
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు రూ.42,206 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని 2020–21 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు అంచనా వేసింది. ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు ఉద్యోగావకాశాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ పత్రంలో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని 86 వేల ఎంఎస్‌ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘వైఎస్‌ఆర్ నవోదయం’ పేరిట ఒన్‌టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ(రీస్ట్రక్చరింగ్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది.
ఇందులో భాగంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఎంఎస్‌ఎంఈలకు చెందిన రూ.3,900 కోట్ల మేరకు రుణాలను ఒన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న 86 వేల ఎంఎస్‌ఎంఈల్లో 80 వేల ఎంఎస్‌ఎంఈలు రూ.పది లక్షలలోపు రుణాలు కలిగి ఉండగా వాటన్నింటినీ ఒన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిగతా ఎంఎస్‌ఎంఈలు పది లక్షల రూపాలయకుపైగా రుణాలు కలిగినవి ఉండగా, వాటిలో ఇప్పటివరకు 2,500కుపైగా ఎంఎస్‌ఎంఈల రుణాల పునర్వ్యవస్థీకరణ పూర్తయినట్లు పేర్కొన్నాయి.
రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు, రైతులకు అవసరమైన నైపుణ్యత పెంపు, అలాగే ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ ఫోకస్ పత్రంలో వివరించింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని నాబార్డు కోరింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment