రేపటి నుంచి పోలియో వ్యాక్సిన్ | tomarrow onwords Pulse Polio vaccine | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పోలియో వ్యాక్సిన్

Published Sun, Jun 19 2016 1:20 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

రేపటి నుంచి పోలియో వ్యాక్సిన్ - Sakshi

రేపటి నుంచి పోలియో వ్యాక్సిన్

విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాం
క్రమబద్ధీకరణకు ఇదే ఆఖరి అవకాశం
హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా


సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 20 నుంచి 26 వరకు హైదరాబాద్ జిల్లాలోని 11 క్లస్టర్లు, రంగారెడ్డి జిల్లాలోని 12 పీహెచ్‌సీల పరిధిలో పల్స్‌పోలియో వ్యాక్సిన్ (ఇనక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్) వేయనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో క లెక్టర్ ఎం.రఘునందన్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 6 వారాల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. నగరంలోని అంబర్‌పేట్ నాలా ప్రాంతంలో ఇటీవల గుర్తించిన పోలియో వైరస్ కారణంగా టీకాలు వేయాల్సిన చిన్నారుల సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో దాదాపు 2.5 లక్షల చిన్నారులను ఈ సర్వేలో గుర్తించినట్లు రాహుల్ బొజ్జా చెప్పారు. నాలా సంబంధిత ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలియో వ్యాక్సిన్ ఇంజక్షన్‌పై అపోహలు అవసరం లేదని, భయపడొద్దని తెలిపారు.

 విద్యా ప్రమాణాల మెరుగుకై..
 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు 10వ తరగతి ఫలితాల్లో చివరి స్థానాల్లో నిలుస్తున్నాయని, దీనికి పలు కారణాలున్నట్లు కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రూపొం దించిందన్నారు. ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను అధిక సంఖ్యలో చేర్పించటమే లక్ష్యంగా కొనసాగిందన్నారు. ప్రభుత్వం మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, హాస్టల్ వసతి అందించడమే లక్ష్యంతో హైదరాబాద్‌లో 7, రంగారెడ్డిలో 9 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మాదిరిగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉత్తమ విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 క్రమబద్ధీకరణకు లాస్ట్ ఛాన్స్..
 పట్టణ భూగరిష్ట చట్టం కింద మిగులు భూములను జూన్ 25 లోగా క్రమబద్దీకరించుకోవాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. యూఎల్‌సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్నారు. క్రమబద్ధీకరించుకోని భూములను స్వాదీనం చేసుకుంటామని హెచ్చరించారు. జీవో 58, 59 కింద అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు డ్రైవ్ చేపట్టినప్పటికీ ఆశించిన రీతిలో ప్రజలు ముందుకురాలేదన్నారు. ఇందుకు అవగాహన లోపమే కారణమని గుర్తించిన తాము యూఎల్‌సీ ఖాళీ మిగులు భూముల క్రమబద్దీకరణకు విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి వారికి నోటీసులను అంద జేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ వల్ల యజమానులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని, భూహక్కుతో పాటూ కచ్చితమైన విలువ పొందొచ్చన్నారు. క్రయ విక్రయాలు కూడా జరుపుకునే అవకాశముందని చెప్పారు. ఈ సమావేశ ంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ షైనీ, యూఎల్‌సీ ప్రత్యేక అధికారి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి డీఆర్‌ఓ సత్తయ్య పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement