సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలవారీగా ఉత్పత్తుల ఆధారిత క్లస్టర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. మరో 38 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ప్రింటింగ్, ఫర్నీచర్, పప్పు ధాన్యాలు, బంగారు ఆభరణాలు, రెడీమేడ్ దుస్తుల క్లస్టర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
కాకినాడ సమీపంలో రూ.14.76 కోట్లతో ప్రింటింగ్ క్లస్టర్, రాజమండ్రి వద్ద రూ.14.98 కోట్లతో ఫర్నీచర్ తయారీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పు ధాన్యాలు, జగ్గయ్యపేట వద్ద రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ, నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో రెడీమేడ్ దుస్తుల క్లస్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఎంఎంస్‌ఎంఈ సీడీపీ ప్రాజెక్టులో రూ.10 కోట్ల లోపు ప్రాజెక్టులకు కేంద్రం 70% గ్రాంటుగా ఇస్తుంది.
రాష్ట్రం 20%.. ఎస్‌పీవీ 10 శాతం భరించాలి. రూ.10 నుంచి 30 కోట్ల లోపు క్టస్లర్లకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 20, ఎస్‌పీవీ 20 శాతం నిధులివ్వాలి. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న 5 క్లస్టర్లకు రూ.60.80 కోట్లు వ్యయమవుతోంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.11.36 కోట్లు, ఎస్‌పీవీ కింద రూ.6.33 కోట్లు మ్యాంచింగ్ గ్రాంట్‌ను విడుదల చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలు, ఇతర నిర్మాణ పనులకు టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
మొత్తం 108 క్లస్టర్లు
ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జిల్లాల వారీగా డిమాండ్ ఉన్న క్లస్టర్ల అభివృద్ధికి కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 108 క్లస్టర్లకు అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే అయిదు క్లస్టర్ల పనులు ప్రారంభమయ్యాయి. మరో 38 క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వీటిని ఎంఎస్‌ఎంఈ సీడీపీ కింద అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా 6,237 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు వస్తాయి. 58,591 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మరో 65 క్లస్టర్లకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
1.13 లక్షల ఎంఎస్‌ఎంఈలు.. 11 లక్షల మందికి ఉపాధి
ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,754 గుర్తింపు పొందిన ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.39,211 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 10.81 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఎంఎస్‌ఎంఈ యూనిట్‌లో కోటి రూపాయల పెట్టబడికి 28 మందికి ఉపాధి లభిస్తోంది. సగటున ప్రతి ఎంఎస్‌ఎంఈ 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 24 శాతం ఎంఎస్‌ఎంఈలు సేవల రంగంలో ఉండగా, 18 శాతం వ్యవసాయ–ఆహారం రంగాలకు చెందినవి. నిర్మాణ రంగం 9 శాతం, టెక్స్‌టైల్స్ , ఫార్మా 8 శాతం చొప్పున ఉన్నాయి.
జోరుగా ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల పనులు
Published Tue, Jun 21 2022 5:35 AM | Last Updated on Tue, Jun 21 2022 9:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment