జిల్లాలకు సంబంధించి 52 క్లస్టర్లను ఎంపిక చేశామని.. ఇందులో ఇప్పటికే 19 ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి పంపినట్లు ప్రవీణ్‌కుమార్ చెప్పారు.
నాలుగేళ్లలో 12.61 లక్షల మందికి ఉపాధి..
ఇక సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 2,00,995 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.24,059 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 12,61,512 మందికి ఉపాధి లభించింది. గడిచిన ఆర్ధిక సంవత్సరం 2022–23లోనే 92,707 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.9,677 కోట్ల పెట్టుబడులతో 3,61,172 మందికి ఉపాధి లభించింది. ఇలా ఎంఎస్‌ఎంఈలు అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుండటంతో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించి ఈ క్లస్టర్ల అభివృద్ధిపై కలెక్టర్లకు ఆదేశాలను జారీచేస్తున్నారు. తాజాగా జరిగిన సమీక్షలో ఈ ఎఫ్‌ఎఫ్‌సీల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులను తక్షణం చేయాల్సిందిగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు కూడా త్వరగా ఆమోదం లభించేందుకు ఏపీ భవన్ అధికారులతో సంప్రదింపులు నిర్వహించాలని కూడా కోరారు.
ఎంఎస్‌ఎంఈలకు బంపర్ ఆఫర్
Published Sun, Jul 23 2023 4:12 AM | Last Updated on Sun, Jul 23 2023 11:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment