Clusters
-
5 రాష్ట్రాల్లో షిప్ బిల్డింగ్ క్లస్టర్స్.. లిస్ట్‌లో ఏపీ
న్యూఢిల్లీ: షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్లను అయిదు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ బుధవారం తెలిపారు. నౌకా నిర్మాణం, నౌకల మరమ్మత్తు వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశాలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు.మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులలో తన మంత్రిత్వ శాఖ సాధించిన ప్రధాన విజయాలను ఈ సందర్భంగా సోనోవాల్ వివరించారు. రాబోయే ఐదేళ్లలో కంటైనర్ హ్యాండ్లింగ్ 40 మిలియన్ టీఈయూలకు (ట్వెంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు. తొలి భారతీయ పోర్టుగా.. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నిర్వహణ సామర్థ్యాన్ని ప్రస్తుత 6.6 మిలియన్ టీఈయూల నుండి 10 మిలియన్లకు పెంచుకుంటుందని సోనోవాల్ వివరించారు. ఇది కార్యరూపం దాలిస్తే ఈ సామర్థ్యానికి చేరుకున్న తొలి భారతీయ పోర్టుగా నిలుస్తుందని అన్నారు. హైడ్రోజన్ తయారీ కేంద్రాల ఏర్పాటుకై దీనదయాళ్ పోర్ట్ అథారిటీ, వీఓ చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్‌లో 3,900 ఎకరాల భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు.ఇది రానున్న సంవత్సరాల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన వెల్లడించారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని గలాథియా బే వద్ద అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రధాన ట్రాన్స్షిప్మెంట్ హబ్‌గా పనిచేస్తుందని వివరించారు. టాప్–10 కంటైనర్ పోర్ట్‌లలో.. కామరాజర్ ఓడరేవును స్థాపించిన 25 సంవత్సరాల తరువాత వధ్వన్ పోర్ట్ చేరిక భారత సముద్ర ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. 21వ శతాబ్దపు భారత మొట్టమొదటి ప్రధాన పోర్ట్ ప్రాజెక్ట్ అయిన వధ్వన్ పోర్ట్ 298 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అతిపెద్ద ఆల్ వెదర్ డీప్ వాటర్ పోర్ట్‌లలో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉందన్నారు.ఈ మెగా పోర్ట్ 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ షిప్పింగ్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, రవాణా సమయం, ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రపంచంలో టాప్–10 కంటైనర్ పోర్ట్‌లలో ఒకటిగా ఉంచుతుందని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. -
3 నెలల్లో.. 4 క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. తక్కువ వ్యయంతో ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పోటీ మార్కెట్లో నిలబడే విధంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఔత్సాహికుల చేయిపట్టుకుని నడిపిస్తోంది. దేశంలోనే మొదటగా కాకినాడలో ఏర్పాటైన ప్రింటింగ్ క్లస్టర్ విజయవంతంగా అందుబాటులోకి రావడంతో.. అదే స్ఫూర్తితో ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. రూ.46.03 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు క్లస్టర్లను మూడునెలల్లోగా అందుబాటులోకి తీసుకువాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద రూ.14.98 కోట్లతో ప్రింటింగ్ క్లస్టర్, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పుదినుసులు తయారు చేసే పల్సస్ క్లస్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో గార్మెంట్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. చుట్టపక్కల ప్రాంతాల్లో ఉండే సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లు జట్టుకట్టి ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పడి ఈ క్లస్టర్లలో ఉమ్మడిగా మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మార్చిలోగా ఈ నాలుగు క్లస్టర్లను ప్రారంభించే విధంగా పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.గోపాలకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నాలుగు క్లస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మ్యాచింగ్ గ్రాంట్, ఎస్పీవీలు సమకూర్చాల్సిన మొత్తం ఇప్పటికే జమచేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నాలుగు క్లస్టర్లతో సుమారు 25 వేలమందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం బకాయిలు గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకుందని తెలిపారు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు 1,93,530 కాగా.. వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఏకంగా 5,81,152కు చేరింది. నాలుగున్నరేళ్లలో క్తొతగా 3.87 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఎంఎస్ఎంఈల ద్వారా 34.83 లక్షల మందికి ఉపాధి లభిస్తుంటే.. ఈ నాలుగున్నరేళ్లలోనే కొత్తగా 12.61 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ఉద్యమ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
జోరుగా ఎంఎస్ఎంఈ క్లస్టర్ల పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలవారీగా ఉత్పత్తుల ఆధారిత క్లస్టర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. మరో 38 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ప్రింటింగ్, ఫర్నీచర్, పప్పు ధాన్యాలు, బంగారు ఆభరణాలు, రెడీమేడ్ దుస్తుల క్లస్టర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాకినాడ సమీపంలో రూ.14.76 కోట్లతో ప్రింటింగ్ క్లస్టర్, రాజమండ్రి వద్ద రూ.14.98 కోట్లతో ఫర్నీచర్ తయారీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పు ధాన్యాలు, జగ్గయ్యపేట వద్ద రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ, నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో రెడీమేడ్ దుస్తుల క్లస్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఎంఎంస్ఎంఈ సీడీపీ ప్రాజెక్టులో రూ.10 కోట్ల లోపు ప్రాజెక్టులకు కేంద్రం 70% గ్రాంటుగా ఇస్తుంది. రాష్ట్రం 20%.. ఎస్పీవీ 10 శాతం భరించాలి. రూ.10 నుంచి 30 కోట్ల లోపు క్టస్లర్లకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 20, ఎస్పీవీ 20 శాతం నిధులివ్వాలి. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న 5 క్లస్టర్లకు రూ.60.80 కోట్లు వ్యయమవుతోంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.11.36 కోట్లు, ఎస్పీవీ కింద రూ.6.33 కోట్లు మ్యాంచింగ్ గ్రాంట్‌ను విడుదల చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలు, ఇతర నిర్మాణ పనులకు టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మొత్తం 108 క్లస్టర్లు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లాల వారీగా డిమాండ్ ఉన్న క్లస్టర్ల అభివృద్ధికి కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 108 క్లస్టర్లకు అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే అయిదు క్లస్టర్ల పనులు ప్రారంభమయ్యాయి. మరో 38 క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వీటిని ఎంఎస్ఎంఈ సీడీపీ కింద అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా 6,237 ఎంఎస్ఎంఈ యూనిట్లు వస్తాయి. 58,591 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మరో 65 క్లస్టర్లకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 1.13 లక్షల ఎంఎస్ఎంఈలు.. 11 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,754 గుర్తింపు పొందిన ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.39,211 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 10.81 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఎంఎస్ఎంఈ యూనిట్లో కోటి రూపాయల పెట్టబడికి 28 మందికి ఉపాధి లభిస్తోంది. సగటున ప్రతి ఎంఎస్ఎంఈ 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 24 శాతం ఎంఎస్ఎంఈలు సేవల రంగంలో ఉండగా, 18 శాతం వ్యవసాయ–ఆహారం రంగాలకు చెందినవి. నిర్మాణ రంగం 9 శాతం, టెక్స్టైల్స్ , ఫార్మా 8 శాతం చొప్పున ఉన్నాయి. -
రూ.123 కోట్లతో 13 ఎంఎస్ఈ క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ఏపీలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఎంఎస్ఈ క్లస్టర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజైస్ క్లస్టర్ డెవలప్మెంట్ పోగ్రాం (ఎంఎస్ఈ–సీడీపీ) కింద కొత్తగా 13 క్లస్టర్లతతో పాటు ఏడు ఫ్యాక్టరీ షెడ్లు నిర్మించనుంది. సుమారు రూ.123.07 కోట్లతో 13 ఎంఎస్ఈ క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికలను తయారుచేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. 2,111.59 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్లస్టర్లకు సంబంధించిన ప్రతిపాదనలను న్యూఢిల్లీలోని ఎంఎస్ఎంఈ డీసీ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.33.66 కోట్లు సమకూర్చనుండగా, కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.89.41 కోట్లు కేటాయిస్తుంది. హిందూపురం గ్రోత్ సెంటర్, గుంటూరు ఆటోనగర్, మచిలీపట్నం జ్యూవెలరీ పార్కు, కర్నూలు పారిశ్రామిక పార్కు, కడప, నడికుడి పారిశ్రామికపార్కులు, కానూరు, ఒంగోలు ఆటోనగర్లు, నెల్లిమర్ల, తణుకు, గాజులమండ్యం,రాయచోటి, తిరుపతి పారిశ్రామికపార్కుల్లో ఈ ఎంఎస్ఈ–సీడీపీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ పథకం కింద రూ.11 కోట్లతో కానూరు, ఆమదాలవలస ప్రాజెక్టులను పూర్తిచేయగా, రూ.74.72 కోట్లతో మరో 6 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. యూనిట్లు తక్షణం ఉత్పత్తిని ప్రారంభించుకునే విధంగా 29.14 ఎకరాల విస్తీర్ణంలో రూ.88.62 కోట్లతో ఏడుచోట్ల ఫ్లాటెడ్ ప్యాక్టరీ షెడ్లను నిర్మించనున్నారు. ఆత్మకూరు, మల్లవల్లి, పలమనేరు పారిశ్రామికపార్కులతో పాటు తిరుపతి–1, తిరుపతి–2, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లతో పాటు అచ్యుతాపురం నాన్‌సెజ్ ఏరియాలో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.17.97 కోట్లు ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలినది కేంద్రం గ్రాంట్ రూపంలో ఇస్తుంది. వీటి డీపీఆర్‌లను కేంద్రానికి పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు. -
పంటల వారీగా క్లస్టర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల వారీగా క్లస్టర్లను ప్రభుత్వం గుర్తించింది. ఏ పంట ఏ క్లస్టర్లలో అధికంగా సాగవుతుందో నిర్ధారించింది. గుర్తించిన క్లస్టర్లలో వచ్చే వానాకాలం సీజన్లో పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. పంట కోత అనంతరం క్లస్టర్ల ఆధారంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. పంటలు శాస్త్రీయంగా సాగు కావాలన్నది క్లస్టర్ల నిర్ధారణలోని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల రైతులకు బాగా ప్రయోజనం కలుగుతుందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్లస్టర్ల ప్రకారం ఈసారి వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. రాష్ట్రంలో సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయా బీన్‌తో పాటు పలు పంటలను ఏ జిల్లాలో ఎంత వేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏ పంట ఎక్కువగా సాగవుతుందో దానిపై దృష్టి ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువగా సాగవుతుందనే దాని ఆధారంగా ఆ పంట క్లస్టర్‌ను గుర్తించారు. ఒకవేళ రెండు ప్రధాన పంటలుంటే, వాటిల్లో ఏది 50 శాతం పైగా ఉందో దాన్ని ఆ పంట క్లస్టర్ (ఐదు వేల ఎకరాలు)గా నిర్ధారించారు. ఆ క్లస్టర్లో ఆ పంటపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. రైతులకు కూడా ఆ ప్రధాన పంటపైనే అవగాహన కల్పిస్తారు. నిర్దిష్ట పంట క్లస్టర్లో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రధాన పంటలను 2,615 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 , కందులకు 71, సోయాబీన్‌కు 21, మొక్కజొన్నకు 9 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాగర్‌కర్నూల్‌లో 142 పంట క్లస్టర్లు.. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో 142 పంట క్లస్టర్లు, నల్లగొండ జిల్లాలో 140, ఖమ్మం జిల్లాలో 129, సిద్దిపేటలో 128 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడ్చల్, ములుగు జిల్లాల్లో అత్యంత తక్కువగా 15 క్లస్టర్ల చొప్పున మాత్రమే ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ 5 వేల ఎకరాల్లో ఉండగా, వాటిని పంటల వారీగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పత్తి క్లస్టర్లే ఎక్కువ.. మొక్కజొన్న మూడు జిల్లాల్లోనే రాష్ట్రంలో గుర్తించిన క్లస్టర్లలో అత్యధికంగా పత్తి క్లస్టర్లే ఉన్నాయి. అయితే జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో పత్తి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. కాగా ఆ జిల్లాల్లో ఏ ఒక్కచోట కూడా అత్యధికంగా పత్తి సాగు కావడం లేదని దీనిని బట్టి తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏకంగా 110 క్లస్టర్లలో పత్తి సాగు చేస్తారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో వరి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. అక్కడ 98 పత్తి క్లస్టర్లు ఉన్నాయి. ఇక నారాయణపేట సహా ఎనిమిది జిల్లాల్లో కంది క్లస్టర్లు, కామారెడ్డితో పాటు నాలుగు జిల్లాల్లో సోయాబీన్ క్లస్టర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి అయినా.. కేవలం మూడు జిల్లాల్లోనే ఈ పంట క్లస్టర్లు ఉన్నాయి. 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు! రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వానాకాలంలో పత్తి పంటను ఎక్కువగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దాదాపు 80 లక్షల ఎకరాలకుపైగా పత్తి వేసేలా ప్రణాళికలు రచిస్తోంది. పత్తి పంటతో వచ్చే లాభాలు రైతులకు వివరించి ఎక్కువ సాగయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. గత ఏడాది వానాకాలంలో వేసిన పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా పత్తినే ఎక్కువ వేయాలని రైతులకు సూచించాలని నిర్ణయించింది. ఒకవేళ మార్కెట్లో ధర పడిపోయినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వరి సాగుపై గందరగోళం కొనసాగుతున్నందున రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
క్లస్టర్ల విభజనకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ల విభజనకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 246 క్లస్టర్లను గుర్తించింది. గడిచిన 5 రోజుల్లో కేసులు రికార్డయితే అది వెరీ యాక్టివ్ క్లస్టర్.. గడిచిన 6 నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైనా 5 రోజుల్లోగా కేసులు లేకపోతే అది యాక్టివ్ క్లస్టర్. గడిచిన 15 నుంచి 28 రోజుల్లో కేసులు నమోదైనా.. 15 రోజుల్లోగా కేసులు నమోదు కాకపోతే అది డార్మంట్ క్లస్టర్. 28 రోజులుగా కేసులు నమోదు కాకపోతే అక్కడ ఆపరేషన్ ముగుస్తుంది. కంటైన్మెంట్ క్లస్టర్లో పాజిటివ్ కేసు ఉన్న ఇంటి నుంచి ప్రారంభమై 500 మీటర్ల నుంచి 1 కి.మీ వరకూ 3 కిలోమీటర్ల వరకూ బఫర్ జోన్ (కేసు ఉన్న ఇంటి నుంచి దూరంతో కలుపుకుని) కేసుల సంఖ్య, కాంటాక్ట్స్, తీవ్రతను బట్టి జిల్లా అధికారులు పరిధిని మార్చవచ్చు. అర్బన్ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ కాలనీలు, మున్సిపల్ వార్డులు వారీగా కంటైన్మెంట్ క్లస్టర్లు.. కంటైన్మెంట్ క్లస్టర్‌కు సమీపంలో ఉన్న వార్డులు, కాలనీల్లో సర్వేలెన్స్ కొనసాగుతుంది. రూరల్ ప్రాంతాల్లో పంచాయతీల ప్రాతిపదికన కంటైన్మెంట్ క్లస్టర్ కేసులు, కాంటాక్టులను బట్టి... అధికారులు దీనిచుట్టూ పరిధిని పెంచే అవకాశం ఉంటుంది. కంటైన్మెంట్ క్లస్టర్లలో బారికేడ్లతో రోడ్ల మూసివేతతో పాటు అన్నిరకాల కదలికలు నిషేధం. నిత్యావసరాలకు ఇంటికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. వీలైనంత వరకూ ఇంటివద్దకే నిత్యావసరాల పంపిణీ చేస్తారు. కంటైన్మెంట్ క్లస్టర్ల వద్దకే మొబైల్ వాహనాలతో నిత్యావసరాల పంపిణీ జరుగుతుంది. వ్యక్తుల కదలికలన్నీ రికార్డు చేస్తారు. ప్రతి కుటుంబం ఆరోగ్యపరిస్థితులపై సంపూర్ణంగా పర్యవేక్షిస్తారు. కేసులు వారి కాంటాక్టుల వివరాలను 12, 24 గంటలకోసారి అప్డేట్ చేస్తారు. వైరస్ సోకినవారికి ఉన్న లక్షణాలను బట్టి క్వారంటైన్‌కు తరలిస్తారు. హై రిస్క్ ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రోటోకాల్. మంచి వైద్యం కోసం తరలిస్తారు. కంటైన్మెంట్ క్లస్టర్లో ఉన్నవారంతా ఆరోగ్య సేతులో 100 శాతం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. -
భారత తీరానికి యూరప్ హారం
ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలతో మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్ కూడా తమిళనాడు, గుజరాత్‌లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్‌ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మతులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా ఏపీ సరుకు రవాణా 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. కోటి జనాభాకు మించని గ్రీస్ దేశం ఏటా ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమానంగా షిప్పింగ్ బిజినెస్ ద్వారా ఆర్జించడం గమనార్హం. భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశంలోని రెండు తీర ప్రాంతాల్లో ‘సముద్ర వాణిజ్య సముదాయాలు’ (మారిటైమ్ క్లస్టర్ల)ను ఏర్పాటు చేస్తోంది. ఒకటి గుజరాత్లో... రెండోది పొరుగునున్న తమిళనాడులో. మరి సుదీర్ఘమైన తీర ప్రాంతంతో విరాజిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ లోనూ మరో మారిటైమ్ క్లస్టర్ రావాలి. దీనికి కేంద్రం పచ్చజెండా ఊపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇపుడెందుకంటే మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సముద్ర వాణిజ్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నౌకా నిర్మాణాలు, నౌకల మర మ్మతులకు సంబంధించిన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. దీనివల్ల విదేశాల నుంచి మన షిప్ యార్డులకు నౌకా నిర్మాణాల ఆర్డర్లు పెరిగే అవకాశముంది. దీంతో నిపు ణులు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దేశీ యంగా నౌకా నిర్మాణ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలు మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్ కూడా తమిళనాడు, గుజరాత్‌లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్‌ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మ తులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా ఏపీ సరుకు రవాణా 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఐరోపాతో భారత ఉప ఖండానికి సరైన వారధి సముద్రమే. తీరప్రాంతాలలో వెలసిన అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్, ప్రపంచం లోనే రెండో చిన్న ఖండమైన యూరప్ స్నేహగీతం ఆలపిస్తున్నాయి. నిజానికి నాగరిక జీవనం ఆరంభం నుంచీ భౌగోళిక, చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన యూరప్ నుంచి రాక పోకలకు భారత్ ప్రధాన ద్వారంగానే ఉంటూ వస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఇరుదేశాల స్నేహపూర్వక సంబంధాలు సుహృద్భావ వాతావ రణాన్ని నెలకొల్పాయి. ఐరోపాకు తూర్పున కాస్పి యన్, పశ్చిమాన అట్లాంటిక్, ఉత్త రాన ఆర్కిటిక్, దక్షిణాన మధ్యదరా సముద్రాలతో పాటు ఆగ్నే యాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం సరి హద్దులుగా ఉన్నాయి. ఇక భారతదేశానికి అత్యధిక జనాభాతో పాటు ఏడు వేల కిలోమీ టర్లకు పైగా సముద్ర తీరం కూడా ఉంది. యూరప్ ఖండాన్ని, భారత్ ఉపఖండాన్ని మిత్ర దేశాలుగా ఉంచుతున్న ఈ సముద్రాలు... ఇరు దేశాల మధ్య వాణిజ్య అవ కాశాలను మరింత పెంచే అవకాశాలనూ అంది స్తున్నాయి. భారతదేశ వాణిజ్యమంతా సముద్రయానం పైనే ఆధారపడి ఉంది. 95 శాతం వ్యాపారం పూర్తిగా సముద్రం మీదుగానే సాగుతోంది. ముడి చమురు దిగుమతులలో భారత్‌ది 3వ స్థానం. గ్రీస్ నుంచి ఎల్ఎన్జీ, ఎల్పీజీలను దిగుమతి చేసుకోవడంలోనూ భారత్ వాటాయే అధికం. ఇక నౌకాయాన వాణిజ్యంలో ప్రపంచంలోనే మొదటి స్థానం భారత్‌ది. ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు సాగించే నౌకలలో 50 శాతం గుజరాత్‌లోని అలంగ్ పోర్ట్ నుంచే సాగుతున్నాయి. భారత నౌకా వాణిజ్యంలో ఎంతగా దూసుకుపోతోందో చెప్ప డానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గ్రీస్, భారత్ దేశాల మధ్య సముద్రయాన వాణిజ్య సంబంధాల వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. ఇక భారత్‌లోని తీర ప్రాంతంలో 12 శాతం ఆంధ్రప్రదేశ్ సొంతం. 974 కిలోమీటర్ల ఈ తీరంలో ఒక మేజర్ పోర్టు, 14 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భాగ స్వామ్యంలో నిర్వహిస్తున్న మరో 6 పోర్టులూ ఉన్నాయి. సముద్రమార్గంలో అత్యధిక సరుకు రవాణా చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది గుజరాత్ తరువాతి స్థానం. 2018 నాటికి 15 కోట్ల మెట్రిక్ టన్నులున్న సరుకు రవాణా 2020 నాటికి 16.5 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని 10 శాతం పెరు గుదల నమోదు చేస్తుందనేది తాజా అంచనా. ప్రాచీనకాలం నుంచి సముద్రరవాణాపై ఆధారప డిన గ్రీస్ దేశ జనాభా కోటికి మించదు. గ్రీకుల వాణిజ్యమంతా జల రవాణా ద్వారానే జరుగుతుం డటం మరో విశేషం. అందుకని ఏపీ సముద్ర రవా ణాకు, వాణిజ్యబంధానికి గ్రీస్ దేశం సరిగ్గా సరిపో తుంది. దీని కోసం ఏపీ తీరంలో మరిన్ని పోర్టులు, షిప్పింగ్ కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది. షిప్పింగ్ బిజినెస్ ద్వారా ఏటా 25 బిలియన్ల డాలర్లను గ్రీస్ దేశం ఆర్జిస్తోంది. ఇది ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమానం. నిజానికి గ్రీస్ స్థాయిలో నౌకా రవాణా, షిప్పింగ్ బిజినెస్‌లో వృద్ధి సాధిం చేందుకు ఏపీలో అనువైన పరిస్థితులే ఉన్నాయి. తీరప్రాంతంలో వాణిజ్య, వ్యాపారాలు సులభ తరం చేసేలా ప్రభుత్వాలు తగు వి«ధానాలు కూడా రూపొందించాయి. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ వీలు కల్పించాయి. రానున్న రోజుల్లో 35 ఏళ్ల లోపు యువతలో 65 శాతం దేశాభివృద్ధిలో భాగమయ్యే అవకాశం ఉంది. ఇక శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు చేయూతనం దించేందుకు గ్రీస్‌లో అవలంబిస్తున్న విద్యావిధానాలు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు భారత్‌లో కూడా అమలవుతున్నాయి. కాబట్టి తగు ప్రణాళిక లతో గ్రీస్ ఆలోచనలు, ఆచరణను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుంచి ఎగుమతులు దిగుమతులు (లక్షల మెట్రిక్ టన్నులలో) పోర్ట్ 2018 2020 నాటికి అంచనా విశాఖపట్నం 600 650 కృష్ణపట్నం 450 500 గంగవరం 230 250 కాకినాడ 200 220 రవ్వ 20 30 డా. గేదెల శ్రీనుబాబు వ్యాస రచయిత పల్సస్ సీఈవో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రితో కలిసి ఇటీవల గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రతినిధి -
చేనేత కార్మికుల సమస్యలపై చర్చించాం
-
మరో 10 క్లస్టర్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేనేత రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇప్పటికే మంజూరు చేసిన హ్యాండ్లూమ్ క్లస్టర్లకు అదనంగా మరో 10 కొత్త వాటిని మంజూరు చేయాలని కేంద్ర జౌళి మంత్రి స్మృతీ ఇరానీని రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు కోరారు. మంగళవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన కేటీఆర్ చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇప్పటికే రూ.1,200 కోట్ల బడ్జెట్‌తో నేతన్నకు చేయూత, చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇప్పటికే మంజూరు చేసిన హ్యాండ్లూమ్ క్లస్టర్లకు అదనంగా మరో 10 క్లస్టర్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి జౌళి శాఖ సంయుక్త కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 8 వేల పవర్‌లూమ్స్‌ను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని, దీనికయ్యే ఖర్చులో కేంద్రం నుంచి రావాల్సిన సగం వాటా నిధుల విడుదల ఆలస్యం కావడంతో పనులు జరగడం లేదని వివరించారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరానన్నారు. ఈ నిధుల విడుదలపై ముంబైలోని జౌళి శాఖ కమిషనర్‌తో కేంద్ర మంత్రి మాట్లాడినట్లు వివరించారు. -
స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యల గురించి మంత్రి స్మృతి ఇరానీతో చర్చించనట్లు తెలిపారు. హ్యాండ్లూమ్, పవర్ లూం రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్మృతి ఇరానీకి వివరించానన్నారు. నేతన్నకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 12 వందల కోట్ల రూపాయలతో ప్రారంభించిన పథకాల గురించి వివరించానన్నారు. అంతేకాక 8 వేల మగ్గాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవేకాక మరో 10 క్లస్టర్లను మంజూరు చేయాల్సిందిగా మంత్రి స్మృతి ఇరానీని కోరానని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకునేవిధంగా ఈ క్లస్టర్స్ ఉంటాయన్నారు. క్లస్టర్ల ఏర్పాటు కోసం కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళానన్నారు. అందుకు స్మృతి ఇరానీ సానుకులంగా స్పందించినట్లు తెలిపారు. -
పాలన లేని పల్లెలేల..!
సాక్షి, హైదరాబాద్: పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు గ్రామ పంచాయతీలను పునర్‌వ్యవస్థీకరిస్తామంటోంది. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులిస్తామని పేర్కొంటోంది. కానీ పంచాయతీల పాలనలో కీలకమైన గ్రామ కార్యదర్శుల నియామకంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికీ 30 శాతం పంచాయతీల్లో కార్యదర్శుల్లేక ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక రూపకల్పన చేసే, పథకాలు అమలు చేసే నాథుడు లేక పనులు కుంటుపడుతున్నాయి. దీనికితోడు తాజాగా 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతో పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభా వం చూపబోతోంది. పన్నెండు వేలకు పెరగనున్న పంచాయతీలు రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలుండగా.. 5,065 గ్రామ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాలన సౌలభ్యం కోసం పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 5,500 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3,519 మంది కార్యదర్శులే పని చేస్తుండటంతో.. క్లస్టర్లతోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలనూ అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలొచ్చాయి. ప్రతిపాదనలు ఆమోదిస్తే పంచాయతీల సంఖ్య 12,806కు పెరుగుతుంది. దీంతో సగటున 3, 4 గ్రామాలకు ఒకరు చొప్పున కార్యదర్శిగా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గ్రామాల పాలన ఇబ్బందిగా మారుతుంది. ప్రణాళిక రూపకల్పన, పన్నుల వసూలు, నిధుల ఖర్చు తదితరాలపై ప్రభావం పడే అవకాశముంది. దీంతో ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని, ఖాళీగా ఉన్న గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖలో డిమాండ్ వినిపిస్తోంది. -
త్వరలో 10 చేనేత క్లస్టర్ల ఏర్పాటు
వెదురుపాక (రాయవరం) : త్వరలో జిల్లాలో 10 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు ఎస్ఎస్ఎస్ఆర్కేఆర్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఉప్పాడ, తాటిపర్తి, గొల్లప్రోలు, ఒమ్మంగి, పసలపూడి, పులుగుర్త, కొట్టాం తదితరచోట్ల బ్లాక్ లెవెల్ హేండ్లూమ్ క్లస్టర్లు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే క్లస్టర్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాలుంటాయన్నారు. ఒక్కో క్టస్టర్‌కు అవి చేసే వ్యాపారాన్నిబట్టి రూ.కోటి నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించగానే క్లస్టర్ పరిధిలోని చేనేత కార్మికులకు శిక్షణ, పనిముట్లు ఇవ్వడంతోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్, యార్న్ డిపో ఏర్పాటు చేస్తామని వివరించారు. జిల్లాలోని 50 చేనేత సహకార సంఘాల పరిధిలో 12,800 మగ్గాలు ఉన్నాయని, వీటిపై సుమారు 20 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న 50 చేనేత సంఘాల ద్వారా ఏటా రూ.15కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు ప్రసాద్ వెల్లడించారు. చేనేత రంగంపై కార్మికులకు ఏటా ఆసక్తి తగ్గుతున్నట్లు గుర్తిస్తున్నామన్నారు. జిల్లాలో సహకార రంగంలో 12 వేలు, సహకారేతర రంగంలో 3 వేల మగ్గాలున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 వేల వరకూ మగ్గాలు తగ్గినట్లు గుర్తించామన్నారు. 35 ఏళ్లు పైబడినవారు మాత్రమే ఈ రంగంలో ఉంటున్నారని, ప్రస్తుత తరం యువకులు ఈ రంగంపై ఆసక్తి చూపడంలేదని అన్నారు. 2014 జూలై నెలాఖరు వరకూ ఉన్న వస్త్రనిల్వలపై 20 శాతం రిబేటు ఉందన్నారు. ఏటా రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. దారాలపై చేనేత సంఘాలకు 20 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఉన్న 2,300 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ రూ.5 కోట్లు మంజూరైందన్నారు. ఈ సొమ్మును త్వరలోనే బ్యాంకులకు సర్దుబాటు చేస్తామని ప్రసాద్ తెలిపారు. -
రేపటి నుంచి పోలియో వ్యాక్సిన్
♦ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాం ♦ క్రమబద్ధీకరణకు ఇదే ఆఖరి అవకాశం ♦ హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 20 నుంచి 26 వరకు హైదరాబాద్ జిల్లాలోని 11 క్లస్టర్లు, రంగారెడ్డి జిల్లాలోని 12 పీహెచ్‌సీల పరిధిలో పల్స్‌పోలియో వ్యాక్సిన్ (ఇనక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్) వేయనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శనివారం రంగారెడ్డి కలెక్టరేట్లో క లెక్టర్ ఎం.రఘునందన్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 6 వారాల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. నగరంలోని అంబర్పేట్ నాలా ప్రాంతంలో ఇటీవల గుర్తించిన పోలియో వైరస్ కారణంగా టీకాలు వేయాల్సిన చిన్నారుల సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో దాదాపు 2.5 లక్షల చిన్నారులను ఈ సర్వేలో గుర్తించినట్లు రాహుల్ బొజ్జా చెప్పారు. నాలా సంబంధిత ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలియో వ్యాక్సిన్ ఇంజక్షన్‌పై అపోహలు అవసరం లేదని, భయపడొద్దని తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుకై.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు 10వ తరగతి ఫలితాల్లో చివరి స్థానాల్లో నిలుస్తున్నాయని, దీనికి పలు కారణాలున్నట్లు కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రూపొం దించిందన్నారు. ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను అధిక సంఖ్యలో చేర్పించటమే లక్ష్యంగా కొనసాగిందన్నారు. ప్రభుత్వం మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, హాస్టల్ వసతి అందించడమే లక్ష్యంతో హైదరాబాద్‌లో 7, రంగారెడ్డిలో 9 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మాదిరిగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉత్తమ విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణకు లాస్ట్ ఛాన్స్.. పట్టణ భూగరిష్ట చట్టం కింద మిగులు భూములను జూన్ 25 లోగా క్రమబద్దీకరించుకోవాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్నారు. క్రమబద్ధీకరించుకోని భూములను స్వాదీనం చేసుకుంటామని హెచ్చరించారు. జీవో 58, 59 కింద అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు డ్రైవ్ చేపట్టినప్పటికీ ఆశించిన రీతిలో ప్రజలు ముందుకురాలేదన్నారు. ఇందుకు అవగాహన లోపమే కారణమని గుర్తించిన తాము యూఎల్సీ ఖాళీ మిగులు భూముల క్రమబద్దీకరణకు విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి వారికి నోటీసులను అంద జేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ వల్ల యజమానులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని, భూహక్కుతో పాటూ కచ్చితమైన విలువ పొందొచ్చన్నారు. క్రయ విక్రయాలు కూడా జరుపుకునే అవకాశముందని చెప్పారు. ఈ సమావేశ ంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ షైనీ, యూఎల్సీ ప్రత్యేక అధికారి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఆర్ఓ సత్తయ్య పాల్గొన్నారు. -
‘కష్ట’ర్లు
♦ నాలుగైదు క్లస్టర్లకు ఒకరే కార్యదర్శి ♦ 179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ ♦ అస్తవ్యస్తంగా పల్లె పాలన ♦ గ్రామ సచివాలయాల వద్ద ప్రజల పడిగాపులు దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది.. కార్యదర్శుల్లేక రోజు రోజుకు కునారిల్లుతున్నాయి. స్మార్ట్‌విలేజ్ అంటూ హడావుడిచేసిన సర్కార్ ఆ తర్వాత ఆ ఊసెత్తడం లేదు. కనీసం పల్లెల్లో పాలనపై కూడా దృష్టి పెట్టడం లేదు. కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులను దారి మళ్లిస్తూ దొడ్డిదారిన పెత్తనం చెలాయిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : గ్రామ సచివాలయాలుగా పిలవబడే పంచాయతీ కార్యాలయాలు ఎప్పుడు చూసినా తాళాలు వేసే కన్పిస్తున్నాయి. అవసరానికి తగ్గట్టుగా కార్యదర్శుల్లేక ఈ కార్యాలయాల్లో పాలన పట్టాలు తప్పింది. ఉన్న కొద్ది మంది కార్యదర్శులపై పనిభారం పెరిగి పోవడంతో వారానికో రోజు కూడా కార్యాలయాల్లో అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. 2 నుంచి 5 పంచాయతీల కొకటి చొప్పున 558 క్లస్టర్లుగా కుదించారు. కనీసం ఈ క్లస్టర్లకైనా పూర్తిస్థాయిలో కార్యదర్శులున్నారా అంటే అదీలేదు. 558 క్లస్టర్లుకు కేవలం 379 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. 179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ : రూ.5 లక్షలపైబడి ఆదాయమున్న గ్రేడ్-1 క్లస్టర్లు 77 ఉంటే వాటి పరిధిలో 61 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయమున్న గ్రేడ్-2 క్లస్టర్లు 50 ఉంటే 39కి మాత్రమే కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష నుంచి రూ.3 లక్షల ఆదాయమున్న గ్రేడ్-3 క్లస్టర్లు 151 ఉంటే.. కేవలం 49 చోట్లే కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష లోపు ఆదాయం ఉన్న 280గ్రేడ్-4 క్లస్టర్లకు గాను 230 మంది కార్యదర్శులున్నారు. 2013లో 55 మంది కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయగా.. ఏపీపీ ఎస్సీ ద్వారా 155 మందిని కొత్తగా నియమించడంతో ఆ మాత్రమైనా కార్యదర్శులున్నారు. లేకపోతే మరీ ఘోరంగా ఉండేది. ఇంకా 179 క్లస్టర్లకు కార్యదర్శులు లేకపోవడం వల్ల వీటి పరిధిలో ఉన్న సగానికి పైగా పంచాయతీలు దిక్కూమొక్కూలేని అనాథల్లా తయారయ్యాయి. పంచాయతీల్లో వారానికోరోజే.. కార్యదర్శుల కొరత కారణంగా నాలుగైదు క్లస్టర్స్ కొకరు చొప్పున కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే ఒక్కో కార్యదర్శిపై ఐదునుంచి 10 పంచాయతీల భారం పడింది. ప్రతీనెలా 1 నుంచి 10వ తేదీ వరకు పింఛన్ల పంపిణీలో తలమునకలవ్వాల్సి వస్తోంది. ఆ తర్వాత సమావేశాలు.. సమీక్షలు, పన్నుల వసూళ్లంటూ ఊళ్లమ్మట తిరగడంతో నెలలో పట్టుమని నాలుగైదురోజులు కూడా కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి. కొంతమంది అయితే ఇదేఆసరాగా చేసుకుని సొంత పనులు చక్కబెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. లక్ష్యానికి దూరంగా పన్నుల వసూలు జిల్లాలో పన్నుల వసూలు డిమాండ్ రూ.38 కోట్లు కాగా మరో నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. రూ.13కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. మరో పక్క జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎన్వోసీలు ఇలా పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు కార్యదర్శుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. చివరకు మిగిలింది ఆరుగురే.. ఖాళీ పోస్టులను భర్తీచేయాల్సిన సర్కార్ ఆ ఊసెత్తకుండా వివిధ శాఖల్లో అదనపు సిబ్బందిని పంపించాలన్న ఆలోచనతో జీవో 966ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం 19 మంది మాత్రమే కార్యదర్శులుగా చేరేందుకు ఆసక్తిచూపగా.. డిగ్రీ అర్హత ఉన్న రెగ్యులర్ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలని తొలుత జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 10మందిని అర్హులుగా నిర్ధారించారు. కానీ తాజాగా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉన్న ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పడంతో దరఖాస్తు చేసిన అటెండర్ స్థాయి సిబ్బందిని జాబితా నుంచి తప్పించడంతో చివరికి మిగిలింది ఆరుగురే. వీరికి శిక్షణ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. వెనక్కి వెళ్లనున్న డిప్యుటేషన్ సిబ్బంది మరో పక్క ఇప్పటికే డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 22 మందిలో ఒకరు లాంగ్ లీవ్‌లో ఉండగా.. మిగిలిన 21మంది పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 14 ఏళ్లుగా పనిచేస్తూ, పదోన్నతులు పొందే అవకాశాన్ని కోల్పోతుండడంతో సొంత శాఖలకు వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్నారు. వీరు కూడా వెళ్లిపోతే పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయకుంటే పంచాయతీల పాలన మరింత కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక క్లస్టర్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అవకాశాల స్వర్గంగా ఆధునిక హంగులు సొంతం చేసుకోనున్న మన జిల్లా త్వరలోవిశ్వ విపణిలో ఆధునిక నగరాల సరసన చేరనుంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతుంది. గ్లోబల్‌సిటీగా మలచాలనే కొత్త ప్రభుత్వం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. షాంైఘై, చండీగఢ్ సిటీల తరహాలో పక్కా ప్రణాళికతో నగర శివార్లను అభివృద్ధిచేసే దిశగా అడుగులు వేస్తోంది. చారిత్రక నగరంగా పేరున్న హైదరాబాద్ మురికి మయంగా తయారుచేసిన గత పాలకుల నిర్వాకాలకు భిన్నంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఘట్కేసర్, శామీర్‌పేట ప్రాంతాల్లో మధ్యస్థ విమానాశ్రయాలు, రేడియల్ రహదారులు, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పేందుకు నూతన కారిడార్లు, మౌలిక వసతులు ఇలా.. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలబెట్టేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మార్గనిర్దేశానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం కోటి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ జనాభా రానున్న ఐదేళ్లలో మూడు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న సర్కారు.. అందుకనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడానికి కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ కన్సల్టెన్సీల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా జిల్లాలోని రెండు వేల చిన్ననీటి పారుదల చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. రీజినల్ రింగ్‌రోడ్డు: ప్రస్తుతం ఔటర్‌రింగ్ రోడ్డుకు అవతల రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి 60-70 కిలోమీటర్ల దూరంలో నగరాన్ని చుట్టుతూ ఈ రోడ్డు నిర్మితమవుతుంది. రెండు రింగ్‌రోడ్డుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మలచాలని సర్కారు యోచిస్తోంది. ఫార్మా, ఐటీ తదితర రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పరిధి అంతటికీ ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీని ఆదేశించారు. రెండు ఎయిర్‌పోర్టులు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికితోడు జిల్లాలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో శివార్లు శరవేగంగా అభివృద్ది చెందుతాయని అంచనా వేసిన సర్కారు.. శామీర్‌పేట, ఘట్కేసర్ ప్రాంతాల్లో మధ్యతరహా ఎయిర్‌పోర్టులను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు భూసేకరణపై దృష్టి సారించింది. కనెక్టివిటీ: కొత్త పరిశ్రమల స్థాపన, నగరీకరణ ఇక పూర్తిగా ఔటర్ రింగ్‌రోడ్డు బయటే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాలకు సులువుగా చేరుకునేందుకు రవాణా సదుపాయాలను మెరుగు పరచనుంది. దీనికి కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్)ను విస్తరించాలని నిర్ణయించింది. శివారు ప్రాంతాలకు ఈ రైళ్లను పొడిగించడం ద్వారా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. పారిశ్రామికవాడలు: పారిశ్రామిక అవసరాలకు జిల్లా యంత్రాంగం 19వేల ఎకరాలను సిద్ధం చేసింది. క్లస్టర్లుగా పరిశ్రమలను నోటిఫై చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కొత్త సంస్థలకు కేటాయించేందుకు వీలుగా భూదాన్ యజ్జబోర్డు, సీలింగ్, యూఎల్సీ భూములతో ల్యాండ్‌బ్యాంకును తయారు చేస్తోంది. -
బాబోయ్.. ఇదేం ‘పంచాయితీ’
సాక్షి, సంగారెడ్డి: నిరుద్యోగుల భవిష్యత్తుతో సర్కారు చెలగాటమాడుతోంది. పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీలో సర్కార్ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. ఖాళీ పోస్టుల సంఖ్యను విడగొట్టి రెండు వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తోంది. జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలుంటే 514 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శి పోస్టు మంజూరు చేశా రు. ప్రస్తుతం 318 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండగా అందులో 208 మంది కాంట్రాక్టు ఉద్యోగులే. 110 మంది మాత్రమే రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. దాదాపు 504 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఈ పోస్టులను విభజించి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడం నిరుద్యోగుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 208 మంది కార్యదర్శులను నేరుగా క్రమబద్ధీకరిస్తే ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరించాల్సివస్తుందనే భావనతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గత అక్టోబర్ 31న కలెక్టర్ 210 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. పదో తరగతి మార్కులపై వెయిటేజీ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోడానికి నిరుద్యోగులందరికీ అందరికీ అవకాశం ఇచ్చినా కాంట్రాక్టు కార్యదర్శులకు 75 మార్కులను అదనపు వెయిటేజీగా కేటాయించారు. ఏకంగా 15,434 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వ వైఖరీ స్పష్టం చేస్తోంది. ఈ నియామకు ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ 90 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో ఈ భర్తీ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) సోమవారం జిల్లాలో మరో 182 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయడంతో నిరుద్యోగులు మళ్లీ రెండో సారీ దరఖాస్తు చేసుకోక తప్పడం లేదు. రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక వేళ ఎవరైనా అభ్యర్థులకు రెండు చోట్లా కొలువు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై తర్వాత ఆలోచిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.