3 నెలల్లో.. 4 క్లస్టర్లు | Plan to start 4 MSME clusters by March | Sakshi
Sakshi News home page

3 నెలల్లో.. 4 క్లస్టర్లు

Published Thu, Dec 7 2023 2:18 AM | Last Updated on Thu, Dec 7 2023 2:18 AM

Plan to start 4 MSME clusters by March - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపడుతు­న్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. తక్కువ వ్యయంతో ఉత్ప­త్తులను తయారు చేయడం ద్వారా పోటీ మార్కెట్‌లో నిలబడే విధంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఔత్సాహికుల చేయి­పట్టుకుని  నడిపిస్తోంది. దేశంలోనే మొదటగా కాకినాడలో ఏర్పాటైన ప్రింటింగ్‌ క్లస్టర్‌ విజయవంతంగా అందుబాటులోకి రావ­డంతో.. అదే స్ఫూర్తితో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. రూ.46.03 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు క్లస్టర్లను మూడునెలల్లోగా అందుబాటులోకి తీసుకువాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్,  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద రూ.14.98 కోట్లతో ప్రింటింగ్‌ క్లస్టర్, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పుదినుసులు తయారు చేసే పల్సస్‌ క్లస్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో గార్మెంట్‌ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. చుట్టపక్కల ప్రాంతాల్లో ఉండే సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లు జట్టుకట్టి ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పడి ఈ క్లస్టర్లలో ఉమ్మడిగా మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

మార్చిలోగా ఈ నాలుగు క్లస్టర్లను ప్రారంభించే విధంగా పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.గోపాలకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నాలుగు క్లస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్, ఎస్‌పీవీలు సమకూర్చాల్సిన మొత్తం ఇప్పటికే జమచేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నాలుగు క్లస్టర్లతో సుమారు 25 వేలమందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

గత ప్రభుత్వం బకాయిలు 
గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకుందని తెలిపారు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకా­లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు 1,93,530 కాగా.. వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఏకంగా 5,81,152కు చేరింది. నాలుగున్నరేళ్లలో క్తొతగా 3.87 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఎంఎస్‌ఎంఈల ద్వారా 34.83 లక్షల మందికి ఉపాధి లభిస్తుంటే.. ఈ నాలుగున్నరేళ్లలోనే కొత్తగా 12.61 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ఉద్యమ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement