న్యూఢిల్లీ: షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్లను అయిదు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ బుధవారం తెలిపారు. నౌకా నిర్మాణం, నౌకల మరమ్మత్తు వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశాలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు.
మూడవసారి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులలో తన మంత్రిత్వ శాఖ సాధించిన ప్రధాన విజయాలను ఈ సందర్భంగా సోనోవాల్ వివరించారు. రాబోయే ఐదేళ్లలో కంటైనర్ హ్యాండ్లింగ్ 40 మిలియన్ టీఈయూలకు (ట్వెంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు.
తొలి భారతీయ పోర్టుగా..
జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నిర్వహణ సామర్థ్యాన్ని ప్రస్తుత 6.6 మిలియన్ టీఈయూల నుండి 10 మిలియన్లకు పెంచుకుంటుందని సోనోవాల్ వివరించారు. ఇది కార్యరూపం దాలిస్తే ఈ సామర్థ్యానికి చేరుకున్న తొలి భారతీయ పోర్టుగా నిలుస్తుందని అన్నారు. హైడ్రోజన్ తయారీ కేంద్రాల ఏర్పాటుకై దీనదయాళ్ పోర్ట్ అథారిటీ, వీఓ చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్‌లో 3,900 ఎకరాల భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
ఇది రానున్న సంవత్సరాల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన వెల్లడించారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని గలాథియా బే వద్ద అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ ప్రధాన ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌గా పనిచేస్తుందని వివరించారు.
టాప్–10 కంటైనర్ పోర్ట్‌లలో..
కామరాజర్ ఓడరేవును స్థాపించిన 25 సంవత్సరాల తరువాత వధ్వన్ పోర్ట్ చేరిక భారత సముద్ర ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. 21వ శతాబ్దపు భారత మొట్టమొదటి ప్రధాన పోర్ట్ ప్రాజెక్ట్ అయిన వధ్వన్ పోర్ట్ 298 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అతిపెద్ద ఆల్ వెదర్ డీప్ వాటర్ పోర్ట్‌లలో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉందన్నారు.
ఈ మెగా పోర్ట్ 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ షిప్పింగ్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, రవాణా సమయం, ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రపంచంలో టాప్–10 కంటైనర్ పోర్ట్‌లలో ఒకటిగా ఉంచుతుందని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment