సాక్షి, అమరావతి: అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా అనకాపల్లి వద్ద భారీ ఎంఎస్‌ఎంఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామంలో సుమారు 129 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తోంది. తొలిదశలో 59 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. సర్వే నెంబర్ 1(పీ), సర్వే నెంబర్ 21(పీ)లో కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది.
సుమారు రూ.12.63 కోట్లతో రహదారులు, డ్రైనేజ్, వర్షపు నీటి కాలువలను అభివృద్ధి చేయనున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ 12 నెలల్లో పనులు పూర్తి చేయాలి. ఆసక్తి గల సంస్థలు జనవరి 17లోగా బిడ్లను సమర్పించాలి. ఆటోమొబైల్, కెమికల్ రంగాలకు చెందిన కంపెనీల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎంఎస్–సీడీపీ ప్రోగ్రాం కింద పార్కును అభివృద్ధి చేసేలా ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు
ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.962.05 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లించడమే కాకుండా రాయితీలను ఎప్పటికప్పుడు అదే ఏడాది చెల్లిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది.
రాయితీలను ఫిబ్రవరిలో మరోసారి అందించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ ప్రకటించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ పోగ్రాం (పీఎంఈజీపీ) కింద వ్యాపార విస్తరణకు విరివిగా రుణాలను ఇప్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో గత సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,05,620 ఎంఎస్‌ఎంఈలు ఉండగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో 2,13,826కి పెరిగాయి. మూడున్నరేళ్లల్లో కొత్తగా 1,08,206 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కావడం ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అనకాపల్లిలో ఎంఎస్‌ఎంఈ పార్కు
Published Mon, Jan 2 2023 4:30 AM | Last Updated on Mon, Jan 2 2023 8:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment