
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షోరూమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్లా (Tesla) కార్లు దేశీయ విఫణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
విదేశీ కంపెనీలపై.. దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. అయితే టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే.. కార్ల ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గిన తరువాత కూడా.. టెస్లా కారు ప్రారంభ ధర రూ. 35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ 'సీఎల్ఎస్ఏ' నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది.
మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే.. టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువ. కాబట్టి టెస్లా అమ్మకాలు ఇండియాలో ఆశాజనకంగా ఉంటాయా? అనేది ఒక ప్రశ్న. అయితే టెస్లా ధరలు భారతీయ ఈవీ మార్కెట్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని సీఎల్ఎస్ఏ నివేదిక వెల్లడించింది.
ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్.. ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు
టెస్లా కంపెనీ రూ. 25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్లా ప్రవేశం ప్రధాన భారతీయ వాహన తయారీదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపదని నివేదిక సూచిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో మొత్తం EVల వ్యాప్తి చైనా, యూరప్ మరియు US కంటే తక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment