
చౌక స్టీల్ దిగుమతులను ప్రభుత్వం కట్టడి చేయాలి
టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్
న్యూఢిల్లీ: చౌక ఉక్కు దిగుమతులు వెల్లువెత్తుతుండటం దేశీయంగా పరిశ్రమను దెబ్బతీస్తోందని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా మార్కెట్లలో అవకాశాల్లేక పలు దేశాల నుంచి స్టీల్ భారత్‌కు మళ్లుతోందని ఆయన చెప్పారు. దీనితో దేశీయంగా ధరలు పడిపోయి, ఉక్కు కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు.
భవిష్యత్తులో ఉక్కు పరిశ్రమ పెట్టుబడులపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నరేంద్రన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే చౌక దిగుమతులను కట్టడి చేయాలంటూ ప్రభుత్వానికి పరిశ్రమ విజ్ఞప్తి చేసినట్లు ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 69వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా అత్యధికంగా ఇన్వెస్ట్ చేస్తున్న ప్రైవేట్ రంగాల్లో ఉక్కు పరిశ్రమ కూడా ఉందని నరేంద్రన్ చెప్పారు. ప్రస్తుతం ఒక విడత విస్తరణ ప్రణాళికలు పూర్తయినట్లు వివరించారు.
అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో భారత ఉక్కు ఎగుమతులు సుమారు 29 శాతం క్షీణించి 3.99 మిలియన్ టన్నులకు పరిమితయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఎగుమతులు 5.61 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. మరోవైపు, ఏప్రిల్–జనవరి మధ్య వ్యవధిలో దిగుమతులు 20 శాతం పెరిగి 8.29 మిలియన్ టన్నులకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment