ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు సూత్రాల ప్రణాళిక అమలు
‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదు చేయించి కేంద్ర, రాష్ట్ర పథకాలతో పాటు మార్కెటింగ్ అవకాశాల కల్పనకు చర్యలు
రాష్ట్రంలో ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని 45 లక్షల
ఎంఎస్‌ఎంఈలు ఉన్నట్టు అంచనా
25 శాతం పరికరాలు, ఇతర ఉత్పత్తులను ఎంఎస్‌ఎంఈల నుంచే కొనుగోలుకు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: అత్యధికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లను చేయి పట్టి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలన్నింటినీ గుర్తించి ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలందించడం, అవకాశాలను అంది పుచ్చుకుంటూ విస్తరించే విధంగా అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయించడం, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది.
‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదుకు చర్యలు
ఇప్పటికీ ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్‌ఎంఈలు 45 లక్షలకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని త్వరతగతిన గుర్తించి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేయించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎంఎస్‌ఎంఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన ఎంఎస్‌ఎంఈల సంఖ్య 7.52 లక్షలు కాగా.. వీటిలో 1.6 లక్షల పరిశ్రమలు తయారీ రంగానికి చెందినవి కాగా 5.7 లక్షల యూనిట్లు సేవా రంగానికి చెందినవి. వీటిలో 96 శాతం యూనిట్లు అత్యధికంగా సూక్ష్మ రంగానికి చెందినవే కావడం గమనార్హం.
ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోళ్లు తప్పనిసరి
రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విభాగాలు ఏటా చేసే కొనుగోళ్లలో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్‌ఎంఈ యూనిట్ల నుంచే ఉండాలంటూ జీవోను జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎంఎస్‌ఎంఈలు మూతపడకుండా చేయూతనిచ్చే విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. అయినా.. కొన్ని ప్రభుత్వ విభాగాలు రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నట్టు ప్రభుత్వ దృష్టికి రావడంతో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలను కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తే అటువంటి బిల్లులకు ఆమోదం తెలపవద్దంటూ ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలకు చాలా ప్రోత్సాహం లభిస్తుందని ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment